• facebook
  • whatsapp
  • telegram

ఆహార భద్రతకు పెను సవాళ్లుఏ దేశానికైనా ఆహార భద్రత అత్యంత ప్రాధాన్య అంశం. ఐక్యరాజ్య సమితి ఆమోదించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఆకలిని పారదోలడం సైతం ఒకటి. వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి. ముఖ్యంగా, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ఒప్పందంలోని నిర్బంధ, నియంత్రిత నియమాలతో అభివృద్ధి చెందుతున్న దేశాల ఆహార భద్రతకు సవాళ్లు ఎదురవుతున్నాయి.


‘ఆరోగ్యకరమైన జీవనాన్ని గడిపేందుకు అవసరమైన, సురక్షితమైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ప్రజలందరికీ అన్ని కాలాల్లో అందుబాటులో ఉంచడమే ఆహార భద్రత’ అని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) నిర్వచించింది. ఆహార భద్రత లోపిస్తే ఆకలి చావులు సంభవించే పెనుప్రమాదం ఉంది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 80కోట్ల మంది ఆకలితోనే నిద్రిస్తున్నారనేది చేదు నిజం. ప్రపంచ జనాభాలో సుమారు 42శాతం ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందడానికి తగినంత ఆర్థిక స్థోమత లేదు. విస్తరిస్తున్న ఆహార అభద్రత ప్రమాదకర స్థాయికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో సుమారు 74శాతం జనాభా ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారని, 16శాతం జనాభా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారనే నిష్ఠుర సత్యాన్ని ఆహార వ్యవసాయ సంస్థ నివేదిక వెల్లడించింది. బ్రిటిష్‌ వలస పాలనలో ఇండియా తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంది. బెంగాల్‌ కరవు వల్ల లక్షల మంది మృత్యువాత పడ్డారు. స్వాతంత్య్రానంతరం ఆహార లోటు ఆందోళన కలిగించింది. దరిమిలా వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతుల కృషి ఫలితంగా హరిత విప్లవం సాకారమైంది. వరి, గోధుమ ధాన్యాల ఉత్పత్తి ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. కాలక్రమంలో స్వయంసమృద్ధిని సాధించడంతోపాటు ప్రపంచ స్థాయి ఎగుమతిదారుల్లో అగ్రగామిగా భారత్‌ అవతరించింది.


మద్దతు ధరపై అభ్యంతరాలు

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ఒప్పందంలోని కొన్ని నిర్బంధ నియమాలు భారత్‌ సహా పలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు అశనిపాతంలా మారాయి. ఆయా దేశాల్లో అమలవుతున్న జాతీయ ఆహార భద్రతా కార్యక్రమాలు/పథకాలకు అవి తీవ్ర అవరోధాన్ని కలిగిస్తున్నాయి. నిజానికి వ్యవసాయంపై డబ్ల్యూటీఓ ఒప్పందం అమలులోకి వచ్చిన తరవాత అంతర్జాతీయంగా ఆహార, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య విధానాల్లో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. సంపన్న దేశాలు తమ రైతులకు, వ్యవసాయ వ్యాపారులకు ఇచ్చే రాయితీలు భారీగానే ఉంటున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ విపణిలో ఆహార వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, సరఫరాలపైనా ఆయా దేశాలు ఆధిపత్యం చలాయిస్తున్నాయి. భారత్‌తో పోలిస్తే అభివృద్ధి చెందిన దేశాలు తమ రైతులకు ఇచ్చే రాయితీలు అనేక రెట్లు అధికంగా ఉంటాయి. అయినా, ఇండియా ఇస్తున్న కొద్దిపాటి వ్యవసాయ రాయితీలనూ రద్దు చేయాల్సిందిగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఐరోపా తదితర దేశాలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. బియ్యం, గోధుమలు, పత్తి, చక్కెరపై భారతదేశ విధానాలు- వ్యవసాయం విషయంలో డబ్ల్యూటీఓ ఒప్పంద నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ పలు ఆహార ఎగుమతి దేశాలు అసత్య ప్రచారానికి పూనుకొన్నాయి. ముఖ్యంగా వరి, గోధుమను చిన్న సన్నకారు రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసే ప్రభుత్వ సేకరణ విధానాన్ని తప్పుపడుతూ అవి తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉంది. గోధుమల ఉత్పత్తి విలువలో సగానికిపైగా భారత్‌ రాయితీ ఇస్తోందని, దీనిపై డబ్ల్యూటీఓలో దావా వేయాలని అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులు ప్రతిపాదించారు. డబ్ల్యూటీఓ కేవలం పది శాతం రాయితీనే అనుమతిస్తోందని వారు చెబుతున్నారు. భారత్‌ అందించే అధిక రాయితీల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గి అమెరికా గోధుమ రైతులు నష్టపోవాల్సి వస్తోందని వాదిస్తున్నారు. గోధుమతో పాటు బియ్యంపై రాయితీలనూ ఇండియా తగ్గించేలా ఒత్తిడి తీసుకురావాలని అమెరికా పార్లమెంటు సభ్యులు తమ ప్రభుత్వానికి సూచించారు. అయితే, రైతులకు ఇస్తున్న మద్దతు- డబ్ల్యూటీఓ ఒప్పంద నిబంధనలకు అనుగుణంగానే ఉందని ఇండియా గట్టిగానే వాదిస్తోంది.


తీవ్ర పర్యవసానాలు

భారత ప్రభుత్వ ఆహార సేకరణ, నిల్వ కార్యక్రమాన్ని గతంలో డబ్ల్యూటీఓ సమావేశంలో అభివృద్ధి చెందిన దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. అయితే, తృతీయ ప్రపంచ దేశాల మద్దతుతో శాంతి నిబంధన కింద భారత్‌ తాత్కాలిక ఉపశమనం పొందింది. దాని ప్రకారం ఈ సమస్యపై ఒక తీర్మానం చేసేదాకా ఎలాంటి శిక్షలు, చర్యలు తీసుకోవడానికి వీలులేదు. కొన్ని ప్రభుత్వాలు రైతులకు అందించే మద్దతు వల్ల ప్రపంచ ఆహార వాణిజ్యం దెబ్బతింటోందని, దీన్ని ఉపసంహరించాలంటూ ఆహార ఎగుమతి దేశాలు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాయి. అయినా, ఆహార ధాన్యాలకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసే ప్రభుత్వ సేకరణ విధానాన్ని ఎలాంటి పరిమితులు విధించకుండా కొనసాగించాల్సిన అవసరం ఉంది. ప్రజా పంపిణీ వ్యవస్థ మనుగడ, దేశ ఆహార భద్రత దీనిపై ఆధారపడి ఉన్నాయి. అంతర్జాతీయ విపణిలో ఆహార ధాన్యాల ధరలు పెరిగితే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆహార ధాన్యాల ధరల అస్థిరత, అనిశ్చితి రైతుల జీవనోపాధిని, ఆహార భద్రతను ప్రమాదంలోకి నెడతాయి. అందువల్ల 2024లో జరిగే మంత్రుల స్థాయి చర్చల్లో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా వ్యూహాలు రచించి, అభివృద్ధి చెందుతున్న, తృతీయ ప్రపంచ దేశాలు ఏకమై ఒత్తిడి తీసుకురావాలి. అప్పుడే ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యమైన ఆకలిని అంతమొందించి ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించడం సాకారమవుతుంది.


తక్కువ ధరకే సరఫరా

భారత్‌లో ప్రజలందరికీ ఆహార భద్రతను కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం- ప్రజాపంపిణీ. దీని నిర్వహణకు జాతీయ ఆహార సంస్థ వరి, గోధుమ వంటి ధాన్యాలను రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న చౌకధరల దుకాణాల ద్వారా మార్కెట్‌ కంటే తక్కువ ధరకే సరఫరా చేస్తుంది. మార్కెట్లను స్థిరీకరించడానికి, భవిష్యత్తు అవసరాల కోసమూ ఆహార ధాన్యాలను వ్యూహాత్మకంగా నిల్వ చేస్తుంది. వరి, గోధుమలను సాగుచేసే చిన్న సన్నకారు రైతులకు ప్రాణవాయువు లాంటి కనీస మద్దతు ధరను కల్పించడంతోపాటు ధాన్యం సేకరణ, పంపిణీ, నిల్వలతో దేశ ఆహార భద్రతకు వెన్నుదన్నుగా నిలవాలన్నది లక్ష్యం. జాతీయ ఆహార భద్రతా చట్టం కారణంగా దేశంలో గ్రామీణ జనాభాలో 75శాతం, పట్టణ జనాభాలో 50శాతం ప్రజలకు రాయితీపై ఆహార ధాన్యాలు అందుతున్నాయి. తద్వారా నిరుపేదల ఆకలి తీరుతోంది.


- డాక్టర్‌ జె.సురేష్‌

(హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ యానిమేషన్‌ రంగం.. ఉపాధికి ఊతం!

‣ డ్రాగన్‌తో తెగదెంపులు సాధ్యమేనా?

‣ నోబెల్‌.. భారతీయులకు అందుతుందా?

‣ లంకతో మాయని చెలిమి

‣ మండలి సంస్కరణలకు భారత్‌ పట్టు

‣ తలసరి ఆదాయంలో మనమెక్కడ?

‣ ప్రకృతి విధ్వంసం.. మనిషే కారణం!

Posted Date: 06-11-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని