• facebook
  • whatsapp
  • telegram

భారత్‌ - ఆఫ్రికాల బలమైన బంధంఅమెరికా, ఇండియా, రష్యా, చైనా, ఐరోపా సమాఖ్య వంటి ప్రధాన భాగస్వాములున్న జీ20 కూటమిలో 55 దేశాల ఆఫ్రికన్‌ యూనియన్‌(ఏయూ)కు భారత్‌ పట్టుపట్టి సభ్యత్వం ఇప్పించింది. దిల్లీ శిఖరాగ్ర సభలో ఏయూ లాంఛనంగా జీ20లో చేరింది. అంతకు ముందునుంచే ఆఫ్రికా దేశాలతో భారత్‌ రాజకీయ, ఆర్థిక బంధాలను బలోపేతం చేసుకుంటోంది.


చైనా మాదిరిగా భారత్‌ ఆఫ్రికా దేశాలను రుణ ఉచ్చులోకి నెట్టి, తరవాత వాటిని గుప్పిట్లో పెట్టుకోవడం లేదు. ఆ దేశాలను సైతం సమాన భాగస్వాములుగా పరిగణించడం ఇండియా విశిష్టత. ఆఫ్రికన్‌ యూనియన్‌కు చెందిన 42 దేశాల్లో రైల్వే, రహదారులు, రేవుల నిర్మాణంతోపాటు రక్షణ పునాదిని ఏర్పరచడానికి భారత్‌ తక్కువ వడ్డీ రేట్లపై రూ.2,65,000 కోట్లకు పైగా (3200కోట్ల డాలర్ల) రుణాలు అందించింది. చైనా తరవాత అంత భారీగా ఆఫ్రికాకు రుణాలిస్తున్న దేశం ఇండియాయే! బ్రిటిష్‌ కాలంలోను, ఆ తరవాత విదేశాలకు వెళ్ళి స్థిరపడిన భారత సంతతి ప్రజల్లో 13శాతం ఆఫ్రికాలో నివసిస్తుండటం ఇండియాకు కలిసివచ్చే అంశం. ఈ సానుకూలత చైనాకు లేదు. ఆఫ్రికాలో మొత్తం 192 ప్రాజెక్టులకు భారత్‌ నుంచి నిధులు అందుతున్నాయి.


భారత్‌ కొంతకాలంగా ఆఫ్రికా దేశాలతో సైనిక సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. ఇండియా ఆయుధ ఎగుమతుల్లో 20శాతం వాటికే అందుతున్నాయి. ఆఫ్రికా దేశాల సైన్యాలకు శిక్షణ ఇవ్వడంతోపాటు భారత్‌ సొంతంగా తయారుచేసిన ఆయుధాలను అక్కడ ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉంది. నైజీరియాలో 1400 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ఇటీవలి జీ20 సమావేశం సందర్భంగా ఒప్పందం కుదిరింది. దాని కింద భారత ప్రభుత్వం, భారతీయ ప్రైవేటు సంస్థలు నైజీరియాలో పెట్టుబడులు పెడతాయి. అందులో 100కోట్ల డాలర్లు నైజీరియా రక్షణ రంగానికి కేటాయిస్తారు. మిగతా పెట్టుబడులు ఉక్కు, పెట్రో రసాయనాలు, విద్యుదుత్పత్తి రంగాల్లోకి ప్రవహిస్తాయి. ప్రధాన చమురు ఉత్పత్తి దేశాల్లో నైజీరియా ఒకటి. ఇండియా తోడ్పాటుతో రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలని నైజీరియా కృతనిశ్చయంతో ఉంది. తదనుగుణంగా నైజీరియా రక్షణ పరిశ్రమల సంస్థ భారత్‌ సహాయంతో 2027కల్లా ఆయుధోత్పత్తిలో 40శాతం స్వావలంబన సాధించాలని లక్షించింది. భారత్‌తో కుదిరిన 100 కోట్ల డాలర్ల ఒప్పందం కింద తుపాకులు, మందుగుండు, సాయుధ కవచ శకటాలు, అధునాతన కమ్యూనికేషన్‌ పరికరాలను తయారు చేసుకోవాలని ఆ దేశం భావిస్తోంది. అంతేకాదు- భారత్‌ నుంచి తేజస్‌ యుద్ధ విమానాలు, డ్రోన్లు సంపాదించేందుకు నైజీరియా ఆసక్తి కనబరుస్తోంది. ఈజిప్ట్‌ సైతం తేజస్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతోంది.


ఇంతవరకు అమెరికా, ఐరోపా, రష్యా, చైనాల నుంచి ఖరీదైన ఆయుధాలు దిగుమతి చేసుకుంటూ వచ్చిన ఆఫ్రికా దేశాలు.. అంతకన్నా తక్కువ ధరకు లభించే నాణ్యమైన భారతీయ ఆయుధాల వైపు మళ్ళుతున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధంలో తలమునకలైన రష్యా ఆఫ్రికాకు కావలసిన పరిమాణంలో ఆయుధాలు ఎగుమతి చేయలేకపోవడం భారత్‌కు లాభిస్తోంది. భారత అమ్ములపొదిలో అత్యధికం రష్యన్‌ ఆయుధాలే. పలు ఆఫ్రికా దేశాలు సైతం రష్యన్‌ ఆయుధాలనే వాడుతున్నాయి. కాబట్టి, ఇండియా నుంచి ఆయుధాలను, వాటి విడిభాగాలను దిగుమతి చేసుకోవడం వాటికి ఉపయుక్తంగా ఉంటోంది. 2017-2022 మధ్య భారతీయ ఆయుధాలను అత్యధికంగా దిగుమతి చేసుకున్న దేశాలు మొజాంబిక్‌, మారిషస్‌, సెషెల్స్‌. వీటితోపాటు ఈజిప్ట్‌, ఇథియోపియాలు కూడా భారతీయ ఆయుధాలను కొనుగోలు చేయడం ఆరంభించాయి. ఇప్పుడు నైజీరియా ఆ జాబితాలో చేరుతోంది. కొన్ని ఆఫ్రికా దేశాలకు భారత్‌ గస్తీ నౌకలు, హెలికాప్టర్లను సరఫరా చేసింది.


గడచిన ఏప్రిల్‌లో పుణెలో జరిగిన భారత్‌-ఆఫ్రికా సైన్యాధికారుల సమావేశంలో 10 ఆఫ్రికా దేశాల ప్రధాన సైన్యాధికారులు పాల్గొన్నారు. మరో 21 దేశాల సైనిక ప్రతినిధులూ హాజరయ్యారు. అంతకుముందు మార్చిలో జరిగిన ఆఫ్రికా-భారత్‌ సంయుక్త యుద్ధక్షేత్ర శిక్షణ అభ్యాసాల్లో 25 ఆఫ్రికా దేశాల సైనిక దళాలు పాల్గొన్నాయి. నిరుడు అక్టోబరులో భారత్‌, టాంజానియా, మొజాంబిక్‌ నౌకాదళాలు పశ్చిమ హిందూ మహాసముద్రంలో సంయుక్తంగా విన్యాసాలు ప్రదర్శించాయి. మొత్తం మీద ఆయుధ ఎగుమతులు, ఆయుధ ఉత్పత్తిలో స్వావలంబన, సైనిక శిక్షణ, సంయుక్త విన్యాసాల కోణంలో ఆఫ్రికాతో భారత్‌ సంబంధాలు వృద్ధి చెందుతున్నాయి.


- వరప్రసాద్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రజాస్వామ్యం తీరుతెన్నులు

‣ పకడ్బందీగా సుస్థిరాభివృద్ధి

‣ డ్రాగన్‌ దూకుడుకు ముకుతాడు

‣ జీ20.. భారత్‌ ముద్ర!

‣ మహిళాభివృద్ధిలో మనమెక్కడ?

‣ జమిలి బాటలో సవాళ్ల మేట

Posted Date: 15-09-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం