• facebook
  • whatsapp
  • telegram

భూ హక్కులకేదీ భరోసా?అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల ఒడంబడికలోని భూహక్కుల అమలుపై ‘జనరల్‌ కామెంట్‌-26’ పేరుతో యునెస్కో ఇటీవల ఒక ప్రకటన వెలువరించింది. ఇది భూమి హక్కులను కాపాడటంలో ప్రభుత్వాల బాధ్యతలను గుర్తుచేసింది. నానాటికీ భూహక్కుల ఉల్లంఘనలు పెరిగిపోతుండటంతో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. 


భూమి.. మానవ మనుగడకు ప్రధాన వనరు. భూమిపై హక్కులు కీలకం. అందుకనే, మనిషి బతకడానికి కావాల్సిన కనీస హక్కుల జాబితాలో భూహక్కుకూ చోటు కల్పించారు. ఐక్యరాజ్యసమితి 1948లో వెలువరించిన మానవ హక్కుల ప్రకటన మొదలుకొని 2018లో చేసిన రైతు హక్కుల ప్రకటన వరకు భూమి హక్కుల ప్రస్తావన ఉంది. పలురకాల ఒడంబడికలు, ఒప్పందాలు, నియమాలు, ప్రకటనలు వంటివన్నీ భూమి హక్కును గుర్తించాయి. ఈ హక్కుల గుర్తింపు పరంపరలో వచ్చినదే 1966లో ఐరాస ఆమోదించిన అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల ఒడంబడిక. దీనికి భారత్‌ గతంలోనే ఆమోదం తెలిపింది.


ప్రజాప్రయోజనం కీలకం

ప్రతి మనిషికీ భూమిని కలిగి ఉండే హక్కు ఉంది. ఎవరి భూమి హక్కులనూ ఏకపక్షంగా హరించడానికి వీలు లేదని అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన పేర్కొంది. ఇదే నియమం భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల జాబితాలోనూ ఉండేది. తదనంతర కాలంలో భూమి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారు. అయినప్పటికీ అది రాజ్యాంగ హక్కుగా కొనసాగుతోంది. భూమి హక్కును వివిధ అంతర్జాతీయ ఒప్పందాల్లో పలు రూపాల్లో పొందుపరచారు. అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల ఒడంబడికలోని పలు నియమాల్లో భూమి హక్కుల ప్రస్తావన ఉంది. ఈ ఒడంబడికలోని ఆహార భద్రత, అందరికీ నివాసగృహం, తాగునీరు, కాలుష్యరహిత పర్యావరణం, కనీస జీవన ప్రమాణాలతో ఆరోగ్య జీవనం, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే స్వేచ్ఛ, స్వీయ నిర్ణయ స్వేచ్ఛవంటి హక్కులు సాకారం కావాలంటే భూమి వినియోగం, నియంత్రణపై అందరికీ సమాన అవకాశాలు ఉండాలని యునెస్కో పేర్కొంది. ప్రస్తుత భూ నిర్వహణ, వినియోగం తీరు ఒడంబడికలోని హక్కుల సాకారానికి అడ్డంకిగా ఉన్నదని వాపోయింది. వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, విపరీతంగా పెరుగుతున్న భూమి విలువలు, వివిధ అవసరాల నిమిత్తం భూమి కోసం పెరుగుతున్న ఒత్తిడి, పర్యావరణ మార్పులు... సరైన చట్టాలు, వ్యవస్థీకృత ఏర్పాట్లు లేకపోవడంవల్ల భూమి హక్కుల ఉల్లంఘనలు అధికమవుతున్నాయి. ప్రాజెక్టులు, పరిశ్రమల కోసమని, ప్రజాప్రయోజనార్థమని, అభివృద్ధి కార్యక్రమాల కోసమంటూ పలురకాల కారణాలతో ప్రభుత్వం భూమిని తీసుకుంటోంది. ప్రభుత్వ బలవంతపు భూసేకరణతో భూమిని కోల్పోయినవారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూసేకరణ చట్టబద్ధంగా ఉండాలి. ప్రజా ప్రయోజనాన్ని చట్టంలో స్పష్టంగా పేర్కొనాలి. దీనివల్ల భూ యజమానులకు జరిగే నష్టంకంటే, ఆ భూమిని ప్రజా ప్రయోజనాలకు వినియోగించడంవల్ల కలిగే మేలు అధికంగా ఉండాలి. భూ యజమానులకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పునరావాసం కల్పించాలని యునెస్కో పేర్కొంది. మన దేశంలో ఈ ప్రమాణాలకు అనుగుణంగా లేని పాత భూసేకరణ చట్టాన్ని రద్దుచేసి 2014లో కొత్త చట్టం తీసుకొచ్చారు. అయితే, దాన్ని సరిగ్గా పాటించకపోవడం, సవరణల పేరుతో కీలక నియమాలను తొలగించడంవల్ల ఆశించిన మార్పు రాలేదు. ముఖ్యంగా బాధితులకు నష్టపరిహారం రావడం లేదని, తగినంతగా చెల్లించడంలేదని, పునరావాసం కల్పించడం లేదనే ఆరోపణలున్నాయి. భూమికి సంబంధించి తగిన పత్రాలు లేకపోయినా, ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాకపోయినా ఆ భూమిపై హక్కుకు భద్రత ఉండదు. హక్కుపత్రం లేకపోతే భూమి ఆక్రమణకు గురికావడానికి, లేదంటే ప్రభుత్వం బలవంతంగా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి భూహద్దులు గుర్తించి, హక్కులు కల్పించే ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. భూ హక్కుల పరిరక్షణతో పాటు సులభంగా అమ్మకాలు కొనుగోళ్లకు వెసులుబాటు కల్పించడం ఈ ప్రయత్నాల ఉద్దేశం. హక్కులను కల్పించే కార్యక్రమాలు చేపట్టేటప్పుడు పేదలకు నష్టం జరగకుండా చూడాలని యునెస్కో స్పష్టీకరించింది.


మెరుగైన చట్టాలు, విధానాలు..

అంతర్జాతీయ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల ఒడంబడికలో పేర్కొన్న భూమి హక్కులు అందరికీ దక్కాలంటే భూసంస్కరణలు అవసరం. పేదలకు, అణగారిన వర్గాలకు భూమి పంచితేనే ఆకలి చావులు ఆగుతాయి. పేదరిక నిర్మూలనా సాధ్యమవుతుంది. మనదేశంలో భూసంస్కరణలు అసంపూర్ణంగా మిగిలిపోయాయి. భూమిలేని గ్రామీణ పేద వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు ఎంతో కొంత భూమి అందించాలి. ఆ మేరకు భూమి హక్కుల చట్టం చేసే ప్రయత్నాలకు ఆదిలోనే గండిపడింది. భూమి హక్కులకు భద్రత కల్పించాలంటే మెరుగైన భూపరిపాలన ఉండాలి. భూమికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం పేదలకు ఉచిత న్యాయసహాయం అందించాలి. మన దేశంలో మెరుగైన భూ పరిపాలన కోసం చెయ్యాల్సింది ఎంతో ఉంది. పదేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆశించిన ఫలితాలు రావాలంటే మరింత కృషి జరగాలి. భూహక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు న్యాయం పొందే అవకాశాలు కల్పించాలి. అందుకోసం అవసరమైన పరిపాలన, న్యాయ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని యునెస్కో అన్ని దేశాలనూ కోరింది. ఎప్పటికప్పుడు భూమి చట్టాలను, విధానాలను సమీక్షిస్తూ తగిన మార్పులను చెయ్యాలని సూచించింది. వేగవంతమైన అభివృద్ధి, వ్యాపారీకరణ భూమిపై ఒత్తిడి పెంచుతుంది. హక్కుల ఉల్లంఘనలకు దారితీస్తుంది. కాబట్టి, భూమి హక్కుల రక్షణ కోసం మెరుగైన చట్టాలు, విధానాలు ఉండాలి. వ్యవస్థలు సమర్థంగా పనిచేయాలి. అధిక శాతం ప్రజలకు భూమే జీవితం. వారికి జీవించే హక్కు అంటే భూమి హక్కే. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూహక్కుల రక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.


జాగ్రత్తలు ముఖ్యం

మన దేశంలో జరుగుతున్న భూ రికార్డుల కంప్యూటరీకరణ, రీసర్వే ప్రాజెక్టులవల్ల ఎంతోమంది పేదలు, చిన్న సన్నకారు రైతులు భూ సమస్యల్లో చిక్కుకొని సతమతమవుతున్నారు. రాబోయే రోజుల్లో టైటిల్‌ గ్యారంటీ చట్టం దేశమంతా అమలులోకి రాబోతుంది. ఇటువంటి చట్టాలను అమలుచేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే, దానివల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరిగే ప్రమాదముంది.
 

Posted Date: 02-10-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని