• facebook
  • whatsapp
  • telegram

వాన నీటి సంరక్షణతో జలసిరులు



పట్టణీకరణ, వాతావరణ మార్పులు తదితరాల వల్ల భారత్‌లో ఉపరితల జలవనరులు క్రమంగా కనుమరుగు అవుతున్నాయి. ఈ క్రమంలోనే భూగర్భ జలాల వినియోగం అధికమైంది. పోనుపోను ఇవి అడుగంటుతుండటంతో మరింత లోతుకు బావులు తవ్వుతున్నారు. వాటి వల్ల విద్యుత్‌ డిమాండు ఎక్కువైంది.


దేశీయంగా చిన్న నీటి పారుదల వనరులకు సంబంధించి కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఇటీవల ఆరో నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం- దేశంలో 75శాతం చిన్న నీటి వనరులను విద్యుచ్ఛక్తి ద్వారానే తోడివేస్తున్నారు. ఈ విషయంలో డీజిల్‌, పవన, సౌరశక్తి వినియోగం చాలా తక్కువగా ఉంది. చెరువులు, కుంటలు, సాధారణ బావులు, బోర్లు వంటివి చిన్న నీటి వనరుల కిందకు వస్తాయి. వీటిలో సాధారణ బావులు, బోర్ల నుంచి నీటిని తోడటానికే విద్యుచ్ఛక్తిని అధికంగా వాడుతున్నారు. జల్‌శక్తి మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం- దేశీయంగా విద్యుత్తు ద్వారా నీటిని తోడే చిన్న జల వనరులు 2011లో 56శాతం ఉండేవి. తరవాతి కాలంలో వాటి సంఖ్య మరింత పెరిగింది. 2014-18 మధ్య కాలంలో ఇండియాలో చిన్న నీటి కుంటల సంఖ్య 87 లక్షల నుంచి 82 లక్షలకు పడిపోయింది. దానివల్ల సాధారణ, బోరు బావులపై ఒత్తిడి పెరిగింది.


చాలా లోతు నుంచి..

భారత్‌లో ఉపరితల జలాలు నానాటికీ తగ్గిపోతుండటంతో భూగర్భ జలాలు సైతం అడుగంటుతున్నాయి. ఈ క్రమంలో భూగర్భ జలాల కోసం పోనుపోను మరింత లోతుగా తవ్వుతున్నారు. ఇండియాలోని కొన్ని నగరాల్లో పద్దెనిమిది వందల అడుగుల దాకా తవ్వుతున్నట్లు పరిశీలనలు చెబుతున్నాయి. అక్కడి నుంచి నీటిని తోడటానికి శక్తిమంతమైన మోటార్లను వినియోగిస్తున్నారు. దానివల్ల విద్యుత్తు డిమాండు పెరుగుతోంది. ఉపరితల జలాలు తరిగిపోతుండటంతో భారత్‌లో చాలా చోట్ల రైతులు తమ పొలాల్లో 70 మీటర్ల లోతు దాకా కొత్తగా బావులు తవ్వుతున్నారు. వాటి నుంచి నీటిని తోడటానికి మోటార్లు బిగిస్తున్నారు. 70 మీటర్ల లోతు నుంచి భూగర్భ జలాలను అందించే వాటిని కేంద్ర జల్‌శక్తి నివేదిక- మధ్యస్థ స్థాయి బావులుగా విశ్లేషించింది. 2014-18 మధ్య కాలంలో వాటి సంఖ్య 31 లక్షల నుంచి 43 లక్షలకు పెరిగింది. 70 మీటర్లకు మించిన లోతు నుంచి భూగర్భ జలాలను తోడే వాటిని లోతైన బావులుగా వర్గీకరించింది. నాలుగేళ్ల వ్యవధిలో ఇవి 26 లక్షల నుంచి 37 లక్షలకు ఎగబాకాయి. దీన్ని గమనిస్తే నాలుగేళ్ల వ్యవధిలో నీటి కుంటలు లాంటివి గణనీయంగా తగ్గిపోగా, ఎక్కువ లోతు నుంచి తోడే జల వనరులు గణనీయంగా పెరిగినట్లు అర్థమవుతుంది. మరోవైపు భారత్‌లో 35 మీటర్ల లోతు కలిగిన బావులు 2014-18 మధ్య కాలంలో 59 లక్షల నుంచి 55 లక్షలకు తగ్గిపోయాయి. అంటే, ఇండియాలో భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయని అర్థం. విచక్షణారహితంగా భూగర్భ జలాలను తోడివేస్తుండటం వల్ల భవిష్యత్తులో తలెత్తే సమస్యలను జల్‌శక్తి శాఖ నివేదిక ప్రస్తావించకపోవడం విచారకరం. ఈ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాలను బట్టి భూగర్భ జలాల లభ్యత, వినియోగ పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి. ఇండియాలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు బావులకు వినియోగించే పైపుల కొనుగోలుకు రైతులకు రుణ సదుపాయం కల్పిస్తున్నాయి. ఇతర ప్రయోజనాలూ అందిస్తున్నాయి. ఇలాంటి చోట్ల భూగర్భ జలాల వెలికితీత, విద్యుత్తు వినియోగం అధికంగా ఉన్నాయి. మితిమీరిన పట్టణీకరణ వల్ల చాలా ప్రాంతాల్లో చెరువులు, కుంటలు వంటివి కుంచించుకుపోతున్నాయి. కొన్నిచోట్ల పూర్తిగా కనుమరుగు అవుతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల దేశీయంగా చాలాచోట్ల వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. వేసవిలో ఉష్ణతాపం విపరీతమవుతోంది. దానివల్ల ఉపరితల జల వనరులు అడుగంటిపోతున్నాయి. ఇవి లేకుంటే భూగర్భ జలాలు భర్తీ కావడం సాధ్యం కాదు.


పునరుద్ధరణే కీలకం

భూగర్భ జలాల దుర్వినియోగాన్ని నివారించడం ఎంతో అవసరం. వాన నీటిని సంరక్షించుకోవడం మరో ప్రధాన అంశం. కురిసే ప్రతి వర్షపు చినుకు భూమిలోకి ఇంకేలా చూడాలి. తద్వారా భూగర్భ జలాలను పునరుద్ధరించుకోవచ్చు. వాన నీటిని నిల్వ చేసుకొని వినియోగించుకోవడం ద్వారా భూగర్భ జలాలపై ఒత్తిడిని తగ్గించవచ్చు. దీనిపై అన్ని ప్రాంతాల్లో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి. వ్యవసాయంలో భూగర్భ జలాలను తోడటానికి సౌర, పవన వంటి పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించాలి. ఇందుకోసం రైతులకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందించాలి. దీనివల్ల విద్యుదుత్పత్తికి అధికంగా శిలాజ ఇంధనాలను వాడాల్సిన అవసరం తప్పుతుంది. ఫలితంగా కర్బన ఉద్గారాలు దిగివచ్చి పర్యావరణానికి మేలు కలుగుతుంది. పట్టణాలు, నగరాల్లో చెరువులు, కుంటలు వంటి ఉపరితల జల వనరులు కబ్జాకు గురికాకుండా పాలకులు పటిష్ఠ చర్యలు తీసుకోవడం తప్పనిసరి. ఇవి భూగర్భ జలాలను పెంచడానికి తోడ్పడటంతో పాటు వరదల నుంచి మనల్ని కాపాడతాయి.


భూగర్భ జల వనరులే అధికం

చిన్న నీటి పారుదల వనరుల గణాంకాల సేకరణ కోసం దేశవ్యాప్తంగా కేంద్ర జల్‌శక్తి శాఖ అధ్యయనం జరిపింది. దీని ప్రకారం సాధారణ బావులు, బోర్లు, చెరువులు, కుంటలు... ఇలా అన్నీ కలిపి ఇండియాలో 2.31కోట్ల చిన్న నీటి పారుదల వనరులు ఉన్నాయి. వాటిలో దాదాపు 95శాతం భూగర్భ జలానికి సంబంధించినవే. 5.2శాతం ఉపరితల నీటి వనరులు. 2014-18 మధ్య కాలంలో చిన్న నీటి వనరులు 10.42 లక్షలు పెరిగాయి. వీటిలో 96.6శాతం రైతులు, అదీ రెండు హెక్టార్ల లోపు భూములు కలిగిన సన్న, చిన్నకారు అన్నదాతలు సొంతంగా ఏర్పాటు చేసుకున్నవే. చిన్న నీటి వనరుల విషయంలో 17.2శాతంతో ఉత్తర్‌ ప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలుస్తోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, తమిళనాడులు తరవాతి స్థానాల్లో ఉన్నాయి. 7.3 శాతం చిన్న నీటి వనరులతో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. 5.1శాతంతో ఆంధ్రప్రదేశ్‌ తొమ్మిదో స్థానంలో ఉంది. ఉపరితల జల వనరుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా, ఝార్ఖండ్‌ రాష్ట్రాలు అత్యధిక వాటాను కలిగి ఉన్నాయి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నదులకు కాలుష్యం కాటు

‣ అభివృద్ధి ముసుగులో చైనా అప్పుల వల!

‣ కావేరి.. రణభేరి!

‣ తలరాత మార్చే తలసరి ఆదాయం

‣ జమిలి ఎన్నికలు ఎందుకు?

Posted Date: 02-10-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం