• facebook
  • whatsapp
  • telegram

యుద్ధ జ్వాలల్లో భూగోళం



శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం వల్ల కర్బన ఉద్గారాలు పెద్దయెత్తున వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. ఫలితంగా భూతాపం నానాటికీ కట్టుతప్పుతోంది. ఆ దుష్పరిణామాలను ప్రపంచం ఇప్పటికే అనుభవిస్తోంది. యుద్ధాల వల్లా కర్బన ఉద్గారాలు పోటెత్తుతున్నాయి.


ఈ ఏడాది జూన్‌, జులై, ఆగస్టు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో మండుటెండలు జనాన్ని హాహాకారాలు పెట్టించాయి. చల్లని ఐరోపా, ఉత్తర అమెరికాలలో అడవులు దగ్ధమై తీవ్ర వాయు కాలుష్యం తలెత్తింది. చలి దేశాల్లోనూ వడదెబ్బ మరణాలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి. వాతావరణ వివరాలను నమోదు చేయడం మొదలైన తరవాత అత్యుష్ణ సంవత్సరంగా 2016 రికార్డును 2023 అధిగమించింది. ఈ ఏడాది ఆగస్టులో సగటు ఉష్ణోగ్రత పారిశ్రామిక విప్లవానికి ముందున్న స్థాయికన్నా 1.68 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా నమోదైంది. ఈ లెక్కన భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల వద్ద పట్టి నిలపాలన్న పారిస్‌ వాతావరణ సభ తీర్మానం ఏమవుతుందనే ఆందోళన పెరిగింది. రవాణా, విద్యుదుత్పాదన, పారిశ్రామికోత్పత్తికి శిలాజ ఇంధనాలను వినియోగిస్తుండటం వల్ల వెలువడుతున్న బొగ్గుపులుసు వాయువు భూ తాపానికి ప్రధాన కారణం. ఇవి కాకుండా ఇంతవరకు ప్రపంచం పరిగణనలోకి తీసుకోని అంశం మరొకటి ఉంది. అది- యుద్ధాల వల్ల వెలువడే కర్బన ఉద్గారాలు! వాటిని మిలిటరీ ఉద్గారాలుగా నిర్వచిస్తున్నారు.


కర్బన ఉద్గారాల వెల్లువ

‘మనం భూతాప పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌ లేదా రెండు డిగ్రీల సెల్సియస్‌ వద్ద పట్టి నిలపలేం, అది మూడు డిగ్రీలకు చేరకుండా నిరోధించడమెలా అన్నదే ప్రశ్న’ అని కెనడా వాతావరణ శాస్త్రజ్ఞుడు ఆండ్రూ వీవర్‌ హెచ్చరించారు. ఈ ఏడాది సగటు భూ ఉష్ణోగ్రత పెరుగుదలలో ఎల్‌నినో తనవంతు పుణ్యం కట్టుకుంది. వచ్చే సంవత్సరం సూపర్‌ ఎల్‌నినో ఏర్పడుతుందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. మరోవైపు యుద్ధాల వల్ల వెలువడుతున్న కర్బన ఉద్గారాలూ ఆందోళన కలిగిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన తొలి సంవత్సరంలోనే 12 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి విడుదలయ్యాయని ఇటీవలి అధ్యయనం తెలిపింది. అది ఒక ఏడాది పాటు 2.70 కోట్ల మోటారు వాహనాలు విడుదల చేసే ఉద్గారాలకు సమానం. యుద్ధం ఇప్పటికీ ముగియనందువల్ల మిలిటరీ ఉద్గారాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. యుద్ధంలో ట్యాంకులు, సైనిక వాహనాలు, యుద్ధ విమానాలు భారీగా పెట్రోలు, డీజిల్‌ను వినియోగిస్తాయి. ఆయుధ ఉత్పత్తి, వివిధ కాంక్రీటు కట్టడాల నిర్మాణానికీ భారీగా ఇంధనాన్ని వినియోగించాల్సి వస్తుంది. తుపాకి కాల్పులు, బాంబు పేలుళ్లు, క్షిపణి ప్రయోగాల వల్ల నగరాలు, వనాలలో అగ్ని కీలలు ఎగసిపడతాయి. ఈ తరహా మంటలు 1.80 కోట్ల కర్బన ఉద్గారాలను విరజిమ్ముతున్నాయని అంచనా. ఉక్రెయిన్‌లోని విద్యుత్‌ కేంద్రాలపై రష్యా బాంబు దాడులు మరింతగా బొగ్గుపులుసు వాయువు వాతావరణంలోకి చేరడానికి కారణమవుతున్నాయి. యుద్ధం వల్ల రష్యా చమురు, సహజవాయు దిగుమతులపై ఐరోపా సమాఖ్య (ఈయూ) ఆంక్షలు విధించింది. దాంతో విద్యుదుత్పత్తి కోసం, చలికాలంలో ఇళ్లను వెచ్చగా ఉంచడానికి ఈయూ దేశాలు బొగ్గును అధికంగా మండిస్తున్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ఐరోపాతో పాటు మిగతా ప్రపంచంలోనూ శిలాజ ఇంధనాలకు బదులుగా పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్ళాలన్న ప్రణాళిక తాత్కాలికంగా అటకెక్కింది. యుద్ధ కాలంలో విమానాలను రష్యా, ఉక్రెయిన్‌ల నుంచి ఇతర మార్గాల్లో మళ్ళించడం వల్ల ఇంధనం ఎక్కువగా ఖర్చవుతోంది. అది ఉద్గారాల పెరుగుదలకు దారి తీసింది. దీనంతటి వల్ల పారిస్‌ వాతావరణ సదస్సు తీర్మానించిన ప్రకారం భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌ వద్ద కట్టడి చేయడం కష్టమవుతుందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.


సరైన చర్చ అవసరం

ఉక్రెయిన్‌ యుద్ధం ముగిసిన తరవాత అక్కడ ధ్వంసమైన మౌలిక వసతులు, నగరాలు, పరిశ్రమల పునరుద్ధరణ మరింతగా ఉద్గారాలను పెంచనుంది. భవనాల నిర్మాణానికి సిమెంటు, ఉక్కు వంటివి అవసరం. వాటిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన విద్యుదుత్పాదన కోసం చమురు, బొగ్గు మండించాలి. ఆ క్రమంలో ఉద్గారాలు మరింత పెరుగుతాయి. ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల అమెరికాతో పాటు ఐరోపా సమాఖ్య దేశాలు సైనిక బడ్జెట్లను పెంచేయడం మిలిటరీ ఉద్గారాలను మరింతగా జనింపజేస్తుంది. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం అదుపుతప్పి పశ్చిమాసియాలో పోరాటాలు ప్రజ్వరిల్లితే ఉద్గారాలు మరింత పెరుగుతాయి. అందువల్ల వాతావరణ మార్పుల నిరోధ చర్చల్లో మిలిటరీ ఉద్గారాల నివారణపైనా దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లోని దుబాయ్‌లో ఈ ఏడాది నవంబరు 30-డిసెంబరు 12 మధ్య కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ (కాప్‌) 28వ సదస్సు జరగనుంది. మిలిటరీ ఉద్గారాల గురించి అందులో లోతుగా చర్చించాలని వారు కోరుతున్నారు.


- ప్రసాద్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మదుపరులకు మేలెంత?

‣ చైనా ఎత్తులకు పైయెత్తు!

‣ ఆహార భద్రతకు పెను సవాళ్లు

‣ యానిమేషన్‌ రంగం.. ఉపాధికి ఊతం!

‣ డ్రాగన్‌తో తెగదెంపులు సాధ్యమేనా?

‣ నోబెల్‌.. భారతీయులకు అందుతుందా?

Posted Date: 06-11-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం