• facebook
  • whatsapp
  • telegram

అజేయ శక్తిగా భారత వైమానిక దళంభారత వాయుసేన అధికారికంగా 1932 అక్టోబరు ఎనిమిదిన ఆవిర్భవించింది. ఈ తొంభై ఒక్క ఏళ్ల ప్రస్థానంలో మేటి పైలట్లు, యుద్ధ విమానాలు, పోరాట పటిమతో అసమాన శక్తిగా రాణిస్తోంది. ప్రపంచ ఆధునిక యుద్ధ విమానాల డైరెక్టరీ ప్రకారం నేడు మన వాయుసేన ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన వైమానిక దళాల్లో మూడో స్థానం ఆక్రమిస్తోంది.


స్వావలంబన, ఆధునికీకరణ సాధించడానికి చేపట్టిన ఆత్మనిర్భర్‌ కార్యక్రమం భారత వాయుసేనకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. దాని పోరాట సామర్థ్యాన్ని ఇనుమడింపజేస్తోంది. విభిన్న జెట్‌ విమానాలు, హెలికాప్టర్ల బలగంతో ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లను దీటుగా ఎదుర్కొనే సత్తాను భారత వాయుసేన కనబరుస్తోంది. కొంతకాలంగా సరిహద్దులో చైనాతో ఏర్పడిన ఘర్షణ పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నుంచి నేర్చిన పాఠాలు, గడించిన అనుభవాలతో మన వాయుసేన సరికొత్త పోరాట వ్యూహాలను రచించుకొంది. భారత వాయుసేన అమ్ముల పొదిలో మిరేజ్‌-2000, సుఖోయ్‌-30 ఎంకేఐ, జాగ్వార్‌, మిగ్‌, తేజస్‌, రఫేల్‌ యుద్ధ విమానాలు ఉన్నాయి. అత్యాధునిక తేలికపాటి హెలికాప్టర్‌ ధ్రువ్‌, బహుముఖ పోరాట విధులు నిర్వర్తించగల హెలికాప్టర్‌ ప్రచండ్‌, దాడి చేసే హెలికాప్టర్లు రుద్ర, అపాచీ, భారీ సామగ్రిని తీసుకెళ్ళగల చినూక్‌ హెలికాప్టర్‌, రవాణా విమానాలైన సీ-17, సీ-295, సీ-130లను మన వాయు సేన సముపార్జించుకుంది. సీ-17, సీ-130 రవాణా విమానాలు ప్రపంచంలో ఏ మూలకైనా సైనికులను, యుద్ధ సామగ్రిని తీసుకెళ్ళగలవు.


ఐరాస శాంతి పరిరక్షణ విధులు

భారత వాయుసేన పోరాట సిద్ధాంత వ్యూహాన్ని 1995లో ప్రకటించి, 2007లో సవరించారు. 2012లో మరోసారి సవరించి ప్రచురించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగున తాజా వ్యూహ పత్రాన్ని వెలువరించారు. ఉక్రెయిన్‌లో రష్యా తన సైనిక దళాలకు దన్నుగా దాని అపార వైమానిక శక్తిని పూర్తిస్థాయిలో వినియోగించలేకపోతోందనే గ్రహింపు ఆ పత్రంలో కనిపించింది. యుద్ధంలో డ్రోన్ల వినియోగం అధికమైన సంగతినీ ఆ వ్యూహ పత్రం వెల్లడించింది. సైబర్‌, ఎలెక్ట్రానిక్‌, సమాచార యుద్ధ రీతులు, కృత్రిమ మేధ, హైపర్‌ సోనిక్‌, లేజర్‌ ఆయుధాల ఆవశ్యకతనూ వాయుసేన పోరాట సిద్ధాంతంలో పొందుపరచారు. యుద్ధ సమయంలో, శాంతి కాలంలో, అటు యుద్ధమూ లేక ఇటు శాంతి సైతం లేని సంధి కాలంలోనూ పైచేయిగా ఉంటూ పాకిస్థాన్‌, చైనాల ఆట కట్టించాలని పోరాట సిద్ధాంతం నిర్దేశిస్తోంది. ఇలాంటి సంధి కాలంలో దౌత్యపరంగా ప్రయత్నాలు సాగిస్తూనే, మిత్ర దేశాల వాయుసేనలతో సమన్వయ సహకారాలను నెరపాలని వ్యూహ పత్రం సూచిస్తోంది. గగనతలంతోపాటు అంతరిక్షంలోనూ దాడి చేసే సామర్థ్యాన్ని సాధించాలని పిలుపిస్తోంది.


గడచిన దశాబ్దంలో భారత వాయుసేన పోరాట సామర్థ్యం, పరిధి అపారంగా విస్తరించాయి. అన్ని సీమల్లో అది అనుభవాన్ని గడించింది. 1971లో పాకిస్థాన్‌లోని మైదాన ప్రాంత లక్ష్యాలపై వాయుసేన విరుచుకుపడింది. 1990ల్లో కార్గిల్‌ పర్వత శిఖరాలపై, 2019లో పాక్‌ లోతట్టు ప్రాంతమైన బాలాకోట్‌లో విజయవంతంగా దాడులు చేసింది. 2020లో తూర్పు లద్దాఖ్‌లో చైనా కబ్జా ధోరణులను ఎదిరించడంతో పాటు మన సరిహద్దు దళాలకు అన్ని రకాల సామగ్రిని అందించి తోడ్పడటంతో వాయుసేన సామర్థ్యం అందరికీ తెలిసి వచ్చింది. నేడు భారత వాయుసేన తూర్పున మలక్కా జలసంధి నుంచి పశ్చిమాన ఏడెన్‌ సింధు శాఖ వరకు కార్యకలాపాలను నిర్వహించగలదు. తన పరిధిలోకి శత్రువు చొరబడకుండా నిరోధించగల సామర్థ్యాన్ని సంతరించుకుంది. వాయుసేన యుద్ధ విమానాలు ఆకాశంలోనే ఇంధనాన్ని నింపుకొని నిరాఘాటంగా 8-10 గంటలు ఎగరగలవు. ఈ ప్రయాణ పరిధిని మరింత విస్తరించడానికి అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో నిర్మిస్తున్న విమాన స్థావరాలు తోడ్పడతాయి. భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం పెరగడం వాయుసేన బల విస్తరణకు తోడ్పడుతోంది. మిత్రదేశాల వైమానిక దళాలకు భారత వాయు సేన సహాయ సహకారాలు అందిస్తోంది. అంతర్జాతీయ రక్షణ సహకారాన్ని పెంపొందించుకొంటోంది. ఖండాంతరాలకు పయనించే సామర్థ్యాన్ని సాధించిన భారత వాయుసేన- మిత్ర దేశాలతో కలిసి ప్రపంచంలో వేర్వేరు చోట్ల సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తోంది. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ విధుల్లోనూ చురుగ్గా పాలుపంచుకొంటోంది. కాంగో, సూడాన్‌, సియెరా లియోన్‌లలో ఐరాస తరఫున ఈ విధులు నిర్వర్తించింది. ప్రకృతి ఉత్పాతాలు సంభవించినప్పుడు హెలికాప్టర్ల ద్వారా బాధితులకు ఆహారం అందించడం, వారిని రక్షించడం వంటి విధులను సమర్థంగా నిర్వహిస్తోంది.


యుద్ధ విమానాల కొరత

సంఖ్యా బలం పరంగా ప్రపంచంలో మూడో పెద్ద వైమానిక దళంగా నిలుస్తున్నప్పటికీ, భారత వాయుసేన ప్రస్తుతం యుద్ధ విమానాల కొరతను ఎదుర్కొంటోంది. చైనా వద్ద రెండు వేలకు పైగా యుద్ధ విమానాలు ఉన్నాయి. పాకిస్థాన్‌ వద్ద 450 ఉన్నాయి. భారత వాయుసేనకు 700 విమానాలు మాత్రమే ఉన్నందువల్ల, భవిష్యత్తులో ఆ రెండు శత్రు దేశాలను ఏకకాలంలో ఎదుర్కోవడం కష్టమవుతుంది. 2032కల్లా మన వాయుసేన 42 స్క్వాడ్రన్లను సంతరించుకుంటుందని కేంద్రం భావిస్తున్నా, వాస్తవంలో మరి కొన్నేళ్లు ఆలస్యం కావచ్చు. ప్రస్తుతం మన వాయుసేనకు 31 యుద్ధ విమాన స్క్వాడ్రన్లు ఉన్నాయి. ఒక్కో స్క్వాడ్రన్‌లో 18 నుంచి 20 దాకా యుద్ధ విమానాలు ఉంటాయి. తేజస్‌ యుద్ధ విమానాల తయారీ అనుకున్నంత వేగంగా సాగకపోవడం, 114 బహుముఖ పోరాట విమానాల టెండరును ఇంకా ఖరారు చేయకపోవడం దీనికి కారణాలు. పశ్చిమాసియా నుంచి ఆగ్నేయాసియా వరకు విస్తరించిన హిందూ, పసిఫిక్‌ మహా సముద్ర జలాల్లో పెరుగుతున్న సవాళ్లను అధిగమించి భారత ఆర్థిక, రాజకీయ, సైనిక ప్రయోజనాలను కాపాడాల్సిన గురుతర బాధ్యత వాయుసేనపై ఉంది. ఈ క్రమంలో మన వాయుసేన తన బలగాన్ని పెంచుకోవడమే కాకుండా అంతరిక్ష పోరాట సామర్థ్యాన్నీ సాధించాలి. ఆధునిక సాంకేతికతలతో కొత్త ఆయుధ శక్తిని సాధించి అజేయ సేనగా నిలవాలి.


భారీ ప్రాజెక్టులు

భారత వాయు సేన వచ్చే మూడేళ్లలో ఆత్మనిర్భర్‌ కార్యక్రమం కింద దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను చేపడుతోంది. ఈ నిధులు స్వదేశంలోనే వినియోగమవుతూ దేశార్థికానికి ఊపు తెస్తాయి. ఆత్మనిర్భర్‌ కింద మన వాయు సేన 180 తేజస్‌ మార్క్‌ 1ఏ విమానాలను కొత్తగా సముపార్జించుకుంటుంది. సుఖోయ్‌-30ఎంకేఐ యుద్ధ విమానాల ఆధునికీకరణనూ చేపడుతుంది. 156 తేలికపాటి పోరాట హెలికాప్టర్లను, గూఢచర్యం, గగనతల నిఘా, లక్ష్య ఛేదనకు ఐస్టార్‌ విమానాలను సమకూర్చుకొంటుంది. స్వదేశీ ఎస్‌-400 క్షిపణి వ్యవస్థ కుశ ప్రాజెక్టును చేపడుతుంది. డార్నియర్‌, హెచ్‌ఎస్‌-748 విమానాలను లైసెన్సుపై స్వదేశంలోనే తయారు చేస్తుంది. చిన్న రవాణా విమానం సారస్‌ను సైతం నిర్మించనుంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రైతును ప్రేమించిన తపస్వి

‣ పురోగామి రాష్ట్రాలకు నష్టం

‣ చిరకాల మైత్రికి సరికొత్త సవాళ్లు

‣ ఆర్థిక స్వేచ్ఛతో మెరుగైన జీవనం

‣ పుతిన్‌, కిమ్‌.. ఏం మాట్లాడుకున్నారు?

Posted Date: 09-10-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని