• facebook
  • whatsapp
  • telegram

మహిళాభివృద్ధిలో మనమెక్కడ?



ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించనుందని, ఈ వృద్ధియాత్రకు మహిళలే చోదకశక్తి అని కొద్దిరోజుల కిందట ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అనేక రంగాల్లో మహిళలు ముందడుగు వేస్తే- అది కచ్చితంగా దేశానికి లాభిస్తుంది. అయితే, ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల వాటా భారత్‌లో ఇప్పటికీ స్వల్పంగానే ఉంటోంది.


భారత్‌లో లింగపరమైన అసమానతలు, దుర్విచక్షణ తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. అందువల్లే ప్రపంచ ఆర్థిక వేదిక ప్రచురించే లింగపరమైన అసమానతల నివేదికలో ఇండియా వెనకంజలో ఉంటోంది. 2023కు సంబంధించి ఆ నివేదికలో 146 దేశాలకుగాను భారత్‌ 127వ స్థానంలో నిలిచింది. శ్రీలంక, నేపాల్‌, మాల్దీవులు, సెనెగల్‌, ఘనా, మంగోలియా వంటి దేశాలకన్నా ఇండియా ఈ జాబితాలో వెనకబడింది. అమ్మాయిలు చదువుల్లో రాణిస్తున్నా, పురుషులతో సమానంగా అనేక రంగాల్లో దూసుకుపోతున్నా- లింగపరమైన సమానత్వ సాధనకు మరెంతగానో కృషి జరగాల్సి ఉందని ఆ నివేదిక సూచించింది.


శ్రామిక శక్తిలో వెనకంజ

మహిళల ఆర్థిక సాధికారత, వారు విద్యావకాశాలను అందిపుచ్చుకోవడం అభివృద్ధికి ఊతమిస్తాయని ప్రధాని మోదీ లోగడ ఉద్ఘాటించారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ప్రతి పదకొండు మంది అమ్మాయిల్లో చదువుకున్నవారు ఒక్కరే ఉండేవారు. నాడు తొమ్మిది శాతంగా ఉన్న మహిళా అక్షరాస్యత ప్రస్తుతం 77శాతానికి చేరింది. అయితే, ఉన్నత విద్యలో, ముఖ్యంగా వృత్తి విద్యల్లో వారి ప్రవేశాలు ఎలా ఉంటున్నాయన్నది కీలకం. 2020-21 అఖిల భారత ఉన్నత విద్యాసర్వే (ఏఐఎస్‌హెచ్‌ఈ) ప్రకారం- కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అమ్మాయిల చేరికలు పెరుగుతున్నాయి. 2019-20లో 1.88 కోట్ల మంది విద్యార్థినులు వివిధ ఉన్నతస్థాయి కోర్సుల్లో చేరగా, 2020-21లో వారి ప్రవేశాలు 2.01 కోట్లకు పెరిగాయి. కానీ, దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరుతున్న అమ్మాయిలు 30శాతంలోపే ఉంటున్నారని, మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లోనూ 40శాతం లోపే నమోదవుతున్నారని ఏఐఎస్‌హెచ్‌ఈ నివేదిక వెల్లడించింది. ఇలాంటి పరిస్థితుల్లో 21వ శతాబ్దపు సాంకేతిక ప్రపంచంలో దేశాభివృద్ధికి మహిళలు ఎలా నాయకత్వం వహించగలుగుతారన్నది ప్రధాన ప్రశ్న.


శ్రామికశక్తిలోనూ మహిళల వాటా తక్కువే! 2018-19లో దేశ శ్రామికశక్తిలో గ్రామీణ మహిళల భాగస్వామ్యం 19.7శాతంగా ఉండేది. 2020-21 నాటికి అది 27.7 శాతానికి చేరిందని 2022-23 ఆర్థిక సర్వే చెబుతోంది. కాలానుగుణ కార్మిక శక్తి(పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌) సర్వే ప్రకారం, 2021-22లో దేశంలో 15ఏళ్లు దాటిన ఆడపిల్లల్లో 32.80శాతం శ్రామికశక్తిలో భాగస్వాములయ్యారని ప్రభుత్వం కొద్దినెలల కిందట లోక్‌సభలో వెల్లడించింది. ఇలా ఏ గణాంకాలను పరిశీలించినా- ఆర్థిక కార్యకలాపాల్లో భారతీయ మహిళల వాటా చాలా దేశాలకంటే తక్కువగానే ఉన్నట్లు అర్థమవుతుంది. చెప్పాలంటే, కొన్ని రంగాల్లోనే మహిళలు స్వశక్తితో విజయం సాధించి, ఉన్నత ఉద్యోగాలను అందిపుచ్చుకొంటున్నారు. పేద, దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన వారిలో అత్యధికులు ఆ స్థాయికి చేరుకోలేకపోతున్నారు. ఆసక్తి, ప్రతిభ ఉన్నప్పటికీ... అనేక అంశాలు వారిని వెనక్కి లాగుతున్నాయి.


కుటుంబ స్థాయి నుంచే..

లింగపరమైన దుర్విచక్షణను రూపుమాపి మహిళలకు సమానావకాశాలు కల్పిస్తే... 2025 నాటికి ఇండియా స్థూల దేశీయోత్పత్తికి అదనంగా 77 వేల కోట్ల డాలర్లు జతపడతాయని మెకెన్సే గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ గతంలో అంచనా వేసింది. అందుకు ప్రభుత్వపరంగా, సామాజికంగా అనేక మార్పులు తీసుకురావాల్సి ఉంది. ఆడపిల్లలను భారంగా భావించే దుష్ట సంస్కృతి దేశం నుంచి పూర్తిగా తొలగిపోలేదు. భ్రూణహత్యలు ఆగడం లేదు. వాటిని నిరోధించేందుకు తీసుకొచ్చిన చట్టాలను సమర్థంగా అమలుచేయడం ఎంతో కీలకం. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా పసిపిల్లలు మొదలు పెద్దవారిపై విచ్చలవిడిగా అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి. దేశ ప్రగతికి స్త్రీలోకం దిక్సూచి కావాలన్న ప్రభుత్వ ఆకాంక్ష నెరవేరాలంటే- విద్యాలయాల్లో, పనిచేసే చోట, బహిరంగ ప్రదేశాల్లో ముందుగా సురక్షిత వాతావరణాన్ని కల్పించాలి. మహిళలపై దాష్టీకాలకు పాల్పడేవారికి త్వరితగతిన కఠిన శిక్షలు విధించాలి. అదే సమయంలో సమాజాన్ని పితృస్వామిక భావజాల సంకెళ్లలోంచి బయటకు తెచ్చేందుకు చైతన్య కార్యక్రమాలను విరివిగా చేపట్టాలి. పాఠ్యప్రణాళికల్లోనూ ఆ మేరకు లింగ సమానత్వాన్ని ప్రబోధించే అంశాలకు ప్రాధాన్యమివ్వాలి. శాస్త్ర పరిశోధన రంగాల్లో అమ్మాయిలను ప్రోత్సహించడం, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు రుణ లభ్యతను పెంచడమూ ఎంతో కీలకం. సమాన పనికి సమాన ప్రతిఫలం పొందడంలో స్త్రీలకు ఎదురవుతున్న ఇబ్బందులనూ పూర్తిస్థాయిలో తొలగించాలి. అప్పుడే నారీశక్తి కేంద్రకంగా దేశ పురోగతి వేగవంతమవుతుంది.


- గీతాన్విక
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ జమిలి బాటలో సవాళ్ల మేట

‣ ఆర్థిక వృద్ధికి కృత్రిమ మేధ

‣ జీ20 సర్వత్రా ఆసక్తి!

‣ లోపాలు సరిదిద్దితేనే సరైన న్యాయం

‣ విశ్వ కుటుంబంగా ముందడుగు

Posted Date: 15-09-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం