• facebook
  • whatsapp
  • telegram

ఆర్థిక వృద్ధికి కృత్రిమ మేధ



బ్లాక్‌చైన్‌, ఎడ్జ్‌ కంప్యూటింగ్‌, క్లౌడ్‌, మెషీన్‌ లెర్నింగ్‌, కృత్రిమ మేధ (ఏఐ).. ఇవన్నీ డిజిటల్‌ సాంకేతికత జాబితాలోకి వస్తాయి. వీటిలో ఏఐ పాత్ర ప్రత్యేకమైంది. ప్రజల జీవన విధానాన్ని సమూలంగా మార్చడంతో పాటు, ఎన్నో రకాల సమస్యలకు అనూహ్యమైన పరిష్కారాలను కనుగొనే శక్తిసామర్థ్యాలు ఏఐకి ఉన్నాయి.


కృత్రిమ మేధ (ఏఐ) ఇప్పటికే మానవాళిపై అమిత ప్రభావాన్ని చూపుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వాలతో పాటు, ప్రైవేటు రంగ సంస్థలు సైతం ఏఐపై తప్పక దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ఏఐ ఆధారిత డిజిటల్‌ సాంకేతికతల ఆవిష్కరణలో అమెరికా, చైనా ముందంజలో ఉన్నాయి. యునైడెట్‌ కింగ్‌డమ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ తదితర ఐరోపా దేశాలు దీనికి సంబంధించి భారీ ప్రాజెక్టులను పట్టాలకు ఎక్కించేందుకు సిద్ధమవుతున్నాయి. యూఏఈ, సౌదీ వంటి గల్ఫ్‌ దేశాలూ ఈ పరుగులో భాగం అవుతున్నాయి. భారత్‌ సైతం డిజిటల్‌ సాంకేతికతలను విరివిగా అమలులోకి తేవడానికి మూడు నాలుగేళ్లుగా పలు ప్రయత్నాలు చేస్తోంది. ఈ కృషి సరిపోదనే చెప్పాలి. వాటికి అధిక ప్రాధాన్యమిస్తూ, పెద్దయెత్తున పెట్టుబడులను సమీకరించాలి. విస్తృత పరిశోధనలు చేపట్టి నూతన సాంకేతిక పరిష్కారాలను కనుగొనాలి. ఈ విషయంలో ప్రభుత్వం పాత్ర ఎంతో కీలకం. సర్కారు దారి చూపితే, అందులో ప్రైవేటు రంగ సంస్థలు సైతం ముందుకు సాగి, ఐటీ రంగంలో మాదిరిగా ఘన విజయాలను సాధించడానికి అవకాశం ఉంటుంది.


స్పష్టమైన లక్ష్యాలతో..

దేశీయంగా ప్రైవేటు రంగంలో రిలయన్స్‌ గ్రూపు సంస్థ అయిన జియో భారత్‌కు అనువైన ఏఐ మోడళ్లను ఆవిష్కరించడానికి కృషి చేస్తోంది. రెండు వేల మెగావాట్ల ఏఐ కంప్యూటింగ్‌ సామర్థ్యం కలిగిన క్యాంపస్‌ను సిద్ధం చేసే పనిలో అది నిమగ్నమైంది. భారతీయ భాషలకు సంబంధించి టెక్‌ మహీంద్రా, ఐఐటీ మద్రాస్‌తో కలిసి మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ ప్రత్యేక ప్రాజెక్టులు చేపట్టింది. వైద్య సేవలు, విద్య, ఈ-గవర్నెన్స్‌ విభాగాల్లోనూ నూతన ఏఐ అనువర్తనాలను తేవడానికి ప్రైవేటు రంగ సంస్థలు పెద్దయెత్తున ముందుకు రావాలి. అందుకు ప్రభుత్వం తగిన చొరవ చూపాలి. ‘కృత్రిమ మేధ’ ఆధారిత అనువర్తనాలను అధికంగా వినియోగిస్తే ఇండియా ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుంది. తద్వారా తలసరి ఆదాయం పెరుగుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. నేర పరిశోధన, వ్యాధుల తీరుతెన్నులు, వాటి తీవ్రత గుర్తింపు, ప్రభుత్వ పథకాల్లో లొసుగుల నివారణ తదితరాల్లో ఏఐ ఎంతగానో ఉపయోగపడుతుంది. సింగపూర్‌లో ఆర్థిక నేరాలను కనుగొనడానికి ఏఐని విరివిగా వినియోగిస్తున్నారు. క్యాన్సర్‌ను గుర్తించేందుకు ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో సీటీ స్కాన్‌, వీడియో చిత్రాలను పరీక్షిస్తున్నారు. సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేసేవారి పని పట్టడానికి నెదర్లాండ్స్‌ ప్రభుత్వం ఏఐ పరిజ్ఞానాన్ని వాడుతోంది.


కృత్రిమ మేధ విషయంలో భారత్‌ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని, దానిపై అభివృద్ధి చేసిన అనువర్తనాలను వినియోగించడానికే ఇండియా పరిమితమైంది. పరిశోధన-అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ) ద్వారా నూతన అప్లికేషన్లను ఆవిష్కరించే స్థితికి ఇంకా చేరలేదు. ఈ విభాగంలో అగ్రగామి కావాలంటే సొంతంగా నూతన అప్లికేషన్లను అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలకు అందించగలిగే సామర్థ్యాన్ని సంతరించుకోవాలి. పలు దేశాలతో పోలిస్తే భిన్నమైన సమస్యలు ఇండియాలో ఉన్నాయి. అందువల్ల ఆయా దేశాలు ఆవిష్కరించే డిజిటల్‌ సాంకేతికత పరిష్కారాలన్నీ మన దేశానికి సరిపోకపోవచ్చు. ఈ క్రమంలో మన సమస్యలకు అనువైన రీతిలో సాంకేతిక పరిష్కారాలను కనుగొనాలి. అందుకోసం ఆర్‌అండ్‌డీకి పెద్దపీట వేయాలి. నిధుల కేటాయింపును గణనీయంగా పెంచాలి. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి.


ఎన్నో అనుకూలతలు

భారత్‌ సొంతంగా ఏఐ అనువర్తనాలను అభివృద్ధి చేయాలని, అందుకు వీలుగా జాతీయ ఏఐ కంప్యూటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఇటీవల ఐబీఎం ఛైర్మన్‌, సీఈఓ అర్వింద్‌ కృష్ణ ఒక సదస్సులో వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఐటీ పరిజ్ఞానంలో భారత్‌ ముందంజలో ఉంది. మానవ వనరుల లభ్యతా మనకు అధికమే. ఇటీవల విద్యాధికులైన యువకులు అంకుర సంస్థలను నెలకొల్పి విభిన్న వస్తు సేవలను అందిస్తున్నారు. ఏఐ విభాగంలో ప్రపంచ దేశాలకు భారత్‌ మార్గదర్శిగా నిలిచేందుకు ఇవన్నీ ఎంతగానో తోడ్పడతాయి. డిజిటల్‌ సాంకేతికతల్లో ఇండియా అగ్రగామిగా నిలవాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్షించింది. అందుకోసం పలు కీలక చర్యలు తీసుకుంటోంది. అయితే కృత్రిమ మేధ వినియోగం బాధ్యతాయుతంగా, నైతికంగా ఉండాలని ఇటీవల ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. తాజాగా జీ20 సదస్సులో కృత్రిమ మేధపై చర్చలు జరిగాయి. నిజానికి ఏఐ విస్తృత వినియోగంతో కొన్ని సమస్యలూ ఉన్నాయి. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి, వ్యాపార సంస్థల బ్రాండ్‌ విలువను దెబ్బతీయడానికి, నేరస్థులు చట్టానికి దొరక్కుండా తప్పించుకోవడానికి ఏఐని దుర్వినియోగం చేయగల వీలుంది. వీటిని నిరోధించేందుకు పటిష్ఠ జాగ్రత్తలు తీసుకోవాలి.  ఏఐ పరంగా రాబోయే అయిదు, పదేళ్ల కాలానికి స్పష్టమైన కార్యచరణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం చేసుకొని, దాని సమర్థ అమలుపై దృష్టి సారించాలి. అప్పుడే ఈ నూతన సాంకేతిక పరిజ్ఞాన ఫలాలు అందరికీ అందుబాటులోకి వస్తాయి.


తప్పనిసరి  అవసరం

భారత ఆర్థిక వ్యవస్థకు వచ్చే పదేళ్లలో దాదాపు వంద కోట్ల డాలర్ల మేర అదనపు విలువను జోడించే సత్తా ఏఐకి ఉంది. ఇండియా త్వరలోనే అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తక్కువ సమయంలోనే అగ్రగామి దేశంగా, ప్రబల ఆర్థిక శక్తిగా ఆవిర్భవించాలని భారత్‌ లక్షిస్తోంది. ఇందుకోసం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం తప్పనిసరి. ఆ వైపు ఇప్పటికే కేంద్రం అడుగులు వేస్తోంది. ఆధార్‌, యూపీఐ, డిజిలాకర్‌, కొవిన్‌ వేదిక, ఉమంగ్‌... దీనికి కొన్ని ఉదాహరణలు. దేశీయంగా పలు రాష్ట్రాలు కృత్రిమ మేధ దన్నుతో వివిధ రకాల డిజిటల్‌ సాంకేతిక అనువర్తనాలను వినియోగిస్తున్నాయి. బయోమెట్రిక్‌, నేర పరిశోధన, మహిళల భద్రత, ముఖాల గుర్తింపు వంటి వివిధ అంశాల్లో ఏఐని అధికంగా వాడుతున్నారు. ఈ-గవర్నెన్స్‌ ప్రాజెక్టుల్లో ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చు. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాయి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ జీ20 సర్వత్రా ఆసక్తి!

‣ లోపాలు సరిదిద్దితేనే సరైన న్యాయం

‣ విశ్వ కుటుంబంగా ముందడుగు

‣ భూటాన్‌కు డ్రాగన్‌ వల

‣ ప్రత్యేక భేటీ.. అమిత ఉత్కంఠ!

‣ నాణ్యమైన విద్యతోనే దేశాభివృద్ధి

‣ డాలర్‌ పెత్తనానికి గండి?

Posted Date: 15-09-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం