• facebook
  • whatsapp
  • telegram

భూటాన్‌కు డ్రాగన్‌ వల



ఇండియాకు వ్యూహాత్మకంగా కీలకమైన డోక్లాం పీఠభూమిని తన వశం చేసుకోవాలని చైనా ఆరాటపడుతోంది. దాన్ని తమకు అప్పగించాలంటూ భూటాన్‌పై ఒత్తిడి పెంచుతోంది. ప్రతిగా ఉత్తర భూటాన్‌లో పలు వివాదాస్పద ప్రాంతాలను ఆశజూపుతోంది.


దశాబ్దాలుగా తమ మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు చైనా, భూటాన్‌ ప్రస్తుతం వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా- సరిహద్దులను పక్కాగా నిర్ణయించేందుకు తాజాగా ఉమ్మడి సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. సరిహద్దు గొడవను తేల్చేందుకు 2021లో కుదుర్చుకున్న మూడంచెల కార్యాచరణ ప్రణాళిక అమలును వేగిరం చేయాలని తీర్మానించుకున్నాయి. వివాద పరిష్కారం దిశగా అడుగులు పడుతుండటం స్వాగతించదగ్గ పరిణామమే. అయితే చైనా నుంచి వస్తున్న ఒత్తిడికి తలొగ్గి, డోక్లాం పీఠభూమిని దానికి భూటాన్‌ అప్పగిస్తుందేమోనన్న అనుమానాలు భారత వర్గాల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి.


బీజింగ్‌, థింపూ మధ్య సరిహద్దు వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. భూటాన్‌లో 764 చదరపు కిలోమీటర్ల భాగం తమదేనని చైనా వాదిస్తోంది. వివాద పరిష్కారం కోసం రెండు దేశాల మధ్య సరిహద్దు చర్చలు 1984లో ప్రారంభమయ్యాయి. పలుమార్లు సంప్రతింపులు జరిపాయి. థింపూతో వివాదాస్పద ప్రాంతాలు చాలా ఉన్నా, బీజింగ్‌ దృష్టి మాత్రం ప్రధానంగా డోక్లాంపైనే ఉంటోంది. ఇండియా-భూటాన్‌-చైనా మధ్య కూడలి వంటి ప్రాంతమది. భారత ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానించే సిలిగుడి నడవాకు అత్యంత చేరువలో ఈ పీఠభూమి ఉంది.     భారత్‌కు వ్యూహాత్మకంగా అది చాలా కీలకం. దాన్ని తమ వశం చేసుకుంటే- సాయుధ ఘర్షణల సమయంలో సరిహద్దుకు బలగాలను తరలించడం చైనాకు సులువవుతుంది. ఇండియాపై పైచేయి సాధించే అవకాశాలు పుష్కలమవుతాయి. అందుకే చాలా ఏళ్లుగా భూటాన్‌ను ఆకర్షణీయ ప్యాకేజీతో ఊరిస్తోంది. ఉత్తర భూటాన్‌లో వివాదాస్పద ప్రాంతాలను వదులుకుంటామని, బదులుగా డోక్లాంను తమకు ఇవ్వాలని కోరుతోంది. దానికి అంగీకరిస్తే ఇండియా ఆగ్రహానికి గురవుతామన్న సంగతి భూటాన్‌కు తెలుసు. అందుకే ఇప్పటి వరకైతే ఆ ప్యాకేజీకి తలొగ్గలేదు. దాంతో తీవ్ర అసహనానికి గురవుతున్న చైనా, కొన్నిసార్లు ఏకపక్షంగా సరిహద్దును మార్చేసే సాహసం చేసింది. 2017లో ఆ దేశ బలగాలు డోక్లాంలో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు యత్నించాయి. భారత దళాలు ఆ ప్రయత్నాన్ని    అడ్డుకున్నాయి. తూర్పు భూటాన్‌లోని సాక్టెంగ్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కూడా తమదేనని 2020లో డ్రాగన్‌ దేశం కొత్త వాదనను తెరమీదకు    తీసుకొచ్చింది. నిజానికి దాని అధికారిక పటాలూ సాక్టెంగ్‌ను భూటాన్‌లో భాగంగా చూపుతున్నాయి. గల్వాన్‌ ఘర్షణలతో తూర్పు లద్దాఖ్‌లో ఇండియా, చైనా మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఇప్పటికీ చల్లారలేదు. కొన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకోవడంపై ఇరు దేశాలు జరుపుతున్న చర్చలు ఇంకా ఫలించలేదు. ఈ నేపథ్యంలో భూటాన్‌తో సరిహద్దు వివాద పరిష్కారానికి బీజింగ్‌ తొందర పడుతుండటంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. భూటాన్‌కు డోక్లాం అంత కీలకమేమీ కాదు. కాబట్టి ఎలాగైనా ఒత్తిడి పెంచి, ఆ పీఠభూమిని కలిపేసుకుంటే దిల్లీని ఉక్కిరిబిక్కిరి చేయవచ్చని బీజింగ్‌ భావిస్తుండవచ్చు. అయితే అదంత సులభమేమీ కాదు. భూటాన్‌- దశాబ్దాలుగా ఇండియాకు సన్నిహిత మిత్ర దేశం. థింపూ తన అవసరాల కోసం దిల్లీపైనే అత్యధికంగా ఆధార పడుతుంటుంది. ఇండియా సైతం ఏళ్లుగా సైనిక, ఆర్థిక సహాయం అందిస్తూ వస్తోంది. ఇరు దేశాలకూ ప్రాధాన్యమున్న ఏ అంశంలోనూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవద్దని దిల్లీ, థింపూల మధ్య కీలక ఒప్పందం ఉంది. కాబట్టి డోక్లాం విషయంలో ఇండియా ప్రయోజనాలను అది ఎంతమాత్రమూ విస్మరించజాలదు. డోక్లాంలో చైనా చొరబాట్లేమీ లేవంటూ గతంలో భూటాన్‌ ప్రధానమంత్రి లొటే షెరింగ్‌ చేసిన వ్యాఖ్యలు భారత భద్రతా వర్గాల్లో కలవరం సృష్టించాయి. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకుంటామని నాడు ఆయన పేర్కొన్నారు. థింపూపై బీజింగ్‌ ఒత్తిడి పెరుగుతోందని చెప్పేందుకు షెరింగ్‌ వ్యాఖ్యలను నిదర్శనంగా భావించవచ్చు. ఆయన వ్యాఖ్యలతో థింపూ, దిల్లీ మధ్య దూరం పెరుగుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమైనా, భూటాన్‌ రాజు వాంగ్‌చుక్‌ భారత్‌లో పర్యటించడం ద్వారా వాటిని పటాపంచలు చేశారు. ప్రస్తుతం సరిహద్దు వివాద పరిష్కారం కోసం బీజింగ్‌-థింపూ  ప్రయత్నాలు ముమ్మరం చేయడం శుభ పరిణామమే. అయితే దిల్లీకి   వ్యూహాత్మకంగా కీలకమైన డోక్లాం విషయంలో భూటాన్‌ ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయమూ తీసుకోకూడదు. ఆ పీఠభూమి తమదేనన్న వాదనను బలంగా వినిపించడం శ్రేయస్కరం. కూడలి విషయంలో ఇండియా జోక్యం చేసుకోకుండా తుది నిర్ణయం సాధ్యం కాదని చైనాకు స్పష్టం చేసి, దిల్లీతో దీర్ఘకాల మైత్రిని పదిలంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.


- ఎం.నవీన్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రత్యేక భేటీ.. అమిత ఉత్కంఠ!

‣ నాణ్యమైన విద్యతోనే దేశాభివృద్ధి

‣ డాలర్‌ పెత్తనానికి గండి?

‣ వైమానిక సేనకు స్వయంశక్తి

‣ ‘నెట్‌వర్క్‌’తో లాభాలెన్నో!

‣ పర్యటనలే ఉద్యోగమైతే!

‣ డాలరుకు ప్రత్యామ్నాయం ఏమిటి?

Posted Date: 09-09-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం