• facebook
  • whatsapp
  • telegram

సమాచార నిరాకరణ అస్త్రం!ఇటీవల పార్లమెంటు ఆమోదించిన డిజిటల్‌ వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు ప్రజాస్వామిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుంది. అధికార సమాచారాన్ని కోరడానికి భారత పౌరులకున్న హక్కును బలహీనపరచే నిబంధనలు ఇందులో ఉండటం ఆందోళనకరం.


భారత్‌లో 2005లో అమలులోకి వచ్చిన సమాచార హక్కు(ఆర్టీఐ) చట్టం ప్రపంచంలో అత్యుత్తమ పారదర్శక చట్టాల్లో మేటిగా పేరొందింది. ప్రజలను అసలు సిసలు సార్వభౌములుగా గుర్తిస్తోంది. ప్రభుత్వ కార్యకలాపాలలో పారదర్శకత ఉండాలని, వాటి గురించి పూర్తి అవగాహన ఉన్న ప్రజలు తప్పు జరిగినప్పుడు నిలదీయగలగాలని ఆ చట్టం పీఠిక పేర్కొంది. ప్రజలు ప్రభుత్వాన్ని జవాబుదారీని చేస్తే అవినీతిని నిరోధించవచ్చని ఉద్ఘాటించింది. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూనే ప్రభుత్వం సమర్థంగా పనిచేయడానికి వీలు కల్పిస్తున్న చట్టమది. ప్రజలు ఈ చట్టాన్ని అలవోకగా వినియోగించడంతో అధికారులు సమాచారం దక్కకుండా వివిధ మార్గాల్లో అడ్డుపడ్డారు. అయినా చాలామంది కీలక సమాచారాన్ని సంపాదించి పలు సందర్భాల్లో అవినీతిని నిరోధించగలిగారు. ప్రభుత్వపరంగా తప్పులు జరగకుండా నిలువరించగలిగారు.


పౌరులకు అధికారం

దాదాపు ప్రభుత్వం వద్దనున్న సమాచారమంతటినీ డిమాండ్‌ చేసి పొందగలిగే అధికారం పౌరులకు ఉందని ఆర్టీఐ చట్టం స్పష్టం చేసింది. కేవలం పది రకాల సమాచారాన్ని మాత్రమే పౌరులకు అందించనక్కరలేదని పేర్కొంది. ప్రభుత్వం సాఫీగా పని చేయడానికి వీలుగా ఈ జాగ్రత్త తీసుకుంది. ఆ పది రకాల సమాచారాన్ని ఆర్టీఐ చట్టంలోని 8 (1) సెక్షన్‌లో ఏ నుంచి జె నిబంధనల రూపంలో పొందుపరచారు. వ్యక్తి గోప్యతకు భంగం కలిగించే సమాచారం వెల్లడికి 8 (1) సెక్షన్‌లోని జె నిబంధన మినహాయింపు ఇవ్వడం గమనార్హం. బహిరంగ కార్యకలాపాలలో భాగం కాని సమాచారాన్ని సైతం ఈ నిబంధన మినహాయించింది. పార్లమెంటుకు, అసెంబ్లీకి ఇవ్వదగిన సమాచారాన్ని పౌరుడికి కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే, ఇటీవలి డిజిటల్‌ వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు అన్ని రకాల వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించనక్కర్లేకుండా ఆర్టీఐ చట్టంలోని సెక్షన్‌ 8(1)(జె)ని సవరించాలని తలపెట్టింది. దీనివల్ల సమాచార హక్కు చట్టం కాస్తా సమాచార నిరాకరణ చట్టంగా మారిపోతుంది. ప్రజా సమాచార అధికారి (పీఐఓ) ఏ సమాచారాన్నైనా ఎవరో ఒక వ్యక్తికి సంబంధించినదనే సాకుతో నిరాకరించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల జీతభత్యాలు, సబ్సిడీ లబ్ధిదారుల వివరాలు, వివిధ రకాల పర్మిట్లు, అనుమతుల వివరాలను సంబంధిత వ్యక్తులే స్వయంగా వెల్లడించాలని సహచట్టంలోని 4(1)(బి) నిర్దేశిస్తోంది. వ్యక్తిగత సమాచార రక్షణ చట్టం దీనికి చెల్లుచీటీ పాడుతోంది. అంటే అవినీతిని, అవకతవకలను కనిపెట్టే అవకాశం లేకుండా పోతుందన్నమాట. ఇప్పటికే, ఐఏఎస్‌ అధికారుల పనితీరుపై వార్షిక మూల్యాంకన నివేదికలను వెల్లడించాలని ఎన్ని అర్జీలు పెట్టినా కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఇవ్వకుండా మొరాయిస్తోంది. సెక్షన్‌ 8(1)(జె) ప్రకారం ఈ నివేదికలను ఇవ్వనక్కర్లేదంటోంది. అది చట్టానికి వక్రభాష్యం చెప్పడమే. ఎమ్మెల్యే నిధుల వినియోగం వివరాల వెల్లడికీ ప్రభుత్వం నిరాకరిస్తోంది. అదేమంటే, అది వ్యక్తిగత సమాచారమంటోంది. పీఎంకేర్స్‌ ఫండ్‌ నిధుల లబ్ధిదారుల విషయంలోనూ నిరాకరణే ఎదురవుతోంది. బోగస్‌ కుల ధ్రువీకరణ పత్రాలు, నకిలీ విద్యా ధ్రువపత్రాలు, ఉద్యోగ నియామకాల్లో అవినీతి, వివిధ నియమ నిబంధనల ఉల్లంఘన గురించి ఆర్టీఐ కింద సమాచారం ఇచ్చేందుకూ తిరస్కరణే ఎదురవుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల గురించి అడిగినా సమాధానం లేదు. ప్రజాప్రతినిధుల ప్రమాణపత్రాల తనిఖీ కూడా సవ్యంగా సాగడం లేదు. విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుదారులకు సంబంధించిన సమాచారాన్ని సైతం అందనివ్వడం లేదు. అధికారుల అవినీతి నిరూపణ అయిన కేసుల వివరాలూ చిక్కడం లేదు. అధికార సమావేశాల వివరాల వెల్లడికీ నిరాకరిస్తున్నారు.  


సజావుగా సాగని సంప్రతింపులు

డిజిటల్‌ వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు వంటి కీలకమైన చట్టంపై ముందస్తు సంప్రతింపులు సైతం సజావుగా సాగలేదు. ఈ బిల్లుపై బహిరంగ సలహా సంప్రతింపులు దిల్లీలో కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో 2022 డిసెంబరు 23న జరిగాయి. వర్చువల్‌, ముఖాముఖి పద్ధతులతో హైబ్రిడ్‌ సమావేశంగా నిర్వహించారు. కేంద్ర మాజీ సమాచార కమిషనర్‌ హోదాలో వర్చువల్‌ సమావేశానికి హాజరవుతానంటూ దరఖాస్తు పెట్టినా, వీడియో లింకు పంపలేదు. ఆ లింకు పొందిన ఒక మిత్రుడి ద్వారా సమావేశంలో పాల్గొన్నాను. అందులో పాల్గొన్నవారంతా దాదాపుగా కార్పొరేట్‌ న్యాయవాదులే. చర్చ మొత్తం వ్యక్తిగత సమాచార రక్షణ చుట్టూనే తిరిగింది. చాట్‌బాక్స్‌లో కింది అంశాలను లేవనెత్తాను. 1. సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ సహచట్టాన్ని(ఆర్టీఐ) పక్కన పెట్టడానికి డిజిటల్‌ వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లులోని 29 (2) సెక్షన్‌ వీలు కల్పిస్తోంది. 2.ఆర్టీఐని సమాచార నిరాకరణ చట్టంగా మార్చేంద]ుకు అవకాశం కల్పిస్తున్న సెక్షన్‌ 30(2)ని తొలగించాలి. అసలు ఏ సమాచారాన్నైనా వ్యక్తిగతమైనదిగా పరిగణించి, గోప్యతకు భంగం కలిగిస్తోందంటూ నిరాకరించవచ్చు. ఈ అంశాలను సమావేశంలో లేవనెత్తడానికి నాకు అవకాశమిచ్చారు. నేను మొదటి అంశాన్ని ప్రస్తావించగానే మంత్రి స్పందిస్తూ, అది మీ అభిప్రాయమే తప్ప ప్రభుత్వానిది కాదన్నారు. ప్రభుత్వం గోప్యతను పౌరుడి ప్రాథమిక హక్కుగా పరిగణిస్తోందని, ఆర్టీఐకన్నా గోప్యతదే పైచేయిగా భావిస్తోందని చెప్పారు. కానీ, ఆర్టీఐకి తలపెట్టిన సవరణ దాని రద్దుకే దారితీస్తుందని అభ్యంతరపెట్ట డంతో నా గొంతు వినబడనీయకుండా చేశారు.  వ్యక్తిగత సమాచార రక్షణ చట్టంలోని 38(2)వ సెక్షన్‌ను సవరించకపోతే అది ఆర్టీఐని పక్కకు నెట్టేసినట్లే. ప్రభుత్వం ఆ సెక్షన్‌ను సవరిస్తుందని ఆశిస్తున్నాను. డిజిటల్‌ వ్యక్తిగత సమాచార రక్షణ చట్టాన్ని అన్ని ప్రాంతీయ భాషల్లోకీ అనువదించి, నిజమైన చర్చ జరిగే ఏర్పాట్లు చేయాలి.


మొరాయించడం చట్టవిరుద్ధం

బహిరంగ కార్యకలాపాలు లేదా ప్రజోపయోగ కార్యకలాపాలతో సంబంధం లేని వ్యక్తిగత సమాచారాన్ని ఆర్టీఐ కింద వెల్లడించనక్కర్లేదు. పౌరుడి గోప్యతా హక్కుకు భంగం కలిగించే సమాచారాన్నీ ఇలాగే మినహాయించారు. సెక్షన్‌ 8 (1) (జె) ప్రకారం తనకు మినహాయింపు లభించింది కాబట్టి తన వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించబోనని పౌరుడు సంబంధిత అధికారి, సమాచార కమిషనర్‌ లేదా న్యాయమూర్తికి ధ్రువపత్రం ఇవ్వాలని ఆర్టీఐ చట్టం పేర్కొంటోంది. అంతేకానీ, సమాచారం ఇవ్వనంటూ మొరాయించడం చట్టవిరుద్ధం. పలువురు అధికారులు తమ అవినీతిని, నిరంకుశ చర్యలను కప్పిపుచ్చేందుకు ఇలా మొరాయించిన సందర్భాలు అనేకం.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ జీవవైవిధ్యానికి చిరునామా.. దక్కన్‌ పీఠభూమి

‣ బీమా ఆదుకొంటేనే రైతుకు ధీమా

‣ చైనా ప్రాజెక్టుకు బీటలు

‣ సమ సమాజమే ప్రగతి మార్గం!

‣ పత్రికా స్వేచ్ఛకు ముప్పు

Posted Date: 18-08-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం