• facebook
  • whatsapp
  • telegram

నాణ్యమైన విద్యతోనే దేశాభివృద్ధి



ఉపాధ్యాయ దినోత్సవం. స్వాతంత్య్రం సిద్ధించి ఏడున్నర దశాబ్దాలు దాటినా మన విద్యావ్యవస్థ నేటికీ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోంది. విద్యార్జన విషయంలో దేశీయంగా ఎన్నో అసమానతలు ఉన్నాయి. ప్రభుత్వ బడులపై తల్లిదండ్రుల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. వీటన్నింటివల్లా అంతిమంగా పేద పిల్లలే తీవ్రంగా నష్టపోతున్నారు.


ధవళ్‌ పటేల్‌ అనే ఐఏఎస్‌ అధికారి గుజరాత్‌లోని ఛోటా ఉదేపుర్‌ జిల్లా గిరిజన ప్రాంతాల్లో ఆరు ప్రాథమిక పాఠశాలల తీరుతెన్నులను పరిశీలించారు. వాటిలో తాను కనుగొన్న అంశాలను ఇలా వివరించారు. ‘ఇక్కడి పేద గిరిజన విద్యార్థుల విద్యాభ్యాసానికి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తప్ప వేరే మార్గం లేదు. వెనకటి తరాల మాదిరిగా కూలీనాలీ చేసుకొంటూ బతకడం తప్ప జీవితంలో ముందుకెళ్ళడానికి తోడ్పడే చదువును ఈ బడుల్లో నేర్పడం లేదు. ప్రభుత్వాన్ని గుడ్డిగా నమ్మే పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్నాం. ఉపాధ్యాయులను, మౌలిక వసతులను సమకూర్చిన తరవాతా పరిస్థితి ఇంత దారుణంగా ఉండటానికి కారణమేమిటో అంతుచిక్కడం లేదు. బాలబాలికలు ఎనిమిదేళ్లపాటు చదివినా కనీసం కూడికలు తీసివేతలు చేయలేకపోతున్నారంటే అది ఉపాధ్యాయుల అసమర్థత కాదా’ అని ధవళ్‌ పటేల్‌ ప్రశ్నించారు. పరీక్షల్లో మూకుమ్మడిగా కాపీ కొట్టడం అక్కడ సర్వసాధారణం. ఆంగ్లంలోని ప్రశ్న అర్థం కాకపోయినా విద్యార్థులంతా ఒకే సమాధానం రాస్తున్నారంటే ఉపాధ్యాయులే దాన్ని ప్రోత్సహిస్తున్నట్లు అర్థమవుతోందని ధవళ్‌ పటేల్‌ విశ్లేషించారు. దేశీయంగా చాలా రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ బడుల్లో ఇలాంటి పరిస్థితుల వల్ల అనివార్యంగా ప్రైవేటు స్కూళ్లకే లబ్ధి కలుగుతోంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లల ఉజ్జ్వల భవిష్యత్తు కోసం ప్రైవేటు స్కూళ్లలో వారిని చేర్పిస్తున్నారు. అక్కడ అడ్డగోలు ఫీజుల దోపిడితో సతమతమవుతున్నారు. విధానకర్తలు, ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణాధికారులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతారు. అందువల్ల, పేద విద్యార్థులకు జరుగుతున్న నష్టం వారికి అర్థంకాదు.


దృఢ సంకల్పం అవసరం

విద్యార్థులందరూ నాణ్యమైన విద్యను అందుకోవడంలో ప్రస్తుత విద్యావ్యవస్థ తీరుతెన్నులు అవరోధంగా నిలుస్తున్నాయి. బాలలకు, యువతకు నాణ్యమైన విద్య అందించకపోతే ఇండియా అభివృద్ధి పథంలో పరుగు తీయలేదు. విద్యార్థుల నమోదు, కనీస అక్షరాస్యతలో కొన్నేళ్లుగా భారత్‌ చెప్పుకోదగిన పురోగతి సాధించినా- సరైన విద్యాబుద్ధులు నేర్పడంలో మాత్రం వెనకబడే ఉంది. ముఖ్యంగా, దేశీయంగా అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. బాలబాలికల అభ్యసన తీరులోనూ భేదాలున్నాయి. ముఖ్యంగా యువతకు వృత్తి నైపుణ్యాలను అలవరచలేక పోతున్నాం. దీనికి విద్యావ్యవస్థలోని లోపాలతో పాటు చారిత్రక కారణాలూ ఉన్నాయి. గతంలో భారత్‌లో శిష్ట వర్గ ప్రయోజనాలు తీర్చడానికే విద్య పరిమితమయ్యింది. బ్రిటిష్‌ హయాములో విద్య వలస పాలకుల ప్రయోజనాలను నెరవేర్చడానికి అంకితమయ్యింది. ముఖ్యంగా, చదువును ప్రభుత్వ ఉద్యోగాలతో ముడిపెట్టారు. వలస ప్రభుత్వ విద్యావిధానం ఆంగ్ల, ప్రాంతీయ భాషా మాధ్యమం అని విభజన తెచ్చింది. ఆ భేదం నేటికీ కొనసాగుతోంది.


భారత్‌లోని దాదాపు 15 లక్షల పాఠశాలల్లో 25 కోట్ల మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. వారిలో 12 కోట్ల మంది ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు. దేశంలోని బడుల్లో మూడో వంతు (4.5 లక్షలు) ప్రైవేటు పాఠశాలలే. ప్రభుత్వ పాఠశాలల్లోని లోటుపాట్లు తల్లిదండ్రుల్లో వాటిపై నమ్మకాన్ని పోగొడుతున్నాయి. దాంతో గడచిన రెండు దశాబ్దాల్లో ప్రైవేటు స్కూళ్లలో చేరేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. కొఠారి కమిషన్‌ (1964-66) భారత్‌లో ఉమ్మడి పాఠశాలల వ్యవస్థ (సీఎస్‌ఎస్‌)ను ప్రతిపాదించింది. ప్రభుత్వ, ఎయిడెడ్‌, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల ద్వారా బాలబాలికలందరికీ సమానమైన, నాణ్యమైన విద్యను అందించాలని అది సిఫార్సు చేసింది. మంచి చదువు కోసం విద్యార్థులు ఇతర ప్రత్యామ్నాయాలను వెతుక్కోవలసిన అగత్యం ఉండకూడదని ఆ కమిషన్‌ చెప్పింది. సీఎస్‌ఎస్‌ విషయంలో అమెరికా, బ్రిటన్‌, చైనా, ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌ మనకు స్ఫూర్తిగా నిలిచాయి. దేశీయంగా సామాజిక సమానత్వం సాధించడమే సీఎస్‌ఎస్‌ ప్రధాన లక్ష్యం. ఇండియాలో దీన్ని అమలులోకి తెచ్చి అయిదు దశాబ్దాలైనా నేటికీ ఆశించిన లక్ష్యాలు నెరవేరలేదు. భారత్‌లో బడుగు వర్గాల పట్ల దుర్విచక్షణ సీఎస్‌ఎస్‌ విజయానికి అడ్డుపడుతోంది. చిత్తశుద్ధి ఉన్న రాజకీయ నాయకులు, అధికారులు సైతం దీన్ని తొలగించలేకపోతున్నారు. ఈ విషయంలో రాజకీయంగా మరింత దృఢ సంకల్పం అవసరం.


మధ్యలోనే మానేస్తున్నారు..

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ తమ పిల్లలను విధిగా ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని, అలా పంపిందీ లేనిదీ ఆరు నెలల్లో నిర్ధారించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుధీర్‌ అగర్వాల్‌ 2015 ఆగస్టులో ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోర్టు ఉత్తర్వులను పట్టించుకోనేలేదు. రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ, భారతీయ జనతా పార్టీలలో ఏది అధికారంలో ఉన్నా హైకోర్టు తీర్పును అమలు చేయడానికి పూనుకోలేదు. ఏతావతా దేశంలో విద్యావ్యవస్థ ధనికులు, ఉన్నత వర్గీయుల ప్రయోజనాలను మాత్రమే నెరవేరుస్తున్నట్లు కనిపిస్తోంది. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య గగన కుసుమమైపోయింది. ఈ పరిస్థితిలో అర్ధాంతరంగా చదువు మానేసేవారి సంఖ్య పెరిగిపోతోంది. దేశ సమగ్రాభివృద్ధికి ఇది గొడ్డలిపెట్టు అవుతుందన్న సత్యాన్ని పాలకులు ఇప్పటికైనా గుర్తిస్తారా?


పెరుగుతున్న అగాధం

స్వాతంత్య్రం సిద్ధించిన తరవాత భారత్‌ను లౌకిక సమాజంగా తీర్చిదిద్దాలని తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ లక్షించారు. సంపద, కుల, మత పరమైన విభేదాలతో సతమతమవుతున్న భారతీయ సమాజంలో ఐక్యత, స్వావలంబన, ఆధునికీకరణ సాధించడానికి విద్య మేలిమి సాధనమని ఆయన భావించారు. అయినా, బ్రిటిష్‌ వలస పాలన అవశేషాలు ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే వస్తున్నాయి. విద్యలో ఆంగ్ల మాధ్యమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం, ఆంగ్ల భాషను ఇప్పటికీ హోదాకు చిహ్నంగా పరిగణించడం దానికి ఉదాహరణలు. అంతర్జాతీయ మార్కెట్లో ఉపాధి అవకాశాలను పొందడానికి ఆంగ్లంపై పట్టు తప్పనిసరి అనే భావన సమాజంలో బలంగా నాటుకుంది. అయితే, అత్యధిక భారతీయ విద్యార్థులకు నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ విద్య ప్రస్తుతం లభించడం లేదు. వారు ఆంగ్లాన్ని రెండో, మూడో భాషగా నేర్చుకోవడానికీ ఇబ్బందిపడుతున్నారు. ఫలితంగా ఆంగ్లం బాగా నేర్చుకున్నవారు, సరిగ్గా రానివారి మధ్య అగాధం పెరిగిపోతోంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డాలర్‌ పెత్తనానికి గండి?

‣ వైమానిక సేనకు స్వయంశక్తి

‣ ‘నెట్‌వర్క్‌’తో లాభాలెన్నో!

‣ పర్యటనలే ఉద్యోగమైతే!

‣ డాలరుకు ప్రత్యామ్నాయం ఏమిటి?

Posted Date: 09-09-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం