• facebook
  • whatsapp
  • telegram

ప్రకృతి విధ్వంసం.. మనిషే కారణం!



ప్రపంచవ్యాప్తంగా మానవ కార్యకలాపాలవల్ల ప్రకృతి విధ్వంసం, వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పర్యవసానంగా తుపానులు, వరదలు, కరవు పరిస్థితులు, భూకంపాలు తరచూ తలెత్తుతున్నాయి. వీటికి తోడు ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం, యుద్ధాలు వంటివీ మానవాళిని ప్రమాదంలోకి నెడుతున్నాయి. అంతర్జాతీయ విపత్తు నియంత్రణ దినోత్సవం సందర్భంగా..


మానవ ప్రేరేపిత చర్యలవల్ల పెద్దయెత్తున పర్యావరణ విధ్వంసం చోటుచేసుకుంటోంది. ఆ దుష్పరిణామాలు విపత్తుల రూపంలో తిరిగి మానవాళిపై విరుచుకుపడుతున్నాయి. అల్పాదాయ, వర్ధమాన దేశాల ప్రజలే అధికంగా వీటిబారిన పడుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి విపత్తుల నివారణ కార్యాలయ నివేదికల ప్రకారం- గత అయిదు దశాబ్దాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా 12వేల ప్రకృతి విపత్తులు సంభవించాయి. వీటి ధాటికి సుమారు 20లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. రూ.35లక్షల కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించింది. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇటీవలి కాలంలో మొరాకో, నేపాల్‌, తుర్కియే, అఫ్గానిస్థాన్‌ దేశాల్లో భూకంపాలు సంభవించాయి. పాకిస్థాన్‌లో వరదలు, కెనడా నుంచి అమెరికా వరకు కార్చిచ్చులు చోటుచేసుకున్నాయి. మన దేశంలో సిక్కిం, పశ్చిమ్‌బెంగాల్‌లో ఆకస్మిక వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. భూమి పగుళ్లతో హిమాలయ ప్రాంతాల్లో పెద్దయెత్తున నష్టం సంభవిస్తోంది.


నష్టాన్ని తగ్గించేందుకు..

మానవాళికి పెనుముప్పుగా పరిణమిస్తున్న ప్రకృతి విపత్తులను నివారించడంపై ఐరాస 1970లోనే దృష్టి సారించింది. వీటిని సమర్థంగా ఎదుర్కోవడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించుకోవాలని యోచించింది. అందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో ముందస్తు ప్రణాళికల రూపకల్పన, సాంకేతికతల వినియోగం, సహాయక చర్యలు వంటి అంశాలకు సంబంధించి సభ్యదేశాల నుంచి సలహాలు, సూచనలు ఆహ్వానించింది. విపత్తుల అధ్యయనం, నిరోధం, నియంత్రణ, నిర్వహణ కోసం 1971లో ఐరాస విపత్తుల ఉపశమన కార్యాలయం అంకురించింది. 1990-99 కాలాన్ని అంతర్జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ దశాబ్దంగా ఐరాస ప్రకటించింది. జెనీవాలో జరిగిన అంతర్జాతీయ విపత్తు నివారణ సదస్సు- అంతర్జాతీయంగా విపత్తులను పరిమితం చేయడమే లక్ష్యంగా వ్యూహపత్రాన్ని రూపొందించేందుకు బాటలు పరచింది. ఆ క్రమంలోనే, ఏటా అక్టోబరు 13వ తేదీని ‘అంతర్జాతీయ విపత్తు నియంత్రణ దినోత్సవం’గా నిర్వహించాలని ఐరాస సర్వప్రతినిధుల సభ తీర్మానించింది. ‘స్థిరమైన భవిష్యత్తు కోసం అసమానతలపై పోరాడాలి’ అన్నది ఈ ఏడాది నినాదం. విపత్తులు, అసమానతల మధ్య పరస్పర సంబంధం ఉంటున్నట్లు ఐరాస నివేదికలు చెబుతున్నాయి. శారీరక, మానసిక సమస్యల కారణంగా చాలామంది విపత్తులను సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నారు. సేవల అందజేతలో దుర్విచక్షణవల్ల పేదలు, బలహీనవర్గాల ప్రజలు ఎక్కువగా నష్టాలకు గురవుతున్నారని అవి విశ్లేషిస్తున్నాయి. కాబట్టి, ఇటువంటి అసమానతల నివారణకు ప్రపంచ దేశాలు ఈ ఏడాది ప్రాధాన్యమివ్వాలని ఐరాస పిలుపిచ్చింది.


జపాన్‌లో 2015లో నిర్వహించిన ప్రపంచ సదస్సు విపత్తుల నియంత్రణకు అత్యంత కీలకమైన వ్యూహపత్రాన్ని రూపొందించింది. దాన్నే ‘సెంద్రాయ్‌ ఫ్రేమ్‌వర్క్‌’గా పిలుస్తారు. ప్రపంచదేశాల విపత్తు నివారణ కార్యక్రమాలకు ఈ పత్రమే మార్గదర్శనం చేస్తోంది. 2030 నాటికి ‘కొత్త విపత్తులను నిరోధించడం- ఉన్నవాటిని తగ్గించడం’ అనేది సెంద్రాయ్‌ ఫ్రేమ్‌వర్క్‌ ప్రాథమిక లక్ష్యం. దీన్ని చేరుకోగలిగితే- మరణాలతో పాటు జీవనోపాధులు, ఆర్థిక వ్యవస్థలు, మౌలిక వసతులకు కలిగే నష్టాలు గణనీయంగా తగ్గుతాయి. కానీ- ఐరాస, వివిధ దేశాలు రూపొందించిన విపత్తుల నివారణ వ్యూహాలు సంతృప్తికరమైన ఫలితాలను సాధించలేకపోయాయి. చాలా దేశాలు ప్రణాళికల రూపకల్పనకే పరిమితమవుతున్నాయి తప్పితే, వాటిని క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు చేయడంలేదు. విపత్తుల సంఖ్యను, మరణాల రేటును, మౌలిక వసతులకు కలిగే నష్టాలను తగ్గించడంలో... విద్య, వైద్యం వంటి సేవలను నిరాటంకంగా అందించడంలో సెంద్రాయ్‌ ఫ్రేమ్‌వర్క్‌ పూర్తిస్థాయి ఫలితాలను రాబట్టలేకపోయింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా కనీసం 560 విపత్తులు ఎదుర్కోవలసి వస్తుందని... వీటికి తోడు వాతావరణ మార్పుల కారణంగా 3.76కోట్ల మంది దుర్భర దారిద్య్రంలోకి జారుకుంటారని ఐరాస విపత్తుల ఉపశమన సంస్థ నివేదికలు హెచ్చరించాయి. విపత్తులు ఏటా విజృంభిస్తున్నా ప్రపంచ దేశాలు వాటిని తీవ్రంగా పరిగణించకపోవడం దురదృష్టకరం. సహాయక చర్యలతో సరిపెడుతున్నాయే తప్ప, విపత్తుల నివారణ, నియంత్రణపై సరైన దృష్టి సారించడంలేదు. విపత్తుల నియంత్రణకు జాతీయ, రాష్ట్ర, స్థానిక వ్యూహాలు, ప్రణాళికలను రూపొందించాలని ఐరాస విపత్తుల నివారణ సంస్థ సూచించింది. తదనుగుణంగా ప్రాంతాలవారీగా విపత్తులను గుర్తించి, అవి కలిగిస్తున్న ప్రభావంపై కచ్చితమైన సమాచారాన్ని అధికార యంత్రాంగాలు నమోదు చేయాలి. ఆధునిక సాంకేతికతల వినియోగంతో విపత్తుల రాకను పసిగట్టి, ముందస్తు హెచ్చరికలతో ప్రజలను కాపాడాలి. వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్ట్రాలను గణనీయంగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది.


అరకొర నిధులు..

విపత్తులనివారణ, నష్టాలను గణనీయంగా తగ్గించుకోవడానికి భారీగా పెట్టుబడులు అవసరం. భారత్‌లో విపత్తుల నివారణ, నిర్వహణకు నిరుడు బడ్జెట్‌లో కేటాయించింది కేవలం రూ.377కోట్లు. అందులో సగం నిధులనే ఖర్చు చేశారు! పర్యావరణహితకరమైన ప్రణాళికలు, పూర్తిస్థాయిలో మౌలిక వసతుల కల్పన విపత్తుల నివారణకు ఎంతగానో తోడ్పడతాయి. భౌగోళిక స్వరూపాలకు అనుగుణంగా ప్రాంతీయ ప్రణాళికలు రూపొందించుకోవడంతో పాటు పర్వత, భూకంప ప్రభావిత ప్రాంతాల్లో నిర్మాణ కార్యకలాపాలను నియంత్రించాలి. తీరప్రాంతాల్లో తుపాను ప్రభావాలను తగ్గించే వ్యూహాలను అమలుపరచాలి. ఈ విషయంలో ఒడిశా అనుసరిస్తున్న విధానాలు దేశమంతటికీ ఆదర్శంగా ఉంటున్నాయి. నగరాలను వరదలు ముంచెత్తకుండా సరైన ప్రణాళికలను అమలుపరచాలి. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ఇతోధికంగా పెంచడం శ్రేయస్కరం. విపత్తు స్పందనా దళాలను, యంత్రాంగాలను బలోపేతం చేసుకోవడమూ ఎంతో ముఖ్యం. ఇటువంటి చర్యలతోనే- విపత్తులవల్ల వాటిల్లే ప్రమాదాలు, నష్టాలు గణనీయంగా తగ్గుతాయి.


కరవు కోరలు

గడచిన రెండు దశాబ్దాల కాలంలో భారత్‌లో విపత్తుల కారణంగా సుమారు లక్ష మంది మృత్యువాత పడ్డారు. రూ.12లక్షల కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా వరదలబారిన పడుతున్న దేశాల్లో మనది రెండో స్థానం. దేశంలోని మొత్తం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 27 తరచూ ప్రకృతి ఉత్పాతాలకు గురవుతున్నాయి. ఏపీ, తెలంగాణ సహా 17 రాష్ట్రాలకు చెందిన అనేక ప్రాంతాలు ఏటా కరవు కోరలకు చిక్కుతున్నాయి. ప్రకృతి విపత్తులవల్ల భారత్‌కు ఏటా రూ.70వేల కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు 2018 ఆర్థిక సర్వే వెల్లడించింది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆదాయాల తెగ్గోత.. పొదుపులో క్షీణత

‣ సేంద్రియ ఎరువులుగా పంట వ్యర్థాలు

‣ బాలికలకు భద్రతే భరోసా

‣ ‘పసుపు బోర్డు’ పసిడి సిరులు పండిస్తుందా?

Posted Date: 14-10-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం