• facebook
  • whatsapp
  • telegram

ముదురుతున్న జల వివాదం



కర్ణాటకలో కావేరీ జలాల చిచ్చు రాజుకుంది. కరవు పరిస్థితుల్లో తమిళనాడుకు ఈ నదీ జలాలను విడుదల చేయడంపై కర్ణాటకలో పలు సంఘాలు, ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. దీనిపై కేంద్రం జోక్యాన్ని కర్ణాటక సర్కారు కోరుతోంది.


ఈఏడాది కర్ణాటకలో నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. జులై నుంచి ఆగస్టు చివరి వరకు 56శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. కావేరి జలాశయాల్లో నీరు అడుగంటి పోవడంతో తమిళనాడుకు నీరివ్వలేమని సిద్దరామయ్య సర్కారు తెగేసి చెప్పింది. మరోవైపు తమ రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నందువల్ల కావేరి నుంచి తమ వాటా 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని తమిళనాడు కోరింది. అటు తమిళనాడు మనవిని, ఇటు కర్ణాటక కరవు పరిస్థితిని పరిగణించిన కావేరీ జల నిర్వహణ ప్రాధికార సంస్థ (సీడబ్ల్యూఎంఏ) నిత్యం అయిదు వేల క్యూసెక్కుల నీటిని ఇవ్వాల్సిందిగా కర్ణాటకను ఆదేశించింది. దానికన్నా అధికంగా నీటిని విడుదల చేసేలా చూడాలని తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కరవు పరిస్థితుల నేపథ్యంలో మరింత తక్కువ నీటినే విడుదల చేయగలమంటూ కర్ణాటక సైతం సుప్రీంకు వెళ్ళింది. నీటి విడుదలపై సీడబ్ల్యూఎంఏ ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం ఇటీవల నిరాకరించింది. ఆ మేరకు ప్రస్తుతం తమిళనాడుకు నీటిని విడుదల చేస్తుండటంపై కర్ణాటకలో నిరసనలు భగ్గుమంటున్నాయి. సుప్రీంలో కర్ణాటక తన వాణిని బలంగా వినిపించలేదని పలు సంఘాలు, విపక్షాలు ఆరోపిస్తున్నాయి.


బ్రిటిష్‌ వారి కాలంలోనే కావేరీ నీటి కోసం తమిళనాడు, కర్ణాటకల మధ్య నీటి జగడం మొదలైంది. 1892లో ఓసారి, 1924లో మరోసారి మద్రాస్‌ ప్రెసిడెన్సీ, మైసూరు రాజవంశీకుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఎగువన ఉన్న రాష్ట్రాలు ఏవైనా ప్రాజెక్టులు నిర్మించాలంటే లోతట్టు రాష్ట్రాల అనుమతి పొందాలి. నది ప్రవహించే ప్రతి రాష్ట్రానికి ఆయకట్టు పరిధి మేరకు నీటిని వినియోగించుకునే అవకాశం కల్పించారు. 50ఏళ్ల కాలపరిమితి వరకు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ తరవాతే అసలైన వివాదం మొదలైంది. ఆ ఒప్పందం ముగియగానే కర్ణాటక రాష్ట్రం నీటి మళ్ళింపు మొదలుపెట్టింది. కావేరీ నదిపై హారంగి, హేమావతి, కృష్ణరాజ సాగర, కబిని జలాశయాలు నిర్మించారు. వాటిలో 124 అడుగుల సామర్థ్యమున్న కృష్ణరాజ సాగర కర్ణాటక రాజధాని బెంగళూరుకు తాగునీరు అందిస్తుంది. కర్ణాటక నుంచి తమిళనాడుకు ప్రవహించే కబిని నదిపై జలాశయాన్ని 50 ఏళ్ల ఒప్పందం ముగిసిన తరవాత తమను సంప్రతించకుండానే నిర్మించారని తమిళనాడు 1974లో కోర్టుకెక్కింది. ఈ తగవును తీర్చేందుకు 1990లో ఏర్పాటైన కావేరీ జల వివాద ట్రైబ్యునల్‌ (సీడబ్ల్యూడీటీ) 2007లో తుది తీర్పు వెలువరించింది. దాని ప్రకారం తమిళనాడుకు 404.25 టీఎంసీలు, కర్ణాటకకు 284.75 టీఎంసీలు, కేరళకు 30 టీఎంసీలు, పుదుచ్చేరికి 7టీఎంసీల నీటిని వాడుకునే వీలుంది. ఓ సాధారణ నీటి ఏడాదిలో కావేరి బేసిన్‌లో 740 టీఎంసీల నీటి లభ్యత ఉంటేనే ఈ తీర్పు పరిగణనలోకి వస్తుంది. ఇక్కడే రాష్ట్రాల మధ్య పుట్టుకొచ్చే వ్యాజ్యాలు సీడబ్ల్యూడీటీకి సవాలుగా మారాయి. 2007 నుంచి సమృద్ధిగా వర్షాలు పడటంతో కర్ణాటక నుంచి నిబంధనల ప్రకారం తమిళనాడుకు 12టీఎంసీల నీరు తరలి వెళ్ళింది. 2013లో కర్ణాటకలో కరవు పరిస్థితులు నెలకొనడంతో ఒక టీఎంసీ నీటినే మెట్టూరు జలాశయానికి విడుదల చేశారు. మళ్ళీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులే తలెత్తాయి.


రాష్ట్రాల మధ్య నీటి వాటాను లెక్కించి, సకాలంలో విడుదల చేయాలని సూచించడమే తప్ప అనావృష్టి సంభవిస్తే ఏం చేయాలన్న దానిపై దేశీయంగా సరైన మార్గదర్శకాలు లేవు. ఇక్కడే వివాదాలు రాజుకొంటున్నాయి. ‘ఇండియా’ కూటమిలో భాగస్వామి అయిన డీఎంకేతో సఖ్యత చెడిపోకూడదనే సిద్దరామయ్య సర్కారు తమిళనాడుకు నీరు విడుదల చేస్తున్నట్లు భాజపా,    జేడీఎస్‌లు ఆరోపిస్తున్నాయి. సీడబ్ల్యూఎంఏ ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు స్పష్టం చేస్తే ఇక్కడ రాజకీయ లబ్ధి ఎక్కడుందని కర్ణాటక సర్కారు బదులిస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం జోక్యం చేసుకోవాలని కర్ణాటక సర్కారు కోరుతోంది. ముఖ్యంగా, జల వివాదాలు తరచూ తలెత్తకూడదంటే- కరవు పరిస్థితుల్లో నదీ జలాల పంపిణీపై సరైన విధివిధానాల రూపకల్పనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.


- కె.ముకుంద
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అణ్వస్త్ర రహిత ప్రపంచం.. ఎంతెంత దూరం?

‣ పర్యావరణ ఆరోగ్యమే రక్షాకవచం

‣ వాన నీటి సంరక్షణతో జలసిరులు

‣ నదులకు కాలుష్యం కాటు

Posted Date: 02-10-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం