• facebook
  • whatsapp
  • telegram

సేంద్రియ ఎరువులుగా పంట వ్యర్థాలుదేశంలో పంట వ్యర్థాల దహనంతో పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి పలు రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నా, ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఆధునిక పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ చేపడితే పర్యావరణానికి, పొలాలకు ప్రయోజనం చేకూరుతుంది.


పంట వ్యర్థాల దహనం వాయు కాలుష్యానికి కారణమవుతున్న నేపథ్యంలో, పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. పంటకాలం 150-160 రోజులు ఉండే పూసా-44 వరి సాగును వచ్చే ఖరీఫ్‌ నుంచి నిషేధించాలని నిర్ణయించింది. ఇతర వంగడాలతో పోలిస్తే ఈ రకం వరికి నీరు ఎక్కువగా అవసరమవుతుంది. పంట అవశేషాలూ భారీగా పోగుపడతాయి. పీఆర్‌-126 రకం పంటకాలం 92రోజులే. తక్కువ పంటకాలం ఉండే రకాలతో అవశేషాలూ తక్కువగానే ఉంటాయని, తద్వారా వ్యర్థాల దహనం 50శాతం మేర తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.


పంజాబ్‌లో దాదాపు 32లక్షల హెక్టార్లలో వరి సాగవుతుంది. ఖరీఫ్‌ వరికోత తరవాత పొలాలను గోధుమ వేయడానికి సిద్ధం చేస్తారు. ఇందులో భాగంగా వరి వ్యర్థాలను తగలబెడతారు. శీతాకాలంలో పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంవల్ల ఉత్తర భారతదేశంలో వాయుకాలుష్యం అమాంతం పెరుగుతోంది. ఇది ఊపిరితిత్తులు, శ్వాస సంబంధ వ్యాధులకు కారణమవుతోంది. దేశ రాజధాని దిల్లీలో ఈ సమస్య తీవ్రంగా ఉంటోంది. భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్‌) రూపొందించిన పూసా-44 వరి రకం బదులు పీఆర్‌-126 రకాన్ని సాగుచేస్తే రెండు నెలలు ముందుగా పంట పూర్తవుతుంది. గోధుమ సాగుకు పొలాలను సిద్ధం చేసుకోవడానికి సరిపడా సమయం ఉంటుంది. అయితే, పంజాబ్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని అక్కడి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పూసా-44 రకమైతే ఎకరానికి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని, పీఆర్‌-126 వంగడాలైతే 25-30 క్వింటాళ్లే చేతికొస్తాయని అన్నదాతలు అంటున్నారు. పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం తమకు ప్రతికూలంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం- పంటకాలం తక్కువే కాబట్టి ఆ మేరకు పెట్టుబడి తగ్గుతుందని చెబుతున్నారు. వరి పైరు వ్యర్థాలను దహనం చేయకుండా రబీలో గోధుమ విత్తనాలను వేసే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. పంజాబ్‌ ప్రభుత్వం వాటిని రాయితీపై అన్నదాతలకు ఇస్తోంది. అయినప్పటికీ, చాలామంది రైతులు వాటిని వినియోగించకుండా పంట వ్యర్థాలను కాల్చివేస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్‌ భూగర్భ జలాల క్షీణతను ఎదుర్కొంటోంది. పూసా-44 రకాన్ని నిషేధించడం ద్వారా సాగునీటిని ఆదా చేయవచ్చని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. పంట వ్యర్థాల దహనాన్ని నియంత్రించానికి హరియాణా ప్రభుత్వమూ పలు చర్యలు తీసుకుంటోంది. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం వంటి చర్యలు అక్కడ సత్ఫలితాలిస్తున్నాయి. పంజాబ్‌లో ఏటా రెండు కోట్ల టన్నుల వరి పంట వ్యర్థాలు వెలువడతాయని అంచనా.


పంట వ్యర్థాల దహనాన్ని నిరోధించడానికి స్వల్పకాలిక రకాల సాగు ఒక్కటే మార్గం కాదు. పర్యావరణ అనుకూల విధానాలను ఆచరించడం ఈ సమస్యకు ఉత్తమ పరిష్కారమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బయోడీకంపోజర్లను వినియోగించడం ద్వారా పంట వ్యర్థాలను త్వరగా కుళ్ళిపోయేలా చేయవచ్చు. పొలాల్లోని గడ్డిని కాల్చడంకంటే వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడంపై దృష్టి పెట్టాలి. ఇందుకు హ్యాపీ సీడర్‌, రొటావేటర్‌, బేలర్‌, వరిగడ్డి ఛాపర్‌ తదితర యంత్రాలను ఉపయోగించాలి. పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో వ్యర్థాల దహనాన్ని కొంతవరకు తగ్గించడంలో ఈ పరికరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వాలు తక్కువ ధరకే వీటిని బడుగు రైతులకు అందించాలి. పంట వ్యర్థాలను సేంద్రియ ఎరువులుగా మార్చే విధానం అన్నింటికంటే ఉత్తమమైనది. బయోగ్యాస్‌ ప్లాంట్లను విరివిగా ఏర్పాటుచేయడం ద్వారా వ్యర్థాల సమస్యను సమర్థంగా అరికట్టవచ్చు. పంట వ్యర్థాలను దహనం చేయడంవల్ల నేల నిస్సారంగా మారుతుంది. మనదేశంలో ఇటువంటి వ్యర్థాలు పెద్దమొత్తంలో వరి, గోధుమ పంటల నుంచి వస్తాయి. చెరకు, పత్తి, మిర్చి పంటల వ్యర్థాలనూ ఎక్కువగా పొలాల్లోనే దహనం చేస్తుంటారు. పంట వ్యర్థాల దహనానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించినప్పటికీ, అది విజయవంతంగా అమలు కాలేదు. పంట వ్యర్థాల దహనంవల్ల సంభవించే నష్టాల పట్ల అన్నదాతలకు అవగాహన కల్పించడం ఎంతో అవసరం. ఆధునిక పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ చేపట్టేలా వారిని ప్రోత్సహించాలి. రైతుల భాగస్వామ్యంతోనే ఈ సమస్య నుంచి బయటపడగలం.


- డి.సతీష్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బాలికలకు భద్రతే భరోసా

‣ ‘పసుపు బోర్డు’ పసిడి సిరులు పండిస్తుందా?

‣ ప్రకృతి రక్షణ.. జీవ వైవిధ్య పరిరక్షణ!

‣ పెద్దనోట్ల రద్దుతో ప్రయోజనమెంత?

‣ అజేయ శక్తిగా భారత వైమానిక దళం

‣ రైతును ప్రేమించిన తపస్వి

Posted Date: 14-10-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని