• facebook
  • whatsapp
  • telegram

రైతును ప్రేమించిన తపస్వి

కొద్దిరోజుల కిందట మనం ప్రొఫెసర్‌ ఎం.ఎస్‌.స్వామినాథన్‌ను కోల్పోయాం. వ్యవసాయ శాస్త్రాన్ని విప్లవాత్మకంగా తీర్చిదిద్దిన దార్శనికుణ్ని దేశం కోల్పోయింది. ఆయన అందించిన సేవలు ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించి ఉంటాయి.భారత్‌ను ఎంతగానో ప్రేమించిన ప్రొఫెసర్‌ స్వామినాథన్‌- మన దేశం, ముఖ్యంగా మన రైతులు సుసంపన్నం కావాలని ఆకాంక్షించేవారు. చదువుల్లో ముందుండే ఆయన ఏ వృత్తినైనా ఎంపిక చేసుకోవచ్చు. కానీ, 1943లో బెంగాల్‌లో తాండవించిన కరవు చూసి ఆయన ఎంతగానో చలించిపోయారు. తాను చేయాల్సిందేమైనా ఉందంటే అది వ్యవసాయాన్ని ఆమూలాగ్రం అధ్యయనం చేయడమేనని నిశ్చయించుకున్నారు స్వామినాథన్‌. చిన్న వయసులోనే ప్రపంచ ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ నార్మన్‌ బోర్లాగ్‌తో పరిచయం కావడంతో ఆయన్నుంచి చాలా నేర్చుకోగలిగారు. 1950ల్లో అమెరికాలో అధ్యాపకుడిగా పనిచేసే అవకాశం వచ్చినప్పటికీ- భారత్‌లోనే, భారత్‌ కోసమే పనిచేయాలన్న దృఢ సంకల్పంతో స్వామినాథన్‌ ఇక్కడే ఉండిపోయారు.


సవాళ్ల నడుమ నిటారుగా నిలబడి..

మన దేశాన్ని స్వయం సమృద్ధి, ఆత్మవిశ్వాసం వైపు నడిపించడానికి ఆయన ఎటువంటి సవాళ్లతో కూడిన పరిస్థితుల నడుమ మహామనీషిగా నిలబడ్డారో మీరంతా ఒకసారి ఆలోచించాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరవాతి రెండు దశాబ్దాల్లో మనకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వాటిలో ఒకటి- ఆహార కొరత! 1960వ దశకం ఆరంభంలో తీవ్ర కరవుతో దేశం అల్లాడిపోయింది. అటువంటి సంక్లిష్ట సమయంలో ప్రొఫెసర్‌ స్వామినాథన్‌ కనబరచిన నిబద్ధత, దూరదృష్టి వ్యవసాయరంగ వికాసానికి, సాగులో నూతన శకం ఆరంభానికి నాంది పలికాయి. ఆయన కృషి ఫలితంగా వ్యవసాయ కార్యకలాపాలు, ముఖ్యంగా గోధుమల ఉత్పత్తి ఊపందుకొన్నాయి. గణనీయమైన దిగుబడులు సాధించడంతో దేశం ఆహార కొరతను అధిగమించి స్వయంసమృద్ధితో తులతూగుతోంది. ఈ మహాద్భుత విజయమే- ఆయనకు ‘భారత హరిత విప్లవ పితామహుడి’గా పేరు తెచ్చింది. ఏదైనా సాధించగలమనే భారత ఆత్మస్థైర్యానికి హరిత విప్లవమే ఒక గొప్ప ఉదాహరణ. ఆ స్ఫూర్తి రేఖ- వంద కోట్ల సమస్యలు వచ్చినాసరే... వాటిని అధిగమించడానికి అవసరమైన ఆవిష్కరణ జ్వాలను రగిలించడానికి వంద కోట్ల మేధావులు ఉన్నారన్న ధీమా కలిగించింది. హరిత విప్లవం ఆరంభమైన అయిదు దశాబ్దాల తరవాత దేశీయ సాగు రంగం ఎంతో పురోగతిని, ఆధునికతను సంతరించుకొంది. అయినప్పటికీ, స్వామినాథన్‌ వేసిన పునాదులు మాత్రం ఎప్పటికీ మరవలేనివి! బంగాళాదుంప పంటలను నాశనంచేసే పరాన్న జీవులను సమర్థంగా ఎదుర్కొనేందుకు స్వామినాథన్‌ ఏళ్ల తరబడి పరిశోధన సాగించారు. ఆ పరిశోధన ఫలితమే- బంగాళాదుంప పంట చలి వాతావరణాన్ని సైతం తట్టుకొని నిలబడేలా చేసింది. నేడు ప్రపంచం చిరుధాన్యాలు లేదా శ్రీఅన్నను ‘సూపర్‌ ఫుడ్‌’గా చెబుతోంది. ప్రొఫెసర్‌ స్వామినాథన్‌ 1990ల్లోనే వాటి గురించి చర్చను ప్రోత్సహించారు.తిరుక్కురళ్‌ సూక్తి- ప్రపంచమంతటినీ ఐక్యపరచే సూదిగా రైతులను అభివర్ణిస్తుంది. ఎందుకంటే, ప్రతి ఒక్కరి మనుగడకు ఆధారం అన్నదాతలే కాబట్టి. స్వామినాథన్‌ ఈ సూత్రాన్ని చాలా లోతుగా అర్థం చేసుకున్నారు. చాలామంది ఆయన్ను వ్యవసాయ శాస్త్రవేత్త (కృషి వైజ్ఞానిక్‌) అని అంటుంటారు. కానీ, నా దృష్టిలో మాత్రం ఆయన అంతకంటే ఎక్కువే! స్వామినాథన్‌ నిజమైన కృషి వైజ్ఞానికుడు. రైతుల శాస్త్రవేత్త. ఆయన హృదయంలో ఉండేది అన్నదాతే. స్వామినాథన్‌ కృషి కేవలం విద్యాపరమైన నైపుణ్యానికే పరిమితం కాలేదు. ఆ కృషి ఫలితం ప్రయోగశాలల వెలుపల ఉండే వ్యవసాయ క్షేత్రాల్లో, పొలాల్లో కనిపిస్తుంది. అది శాస్త్రీయ పరిజ్ఞానానికి, దాని క్షేత్రస్థాయి ఆచరణకు మధ్యనున్న అంతరాన్ని ఎంతగానో తగ్గించింది. సుస్థిర వ్యవసాయం కోసం తపించిన స్వామినాథన్‌- మానవ పురోగతి, పర్యావరణ సుస్థిరతల మధ్య సున్నితమైన సమతౌల్యం ఉండాలని చెప్పేవారు. బడుగు రైతుల జీవితాల్లో వెలుగులు నింపడానికి, ఆవిష్కరణల ఫలాలను వారికి దరిచేర్చడానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. మరీ ముఖ్యంగా, మహిళా రైతుల జీవితాలను మెరుగు పరచడమంటే ఆయనకు ఎంతో మక్కువ!


ప్రపంచంలోనే తొలిసారిగా 1987లో ప్రతిష్ఠాత్మకమైన ‘వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌’ను అందుకొని... ఆవిష్కరణలకు, మార్గదర్శకత్వానికి అత్యుత్తమ నమూనాగా నిలిచారు స్వామినాథన్‌. తనకు బహుమతిగా లభించిన సొమ్మును ఎలాంటి లాభాపేక్ష లేని పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు వెచ్చించారు. నేటికీ అది అనేక రంగాలకు చెందిన విస్తృతస్థాయి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంది. లెక్కలేనంత మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన స్వామినాథన్‌- నేర్చుకోవడంలో, ఆవిష్కరణల దిశగా వారిలో గొప్ప ప్రేరణ రగిలించారు. ఆయన వ్యవస్థల నిర్మాత కూడా. ఆయన చలవవల్లే శక్తిమంతమైన పరిశోధనలు జరిగే కేంద్రాలెన్నో అవతరించాయి. మనీలాలోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థకు ఆయన సంచాలకుడిగా పనిచేశారు. స్వామినాథన్‌ ప్రోద్బలంతోనే 2018లో వారణాసిలో అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రం అంకురించింది.


పట్టుదలతో సాధించిన ధీరుడు..

ఆచార్య స్వామినాథన్‌కు నివాళులు అర్పించేందుకు నేను మళ్ళీ తిరుక్కురళ్‌ ద్విపదను ఉటంకిస్తాను. ‘ప్రణాళిక రూపకర్త దృఢమనస్కుడైతే... తాను కోరుకున్నది, కోరుకున్న విధానంలోనే సాధించి తీరుతాడు’. ఆ రీతిగానే వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికి, రైతులకు సేవ చేయడానికి తనను తాను జీవితారంభంలోనే అంకితం చేసుకున్న మహా మనీషి- ప్రొఫెసర్‌ స్వామినాథన్‌. తాను చేపట్టిన దాన్ని ఆయన ఎంతో ఉత్సాహంగా, వినూత్నంగా కొనసాగించారు. వ్యవసాయ సుస్థిరత, ఆవిష్కరణల దిశగా సాగించే ప్రయాణంలో స్వామినాథన్‌ కృషి స్ఫూర్తిని, మార్గనిర్దేశకత్వాన్ని నిరంతరం అందిస్తూనే ఉంటుంది. మేము సైతం- అన్నదాతల కోసం నిలబడటంలో... శాస్త్రీయ ఆవిష్కరణల ఫలాలను ప్రతి మూలకు తీసుకెళ్ళేలా చేయడంలో... రాబోయే తరాల కోసం అభివృద్ధిని, సుస్థిరతను, శ్రేయస్సును వేగవంతం చేయడంలో స్వామినాథన్‌ సిద్ధాంతాల పట్ల నిబద్ధతను పునరుద్ఘాటిస్తూనే ఉంటాం.


గుజరాత్‌ విజయంలో..

ప్రొఫెసర్‌ స్వామినాథన్‌, నేను వ్యక్తిగతంగా విస్తృత స్థాయిలో మాట్లాడుకునేవారం. చెప్పాలంటే, నేను 2001లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరవాతి నుంచే అవి మొదలయ్యాయి. అప్పట్లో వ్యవసాయ నైపుణ్యాల పరంగా గుజరాత్‌కు అంత పేరేమీ ఉండేది కాదు. వరస కరవులు, భీకర తుపానులు, భూకంపం వంటి విపత్తులు రాష్ట్ర అభివృద్ధిపై తీవ్ర ప్రభావమే చూపించాయి. రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నాం. వాటిలో ఒకటి ‘భూ ఆరోగ్య కార్డు’. పొలాల్లో మట్టి తీరును అర్థం చేసుకోవడానికి, సాగుకు సంబంధించి ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని సమర్థంగా పరిష్కరించుకోవడానికి అవి ఎంతగానో తోడ్పడ్డాయి. ఈ పథకాన్ని ప్రారంభించడానికి ముందు నేను స్వామినాథన్‌ను కలిశాను. ఆయన దీన్ని ఎంతగానో మెచ్చుకోవడమే కాకుండా, తన విలువైన సూచనలు సలహాలను నాతో పంచుకున్నారు. ఆయన చెప్పడంవల్లే ఈ పథకం పట్ల సందేహాలు వ్యక్తపరచినవారిని సైతం ఒప్పించి ముందుకు వెళ్ళగలిగాం. తద్వారా గుజరాత్‌ను వ్యవసాయపరంగా విజయపథాన నడిపించగలిగాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలమే కాకుండా, ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తరవాత కూడా మా మధ్య సంభాషణలు జరుగుతుండేవి. 2016లో అంతర్జాతీయ వ్యవసాయ జీవవైవిధ్య సదస్సులో ఆయన్ని కలిశాను. మరలా 2017లో ఆయన రాసిన రెండు భాగాల పుస్తకాలను ఆవిష్కరించాను.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పురోగామి రాష్ట్రాలకు నష్టం

‣ చిరకాల మైత్రికి సరికొత్త సవాళ్లు

‣ ఆర్థిక స్వేచ్ఛతో మెరుగైన జీవనం

‣ పుతిన్‌, కిమ్‌.. ఏం మాట్లాడుకున్నారు?

Posted Date: 07-10-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని