• facebook
  • whatsapp
  • telegram

ఆర్థిక స్వేచ్ఛతో మెరుగైన జీవనంఆర్థిక స్వేచ్ఛ పరిఢవిల్లే చోట మెరుగైన జీవన పరిస్థితులు నెలకొంటాయి. ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛా సూచీ సైతం ఇదే అంశాన్ని ఉద్ఘాటిస్తోంది. ఈ సూచీ ప్రకారం కొన్ని అంశాల్లో భారత్‌ మరిన్ని మెరుగైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది.


మార్కెట్లలోకి ప్రవేశించేందుకు, పోటీ పడేందుకు స్వేచ్ఛను కలిగి ఉండటం, వ్యక్తులకు, ప్రైవేటు ఆస్తులకు భద్రత దక్కడం తదితర అంశాలు- ఆర్థిక స్వేచ్ఛలో కీలకం. ఆర్థిక స్వేచ్ఛను కల్పించే విషయంలో ఆయా దేశాల్లోని విధానాలు, సంస్థల తోడ్పాటు కూడా ముఖ్యమే. పురుషులతో సమానంగా మహిళలూ సమానస్థాయిలో ఆర్థిక స్వేచ్ఛను పొందుతున్నారా అనేది నిర్ధారించడానికి లింగపరమైన న్యాయ హక్కులను పరిశీలిస్తారు. కెనడా సంస్థ ఫ్రేజర్‌ ఇనిస్టిట్యూట్‌ ‘ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛా సూచీ-2023’ని వెలువరించింది. ఈ ఏడాది ఆర్థిక స్వేచ్ఛా సూచీ- 2021 నుంచి సమగ్ర సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంది. వ్యక్తిగత వృద్ధి, అభివృద్ధి కోసం ఆయా దేశాలు స్వేచ్ఛాయుత విధానాల ద్వారా పాటుపడుతున్న తీరును 1996 నుంచే ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛా నివేదిక గుర్తిస్తోంది. ఆస్తి హక్కులను కాపాడేందుకు కఠిన చట్టాలను అమలు చేయడం, అవినీతి నిరోధక చట్టాల సమర్థ అమలు, సులభ పన్నుల రేట్లు, పారదర్శక వాతావరణం వంటి అంశాల ఆధారంగా వీటిని గుర్తిస్తోంది.


సింగపూర్‌ అగ్రస్థానం

పదికి చేరువగా ఉండే స్కోరు అత్యధిక ఆర్థిక స్వేచ్ఛను సూచిస్తుంది. తాజా సూచీలో సింగపూర్‌ (8.56) అగ్రస్థానంలో నిలిచింది. హాంకాంగ్‌ (8.55), స్విట్జర్లాండ్‌ (8.47), న్యూజిలాండ్‌ (8.43), అమెరికా (8.14), ఐర్లాండ్‌ (8.11), డెన్మార్క్‌ (8.1), ఆస్ట్రేలియా (8.0), బ్రిటన్‌ (8.0), కెనడా (7.98) తరవాతి స్థానాల్లో నిలిచాయి. 53 ఏళ్ల తరవాత తొలిసారిగా హాంకాంగ్‌ రెండోస్థానానికి దిగజారింది. కొన్ని పాయింట్ల మెరుగుదలతో సింగపూర్‌ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో పోలిస్తే సింగపూర్‌ గణనీయ రీతిలో అధిక స్కోరును సాధించింది. చైనా ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించడం కూడా హాంకాంగ్‌ పతనానికి కారణంగా నిలుస్తోంది. విదేశీ శ్రామిక శక్తి ఉపాధి కల్పనపై పరిమితులు విధించడం, ప్రవేశాలపై ఆంక్షలు, వ్యాపార వాణిజ్యాల వ్యయాలు పెరగడం వంటివి దెబ్బతీశాయి. సైనిక జోక్యం పెరగడం, న్యాయ స్వతంత్రత క్షీణించడం, కోర్టుల దుర్విచక్షణ వంటివి న్యాయ వ్యవస్థ, ఆస్తి హక్కుల పరిమితుల్లో కొన్ని పాయింట్లు తగ్గడానికి కారణమయ్యాయి. సింగపూర్‌, హాంకాంగ్‌ల తరవాత స్విట్జర్లాండ్‌, న్యూజిలాండ్‌, అమెరికా, ఐర్లాండ్‌, డెన్మార్క్‌, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, కెనడా తదుపరి స్థానాలు సాధించాయి. రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, అల్జీరియా, అర్జెంటీనా, లిబియా, ఇరాన్‌, యెమెన్‌, సూడాన్‌, సిరియా, జింబాబ్వే, వెనెజువెలా వంటివి అతి తక్కువ ర్యాంకులు సాధించిన దేశాలుగా నిలిచాయి. జపాన్‌ 20, జర్మనీ 23, ఫ్రాన్స్‌ 47, రష్యా 104వ స్థానాలను సాధించాయి. భారత్‌ 87వ స్థానంలో నిలవడం ద్వారా చైనా (111)కన్నా మెరుగైన స్థితిలో ఉంది. అయితే, సూచీలో ఇండియా 86వ స్థానం నుంచి 87వ స్థానానికి దిగింది. 1980 నుంచి చూస్తే భారత్‌ రేటింగ్‌ 4.90 నుంచి 6.62 పాయింట్లదాకా పెరిగినా, ర్యాంకు మాత్రం పడిపోయింది. అంటే, భారత్‌ పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతున్నా, ఇతర దేశాలతో పోల్చినప్పుడు అది తగినంతగా లేదని విదితమవుతోంది. పరపతి నియంత్రణ, శ్రామిక మార్కెట్‌ నియంత్రణలు, వాణిజ్య నిబంధనలు వంటి అంశాల్లో మెరుగైన పనితీరునే కనబరచింది. కానీ, న్యాయ వ్యవస్థ, ఆస్తి హక్కులు, అంతర్జాతీయ వాణిజ్య స్వేచ్ఛ వంటి విషయాల్లో పరిస్థితి దిగజారింది. వ్యక్తిగత ఆస్తులకు సంబంధించి డబ్బుల వృద్ధి, ద్రవ్యోల్బణ ప్రభావాన్ని పరిశీలించే అంశంలో గత ఏడాదితో పోలిస్తే స్కోరు తగ్గింది. ఈ రంగంలో సంస్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోంది. ఏదేమైనా, దక్షిణాసియాకు సంబంధించినంత వరకు భారత్‌ పనితీరు మెరుగ్గానే ఉంది. భూటాన్‌ 87, బంగ్లాదేశ్‌ 132, నేపాల్‌ 103, శ్రీలంక 116, పాకిస్థాన్‌ 123 ర్యాంకులు సాధించాయి. బ్రిక్స్‌లోని బ్రెజిల్‌ 90, రష్యా 104, చైనా 111, దక్షిణాఫ్రికా 94 ర్యాంకులతో పోలిస్తే భారత్‌ 87వ ర్యాంకుతో మెరుగ్గానే ఉంది.


సంపూర్ణ అధ్యయనం

ప్రపంచ అభివృద్ధి, వ్యక్తులపై దాని ప్రభావం వంటి అంశాలను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఇలాంటి వివరణాత్మక అధ్యయనం తోడ్పడుతుంది. మొత్తంగా ఈ నివేదికను అధ్యయనం చేసినప్పుడు- ఆర్థిక స్వేచ్ఛ అత్యధిక స్థాయుల్లో ఉన్న చోట్ల నివసిస్తున్న వారి జీవన పరిస్థితులు అత్యున్నతంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అత్యధిక ఉత్పాదకత, వేగవంతమైన ఆర్థిక వృద్ధి, అధిక ఆదాయ స్థాయులు, తక్కువ పేదరికం, అవినీతి తక్కువగా ఉండటం, సంక్షోభాల సంఖ్య పరిమితంగా ఉండటం వంటి అంశాలు ఇందుకు దోహద పడుతున్నట్లు విదితమవుతోంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పుతిన్‌, కిమ్‌.. ఏం మాట్లాడుకున్నారు?

‣ అగ్రరాజ్యం.. కొత్త వ్యూహం!

‣ చట్ట సభల్లో గట్టి స్వరం

‣ భూ హక్కులకేదీ భరోసా?

‣ ముదురుతున్న జల వివాదం

Posted Date: 06-10-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని