• facebook
  • whatsapp
  • telegram

కావేరి.. రణభేరి!



తేజస్‌.. స్వదేశీ యుద్ధ విమానం. దీనికోసం సొంత ఇంజిన్‌ను తయారు చేసుకోవాలనేది భారత్‌ సంకల్పం. చాలాకాలంపాటు జరిగిన కృషి ఫలితంగా ‘కావేరి’ ఇంజిన్‌ తయారైంది. అయితే, సాంకేతికపరంగా అనేక సమస్యలు తలెత్తడంతో దాన్ని వదిలి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టువదలని మన శాస్త్రవేత్తల కృషి వల్ల కావేరి పునరుత్తేజం పొందింది.


నింగిలో ఎత్తుకు వెళ్ళినకొద్దీ ఇంజిన్‌ సరిగ్గా పనిచేయకపోవడం, బరువు ఎక్కువగా... దాని తోపుడుశక్తి బలహీనంగా ఉండటం, సరైన మిశ్రమ లోహాలను వాడకపోవడం వల్ల ఇంజిన్‌ నుంచి వింత శబ్దం రావడం వంటి సమస్యలు ‘కావేరి’కి అశనిపాతంలా మారాయి. భారత గడ్డపై సరైన ఇంజిన్‌ పరీక్షా కేంద్రాలు లేకపోవడం మరో లోపం. ఇంతలో తేజస్‌తోపాటు ఆధునిక మధ్యతరహా యుద్ధ విమాన (అమ్కా) ఇంజిన్ల తయారీకి అమెరికా, ఫ్రాన్స్‌లతో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో కావేరి ఇంజిన్‌ను ఇక మూలన పడేసినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ, దశాబ్దాల శ్రమ వృథా పోనివ్వరాదన్న సంకల్పంతో భారత్‌ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) ఆధ్వర్యంలోని గ్యాస్‌ టర్బైన్‌ పరిశోధన సంస్థ (జీటీఆర్‌ఈ) కావేరి ఇంజిన్‌లో తగిన మార్పుచేర్పులు చేసి డ్రై కావేరిని రూపొందించింది. రష్యాలో ఒక విమానంలో అమర్చి దీని పనితీరును పరీక్షించారు. డ్రై కావేరి బెంగళూరులో గత ఫిబ్రవరి ఏరోఇండియా ప్రదర్శనలో దర్శనమిచ్చింది. 2019 నుంచి డ్రై కావేరి ఇంజిన్‌ అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంతవరకు మూడు కావేరి ఇంజిన్లను డ్రై కావేరిగా మార్చారు. మరో రెండు ఇంజిన్లపై ప్రయోగాలు జరుగుతున్నాయి. వీటిని బెంగళూరులోని జీటీఆర్‌ఈలో భూతలంపైనే ఉంచి 70 గంటలసేపు పరీక్షించారు. తరవాత రష్యాలో 75 గంటలపాటు నింగిలోకి తీసుకెళ్ళి పరిశీలించారు. డ్రై కావేరి అసలైన కావేరి ఇంజిన్లకన్నా సమర్థంగా, స్థిరంగా పని చేస్తున్నట్లు తేలింది. ఇంజిన్‌ నుంచి శబ్దాలు రావడమూ ఆగిపోయింది. డ్రై కావేరి ఇంజిన్ల తయారీలో ప్రైవేటు సంస్థ గోద్రెజ్‌ ఏరోస్పేస్‌ను భాగస్వామిగా చేర్చుకొంటూ డీఆర్డీఓ 2022 సెప్టెంబరులో ఒప్పందం కుదుర్చుకుంది. దానికింద గోద్రెజ్‌ ఎనిమిది ఇంజిన్లను తయారు చేస్తుంది. వాటిపై అన్ని పరీక్షలను 2025కల్లా పూర్తి చేయాల్సి ఉన్నా ఈ ఏడాది చివరిలోనో లేదా 2024 ఆరంభంలోనో మొత్తం ఇంజిన్లను అందజేస్తామని గోద్రెజ్‌ ప్రకటించింది.



ఈ ఇంజిన్లను తేజస్‌ ఫైటర్‌ విమానాల్లో కాకుండా మానవ రహిత పోరాట గగనతల వాహనమైన(యుకావ్‌) ‘ఘాతక్‌’లో అమర్చాలని భారత్‌ నిశ్చయించింది. 2026కల్లా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని తలపెట్టి రష్యాలో ప్రయోగాలు నిర్వహిస్తోంది. ఇంతకుముందే రష్యాలో డ్రై కావేరిని పరీక్షించినా వచ్చే ఏడాది ప్రారంభంలో తుది పరీక్షలు జరిపి ఘాతక్‌లో అమర్చడానికి యోగ్యమైనదిగా నిర్ధారిస్తారు. గోద్రెజ్‌ తయారు చేసే ఎనిమిది ఇంజిన్లను రష్యాకు పంపుతారు. అక్కడి విమానంలోని నాలుగు ఇంజిన్లలో ఒకదాన్ని తొలగించి, దానిస్థానంలో డ్రై కావేరిని అమర్చి పరీక్షలు జరుపుతారు. తరవాత అది ఘాతక్‌ యుకావ్‌కు చోదక శక్తిగా నిలుస్తుంది. 2020 జూన్‌లో నింగికి ఎగిరిన ఘాతక్‌ 2025-26కల్లా అన్ని పరీక్షలు పూర్తిచేసుకుని యుద్ధ సన్నద్ధతను సాధిస్తుందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. టన్ను బరువుండే ఘాతక్‌ తన వెంబడి డ్రోన్ల దండును తీసుకెళ్ళి శత్రువుపై విరుచుకుపడగలదు. దీన్ని సైన్యం, వాయుసేనలతో పాటు నౌకాదళమూ ఉపయోగించేలా తీర్చిదిద్దుతున్నారు.


మరోవైపు కావేరి ఇంజిన్లను యుద్ధవిమానాలకు యోగ్యమైనవిగా తీర్చిదిద్దే ప్రయత్నాలను సైతం భారత్‌ వదిలిపెట్టలేదు. దీనికోసం ఫ్రాన్స్‌కు చెందిన విమాన ఇంజిన్ల సంస్థతో ఒప్పందం కుదిరింది. దీనికింద క్రమంగా స్వదేశంలోనే శక్తిమంతమైన కావేరి ఇంజిన్‌ తయారీకి నిధులు సమకూరతాయి. కొత్త ఇంజిన్‌, కొత్త నమూనా, కొత్త లోహ మిశ్రమాల తయారీకి ఫ్రాన్స్‌ సహకరిస్తుంది. మరోవైపు తేజస్‌ యుద్ధ విమానాల కోసం జీఈ414 ఇంజిన్లను భారత్‌లోనే తయారు చేయడానికి, సంబంధిత సాంకేతిక పరిజ్ఞానంలో 80శాతాన్ని భారత్‌కు బదిలీ చేయడానికి అమెరికా అంగీకరించడం, మన శాస్త్రజ్ఞులు అనుభవ నైపుణ్యాలు గడించడానికి తోడ్పడుతుంది. భవిష్యత్తులో శక్తిమంతమైన కావేరి ఇంజిన్ల రూపకల్పనకు ఉపకరిస్తుంది.


- ఆర్య
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ తలరాత మార్చే తలసరి ఆదాయం

‣ జమిలి ఎన్నికలు ఎందుకు?

‣ ఆహార భద్రతపై వాతావ‘రణం’!

‣ భారత్‌ - ఆఫ్రికాల బలమైన బంధం

‣ ప్రజాస్వామ్యం తీరుతెన్నులు

‣ పకడ్బందీగా సుస్థిరాభివృద్ధి

Posted Date: 02-10-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం