• facebook
  • whatsapp
  • telegram

అగ్రరాజ్యం.. కొత్త వ్యూహం!



బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో ఏర్పడిన బ్రిక్స్‌ కూటమిలో సౌదీ అరేబియా చేరింది. దాంతో డాలర్‌ పెత్తనానికి, అమెరికా ఆధిపత్యానికి గండి పడుతుందనే అంచనాలు ఊపందుకొన్నాయి. ఈ క్రమంలో అమెరికా ఆర్థికంగా కీలకమైన ‘విప్స్‌’ దేశాలతో బంధాన్ని పటిష్ఠం చేసుకుంటోంది.


బ్రిక్స్‌లో ప్రధాన సభ్య దేశమైన భారత్‌తోపాటు సౌదీ అరేబియాను అమెరికా మరింత దగ్గర చేసుకునే పనిలో పడింది. ఇటీవల దిల్లీ వేదికగా జరిగిన జీ20 సదస్సులో భారత్‌, యూఏఈ, సౌదీ అరేబియాల మీదుగా ఐరోపా వరకు ఆర్థిక నడవా ప్రాజెక్టు ‘ఐమెక్‌’ను ప్రకటించడం ఈ కోణం నుంచే చూడాలి. భారత్‌లో మజగాన్‌ డాక్స్‌, లార్సెన్‌ టూబ్రో (ఎల్‌ అండ్‌ టీ) సంస్థల ఆధీనంలోని రేవుల్లో అమెరికన్‌ యుద్ధ నౌకలకు మరమ్మతు సౌకర్యాలు కల్పించారు. డ్రోన్లు, ఫైటర్‌ జెట్‌ ఇంజిన్లు, ఇతర ఆధునిక ఆయుధాల సరఫరాకు భారత్‌, అమెరికాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఈ తరుణంలో అమెరికన్‌ విధాన నిపుణుడు ఎడ్వర్డ్‌ ప్రైస్‌ చలామణీలోకి తెచ్చిన వీఐపీఎస్‌ (విప్స్‌) అనే పొడి అక్షరాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఆర్థికవేత్త జిమ్‌ ఓ నీల్‌ 2001లో బ్రిక్స్‌ అనే పదబంధాన్ని ప్రయోగించారు. తాజాగా ఎడ్వర్డ్‌ ప్రైస్‌ వియత్నాం, ఇండియా, ఫిలిప్పీన్స్‌, సౌదీ అరేబియాలను కలిపి విప్స్‌ అనే పద ప్రయోగం చేశారు. ఆ దేశాలు ఆర్థికంగా కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అంటున్నారు. అందుకు తగ్గట్టే విప్స్‌తో రక్షణ, ఆర్థిక బంధాన్ని అమెరికా బలోపేతం చేసుకొంటోంది.


ఇటీవల జీ20 సదస్సు ముగిసిన వెంటనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దిల్లీ నుంచి నేరుగా వియత్నాం రాజధాని హనోయ్‌కి వెళ్ళారు. 2013లో అమెరికా, వియత్నామ్‌ల మధ్య కుదిరిన సమగ్ర భాగస్వామ్య ఒప్పందాన్ని వ్యూహపరమైన స్థాయికి పెంచారు. వియత్నామ్‌కు ఇప్పటికే భారత్‌, రష్యా, చైనాలతో ఇలాంటి వ్యూహపరమైన ఒప్పందమే ఉంది. ఇంతవరకు ప్రధానంగా రష్యన్‌ ఆయుధాలపైనే ఆధారపడుతున్న వియత్నామ్‌కు ఎఫ్‌16 ఫైటర్‌ విమానాలతోపాటు ఇతర ఆధునిక ఆయుధాలను సరఫరా చేయడానికి బైడెన్‌ సుముఖత చూపారు. మరోవైపు భారత్‌తో సైనిక పొత్తు విషయంలో వియత్నామ్‌కు ఎలాంటి శషభిషలు లేవు. వియత్నామ్‌కు బ్రహ్మోస్‌ క్షిపణులను విక్రయించడానికి భారత్‌ త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది. హిమాలయాల్లో భారత్‌ సరిహద్దు వెంట, దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం తీరం వెంట చైనా దుందుడుకు చర్యలకు పాల్పడటం రెండు దేశాలను దగ్గర చేస్తోంది. అమెరికా సైతం ఇండో-పసిఫిక్‌ వ్యూహంలో వియత్నామ్‌ను కలుపుకొని పోవడానికి సై అంటోంది.


దక్షిణ చైనా సముద్రంలో చైనా కబ్జాకోరు విధానాన్ని ఫిలిప్పీన్స్‌ ప్రతిఘటిస్తోంది. ఈ సముద్రంలో ఫిలిప్పీన్స్‌ హక్కులను బలపరుస్తూ 2016లో ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానాన్ని భారత్‌, అమెరికాలు గట్టిగా సమర్థిస్తున్నాయి. ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్‌ క్షిపణులను విక్రయించడానికి ఇండియా ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఫిలిప్పీన్స్‌, అమెరికాలు రక్షణ పరంగా గత మే నెలలో కొత్త మార్గదర్శకాలను రూపొందించుకున్నాయి. ఫిలిప్పీన్స్‌ మాజీ అధ్యక్షుడు రొడ్రిగో డుటెర్టె హయాములో అమెరికాకు ప్రాధాన్యం తగ్గించారు. ఫిలిప్పీన్స్‌లోని సైనిక స్థావరాలకు అమెరికాను దూరంపెట్టారు. ప్రస్తుత అధ్యక్షుడు ఫెర్డినాండ్‌ మార్కోస్‌ జూనియర్‌ ఆ స్థావరాలను అమెరికాకు మళ్ళీ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కొత్తగా నాలుగు స్థావరాల్లో ప్రవేశసౌలభ్యం కల్పించారు. దక్షిణ చైనా సముద్రంలోని ఫిలిప్పీన్స్‌ ప్రత్యేక ఆర్థిక మండలంలో అమెరికా, ఫిలిప్పీన్స్‌ నౌకా దళాలు సంయుక్త విన్యాసాలు జరపాలనీ నిర్ణయించాయి.


చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలతో క్వాడ్‌ కూటమి ఏర్పడింది. అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియాలతో ‘ఆకస్‌’ రూపుదిద్దుకొంది. గత జూన్‌లో అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియాలు త్రైపాక్షిక భద్రతా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దక్షిణ, తూర్పు చైనా సముద్రాలలో డ్రాగన్‌ దేశం, ఉత్తర కొరియాల దుందుడుకు చేష్టలను ఎదుర్కోవడమే దీని లక్ష్యం. ఇక ఆర్థిక రంగంలో చైనా నుంచి అమెరికా, ఐరోపా కంపెనీలు ఉపసంహరిస్తున్న పెట్టుబడులలో పెద్ద వాటా భారత్‌కు మళ్ళుతున్నాయని, తరవాతి స్థానాల్లో మెక్సికో, వియత్నాం, మలేసియాలు నిలుస్తున్నాయన్న కథనాలు వెలువడుతున్నాయి. 2021-22 మధ్య భారత్‌లోకి ఈ పెట్టుబడులు 400శాతం పెరిగి 6,500 కోట్ల డాలర్లకు చేరాయి. ఏది ఏమైనా ‘విప్స్‌’ అనేది వట్టి పదబంధంగా మాత్రమే మిగిలిపోదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


- వరప్రసాద్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ చట్ట సభల్లో గట్టి స్వరం

‣ భూ హక్కులకేదీ భరోసా?

‣ ముదురుతున్న జల వివాదం

‣ అణ్వస్త్ర రహిత ప్రపంచం.. ఎంతెంత దూరం?

‣ పర్యావరణ ఆరోగ్యమే రక్షాకవచం

‣ వాన నీటి సంరక్షణతో జలసిరులు

‣ నదులకు కాలుష్యం కాటు

Posted Date: 02-10-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం