• facebook
  • whatsapp
  • telegram

యానిమేషన్‌ రంగం.. ఉపాధికి ఊతం!



కదిలే బొమ్మలతో కొన్నేళ్ల క్రితమే జనాన్ని కనికట్టు చేసింది- ప్రాక్సినోస్కోప్‌! అతి సాధారణమైన ఈ ఆట పరికరం లక్షల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి పునాది అవుతుందని, లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని నాడు ఎవరూ ఊహించలేదు. నాటి ప్రాక్సినోస్కోప్‌ ఇప్పుడు మనం చూస్తున్న యానిమేషన్లకు మాతృకలాంటిది.


యానిమేషన్‌ రంగం వందల కోట్ల డాలర్ల పరిశ్రమగా మారడానికి మూల కారణమైన ప్రాక్సినోస్కోప్‌ను ఫ్రెంచ్‌ జాతీయుడైన ఛార్లెస్‌ ఎమిల్‌ రేనాడ్‌ కనుగొన్నారు. ఆయన తన అద్భుత సృష్టి ‘ప్యాంటోమైమ్స్‌ లుమిన్యూస్‌’ను 1892 అక్టోబరు 28న పారిస్‌లో ప్రదర్శించారు. ఆ చరిత్రాత్మక సందర్భానికి గుర్తుగా ఇంటర్నేషనల్‌ యానిమేటెడ్‌ ఫిల్మ్స్‌ అసోసియేషన్‌ (ఆసిఫా) నేడు ‘అంతర్జాతీయ యానిమేషన్‌ దినోత్సవం’ నిర్వహిస్తోంది. రేనాడ్‌ చేసిన ఆవిష్కరణలు అనంతర కాలంలో ఎన్నో మార్పులు చెంది యానిమేషన్‌ రంగ అభివృద్ధికి బాటలు పరచాయి. యానిమేషన్‌ చరిత్రను పరిశీలిస్తే- చప్పున స్ఫురించే పేరు వాల్ట్‌ డిస్నీ. దర్శకుడు, నిర్మాత, యానిమేటర్‌, కార్టూనిస్ట్‌, వాయిస్‌ యాక్టర్‌, స్క్రీన్‌ రైటర్‌ ఇలా బహుముఖ ప్రతిభావంతుడైన ఈ అమెరికన్‌... తన ఆవిష్కరణలతో యానిమేషన్‌ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులకు ఆద్యుడయ్యారు. ఆయన సృష్టించిన మిక్కీ మౌస్‌ పాత్ర యానిమేషన్‌ చరిత్రలో ఓ మేలిమలుపు. ఎన్నో విశేషాలు కలిగిన కార్టూన్‌గా ప్రసిద్ధిగాంచిన మిక్కీ మౌస్‌తో డిస్నీ స్టూడియోస్‌ యానిమేషన్‌ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. యానిమేషన్‌ పరిశ్రమ గతానికి, వర్తమానానికి మధ్య అనుసంధానకర్తగా సమున్నతంగా నిలిచిన డిస్నీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద వినోద రంగ సంస్థల్లో ఒకటి. ఆ సంస్థ సృష్టించిన డొనాల్డ్‌ డక్‌, గూఫీ వంటి కార్టూన్‌ పాత్రలు అత్యంత ప్రజాదరణతో ఈ రంగ అభివృద్ధికి నిచ్చెన మెట్లయ్యాయి. డిస్నీ స్టూడియో నిర్మించిన పలు చిత్రాలు ప్రపంచ యానిమేషన్‌ పరిశ్రమకు అపరిమిత ప్రజాదరణను, అద్భుతమైన వృద్ధిని కట్టబెట్టాయి.


పొరుగు సేవల కేంద్రంగా భారత్‌ 

ప్రపంచవ్యాప్తంగా యానిమేషన్‌ పరిశ్రమ మున్ముందుకు దూసుకుపోతూ లక్షల కోట్ల రూపాయల ఆదాయ వనరుగా మారింది. భారత్‌లో మాత్రం ఈ పరిశ్రమలో ఆశించినంత మేర పురోగతి సాధించలేక, వెనకబాటే కనిపిస్తోంది. మన యానిమేషన్‌ స్టూడియోలు తమ ఉత్పత్తులకు, పనితీరుకు విలువ పెంచుకోవడం, మేధాసంపత్తి హక్కులను పొందడంలో మిశ్రమ ఫలితాలనే సాధించాయి. ‘ఛోటా భీమ్‌’ కార్టూన్‌ పాత్ర సృష్టికర్తలైన గ్రీన్‌ గోల్డ్‌ యానిమేషన్‌, ‘మోటూ-పత్లూ’ పాత్రలను సృష్టించిన కాస్మోస్‌-మాయా స్టూడియోస్‌ మినహా భారతదేశంలో మరే ఇతర యానిమేషన్‌ కంపెనీ ఆదాయం, ఉపాధి, పరిశ్రమ వృద్ధి పరంగా ప్రపంచ మార్కెట్‌కు పోటీ ఇవ్వలేకపోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం- యానిమేషన్‌ రంగంలో మనం ఇప్పటికీ పొరుగుసేవల కేంద్రంగా మిగిలిపోవడమే! దేశవ్యాప్తంగా చాలా యానిమేషన్‌ స్టూడియోలు పెద్ద విదేశీ నిర్మాణ సంస్థలకు పొరుగు సేవలు అందించే ఏజెన్సీలుగానే మనుగడ సాగిస్తున్నాయి. తక్కువ విలువ కలిగిన పనులే వాటికి దక్కుతున్నాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, ముంబయి, తిరువనంతపురం వంటి నగరాల్లోని కొన్ని స్టూడియోలు మాత్రం తమ సొంత మేధాసంపత్తితో ప్రాజెక్టులను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా, ఐరోపాల్లోని విదేశీ స్టూడియోల నుంచి ‘క్యారెక్టర్‌ డెవలప్‌మెంట్‌’ వంటి అధిక విలువ కలిగిన పనులను సాధిస్తున్నాయి. అయితే, ఇప్పటికీ యానిమేషన్‌ రంగంలో మన వ్యాపారమంతా ప్రధానంగా పొరుగు సేవలపైనే ఆధారపడి ఉంటోందన్నది కాదనలేని వాస్తవం. ఈ దశ నుంచి ఎదిగేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ఇండియా- క్రమంగా ప్రపంచ యానిమేషన్‌ రంగంలోకి అడుగుపెడుతోంది.


ప్రోత్సాహం దక్కితే..

యానిమేషన్‌ పరిశ్రమ వృద్ధి చెందడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించడానికి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఇమేజ్‌ (ఇన్నొవేషన్‌ ఇన్‌ యానిమేషన్‌, మల్టీమీడియా, గేమింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌) టవర్స్‌ ఏర్పాటుకు సంకల్పించింది. యానిమేషన్‌, వీఎఫ్‌ఎక్స్‌, గేమింగ్‌, కామిక్స్‌, ఏఆర్‌/వీఆర్‌/ఎంఆర్‌ తదితర రంగాల పురోగతికి చోదకశక్తిగా నిలిచేలా దీన్ని చేపట్టింది. అత్యాధునిక, ప్లగ్‌-అండ్‌-ప్లే సదుపాయంతో తొలితరం టెక్నోక్రాట్‌ వ్యవస్థాపకులకు, ఈ రంగంలోని చిన్న, మధ్యతరహా సంస్థలకు రాయితీ ధరలకే కార్యాలయ సౌకర్యాన్ని కల్పించడం ఇమేజ్‌ టవర్స్‌ ప్రధాన ఉద్దేశం. సుమారు 20వేల మంది ఉద్యోగులు పనిచేసేందుకు వీలుగా పలు యానిమేషన్‌ స్టూడియోలను ఏర్పాటు చేయనున్నారు. సాంకేతిక ఎగుమతులు, ఉపాధి కల్పనకు ఇది కీలక వృద్ధి ఇంజిన్‌గా మారనుంది. ఈ టవర్స్‌తో అంతర్జాతీయ యానిమేషన్‌ పటంలో హైదరాబాద్‌ తనదైన ముద్ర వేసే అవకాశం ఉంది. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ పరిశ్రమ ఎదుగుదలకూ తగినంత ఊతం ఇవ్వగలదు. ఇతర ప్రాజెక్టులతో పాటు తెలంగాణ ప్రపంచంలోనే అత్యంత ఆశాజనక పెట్టుబడి గమ్యస్థానాల్లో ఒకటిగా ప్రతిష్ఠ సాధించడానికి ఇమేజ్‌ టవర్స్‌ తోడ్పడుతుందన్నది నిపుణుల అభిప్రాయం. యానిమేషన్‌ రంగంలో వేగాన్ని పెంచడానికి, వృద్ధికి ఊతమివ్వడానికి సరైన ప్రణాళికలు రూపొందించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మౌలిక వసతులతోపాటు అన్ని రకాల ప్రోత్సాహకాలు దక్కితే దేశంలో యానిమేషన్‌ రంగం మరింత వేగంగా అభివృద్ధి సాధించగలుగుతుంది. ఫలితంగా, నిపుణులైన యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు దక్కుతాయి. ఈ రంగంపై ఆధారపడే ఇతరత్రా పరిశ్రమలు విస్తృతంగా వ్యాప్తి చెందుతాయి. ఆర్థిక కార్యకలాపాల ద్వారా దేశ పురోగతికీ అవి తోడ్పడతాయి.


కీలకంగా మారుతున్న హైదరాబాద్‌

అనేక యానిమేషన్‌, వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియోలు తమ కార్యస్థానాలను ఏర్పాటు చేయడంతో హైదరాబాద్‌ నగరం దేశంలో ముఖ్యమైన యానిమేషన్‌ ఉత్పత్తి కేంద్రంగా ఎదుగుతోంది. భారతదేశపు అత్యంత విజయవంతమైన గ్రీన్‌ గోల్డ్‌ సహా అనేక కొత్త యానిమేషన్‌ స్టూడియోలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. అంకురాలకు అండగా నిలిచే టీ-హబ్‌2, ప్రోటో టైపింగ్‌లకు కేంద్ర స్థానంగా రూపొందుతున్న టీ-వర్క్స్‌ సహా పలు ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. గేమ్‌ సిటీ, ఇమేజ్‌ టవర్స్‌ వంటివాటితో స్నేహపూర్వక పెట్టుబడి వాతావరణం నెలకొంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డ్రాగన్‌తో తెగదెంపులు సాధ్యమేనా?

‣ నోబెల్‌.. భారతీయులకు అందుతుందా?

‣ లంకతో మాయని చెలిమి

‣ మండలి సంస్కరణలకు భారత్‌ పట్టు

‣ తలసరి ఆదాయంలో మనమెక్కడ?

‣ ప్రకృతి విధ్వంసం.. మనిషే కారణం!

Posted Date: 06-11-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం