• facebook
  • whatsapp
  • telegram

డ్రాగన్‌తో తెగదెంపులు సాధ్యమేనా?



భారత్‌, చైనా.. ఇరుగు పొరుగు దేశాలు. ప్రపంచంలోనే అత్యధిక జనాభాతో పరిఢవిల్లుతున్నాయి. ఒక దశలో రెండు దేశాలు దాదాపు ఒకే స్థాయిలో ఉండేవి. కాలక్రమంలో చైనా మున్ముందుకు దూసుకుపోయింది. వాణిజ్య కార్యకలాపాలే డ్రాగన్‌ పురోగతికి దోహదపడ్డాయనేది విశ్లేషకుల అభిప్రాయం.


చైనా ఆర్థిక వ్యవస్థ ఒక దశలో భారత్‌తో సమానంగా నడిచింది. తదనంతర కాలంలో అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు పరుగులు తీసింది. ప్రస్తుతం ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోంది.ప్రణాళికల కాలంలో భారత్‌ గణనీయ ప్రగతి సాధించినప్పటికీ, చైనాతో పోలిస్తే చాలా వెనకంజలో ఉండిపోయింది. చైనా ముందు నుంచీ అమెరికా, జపాన్‌ ఆర్థిక వ్యవస్థల స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో జాగ్రత్తగా అడుగులు వేసింది. భారత్‌ మాత్రం స్వదేశీ కంపెనీలను విదేశీ ఉత్పత్తుల పోటీ నుంచి కాపాడుకుంటూ వచ్చిందనే ఆరోపణలున్నాయి. అభివృద్ధి విషయంలో మన దేశం పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ వంటి దేశాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొనేదనే విమర్శలున్నాయి. అమెరికాతో వాణిజ్య యుద్ధం సాగిస్తున్న డ్రాగన్‌- కొవిడ్‌ అనంతర ప్రభావాన్ని తట్టుకొని విస్తరణ వ్యూహాలతో ప్రపంచ దేశాలతో వర్తకం నిర్వర్తిస్తోంది. ఎటువంటి నష్టాలు తలెత్తకుండా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం తమ అభివృద్ధి అవసరాలకు చైనాపై ఆధారపడని దేశమంటూ లేదంటే అతిశయోక్తి కాదు!


దిగుమతులు కీలకం

కొన్నేళ్లుగా భారత్‌కు చైనా అతిపెద్ద సరఫరాదారుగా నిలుస్తోంది. చైనా నుంచి ఇండియా దిగుమతి చేసుకుంటున్న సరకుల్లో ఎలెక్ట్రికల్‌, ఎలెక్ట్రానిక్స్‌, ఔషధాలతో పాటు రసాయనాలు, ప్లాస్టిక్స్‌ ముఖ్యమైనవి. మొత్తం దిగుమతుల్లో వీటిదే అధిక వాటా. కొవిడ్‌ తరవాత ఇవి మరింత పెరిగాయి. భారతదేశ ఉత్పత్తులకూ చైనా పెద్ద విపణిగానే నిలుస్తోంది. అయినా, ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటు విపరీతంగా పెరుగుతోంది. వాణిజ్య లోటు పెరగడం భారత్‌కు శ్రేయస్కరం కాదు.   చైనా ఆది నుంచీ భారత్‌ను దెబ్బతీసే కుయుక్తులు పన్నుతున్న దేశంగా పేరొందింది. చైనా సైనికులు ఇండియా సరిహద్దుల్లోకి చొరబడేందుకు యత్నించడం, ఘర్షణలకు దిగడం తరచూ చోటుచేసుకునే ఉదంతాలు. అలాగని చైనాతో వాణిజ్య బంధాన్ని పూర్తిగా తెగదెంపులు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. చైనా నుంచి దిగుమతులు భారత్‌కు కీలకంగా పరిణమించాయి. దేశీయంగా గిరాకీ, సరఫరాల మధ్య వ్యత్యాసాన్ని డ్రాగన్‌ దిగుమతులు భర్తీ చేస్తున్నాయి. చవకగా లభించే చైనా సరకులు ద్రవ్యోల్బణం పెరగకుండా తోడ్పడుతున్నాయి. అదేవిధంగా స్వదేశీ ఉత్పత్తి సంస్థల మధ్య పోటీ పెరుగుతోంది. భవిష్యత్తులో దేశాభివృద్ధి సాధనకు, ప్రస్తుతం మౌలిక వసతుల కల్పనకు యంత్రపరికరాలు వంటివి చాలా అవసరం. ఇవి తాత్కాలికంగా, స్వదేశీ కంపెనీలపై కొంత ప్రతికూల ప్రభావం చూపుతాయి. అయితే, భవిష్యత్తులో ఈ సంస్థలు దిగుమతి చేసుకొన్న సాంకేతికత సాయంతో అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి ఎదగగలుగుతాయి. ఈ విషయంలో కేంద్రం స్వదేశీ కంపెనీలకు పలురకాల పథకాలతో ఉతమిస్తోంది. దీర్ఘకాలిక వ్యూహాన్ని దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం భారత్‌-చైనా మధ్య ఇతరత్రా సంబంధాలు సానుకూల ధోరణిలో లేవు. అయినప్పటికీ, ఇరుదేశాలకూ పరస్పరాధారిత అవసరాలు ఉన్నాయనేది కాదనలేని అంశం. చైనా మాదిరిగా భారత్‌ సైతం అధిక జనాభా కలిగిన దేశం. భారత్‌లో యువజన సంఖ్య అత్యధికం. చైనా వస్తువులకు భారత్‌ అతిపెద్ద విపణిగా మారింది. చైనా పరిశ్రమల్లో యంత్రాలు నిరంతరం పనిచేయాలంటే భారత్‌ అవసరం డ్రాగన్‌కు ఎంతైనా ఉందని చెప్పవచ్చు. భారత్‌ భవిష్యత్తులో అభివృద్ధి పథంలో దూసుకెళ్ళడానికి చైనా యంత్రాలు, పరికరాలు కీలకంగా మారతాయి. డ్రాగన్‌ తన పరిశ్రమలను స్థాపించడానికి భారత్‌ చాలా అనుకూలమైన దేశం.


అంత సులువేం కాదు..

కేంద్ర ప్రభుత్వం గతంలో కొన్ని చైనా యాప్‌లను నిషేధించింది. దాంతో దిగుమతులకు కూడా స్వస్తి పలుకుతుందని అందరూ భావించారు. అలా జరగకపోగా, దిగుమతులు మరింతగా పెరిగాయి. చైనాను పక్కనపెట్టడం, విస్మరించడం అంత సులువైన పనేమీ కాదు. దీనివల్ల భారత్‌ ఆర్థికవృద్ధి కుంటువడే ప్రమాదం ఉంది. ఫార్మా రంగంతోపాటు పలు ఇతర రంగాలు చైనా దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి. అదే సమయంలో డ్రాగన్‌ భారత్‌ వస్తువులపై పూర్తిస్థాయిలో ఆధారపడే పరిస్థితిలో లేదు. మరోవైపు, ప్రపంచంలో  చాలా దేశాలు చైనాతో వాణిజ్యానికి అధిక స్థాయిలో ఆసక్తి చూపుతున్నప్పుడు, భారత్‌ ఒక్కటే దూరంగా ఉండటం సాధ్యమయ్యే పనికాదు. చైనాతో వాణిజ్యపరంగా లాభనష్టాలను బేరీజు వేసుకొంటే ఒక విధంగా భారత్‌కు లాభమే కానవస్తోంది. ప్రస్తుతం స్వల్పకాలంలో చైనా దిగుమతులను ఉపయోగించుకొని, దీర్ఘకాలంలో ఇతర దేశాల దిగుమతులు పెంచుకోవాలి. క్రమంగా డ్రాగన్‌ను పక్కనపెట్టే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. దీనికితోడు జీఎస్‌టీ హేతుబద్ధీకరణ, పీఎల్‌ఐను బలపరచడం, మౌలిక వసతుల కల్పన వంటి చర్యలతో స్థానిక కంపెనీలను ప్రోత్సహించాలి. చైనాపై ఆధారపడటాన్ని దీర్ఘకాలంలో తగ్గించుకునే ప్రణాళికలు రచించాలి. ఈ విషయంలో చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. భారతీయ వినియోగదారుల ఆలోచనతీరులోనూ మార్పు రావాల్సి ఉంది. చైనా వస్తువులపై మోజు తగ్గించుకోవాలి. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. తద్వారా స్వదేశీ పరిశ్రమలకు ప్రోత్సాహం దక్కుతుంది. పూర్తిగా దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరమూ తగ్గుతుంది. అదేవిధంగా... ఇరు దేశాలు సరిహద్దు సమస్యల్ని చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. అభివృద్ధికే ప్రాధాన్యమిస్తూ ముందడుగు వేయాలి. అటువంటి సుహృద్భావ వాతావరణం- ఉభయ దేశాలతో పాటు యావత్‌ ప్రపంచానికీ మేలు కలిగిస్తుంది.


ప్రగతి బాట

స్వల్పకాలంలో త్వరితగతిన ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన వాణిజ్యం- చైనా ప్రగతికి బాటలు వేసింది. ఆ దేశంలో కఠిన నిబంధనలతో కూడిన పాలనా వ్యవస్థ అందుకు కొంతమేర ఉపకరించింది. అన్ని రంగాల్లోనూ ఉత్పాదకత వేగం పుంజుకోవడం డ్రాగన్‌ను మరింతగా ముందుకు నడిపించింది. ఇటువంటి అనేక పరిస్థితులు కలిసిరావడంతో చైనా ఆర్థికంగానే కాకుండా, పలు రంగాల్లో అగ్రరాజ్యమైన అమెరికాకు సవాలు విసిరే స్థాయికి ఎదిగింది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నోబెల్‌.. భారతీయులకు అందుతుందా?

‣ లంకతో మాయని చెలిమి

‣ మండలి సంస్కరణలకు భారత్‌ పట్టు

‣ తలసరి ఆదాయంలో మనమెక్కడ?

‣ ప్రకృతి విధ్వంసం.. మనిషే కారణం!

Posted Date: 06-11-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం