• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ పరిరక్షణకుహరిత ఇంధనం



పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచేలా ప్రభుత్వాలు పెట్టుబడులు పెంచాలని ప్రపంచవ్యాప్తంగా వందకుపైగా సీఈఓలు బహిరంగ లేఖలో కోరారు. లేఖపై సంతకం చేసిన వారిలో మనదేశానికి చెందిన సీఈఓలూ ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై అందరూ దృష్టి సారించాల్సిన అవసరముంది.


సకల జీవరాశులకు అవసరమైన ప్రాణవాయువు, నీరు, ఆహారం భూమిపైనే లభ్యమవుతాయి. పారిశ్రామిక విప్లవం తరవాత నూతన సాంకేతికతలతో అనేక రకాల యంత్రాలు ఆవిష్కృతమయ్యాయి. మానవ సౌలభ్యం కోసం, వీటిని శిలాజ ఇంధనాలు మండించడం ద్వారా వినియోగించడం వల్ల కర్బన ఉద్గారాల విడుదల పెరిగింది. మరోవైపు, పెరుగుతున్న జనాభా అవసరాల కోసం అడ్డగోలుగా అడవులను నరికివేస్తుండటం, ప్లాస్టిక్‌ వినియోగం అధికమవడంతో పర్యావరణం కలుషితమవుతోంది. భూ ఉపరితల ఉష్ణోగ్రతలూ పెరుగుతున్నాయి. మంచు పర్వతాలు కరిగి సముద్ర నీటి మట్టం పెరగడం వల్ల భూమి కుంచించుకుపోవడం, అనేక రకాల జీవరాశులు అంతరించడం, ఎంతోమంది నిరాశ్రయులు కావడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలు, తుపానులు, సునామీలు, కరవు కాటకాలు పెరుగుతున్నాయి. మానవాళిని కొత్త ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి.


శిలాజ ఇంధనాల వినియోగం..

శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గిస్తూ పునరుత్పాదక స్వచ్ఛ ఇంధనాలైన సౌర, పవనశక్తి వంటివాటి వాడకాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో సగందాకా విద్యుత్‌ ఉత్పత్తిని పునరుద్ధరణీయ ఇంధన వనరులతోనే సాధించాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ వైపు వడివడిగా అడుగులు వేస్తూ, 2070 నాటికి కర్బన ఉద్గారాల తటస్థ స్థితి (నెట్‌ జీరో)కి చేరుకోవాలని భావిస్తోంది. గత బడ్జెట్లో హరిత ఇంధనానికి కొంత ప్రోత్సాహం ప్రకటించినా దిగుమతులపై సుంకం తగ్గించకపోవడంతో సౌరఫలకాల వ్యయం తగ్గలేదు. అయినప్పటికీ సామాజిక స్పృహ, కొనుగోలు శక్తి కలిగిన అనేకమంది ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్తు సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకొంటున్నారు. భవనాల్లో అత్యంత సామర్థ్యం కలిగిన విద్యుత్‌ పరికరాలను ఎంచుకోవాలి. నీటిని పొదుపుగా వాడుకోవాలి. వృథాను తగ్గిస్తూ, వివిధ పరికరాల కోసం అవసరమైన ఇంధనాన్ని పునరుత్పాదక వనరులతో సమకూర్చుకోవాలి. ఇలాంటి పలు పద్ధతుల ద్వారా స్వయంసమృద్ధి సాధించే హరిత భవనాల నిర్మాణాల్ని ప్రోత్సహించాలి. ప్రస్తుతమున్న భవనాల్లో సాధ్యమైనంత మేర మార్పులు చేయడంతో పాటు భవిష్యత్తులో నిర్మించే భవనాల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే దేశీయంగా సుమారు 15శాతం ఇంధనాలను పొదుపు చేసే అవకాశం ఉంటుంది. దట్టమైన అడవులు, సముద్రాలు వాతావరణంలో పెరుగుతున్న కార్బన్‌ డయాక్సైడ్‌ను సహజంగా గ్రహించే కీలక వ్యవస్థలు. వాతావరణ సమతుల్యత పాటించేందుకు దేశంలో అడవుల విస్తీర్ణం పెంచాలి. పలు కారణాలతో అడవుల నరికివేత అధికమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడవుల పెంపకానికి అనేక చర్యలు తీసుకున్నా ఫలితాలు నిరాశాజనకమే. అడవుల నరికివేతను నిలువరించే విషయంలో ప్రభుత్వాలు మరింత కట్టుదిట్టంగా కృషి చేయాలి. ప్రజలు సైతం ప్రతి ఒక్కరూ ఒక చెట్టు పెంచాలనే సంకల్పాన్ని తీసుకొనేలా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సముద్రాలు వాతావరణం నుంచి పెద్ద మొత్తంలో కార్బన్‌ డయాక్సైడ్‌ను గ్రహిస్తాయి. ఇది వాతావరణాన్ని స్థిరంగా ఉంచడానికి సహాయ పడుతుంది. అయితే, సముద్రాలు వేడెక్కడం వల్ల అందులోని కోట్లాది జీవాలు అంతరించే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్‌ వినియోగం జీవన విధానంలో భాగంగా మారింది. ఒకసారి వినియోగించి పారవేసే ప్లాస్టిక్‌పై నిషేధం ఉన్నప్పటికీ, సమర్థంగా అమలు కావడం లేదు. ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టి సారించడం లేదు. ఇది ఆందోళన కలిగించే విషయం. వ్యవసాయ రంగంలో అధిక దిగుబడి కోసం విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం, పంట వ్యర్థాల దహనం వల్ల కూడా వాతావరణ కాలుష్యం అధికమవుతోంది. ఇలాంటి కార్యకలాపాల్ని తగ్గించాల్సిన అవసరం ఉంది.


ప్రజల భాగస్వామ్యం

కర్బన ఉద్గారాల కట్టడికి వినూత్న, అత్యాధునిక మార్గాల్ని గుర్తించాలి. తక్కువ వ్యయంతో ఉద్గారాల కట్టడి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడే చర్యల దిశగా అడుగులు వేయాలి. అత్యధిక ఇంధన సామర్థ్యం కలిగిన పరికరాలను వాడటం, పునరుత్పాదక ఇంధనాల వినియోగాన్ని పెంచడం, అడవుల పెంపకం చేపట్టడం, వ్యర్థాల పునర్వినియోగం వంటి చర్యల ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. భూతాపాన్ని నియంత్రించే అవకాశమూ ఉంటుంది. ‘వాతావరణ మార్పుల దుష్ప్రభావాన్ని అనుభవించిన మొదటి తరం మనమే, దాని గురించి ఏదైనా చేయగల చివరి తరం కూడా మనమే’ అన్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా. కాలుష్యానికి గురికాకుండా భూమిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి వ్యక్తిపైనా, ప్రతి దేశంపైనా ఉంది. ఇంధన ఆదా కోసం మనం తీసుకునే ప్రతి చర్యనూ దేశానికి అందించే తోడ్పాటుగానే భావించాలి. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రణాళికల్లో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం, కర్బన ఉద్గారాల నియంత్రణ విధానాలను ప్రకటించడం మేలు. పర్యావరణ ఒప్పందాలు, వివిధ సదస్సుల్లో ఇచ్చిన హామీల మేరకు శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించుకొనేందుకు కృషి చేయాలి. ముఖ్యంగా బొగ్గు వినియోగాన్ని పరిహరించాలి. కర్బన ఉద్గారాల శూన్యస్థితి సాధించడానికి దేశాలన్నీ కట్టుబడాలి. పర్యావరణ పరిరక్షణ క్రతువులో ప్రభుత్వాలే కాకుండా, ప్రజలందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


రవాణా రంగంలో కాలుష్యం

దేశంలో వాహనాల పెరుగుదల రేటు ఎక్కువగా ఉందని ‘పర్యావరణ పరిరక్షణ, శిక్షణ పరిశోధన కేంద్రం(ఈపీటీఆర్‌ఐ) తేల్చింది. అత్యధిక డీజిల్‌, పెట్రోల్‌ వాడకం రవాణా రంగంలోనే జరుగుతోంది. దీనివల్ల వాయు కాలుష్యం పెరగడమే కాకుండా లక్షల కోట్ల విదేశ మారక ద్రవ్యం చెల్లించాల్సి వస్తోంది. మనదేశంలో అత్యంత కాలుష్య నగరాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఈ సమస్యను అధిగమించడానికి విద్యుత్‌, హైడ్రోజన్‌ తదితర ఇంధనాలతో నడిచే వాహనాల వినియోగం పెరగాలి. కొనుగోలు ధర ఎక్కువగా ఉండటం, తగినన్ని ఛార్జింగ్‌ కేంద్రాలు లేకపోవడంతో విద్యుత్‌ వాహనాల జోరు ఆశించినంతగా కనిపించడం లేదు. వీటికి మరింతగా ప్రోత్సాహకాలు ఇవ్వాలి. మెట్రో రైలు లాంటి ప్రజారవాణా వ్యవస్థను మరింతగా అందుబాటులోకి తేవాలి. ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థలను ఎక్కువగా వినియోగించుకోవాలి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ యుద్ధ జ్వాలల్లో భూగోళం

‣ మదుపరులకు మేలెంత?

‣ చైనా ఎత్తులకు పైయెత్తు!

‣ ఆహార భద్రతకు పెను సవాళ్లు

‣ యానిమేషన్‌ రంగం.. ఉపాధికి ఊతం!

‣ డ్రాగన్‌తో తెగదెంపులు సాధ్యమేనా?

‣ నోబెల్‌.. భారతీయులకు అందుతుందా?

Posted Date: 06-11-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం