• facebook
  • whatsapp
  • telegram

కర్బన ఉద్గారాలకు కళ్ళెం.. లిథియం!



భూతాపానికి కారణమవుతున్న కర్బన ఉద్గారాలను నిర్దేశిత కనిష్ఠ స్థాయికి తగ్గించాలంటే విద్యుత్‌ వాహనాల వాడకం తక్షణావసరం. విద్యుత్‌ వాహనాల్లోని బ్యాటరీ తయారీకి లిథియం కీలకం. ఈ బ్యాటరీ విద్యుచ్ఛక్తిని దీర్ఘకాలంపాటు నిల్వ ఉంచుకొంటుంది. విభిన్న ఉష్ణోగ్రతల వద్ద వాహన ఇంజిన్‌ను అత్యంత సమర్థంగా పనిచేయిస్తుంది. ఈ క్రమంలో లిథియం ఖనిజ వనరుల లభ్యత అత్యంత కీలకంగా మారింది.


ప్రపంచవ్యాప్తంగా పరిమిత స్థాయిలో లభ్యమవుతున్న మూలకాలు, అరుదైన ఖనిజ నిక్షేపాల వెలికితీతకు గనుల రంగంలో తీవ్ర పోటీ నెలకొంది. హరిత ఇంధన ఉత్పాదక పరిజ్ఞానం, ఎలెక్ట్రానిక్స్‌ రంగంలో లిథియం వంటి ఖనిజ నిక్షేపాలకు గిరాకీ పెరుగుతోంది. మరోవైపు ఖనిజ వనరుల వెలికితీతకు పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. పర్యావరణ పరమైన అడ్డంకులు, అరుదైన ఖనిజ వనరుల వెలికితీత క్లిష్టతరంగా మారుతుండటం క్షేత్రస్థాయి ఆటంకాలుగా చెప్పవచ్చు. భూమిలో లభ్యమయ్యే ఇలాంటి అరుదైన, సంక్లిష్ట మూలకాలు హరిత ఇంధన పరిజ్ఞానంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. శిలాజ ఇంధనాల వినియోగం వైపు నుంచి సుస్థిర ఇంధన సాంకేతికత దిశగా అడుగులు వేసేందుకు దోహదపడుతున్నాయి. నియోడిమియమ్‌, డిస్‌ప్రోసియం, ప్రేసియోడిమియం వంటి అరుదైన మూలకాలు పవన విద్యుత్‌ టర్బైన్లు, విద్యుత్‌ వాహన మోటార్లలో కీలకమైనవి. టెలూరియం, ఇండియం, గాలియం వంటివి సౌర ప్యానళ్ల తయారీలో ముఖ్యమైనవి. విద్యుచ్ఛక్తి నిల్వకు బ్యాటరీల్లో లిథియం, కోబాల్ట్‌, నికెల్‌లను వినియోగిస్తారు. హైడ్రోజన్‌ ఉత్పత్తి, నిల్వ చేసే సాంకేతికతలో లాంథనం, సీరియంను వినియోగిస్తారు. ఇలాంటి అరుదైన, సంక్లిష్ట మూలకాలు, ఖనిజాలు హరిత ఇంధన ఉత్పాదకతలో ప్రాధాన్య పాత్ర పోషిస్తున్నాయి. వాతావరణ మార్పుల కట్టడిలో భాగస్వాములవుతున్నాయి. ఇతర మూలకాలతో తయారైన బ్యాటరీలకన్నా లిథియం బ్యాటరీలు సురక్షితం, విశ్వసనీయమైనవని ఇంధన రంగ నిపుణులు భావిస్తున్నారు. బెల్జియంలోని యూమికోర్‌, సోల్వే, జపాన్‌కు చెందిన మిత్సుబిషి మెటీరియల్స్‌ వంటి సంస్థలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎలెక్ట్రానిక్‌ వ్యర్థాలు, అయస్కాంతాలు, ఇతర వ్యర్థ పదార్థాల నుంచి రీసైక్లింగ్‌, ప్రాసెసింగ్‌ పద్ధతుల ద్వారా అరుదైన మూలకాలను తయారు చేసే పరిశ్రమలను స్థాపించాయి. అరుదైన మూలకాలు, ఖనిజాల పరిమిత స్థాయి లభ్యతను దృష్టిలో ఉంచుకొని జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాలు సంక్లిష్ట ఖనిజాల పునర్‌ వినియోగం కోసం కొన్ని వ్యూహాత్మక ఆవిష్కరణలను అమలు చేస్తుండటం తక్కిన దేశాలకు స్ఫూర్తిదాయకం కావాలి. ఇలాంటి పునర్‌ వినియోగ పద్ధతులు ఖనిజ వనరుల సంరక్షణకు, వాటిపై అతిగా ఆధార పడటాన్ని తగ్గించి సుస్థిరాభివృద్ధి సాధనకు దోహదం చేస్తున్నాయి.


కీలక ముందడుగు

ఇప్పటి వరకు లిథియాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో 59 లక్షల టన్నుల లిథియం నిక్షేపాలున్నట్లు 2023 ఫిబ్రవరిలో జీఎస్‌ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు. తరవాత రాజస్థాన్‌లోనూ లిథియం నిల్వలను కనుగొన్నారు. విద్యుత్‌ వాహనాల బ్యాటరీ తయారీలో అత్యంత కీలకమైన లిథియం నిక్షేపాల కోసం దేశీయంగాను, విదేశాల్లోను భారత్‌ అన్వేషణలు జరుపుతున్న తరుణంలో- ఈ నిక్షేపాల లభ్యత ఉనికిలోకి రావడం ఈ రంగంలో సరికొత్త అధ్యాయానికి నాందిగా భావించవచ్చు. భారత్‌లో ప్రస్తుతం ఏటా అమ్ముడవుతున్న వాహనాల్లో విద్యుత్‌ బ్యాటరీ వాహనాల వాటా కేవలం ఒక్క శాతమే. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలైన-నాల్కో, హిందుస్థాన్‌ కాపర్‌, మినరల్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ కార్పొరేషన్లు- సంయుక్తంగా లిథియం అయాన్‌ బ్యాటరీ తయారీ, ఖనిజ వనరుల సేకరణ, పునర్వినియోగం, పరిశోధన, అభివృద్ధి కోసం కృషిచేస్తున్నాయి. భారత్‌లో వెలుగు చూసిన లిథియం నిక్షేపాలు దేశీయంగా ఉన్న డిమాండ్‌లో 80శాతం అవసరాలను తీర్చనున్నట్లు అంచనా. గతంలో కర్ణాటకలో స్వల్ప మోతాదులో లిథియం నిల్వలు ఉండేవి. జమ్మూకశ్మీర్‌, రాజస్థాన్‌లలోనూ భారీ నిక్షేపాలు బయట పడటంతో భారత్‌ ఇప్పుడు విద్యుత్‌ వాహనాల రంగంపై మరింతగా దృష్టి కేంద్రీకరించింది. ఇటీవల పార్లమెంటు ఆమోదించిన గనులు, ఖనిజాల అభివృద్ధి- నియంత్రణ సవరణ బిల్లు ఈ దిశగా పడిన కీలక ముందడుగుగా భావిస్తున్నారు. దేశీయ గనుల రంగాన్ని ఆధునికీకరించడం, ఈ రంగంలో సంస్కరణలకు ఉద్దేశించిన చర్యల్ని ఇందులో పొందుపరచారు. గనుల కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ప్రస్తుతమున్న నిబంధనలకు ముఖ్యమైన మార్పులు చేశారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం సుస్థిరాభివృద్ధితో కూడిన గనుల నిర్వహణ, గని కార్యకలాపాలను ప్రోత్సహించడం, లైసెన్సింగ్‌, ఆమోదాల ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి పోటీ బిడ్డింగ్‌ను ప్రవేశపెట్టడం, మార్కెట్లో ఖనిజాల ధరలను నియంత్రించడానికి ‘జాతీయ ఖనిజ సూచీ’ని ఏర్పాటు చేయడం వంటివి ఇందులోని ప్రధానాంశాలు.


పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా..

విద్యుత్‌ వాహనాల బ్యాటరీల్లో నిల్వ, పునరుద్ధరణీయ ఇంధన వనరుల్లో లిథియం అయాన్‌ బ్యాటరీలకున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని లిథియం, నికెల్‌, కోబాల్ట్‌ నిక్షేపాల వెలికితీతపై దృష్టిసారించాలి. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా అరుదైన సంక్లిష్ట మూలకాలు, ఖనిజాల తవ్వకానికి ప్రాధాన్యం కల్పించాలి. భారత్‌లో హరిత ఇంధనానికి మొగ్గు ఏర్పడుతున్న క్రమంలో దేశీయంగా ఖనిజ మూలకాల లభ్యత పెరిగితే దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. హరిత ఇంధన వనరుల రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా సంక్లిష్ట ఖనిజ నిక్షేపాల వెలికితీతను సరళతరం చేయవచ్చు. తద్వారా వాతావరణ మార్పులకు కారణమవుతున్న భూతాపానికి కళ్ళెం వేయవచ్చు. కర్బన ఉద్గారాలను కనిష్ఠ స్థాయికి తగ్గించవచ్చు. ఈ మేరకు పర్యావరణ మార్పులను కట్టడి చేసే పోరాటంలో ప్రపంచ దేశాలకు భారత్‌ చేయూత అందించినట్లవుతుంది. ప్రపంచ హరిత ఇంధన వనరుల రంగంలో బలమైన శక్తిగా అవతరించే అవకాశాలు ఇనుమడిస్తాయి.


యువతకు ఉపాధి

అరుదైన, సంక్లిష్ట ఖనిజాల పునర్వినియోగంలో భారత్‌ ఇంకా శైశవ దశలోనే ఉంది. ఈ దిశగా ఇండియా చేస్తున్న ప్రయ త్నాలు ప్రాథమికంగా ఎలెక్ట్రానిక్‌ వ్యర్థాలు, కొన్ని పారిశ్రామిక ప్రక్రియలకే ప్రాధాన్యం ఇచ్చాయి. సంక్లిష్ట ఖనిజాలు మూలకాల పునర్వినియోగ ప్రక్రియకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై అంతంత మాత్రంగానే దృష్టి సారిస్తున్నారు. మరోవైపు, ఇటీవల తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలో అమరరాజా బ్యాటరీస్‌ సంస్థ భారీ పెట్టుబడితో కర్మాగారానికి శంకుస్థాపన చేసింది. ఇక్కడ లిథియం అయాన్‌ బ్యాటరీలను తయారు చేయనున్నారు. దీనిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమంది యువతకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సమాచార నిరాకరణ అస్త్రం!

‣ కాలయాపనే చైనా వ్యూహమా?

‣ జీవవైవిధ్యానికి చిరునామా.. దక్కన్‌ పీఠభూమి

‣ బీమా ఆదుకొంటేనే రైతుకు ధీమా

‣ చైనా ప్రాజెక్టుకు బీటలు

‣ సమ సమాజమే ప్రగతి మార్గం!

‣ పత్రికా స్వేచ్ఛకు ముప్పు

Posted Date: 21-08-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం