• facebook
  • whatsapp
  • telegram

లంకతో మాయని చెలిమిశ్రీలంకతో ఇండియాది దీర్ఘకాలిక మైత్రీబంధం. వందల ఏళ్లుగా ఇరుదేశాల మధ్య సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంక తెరిపిన పడుతున్నవేళ- ఆ దేశంతో బంధాన్ని పరిపుష్టం చేసుకోవడంపై ఇండియా దృష్టి సారించింది. మరోవైపు- పర్యాటక వీసాల విషయంలో వెసలుబాట్లు కల్పించాలని లంక ప్రతిపాదించిన దేశాల్లో భారత్‌ కూడా ఉంది.


భారీగా రుణాలు గుమ్మరిస్తూ చైనా పన్నిన కుటిల వ్యూహాలతో దిల్లీ, కొలంబోల మధ్య దూరం పెరుగుతున్నట్లు ఇటీవలి సంవత్సరాల్లో కనిపించినా, అదంతా తాత్కాలికమేనని ఇప్పటికే తేలింది. ఆర్థిక సంక్షోభం దెబ్బకు దివాలా అంచున నిలిచిన వేళ లంకకు భారత్‌ పలువిధాలుగా చేయూత అందించింది. తద్వారా లంకేయుల హృదయాల్లో సానుకూల స్థానాన్ని పదిలం చేసుకుంది. డ్రాగన్‌ రుణాల చేదు ఫలాలు అనుభవమైన దరిమిలా దిల్లీతో బంధానికి కొలంబో కొంతకాలంగా మరింత ప్రాధాన్యమిస్తోంది. జులైలో శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘె ఇండియాలో పర్యటించడంతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి గట్టి ఊతం లభించినట్లయింది. సముద్రతల, గగనతల, ఇంధన, ఆర్థిక రంగాల్లో భాగస్వామ్యం, అనుసంధానతలను మరింతగా పెంచుకోవాలని తీర్మానించుకొని, అందుకు అవసరమైన దార్శనిక పత్రాన్ని నాడు ఇరు దేశాలు రూపొందించుకున్నాయి.


ఉత్తర, తూర్పు శ్రీలంకల్లోని కొన్ని ప్రాంతాల్లో తమిళులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారి భాష, మతం, సంప్రదాయాల వంటివన్నీ మన దేశంలోని తమిళుల తరహాలోనే ఉంటాయి. దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ విరామం తరవాత ఇరుదేశాల మధ్య ప్రయాణికుల పడవ సేవలు ఇటీవల పునఃప్రారంభం కావడం- దిల్లీ, లంక సంబంధాల్లో సరికొత్త మైలురాయి. ద్వైపాక్షిక జలరవాణా బలోపేతమయ్యేందుకు, రెండు దేశాల్లోని తమిళుల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడేందుకు ఈ సేవలు దోహదపడనున్నాయి. పొరుగు దేశాలతో అనుసంధానతను పెంపొందించుకునేందుకు ఇండియా చేస్తున్న కృషికి వాటి పునఃప్రారంభం ఓ నిదర్శనం. విక్రమసింఘె పర్యటనలో కుదిరిన ఒప్పందాల ప్రకారం- లంకలో ఈ ఏడాది చివరి నుంచే యూపీఐ చెల్లింపులు చెల్లుబాటయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటికి తోడు ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత ఇంధన గొట్టపు మార్గం, విద్యుత్‌ గ్రిడ్‌ అనుసంధానత కూడా అందుబాటులోకి వస్తే- ద్వైపాక్షిక ఆర్థిక బంధం బలోపేతమవుతుంది. ఈ ప్రాజెక్టులతో లంకకే అధిక లాభం. విదేశ మారక నిల్వల కొరతతో ప్రస్తుతం అది చమురు కొనుగోలుకు ఇబ్బంది పడుతోంది. గొట్టపు మార్గం అందుబాటులోకి వస్తే ఇంధనం చవకగా దొరుకుతుంది. ఇండియాకు రూపాయల్లోనే చెల్లింపులు జరపవచ్చు. విద్యుత్‌ కోతల నుంచి బయటపడేందుకు, పవన విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకొని, అవసరమైతే భారత్‌కు కరెంటును ఎగుమతి చేసేందుకు విద్యుత్తు గ్రిడ్‌ వెసలుబాటు కల్పిస్తుంది.


మరోవైపు- హిందూ మహాసముద్ర దేశాల సంఘం మంత్రుల మండలి సదస్సులో పాల్గొనేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఇటీవల లంకలో పర్యటించారు. ఆ దేశాధ్యక్షుడితో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చర్చలు జరిపారు. లంకలో హౌజింగ్‌ ప్రాజెక్టులు, పాఠశాలల ఆధునికీకరణ, పాల దిగుబడి పెంపునకు ఒప్పందాలు కుదిరాయి. హిందూ మహాసముద్రంలో స్వేచ్ఛాయుత వాతావరణం ఉండాలని జైశంకర్‌ మంత్రుల మండలి సమావేశంలో స్పష్టంచేశారు. ప్రయోజనకరం కాని ప్రాజెక్టుల కోసం అధిక వడ్డీలకు వచ్చే రుణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సభ్యదేశాలను హెచ్చరించారు. అలాంటి రుణాల వెనక రహస్య అజెండాలు ఉంటాయంటూ అప్రమత్తం చేశారు. చైనా ఇబ్బడిముబ్బడిగా ఇస్తున్న అప్పులను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారన్నది సుస్పష్టం. బీజింగ్‌ నుంచి భారీగా రుణాలు తీసుకొని దెబ్బతిన్న కొలంబోకు జైశంకర్‌ మాటలు గట్టిగానే తగిలి ఉంటాయనడంలో సందేహం లేదు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అన్ని దేశాలతో రుణ చెల్లింపు గడువులను పొడిగించుకునేందుకు లంక ఇటీవల ప్రయత్నించింది. చైనా, ఇండియా, జపాన్‌ సహా తనకు రుణాలిచ్చిన అన్ని దేశాలతో ఒకేసారి సమావేశమై- అందుకు ప్రణాళికను రూపొందించుకోవాలని భావించింది. అయితే ఇతర దేశాలతో కలిసి రుణ చెల్లింపుల గడువు మార్పుపై చర్చించడానికి చైనా ససేమిరా అంది. విడిగానే చర్చిస్తామని లంకకు స్పష్టం చేసింది. రుణాల విషయంలో చైనా పారదర్శకత లేమికి ఇదొక నిదర్శనం. చైనాతో వ్యవహారం నడిపే విషయంలో లంక మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఉదంతం స్పష్టంచేస్తోంది. కష్టకాలంలో ఆపన్నహస్తం అందించిన ఇండియాతో స్నేహబంధాన్ని మరింత పదిలం చేసుకోవాల్సిన అవసరాన్ని చాటుతోంది.  


- ఎం.నవీన్‌ కుమార్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మండలి సంస్కరణలకు భారత్‌ పట్టు

‣ తలసరి ఆదాయంలో మనమెక్కడ?

‣ ప్రకృతి విధ్వంసం.. మనిషే కారణం!

‣ ఆదాయాల తెగ్గోత.. పొదుపులో క్షీణత

‣ సేంద్రియ ఎరువులుగా పంట వ్యర్థాలు

‣ బాలికలకు భద్రతే భరోసా

‣ ‘పసుపు బోర్డు’ పసిడి సిరులు పండిస్తుందా?

Posted Date: 25-10-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని