• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ ఆరోగ్యమే రక్షాకవచం



ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం. ప్రకృతి వ్యవస్థలు సహజ సిద్ధమైన ఆరోగ్యంతో విలసిల్లాలి. అప్పుడే భూగోళంపై జీవరాశి మనుగడకు భరోసా. అభివృద్ధి పేరిట ప్రైవేటు, ప్రభుత్వ వ్యవస్థలు ప్రకృతి వ్యవస్థల విధ్వంసానికి, వనరుల కాలుష్యానికి తెగబడుతున్నాయి. పర్యావరణ విధ్వంసాన్ని అరికట్టడానికి ప్రపంచ దేశాలు ఇస్తున్న హామీలు, ప్రకటిస్తున్న ప్రణాళికలు కార్యాచరణకు నోచుకోవడం లేదు. ప్రకృతి వ్యవస్థల రక్షణతోనే ప్రజారోగ్యానికి భద్రత దక్కుతుంది.


ప్రకృతి ఆరోగ్యం.. ప్రజల ఆహార భద్రత, జీవన శైలి తదితర అంశాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రకృతి వనరుల విధ్వంసం, పర్యావరణ కాలుష్యం వంటివి ఏటా కోటిమందికిపైగా బలి తీసుకుంటున్నాయి. గత దశాబ్ద కాలంలో అత్యంత వేడి వాతావరణం నమోదయింది. ఇలాంటి వాతావరణ మార్పులతో తలెత్తుతున్న ఉపద్రవాలను ప్రపంచ దేశాలు ప్రత్యక్షంగా చవిచూస్తున్నాయి. అడవులను బూడిద చేస్తున్న కార్చిచ్చులు, జనావాసాలను ముంచెత్తుతున్న వరదలు, తీరప్రాంతాలను కుదిపేస్తున్న తుపానులు ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో జీవనోపాధులకు నష్టం సంభవిస్తోంది. ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. వాతావరణ మార్పులతో సూక్ష్మజీవులు, కీటకాల మనుగడ ప్రభావితమవుతోంది. దీంతో కరోనావంటి వైరస్‌ కారక రోగాల వ్యాప్తి పెరుగుతోంది. ఇలాంటి సమస్యలను కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలి. లేకపోతే ప్రాణనష్టం, ఆర్థిక నష్టం తప్పదు. పైగా ఇలాంటి ఉపద్రవాలు తరచూ తలెత్తే ప్రమాదమూ ఉంటుంది.


కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి

స్వచ్ఛమైన గాలితోనే ఆరోగ్యం. అలాంటి ప్రాణవాయువు మితిమీరిన కాలుష్య కారకాలతో నిండిపోతోంది. గాలిలో విషవాయువులు తదితర ప్రమాదకర పదార్థాలు పెరిగిపోతున్నాయి. పరిశ్రమలు, వాహనాల నుంచి ఉద్గారాల విడుదల, అడవుల్లో కార్చిచ్చు మూలంగా పచ్చని చెట్లు నాశనం కావడం వాయు కాలుష్యానికి ప్రధాన కారకాలుగా నిలుస్తున్నాయి. ప్రపంచంలో అధికశాతం జనాభా నాణ్యత కొరవడిన వాయువులనే పీలుస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు పలు ప్రాణాంతక  వ్యాధులకు కారణమవుతున్నాయి. భారత్‌ సహా వివిధ దేశాల్లో ప్రజల ఆరోగ్యంపై వాయు కాలుష్యం ప్రభావ తీవ్రతను షికాగో విశ్వవిద్యాలయం అధ్యయనం పరిశీలించింది. మితిమీరిన వాయు కాలుష్యం భారతీయుల సగటు ఆయువును హరించివేస్తున్నట్లు గుర్తించింది. పర్యావరణ వ్యవస్థల ఆరోగ్య పరిరక్షణలో ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యాలు ప్రజలను ప్రమాదకర జీవన పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నాయనేది సుస్పష్టం. గాలితోపాటు మిగతా వనరుల కాలుష్యం సైతం ప్రజల జీవన ప్రమాణాల్ని హరించి వేస్తోంది. వాహనాల రొద శబ్ద కాలుష్యాన్ని పెంచుతోంది. ఇది వినికిడి శక్తి లోపించడం, పిల్లల్లో అశాంతి, మానసిక సమస్యలకు కారణమవుతోంది. వనరుల వినియోగం మితిమీరడం వల్ల సముద్ర మట్టం అసాధారణంగా పెరగడం, భూతాపం, వాయు కాలుష్యం, ప్రమాదకర కిరణాలు ప్రసరించడంతో పాటు వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా కరవులు, తుపానులు, వరదలు, భూకంపాలు వంటి ఉపద్రవాలను చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.


భారత్‌లో పర్యావరణ చట్టాల అమలుతీరు లోపభూయిష్ఠంగా ఉంటోంది. ఇది ప్రకృతి వ్యవస్థల ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తోందనే విమర్శలున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు, పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఇస్తున్న పర్యావరణ, అటవీ, వన్యప్రాణి, కోస్తా నియంత్రణ అనుమతులు గత అయిదేళ్ల కాలంలోనే ఎన్నో రెట్లు పెరిగాయి. ఆయా అనుమతుల అమలుపై పర్యవేక్షణ, ఉల్లంఘనలపై సమీక్ష పర్యావరణ వ్యవస్థలకు కలుగుతున్న నష్టాన్ని నియంత్రించడంలో మాత్రం ప్రభుత్వ వ్యవస్థలు విఫలమవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు తమ ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీసుకునే అనుమతులను ఉల్లంఘిస్తున్నా నియంత్రణ చర్యలు కరవయ్యాయి. దేశంలో అనేక చోట్ల సరైన ప్రమాణాలు పాటించకుండా, శుద్ధి చేయకుండానే పరిశ్రమల్లో వెలువడే హానికారక రసాయన వ్యర్థాలను సముద్ర, నదీ జలాల్లోకి విడుదల చేస్తున్నట్లు ‘కాగ్‌’ పరిశీలనలోనూ వెల్లడైంది. జలవనరుల కాలుష్యం మత్స్య సంపదపై ప్రభావం చూపించి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అనుమతులను ఉల్లంఘించి అడవులు, కొండలు, తీరప్రాంతాల విధ్వంసానికి పాల్పడుతున్న వారిపై చర్యలు నామమాత్రంగా ఉంటున్నాయి. కొన్నిచోట్ల పౌర సమాజం హరిత న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నా, తీర్పులు వచ్చేసరికి ఏళ్లు గడుస్తున్నాయి. అప్పటికే ప్రకృతి విధ్వంసంతో భారీనష్టం వాటిల్లుతోంది. ఆ నష్టాన్ని భర్తీ చేయడమూ సాధ్యం కావడం లేదు. దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న పర్యావరణ చట్టాల ప్రక్షాళన అవసరమనే డిమాండ్‌ కొన్నేళ్లుగా వినిపిస్తోంది. అయినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణకు పూనుకోవడం లేదనే విమర్శలున్నాయి. పర్యావరణ వ్యవస్థల ఆరోగ్య రక్షణకు దోహదపడే పర్యావరణ పరిరక్షణ చట్టం-1986, అటవీ సంరక్షణ చట్టం-1980, వన్యప్రాణి సంరక్షణ చట్టం - 1972, నీటి కాలుష్య నియంత్రణ చట్టం - 1974, వాయు కాలుష్య నియంత్రణ చట్టం - 1981 వంటి వాటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు కృషి జరగాలి. అంతేకాదు, సమగ్ర చట్టాన్ని పటిష్ఠంగా అమలుచేసేందుకు గట్టి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.


ఉల్లంఘనలపై పర్యవేక్షణ

ప్రాజెక్టులు, పరిశ్రమలు నిబంధనల అమలులో ఉల్లంఘనలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరం. అడవులకు నష్టం కలిగిస్తే, ప్రత్యామ్నాయంగా పెంచే వనాల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అభయారణ్యాలు కాకుండా ఇతరత్రా అడవులు విస్తరించిన పర్వతాలు, తీర ప్రాంతాలనూ అనుమతుల పరిధిలోకి తీసుకురావాలి. ఉల్లంఘనలు జరిగితే బాధ్యులైన వారికి శిక్షలు పెరగాలి. కాలుష్య నియంత్రణ మండళ్లను బలోపేతం చేయాలి. ప్రత్యేక వ్యవస్థల ఏర్పాటు ద్వారా నిబంధనలను చిత్తశుద్ధితో అమలు చేయాలి. అప్పుడే గాలి, నీరు, వాతావరణ కాలుష్యాల తీవ్రతను కట్టడి చేయవచ్చు. తద్వారా సున్నితమైన పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యాన్ని పరిరక్షించే అవకాశం ఉంటుంది. మానవాళితో పాటు సకల జీవరాశి ఆరోగ్యానికీ భరోసా దక్కుతుంది.


క్షేత్రస్థాయిలో విఫలం

ఆరోగ్యకరమైన పర్యావరణం ద్వారా ప్రజల జీవించే హక్కుకు, జీవన భద్రతకు కట్టుబడి ఉన్నట్లు ప్రపంచ దేశాలన్నీ ఘనంగా చెప్పుకొంటాయి. ఈ మేరకు పర్యావరణ, ప్రజారోగ్య చట్టాలు, అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారమే నడుచుకొంటున్నట్లు స్పష్టం చేస్తుంటాయి. మరోవైపు, భూగర్భ వనరులు, జల, వాయు కాలుష్యంతోపాటు రసాయనాల మూలంగా తలెత్తే పర్యావరణ ప్రమాదాల కారణంగా గణనీయ స్థాయిలో మరణాలు సంభవిస్తుండటం బాధాకరం. ఆయా దేశాలు పర్యావరణ చట్టాల అమలులో, ప్రకృతి వ్యవస్థల ఆరోగ్య పరిరక్షణలో క్షేత్రస్థాయిలో ఏ మేరకు విఫలమవుతున్నాయనేది దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వాన నీటి సంరక్షణతో జలసిరులు

‣ నదులకు కాలుష్యం కాటు

‣ అభివృద్ధి ముసుగులో చైనా అప్పుల వల!

‣ కావేరి.. రణభేరి!

‣ తలరాత మార్చే తలసరి ఆదాయం

‣ జమిలి ఎన్నికలు ఎందుకు?

Posted Date: 02-10-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం