• facebook
  • whatsapp
  • telegram

బెంబేలెత్తిస్తున్న వాయు కాలుష్యం



అడ్డూఆపూ లేని మానవ చర్యల కారణంగా వాయు కాలుష్యం అంతకంతకు పెచ్చరిల్లుతోంది. ఫలితంగా ఊపిరితిత్తులు, గుండె తదితర అవయవాలతో పాటు మెదడు సైతం ప్రభావితం అవుతోంది. గాలిలో సూక్ష్మ ధూళికణాలు (పీఎం 2.5) స్వల్ప మొత్తంలో పెరిగినా, మతిమరుపు (డిమెన్షియా) ముప్పు 70శాతం  ధికమవుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాయుకాలుష్యం వల్ల మనుషుల్లో సూక్ష్మజీవ నిరోధక సామర్థ్యం సైతం దెబ్బతింటోంది.


వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ఏటా 70లక్షల మందికి పైగా ప్రాణాలను కబళిస్తోంది. వాతావరణంలోకి చేరుతున్న సూక్ష్మ ధూళి కణాల (పీఎం 2.5) వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌, గుండెపోటు వంటివి ముమ్మరిస్తున్నాయి. ముఖ్యంగా ఎదుగుతున్న దశలో పిల్లల శ్వాస, నాడీ వ్యవస్థలను వాయు కాలుష్యం తీవ్రంగా దెబ్బతీస్తోంది. దాంతో పిల్లల్లో న్యుమోనియా కేసులు అధికమవుతున్నాయి. పెచ్చరిల్లుతున్న వాయు కాలుష్యం వాతావరణంలోనూ అనూహ్య మార్పులు తీసుకొస్తోంది. మొత్తంగా ఇది కంటికి కనిపించని శత్రువుగా పరిణమించింది. భారత్‌లోనూ ఈ సమస్య పోనుపోను తీవ్రతరమవుతోంది.


ఆందోళనకర పరిస్థితులు

ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల నుంచి సేకరించిన సమాచారంతో వాయు ప్రమాణాలను స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూ ఎయిర్‌ అనే సంస్థ ఏటా అధ్యయనం చేస్తుంది. దాని ఆధారంగా ప్రపంచ వాయు నాణ్యత నివేదికను రూపొందిస్తుంది. ఈ ఏడాది మార్చిలో వెలువరించిన నివేదికలో ప్రపంచంలో అత్యంత కాలుష్యభరిత దేశాల జాబితాలో భారత్‌ ఎనిమిదో స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని 131 దేశాలు, 7,323 నగరాల సమాచారాన్ని సేకరించి ఈ నివేదికను రూపొందించారు. దీని ప్రకారం భారత్‌లో సగటు సూక్ష్మ ధూళికణాల స్థాయి ఘనపు మీటరుకు 53.3 మైక్రో గ్రాములుగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఇది అయిదు మైక్రో గ్రాములలోపు ఉండాలి. ప్రపంచంలో వాయు కాలుష్యం అధికంగా ఉన్న 50 నగరాల్లో దేశ రాజధాని దిల్లీ నాలుగో స్థానంలో నిలిచింది. పాకిస్థాన్‌లోని లాహోర్‌, చైనాలోని హోటన్‌ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలోని నగరాల్లో 39 భారత్‌లోనే ఉండటం- దేశీయంగా వాయు కాలుష్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఒక అధ్యయనం ప్రకారం 2019లో ఇండియాలో 16 లక్షల మంది వాయు కాలుష్యం వల్ల మృత్యువాత పడ్డారు. సూక్ష్మ ధూళి కణాల స్థాయులు డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాల ప్రకారం ఉంటే దేశీయంగా ప్రతి వ్యక్తి సగటు జీవిత కాలం 5.2 సంవత్సరాలు పెరుగుతుంది. ఈ మేరకు షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ఇంధన విధాన సంస్థ విడుదల చేసిన వాయు నాణ్యత నివేదిక ఇటీవల వెల్లడించింది.


భారత్‌లో 50శాతం వాయుకాలుష్యానికి పరిశ్రమలే కారణం. వాహనాల వల్ల 27శాతం, పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల 17శాతం, కట్టెలతో వంట చేయడం వల్ల ఏడు శాతం వాయు  కాలుష్యం సంభవిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని నగరాల్లో మనం పీల్చే వాయువులో పీఎం 2.5, పీఎం 10గా పిలిచే సూక్ష్మ ధూళి కణాలు అధిక మోతాదులో ఉంటున్నాయి. ఇవి చాలా ప్రమాదకరం. గాలి పీల్చినప్పుడు ఇవి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాసకోస వ్యాధులకు కారణమవుతున్నాయి. ఇటీవల నగరాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరగడానికి ఇది ప్రధాన కారణం. దిల్లీలో అయితే వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. ముంబయి, కోల్‌కతా, చెన్నై తదితర నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.


దేశీయంగా వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి 1981లో ప్రత్యేక చట్టం తెచ్చారు. వాహనాలు, పరిశ్రమలు, పంట వ్యర్థాల నిర్వహణ తదితరాలపై ఇందులో పలు నిబంధనలు పొందుపరచారు. అయినా పరిస్థితి చేయిదాటి పోతుండటంతో కేంద్రం 2019లో జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (ఎన్‌సీఏపీ) ప్రారంభించింది. వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న 122 నగరాల్లో దాన్ని 2024 నాటికి 20 నుంచి 30శాతానికి తగ్గించాలన్నది దీని లక్ష్యం. ఇందులో భాగంగా దిల్లీ, అహ్మదాబాద్‌, పుణె వంటి నగరాల్లో ఆధునిక వాయు అధ్యయన కేంద్రాలు నెలకొల్పారు. పరిశ్రమల నుంచి వెలువడే ప్రమాదకర వాయువులపై నిరంతర నిఘా పెట్టారు. బీఎస్‌6 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పర్యావరణ హిత విద్యుత్తు వాహనాల వినియోగాన్ని పెంచాలని నిర్ణయించారు. అయినా, వాయు కాలుష్యం తీవ్రమవుతోంది.


విస్తృత అవగాహన కీలకం

వాయు కాలుష్యాన్ని కట్టడి చేయాలంటే ప్రజల క్రియాశీల భాగస్వామ్యం తప్పనిసరి. దానిపై వారిలో విస్తృతంగా అవగాహన పెంపొందించాలి. వాయు కాలుష్య కారకాలు, వాటి ద్వారా కలిగే నష్టం, ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యలను ప్రతి ఒక్కరికీ వివరించాలి. పాఠశాల స్థాయిలోనే వాయు కాలుష్యాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలి. పిల్లలకు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజెప్పాలి. నగరాల్లో వీలైనంత ఎక్కువగా ప్రజారవాణా వ్యవస్థలను ఉపయోగించేలా పౌరులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు వాటి కొనుగోలుపై రాయితీలు అందించాలి. ఛార్జింగ్‌ స్టేషన్లను పెంచడమూ తప్పనిసరి. పరిశ్రమలు నిర్దేశిత ప్రమాణాలను పాటించేలా పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయాలి. నిబంధనలను అతిక్రమించిన వారిపై ఉక్కుపాదం మోపాలి. వీటితో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. ప్రభుత్వాలు సైతం అడవుల విస్తీర్ణం పెంచడానికి కృషి చేయాలి. ఇలా ప్రభుత్వాలు, ప్రజలు సమష్టిగా కృషి చేస్తేనే వాయు కాలుష్యం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.


శ్వాసకోశ సమస్యలు

రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టడం, వంట కోసం కట్టెలు వినియోగించడం వల్ల గ్రామాల్లోనూ వాయు కాలుష్యం పెరిగిపోతోంది. పంజాబ్‌, హరియాణాల్లో రైతులు పంట వ్యర్థాలను దహనం చేస్తుండటం వల్ల దిల్లీ నగరాన్ని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వ్యర్థాల దహనాన్ని నివారించేందుకు ప్రత్యామ్నాయ విధానాలను విస్తృతంగా అందుబాటులోకి తేవాలి. గతంలో పొగ తాగేవారే ఎక్కువగా శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రులకు వచ్చేవారని, ఇటీవల ఆ అలవాటు లేని వారు సైతం దవాఖానాల బాట పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. పైగా వారిలో 30 నుంచి 40 ఏళ్ల లోపు వారే అధికంగా ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు సైతం పెద్ద సంఖ్యలో శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు.


- ఎం.కరుణాకర్‌ రెడ్డి (రచయిత- ‘వాక్‌ ఫర్‌ వాటర్‌’ వ్యవస్థాపకులు)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ లాభసాటి సేద్యం కోసం..

‣ మాతృభాషతోనే బలమైన పునాది

‣ సైన్యం గుప్పిట్లో ఆఫ్రికా దేశాలు

‣ కర్బన ఉద్గారాలకు కళ్ళెం.. లిథియం!

‣ సమాచార నిరాకరణ అస్త్రం!

‣ కాలయాపనే చైనా వ్యూహమా?

‣ జీవవైవిధ్యానికి చిరునామా.. దక్కన్‌ పీఠభూమి

Posted Date: 22-08-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం