• facebook
  • whatsapp
  • telegram

అణ్వస్త్ర రహిత ప్రపంచం.. ఎంతెంత దూరం?



అంతర్జాతీయ అణ్వస్త్ర సంపూర్ణ నిర్మూలనా దినోత్సవం. భూగోళంపై చిట్టచివరి అణ్వస్త్రం నిర్వీర్యమయ్యేదాకా మానవ జీవితం సురక్షితం కాదు. అణ్వాయుధ దేశాలు ఈ విషయాన్ని గుర్తెరిగి- తమ వద్ద ఉన్న వినాశకర అస్త్రాలను స్వచ్ఛందంగా త్యజించాలి. తద్వారా విశ్వశాంతికి అవి కృషి చేయాలి.


అణ్వాయుధాలు మానవాళి మనుగడను పెను సంక్షోభంలోకి నెట్టివేస్తాయి. వాటిని భూగోళం నుంచి పూర్తిగా నిర్మూలించాలని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1946లో తన తొలి తీర్మానంలోనే పిలుపిచ్చింది. నేటికీ అది సుదూర లక్ష్యంగానే కనిపిస్తోంది. ఇప్పటికే ఉన్న అణ్వాయుధాలను నిర్వీర్యం చేయడానికి బదులు పలు దేశాలు తమ అమ్ములపొదిలో వాటి సంఖ్యను మరింత పెంచుకోవాలనే చూస్తున్నాయి. స్టాక్‌హోం అంతర్జాతీయ శాంతి పరిశోధక సంస్థ (సిప్రీ) ఈ ఏడాది ప్రథమార్ధంలో వెలువరించిన అంచనాల ప్రకారం- ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 12,512 అణు వార్‌హెడ్‌లు ఉన్నాయి. వాటిలో 89శాతం వాటా రష్యా, అమెరికాలదే! మాస్కో వద్ద 5,889, వాషింగ్టన్‌ అమ్ములపొదిలో 5,244 అణ్వస్త్రాలు ఉన్నాయి. చైనా (410 అణు వార్‌హెడ్‌లు), ఫ్రాన్స్‌ (290), బ్రిటన్‌ (225), పాకిస్థాన్‌ (170), ఇండియా (164), ఇజ్రాయెల్‌ (90), ఉత్తర కొరియా (30)లు సైతం అణ్వస్త్ర దేశాలే.


ఆధునికీకరణకే మొగ్గు

జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై 1945లో జరిగిన అణుదాడులు ఎంతటి విధ్వంసాన్ని సృష్టించాయో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రెండు నగరాల్లో కలిపి అప్పటికప్పుడు దాదాపు 2.13 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయపడి తరవాత మరణించారు. ఇలాంటి ఘోర విపత్తులు మళ్ళీ సంభవించకుండా ఉండాలంటే అణ్వాయుధాలను పూర్తిగా విడిచిపెట్టడం తప్పనిసరి. అయితే, అమెరికా-రష్యా మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కారణంగా అణుముప్పు చాలాకాలం పెరుగుతూ పోయింది. 1986 నాటికి ప్రపంచంలోని అణు వార్‌హెడ్‌ల సంఖ్య 70,300 దాకా వెళ్ళింది. తరవాత వాటి సంఖ్యలో తగ్గుదల మొదలై... ప్రస్తుతం 12,512కు చేరింది. క్షీణత స్వాగతించదగినదే అయినా, ఆశించిన వేగంతో ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. నిజానికి, అమెరికా రష్యాలు తమ సైనిక విభాగాల నుంచి ఉపసంహరించుకున్న వార్‌హెడ్‌లను నిర్వీర్యం చేస్తుండటం వల్లే ఈ తగ్గుదల కనిపిస్తోంది. అణ్వస్త్రాల నిర్మూలనకు అవి చిత్తశుద్ధితో కృషి చేయడం లేదు. వాషింగ్టన్‌, మాస్కో సహా అన్ని దేశాలూ ఇప్పుడు అణ్వస్త్రాల ఆధునికీకరణపై దృష్టి సారించాయి. చైనా ఈ విషయంలో దూకుడు ప్రదర్శిస్తోంది. కొత్త అణ్వాయుధాలను అది వేగంగా సముపార్జించుకుంటోంది. 2035కల్లా దాని అమ్ములపొదిలో వార్‌హెడ్‌ల సంఖ్య 1,500 వరకూ చేరుకోవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్‌ వద్ద అణ్వస్త్రాల సంఖ్య ఇండియా కంటే ఎక్కువ. ఉత్తర కొరియా సైతం వాటిని భారీగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. స్వీయభద్రత కోసమే అణ్వస్త్రాలను కలిగి ఉన్నామని ఆయా దేశాలు చెబుతున్నాయి. ఆ వాదనలో పస లేదు. కజఖ్‌స్థాన్‌ వద్ద ఒకప్పుడు భారీగా అణు వార్‌హెడ్‌లు ఉండేవి. 1991లో సోవియట్‌ యూనియన్‌ నుంచి పూర్తిగా విడిపోయాక వాటిని కజఖ్‌ స్వచ్ఛందంగా త్యజించింది. అయినప్పటికీ దాని భద్రత ప్రమాదంలో పడలేదు. మెరుగైన దౌత్య విధానాలతో ఇరుగుపొరుగు సహా చాలా దేశాలతో అది సత్సంబంధాలు నెరపుతోంది. 1968లో కుదిరిన అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ), 1996 నాటి అణు పరీక్షల సమగ్ర నిషేధ ఒడంబడిక (సీటీబీటీ)... అణ్వస్త్రాలు వేగంగా విస్తరించకుండా అడ్డుకునేందుకు దోహదపడ్డాయి. 2016లో అమలులోకి వచ్చిన ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జేసీపీఓఏ) వల్ల ఇరాన్‌ అణు కార్యక్రమాలకు బ్రేకులు పడ్డాయి. అయితే ఇలాంటి కీలక ఒప్పందాలకు తిలోదకాలిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఎన్‌పీటీ నుంచి ఉత్తర కొరియా 2003లోనే బయటికొచ్చింది. ఇండియా, పాకిస్థాన్‌, ఇజ్రా యెల్‌ ఎన్‌పీటీపై సంతకాలే చేయలేదు. తాము ఎన్ని అణ్వస్త్రాలను మోహరించామో ఇకపై వెల్లడించబోమంటూ 2021లో బ్రిటన్‌ ప్రకటించింది. అణ్వాయుధ నియంత్రణకు దోహదపడేలా అమెరికాతో కుదుర్చుకున్న న్యూస్టార్ట్‌ ఒప్పందం నుంచి రష్యా ఈ ఏడాది తాత్కాలికంగా వైదొలగింది. జేసీపీఓఏ నుంచి అమెరికా నిష్క్రమణతో- అణ్వాయుధ సముపార్జన ప్రయత్నాలను ఇరాన్‌ ముమ్మరం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. లిబియా సైతం రహస్యంగా అణు కార్యక్రమాలు చేపడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



చిత్తశుద్ధి అవసరం

ఉక్రెయిన్‌తో యుద్ధంలో విజయం కోసం అవసరమైతే అణ్వాయుధాల వాడకానికి వెనకాడబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఓ దశలో హెచ్చరించడం కలకలం సృష్టించింది. తమ మిత్రదేశమైన బెలారస్‌ సరిహద్దులకు ఆయన వ్యూహాత్మక అణ్వాయుధాలను తరలించారు. మరోవైపు- తైవాన్‌ ఆక్రమణకు చైనా తహతహలాడుతోంది. వాషింగ్టన్‌, బీజింగ్‌ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తరహా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో అణు వార్‌హెడ్‌ల నిర్మూలన అత్యావశ్యకం. ఐక్యరాజ్య సమితి మరింత చొరవ తీసుకొని అణ్వస్త్ర దేశాలు ఆ దిశగా చిత్తశుద్ధితో కృషిచేసేలా చూడాలి. వాటి నిర్మూలనతో ఒనగూడే సామాజిక, ఆర్థిక ప్రయోజనాలపై విస్తృత ప్రచారం కల్పించాలి. అణ్వస్త్ర రహిత ప్రపంచం కలగానే మిగిలిపోకుండా చూడాలి.


- ఎం.నవీన్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పర్యావరణ ఆరోగ్యమే రక్షాకవచం

‣ వాన నీటి సంరక్షణతో జలసిరులు

‣ నదులకు కాలుష్యం కాటు

‣ అభివృద్ధి ముసుగులో చైనా అప్పుల వల!

‣ కావేరి.. రణభేరి!

‣ తలరాత మార్చే తలసరి ఆదాయం

‣ జమిలి ఎన్నికలు ఎందుకు?

Posted Date: 02-10-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం