• facebook
  • whatsapp
  • telegram

పుతిన్‌, కిమ్‌.. ఏం మాట్లాడుకున్నారు?ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఇటీవల రష్యాలో పర్యటించడం యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. పుతిన్‌తో ఆయన ఏం చర్చించారన్నది నిర్దిష్టంగా బయటకు రాలేదు. ఉక్రెయిన్‌పై పోరులో రష్యాకు సహకరించేలా  ఇరువురి మధ్య ఒప్పందం కుదిరి ఉండవచ్చన్నవిశ్లేషణలు పశ్చిమ దేశాలను కలవరపెడుతున్నాయి.


రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు కనుచూపుమేరలో కనిపించడం లేదు. కీవ్‌ సేనలను చెల్లాచెదురు చేసి విజయతీరాలకు చేరుకోవాలని మాస్కో గట్టిగానే ప్రయత్నిస్తోంది. అయితే అమెరికా సహా పశ్చిమ దేశాల సహకారంతో జెలెన్‌స్కీ బలగాలు రష్యా సైన్యాన్ని దీటుగానే ఎదుర్కొంటున్నాయి. దాంతో యుద్ధం మరింత సుదీర్ఘంగా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఇటీవల రష్యాలో పర్యటించడం, ఆ దేశాధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2019 తరవాత ఓ విదేశీ అధినేతతో కిమ్‌ సమావేశం కావడం ఇదే తొలిసారి. పుతిన్‌-కిమ్‌ తమ భేటీలో ఏం చర్చించారన్నది వారిద్దరితోపాటు కొంతమంది ఆంతరంగికులకు తప్ప మరెవరికీ తెలియదు. సాధారణంగా రెండు దేశాల అధినేతలు సమావేశమైతే- వారు ఏం చర్చించారన్నదానిపై అధికారిక ప్రకటనలు వెలువడతాయి. రష్యా, ఉత్తరకొరియా పాలకుల సమావేశం తరవాత అలాంటివేమీ బయటకు రాలేదు. దాంతో వారి చర్చలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


పుతిన్‌, కిమ్‌లకు పశ్చిమ దేశాల ఆధిపత్య ధోరణి నచ్చదు. ద్వైపాక్షిక అంశాలతోపాటు ఉక్రెయిన్‌ యుద్ధం గురించీ వారు మాట్లాడుకొని ఉంటారనడంలో సందేహం లేదు. ఆశించినంత త్వరగా కీవ్‌ను ఓడించలేకపోతుండటంతో పుతిన్‌ ఒకింత అసహనంతో ఉన్నారు. యుద్ధానికి అవసరమైన ఆయుధాలు, మందుగుండు సామగ్రికి కొరత పుతిన్‌కు ఆందోళన కలిగిస్తోంది. దక్షిణ ఉక్రెయిన్‌ ప్రాంతాల్లో పైచేయి సాధించేందుకు ఈ మందుగుండు సామగ్రే కీలకం కానుంది. అందువల్ల మాస్కో వాటి ఉత్పత్తిని పెంచింది. అయితే, యుద్ధంలో అవసరమయ్యేంత మేరకు వాటిని తయారుచేసే సామర్థ్యం రష్యాకు లేదు. ఇక్కడే ఉత్తరకొరియా కీలకంగా మారే అవకాశముంది. దానివద్ద పలు రకాల ఆయుధాలు, మందుగుండు సామగ్రి నిల్వలు, క్షిపణులు సైతం భారీగా ఉన్నాయి. అందువల్ల, ఉక్రెయిన్‌తో యుద్ధంలో తమకు తోడ్పడేలా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసేందుకు కిమ్‌తో భేటీలో పుతిన్‌ ఒప్పందం కుదుర్చుకొని ఉండవచ్చని పశ్చిమ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు- 18 నెలలుగా యుద్ధం కొనసాగుతుండటంతో రష్యా సైనికులు అలిసిపోయారు. వాగ్నర్‌ దళంతో విభేదాలూ  రష్యాకు ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా సైనికులను నేరుగా యుద్ధంలో దింపాలని కిమ్‌ను పుతిన్‌ కోరి ఉండవచ్చన్న విశ్లేషణలూ వెలువడుతున్నాయి.


ఉక్రెయిన్‌ సంక్షోభంలో రష్యాకు బహిరంగంగా మద్దతు పలుకుతున్న అతికొద్ది దేశాల్లో ఉత్తర కొరియా ఒకటి. అయితే రష్యాకు యుద్ధంలో సహకరిస్తే ఉత్తర కొరియా అందుకుతగ్గ ప్రతిఫలం ఆశిస్తుందనడంలో సందేహం లేదు. కిమ్‌ది పూర్తిగా నియంతృత్వ పోకడ. అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా తదితర దేశాలపై కోపంతో కొన్నేళ్లుగా ఆయన సైనికశక్తిని పెంచుకోవడంపైనే దృష్టి సారించారు. ఐక్యరాజ్య సమితి ఆంక్షల కారణంగా ఏకాకిగా మారిన ఉత్తర కొరియా- ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో కూరుకుపోయింది. కొవిడ్‌ సైతం తోడవడంతో దేశాన్ని ప్రస్తుతం తీవ్ర ఆహారకొరత వేధిస్తోంది. పుతిన్‌తో భేటీలో కిమ్‌ ఆహారధాన్యాలు, ఇంధన సరఫరా సాయం కోరి ఉండవచ్చని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతరిక్ష రంగంలో త్వరితగతిన ఎదగాలని ఉత్తర కొరియా కోరుకొంటోంది. శత్రుదేశాల సైనిక కదలికలను పక్కాగా తెలుసుకునే నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు అది ఈ ఏడాది రెండుసార్లు ప్రయత్నించి విఫలమైంది. రష్యాలోని ఓ అంతరిక్ష ప్రయోగ కేంద్రం వేదికగా పుతిన్‌, కిమ్‌ భేటీ కావడంతో- ఆ రంగంలో సహకారం వారి సమావేశ అజెండాలో ప్రధాన అంశం అయ్యుండవచ్చన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. తమ సైనిక ఆధునికీకరణను కిమ్‌ దీర్ఘకాలంగా కాంక్షిస్తున్నారు. ఈ విషయంలో ఆయన మాస్కో సహకారం కోరి ఉండవచ్చు. రష్యాలో సుఖోయ్‌-35, సుఖోయ్‌-57 తయారీ కర్మాగారాలనూ కిమ్‌ సందర్శించారు. ఆ విమానాలను సముపార్జించుకోవాలన్నది ఆయన ప్రణాళికల్లో భాగం కావచ్చు. వాటితోపాటు రాకెట్‌ ప్రయోగ, అణు జలాంతర్గామి సాంకేతికతలను మాస్కో నుంచి కిమ్‌ ఆశించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాటి అందజేతకు పుతిన్‌ పచ్చజెండా ఊపితే- ఉత్తరకొరియా తన దూకుడును మరింత పెంచడం, కొరియా ద్వీపకల్ప భద్రత ప్రమాదంలో పడటం ఖాయం!


- శ్రీయాన్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అగ్రరాజ్యం.. కొత్త వ్యూహం!

‣ చట్ట సభల్లో గట్టి స్వరం

‣ భూ హక్కులకేదీ భరోసా?

‣ ముదురుతున్న జల వివాదం

Posted Date: 02-10-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని