• facebook
  • whatsapp
  • telegram

లోపాలు సరిదిద్దితేనే సరైన న్యాయం



బ్రిటిష్‌ వలస పాలన వారసత్వం నుంచి భారతీయ క్రిమినల్‌ న్యాయవ్యవస్థను విముక్తం చేసేందుకు కేంద్రం నడుంకట్టింది. దశాబ్దాల నాటి భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ), నేర శిక్షా స్మృతి(సీఆర్పీసీ), సాక్ష్యాధారాల చట్టాల స్థానంలో మూడు కొత్త బిల్లులను ప్రవేశపెట్టింది. అవి ఆశించిన ప్రయోజనాన్ని నెరవేర్చగలవా అంటే లేదనే చెప్పాలి.


మన దేశంలో క్రిమినల్‌ న్యాయవ్యవస్థకు నాలుగు మూలస్తంభాలున్నాయి. అవి: పోలీసుశాఖ, ప్రాసిక్యూషన్‌ (నేరాభియోగం దాఖలుచేసి విచారణ ప్రారంభించడం), తీర్పు వెల్లడి, కారాగార శిక్ష అమలు విభాగాలు. బ్రిటిష్‌ వలస పాలన అవశేషాలుగా మారిన చట్టాల స్థానంలో కొత్త నేరస్మృతులను ప్రవేశపెట్టాలని కేంద్రం సంకల్పించింది. ఆ దిశగా మూడు కొత్త బిల్లులను తీసుకొచ్చింది. కానీ, వాటి రూపకల్పనలో ఈ నాలుగు విభాగాల ప్రతినిధులను భాగస్వాముల్ని చేయకపోవడం పెద్ద లోపం!


విచారణలో తీవ్ర జాప్యం

భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)కి బదులుగా ప్రవేశపెట్టిన భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌) కొత్త నేరాలను, శిక్షలను ప్రవేశపెట్టినా అవి అంత సంతృప్తికరంగా లేవు. నిర్భయ ఉదంతం తరవాత ఐపీసీలో కొత్త నేరాలను నిర్వచించి, కఠిన శిక్షలను ప్రతిపాదించారు. కానీ, విచారణను వేగంగా పూర్తిచేయకపోవడం విమర్శలకు తావిచ్చింది. పార్లమెంటు భవనంపైన, ముంబయిలో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను... విజయ్‌ మాల్య, నీరవ్‌ మోదీ వంటి ఆర్థిక నేరస్థులను శీఘ్రంగా విచారించి శిక్షించలేదు. న్యాయ వితరణలో ఆలస్యమైతే న్యాయం జరగనట్లే లెక్క!


కాలం చెల్లిన భారతీయ నేర శిక్షా స్మృతి (సీఆర్పీసీ), సాక్ష్యాధారాల చట్టాలవల్ల విచారణలో జాప్యం చోటుచేసుకుంటోంది. వేగంగా శిక్షలు పడటం లేదు. వాటి స్థానంలో కేంద్రం తెచ్చిన భారతీయ సాక్ష్య సంహిత (బీఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత(బీఎన్‌ఎస్‌ఎస్‌)లలోనూ పాతకాలపు వ్యర్థావశేషాలే ఉన్నాయి. సీఆర్పీసీలో కొన్ని లోపాలు ఉన్నాయి. 1.సందేహానికి తావులేని విధంగా సాక్ష్యాధారాలు సమర్పించడం, 2.దోషిగా తేలే వరకు ప్రతి నిందితుడిని నిర్దోషిగానే పరిగణించడం, 3.విచారణ ఏళ్లూపూళ్లూ సాగడం, 4.నిందితుడికి అవసరాన్ని మించి రక్షణలు కల్పించడం, 5.తీర్పరికి చురుకైన పాత్ర ఇవ్వకపోవడం, 6.బాధితుడికి విచారణ ప్రక్రియలో పాత్ర కల్పించకపోవడం. ఈ లోపాలను సరిదిద్దడానికి బీఎస్‌, బీఎన్‌ఎస్‌ఎస్‌లు చేసిందేమీ లేదు- సీఆర్పీసీ, సాక్ష్యాధారాల చట్టాల్లోని క్లాజులనే మళ్ళీ వల్లెవేసి, సంఖ్యలు మార్చడం తప్ప! నిర్భయ కేసును విచారించి, నేరస్థులను శిక్షించడంలో విపరీత జాప్యం చోటుచేసుకోవడాన్ని మేము తీవ్రంగా నిరసించాం. హైదరాబాద్‌లో దిశ కేసు నిందితులను పోలీసులు చట్టవిరుద్ధంగా కాల్చి చంపినప్పుడు నిరసనగా బ్యానర్లు కట్టాం. ఇక్కడ మనకు, అమెరికన్‌ క్రిమినల్‌ న్యాయవ్యవస్థకు మధ్య తేడాను గమనించాలి. అగ్రరాజ్యంలో రాజ్‌ రత్నానికి చెందిన గాలియన్‌ హెడ్జ్‌ ఫండ్‌లో జరిగిన సెక్యూరిటీల కుంభకోణంలో రజత్‌ గుప్తాకు ప్రమేయం ఉందని స్వల్ప సాక్ష్యాధారాలే లభ్యమయ్యాయి. అయినప్పటికీ, విచారణను వేగంగా పూర్తిచేసి శిక్ష విధించారు. భారత్‌లో ప్రతిపాదిస్తున్న కొత్త బిల్లులు సైతం అంతటి శీఘ్రంగా న్యాయాన్ని అందించలేవు. కారణం- అవి వలస యుగ చట్టాల మాదిరే నేరస్థుల పట్ల సానుకూలతను కలిగి ఉన్నాయి.


భారత్‌లో అపరిష్కృత కేసులు పెద్ద సంఖ్యలో పోగుపడ్డాయి. శిక్షలు పడటమూ చాలా తక్కువ. మరోవైపు, విచారణకు నోచుకోకుండా ఎంతోమంది ఏళ్లతరబడి జైళ్లలోనే మగ్గుతున్నారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న బీఎస్‌, బీఎన్‌ఎస్‌ఎస్‌లలో ఈ లోపాలను సరిదిద్దే ఏర్పాట్లేమీ లేవు. పైగా సత్యం కంటే సాక్ష్యానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాయి. విచారణ ముగిసి శిక్ష పడటం సహజ ప్రక్రియ. కానీ, సుదీర్ఘంగా సాగుతున్న విచారణ ప్రక్రియే నిందితుల పాలిట శిక్ష అవుతోంది. దేశంలోని మొత్తం ఖైదీల్లో విచారణలో ఉన్నవారు 2021 చివరి నాటికి 77.1శాతానికి చేరినట్లు జాతీయ నేర గణాంక బ్యూరో నివేదిక వెల్లడించింది. దేశంలోని అన్ని కోర్టుల్లో కలిపి అయిదు కోట్లకు పైగా కేసులు పేరుకుపోయాయని ఈ ఏడాది జులై14న కేంద్ర న్యాయశాఖ పార్లమెంటుకు తెలిపింది. వీటిలో సుమారు 1.71లక్షల కేసులు 30 ఏళ్లు దాటిపోయినవే! రౌండ్‌ ట్రిప్పింగ్‌ వంటి ఆర్థిక నేరాలను, డిజిటల్‌ నేరాలను విచారించి శిక్షించేందుకు బీఎన్‌ఎస్‌ఎస్‌లో తగిన ఏర్పాట్లు లేవు. దాదాపు రూ.56,000 కోట్ల భూషణ్‌ స్టీల్స్‌ బ్యాంకు మోసం కేసులో   283 మంది నిందితులపై 70,000 పేజీల నేరారోపణ పత్రం దాఖలైంది. సీఆర్పీసీ 207వ సెక్షన్‌ ప్రకారం ప్రతి నిందితుడికి ఛార్జిషీటు ప్రతిని ఇవ్వాలంటే కోట్ల సంఖ్యలో పేజీలను ముద్రించాల్సి వస్తుంది. ఈ కేసును వాదిస్తున్న న్యాయవాదులు, నిందితుల జీవిత కాలంలో విచారణ పూర్తయ్యి శిక్ష పడే అవకాశమే కనిపించడంలేదు!


పటిష్ఠంగా రూపుదిద్దితేనే..

అపరిష్కృత కేసుల్లో కొన్ని మాత్రమే ఉగ్రవాదానికి, తీవ్రమైన ఆర్థిక నేరాలకు సంబంధించినవి ఉంటాయి. ఎక్కువశాతం చిన్నాచితకా కేసులే. వీటిని వర్గీకరించి త్వరగా విచారణ ముగిస్తే కేసులు వేగంగా పరిష్కారమవుతాయి. బీఎస్‌, బీఎన్‌ఎస్‌ఎస్‌లలో అందుకు ఏర్పాట్లు లేవు. ఐరోపా దేశాల్లో నేర బాధితులకు రెండు ప్రత్యేక హక్కులున్నాయి. ఒకటి: కేసు విచారణ కార్యకలాపాల్లో పాలు పంచుకునే హక్కు. కేసులో మూడో పక్షాన్ని ప్రతివాదిగా చేర్చాలని వారు కోరవచ్చు. దర్యాప్తు వివరాలను తెలుసుకోవడానికి, వాదనను వినిపించడానికి, సత్య శోధనలో కోర్టుకు తోడ్పడటానికి బాధితులకు హక్కు ఉంటుంది. రెండు: ప్రత్యేక సందర్భాల్లో బాధితులు నేరుగా క్రిమినల్‌ కోర్టు నుంచే నష్టపరిహారం కోరవచ్చు. బీఎన్‌ఎస్‌ఎస్‌ ఈ విధంగా బాధితుల హక్కులను గుర్తించడం లేదు. ఏతావతా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు తాత్కాలిక స్వభావం కలిగినవనే చెప్పాలి. చట్టాన్ని ధిక్కరించేవారు ఏ శిక్షా పడకుండా తప్పించుకుంటూ ఉంటే బాధితులు ఆశ కోల్పోయే పరిస్థితి ఉండకూడదు. ప్రతిపాదిత బిల్లుల్లోని లోపాలను పరిహరించి, వాటిని పటిష్ఠంగా రూపుదిద్దే బాధ్యతను పార్లమెంటు స్థాయీ సంఘం సమర్థంగా నిర్వహిస్తుందని ఆశిద్దాం.


కాలానుగుణంగా మార్పులు

బ్రిటన్‌, అమెరికాల్లో నేర శిక్షా స్మృతులు కాలానుగుణంగా మార్పులను అందిపుచ్చుకొన్నాయి. భారత్‌లో అలా జరగడం లేదు. 1996లో బ్రిటన్‌ కొన్ని సవరణలతో క్రిమినల్‌ ప్రొసీజర్‌, ఇన్వెస్టిగేషన్స్‌ చట్టాన్ని ఆమోదించింది. అమెరికాలో న్యాయమూర్తులకు చురుకైన పాత్ర కల్పిస్తూ 1962లో నమూనా శిక్షాస్మృతిని ప్రతిపాదించగా, అనేక రాష్ట్రాలు ఆమోదించాయి. బాధితుడికి అధిక పాత్ర కల్పిస్తూ ఫ్రాన్స్‌ కోడ్‌ పీనల్‌ను చేపట్టింది. అది 1810నాటి ఫ్రెంచి శిక్షాస్మృతి స్థానంలో వచ్చింది. ఆ దేశాల అనుభవం నుంచి భారత్‌ నేర్వాల్సింది ఎంతో ఉంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ విశ్వ కుటుంబంగా ముందడుగు

‣ భూటాన్‌కు డ్రాగన్‌ వల

‣ ప్రత్యేక భేటీ.. అమిత ఉత్కంఠ!

‣ నాణ్యమైన విద్యతోనే దేశాభివృద్ధి

‣ డాలర్‌ పెత్తనానికి గండి?

Posted Date: 15-09-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం