• facebook
  • whatsapp
  • telegram

మదుపరులకు మేలెంత?


ట్రేడింగ్‌ సమయాన్ని పొడిగించేందుకు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వాటికి సెబీ ఆమోదం తెలిపే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. దీనివల్ల మదుపరులకు మంచి కంటే చెడే ఎక్కువగా జరిగే ప్రమాదముందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


మన స్టాక్‌ మార్కెట్‌పై అంతర్జాతీయ సంఘటనలు, విదేశీ విపణి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ముందు రోజు రాత్రి అమెరికా, ఐరోపా మార్కెట్లు కదలాడిన తీరు మరుసటి రోజు మన మార్కెట్‌కు దిశానిర్దేశం చేస్తుంటుంది. ఒకవేళ ఏదైనా ప్రతికూల పరిణామం చోటుచేసుకొని అవి భారీ నష్టాలతో ముగిస్తే, ఉదయం ట్రేడింగ్‌ ఆరంభంలోనే మన దగ్గర అది ప్రతిబింబిస్తుంది. ఒక్కోసారి తెల్లారేసరికే మదుపరుల పెట్టుబడి పెద్ద మొత్తంలో ఆవిరవుతుంటుంది. ఈ నష్టం ముప్పు నుంచి కాస్తయినా బయటపడేందుకు వారికి అవకాశం ఉండటం లేదు. దీనికి పరిష్కారంగా ట్రేడింగ్‌ సమయం పెంపుపై ఎక్స్ఛేంజీలు యోచిస్తున్నాయి. ప్రస్తుతం మన స్టాక్‌ మార్కెట్‌ ఉదయం 9.15 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.30 గంటలకు ముగుస్తుంది. అమెరికా మార్కెట్‌ మన ట్రేడింగ్‌ ముగిశాకే ప్రారంభమవుతుంది. అందువల్ల మన మార్కెట్‌ ట్రేడింగ్‌ సమయాన్ని పొడిగిస్తే అమెరికా మార్కెట్ల కదలికలపై ఉదయం వరకు వేచిచూడాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు మదుపరులు స్పందించే అవకాశం ఉంటుందని ఎక్స్ఛేంజీలు భావిస్తున్నాయి.


విడతలవారీగా అమలు

స్టాక్‌ మార్కెట్లో నమోదైన కంపెనీల షేర్ల క్రయవిక్రయాలు జరపడాన్ని క్యాష్‌ (నగదు) మార్కెట్‌గా వ్యవహరిస్తారు. ఇదే కాకుండా ఫ్యూచర్స్‌, ఆప్షన్లు (ఎఫ్‌అండ్‌ఓ) అనే మరో విభాగం ఉంటుంది. సగటు రోజువారీ ట్రేడింగ్‌ లావాదేవీ పరిమాణం, మార్కెట్‌ విలువ ఆధారంగా ఈ విభాగంలోకి కొన్ని కంపెనీల షేర్లను ఎక్స్ఛేంజీలు చేరుస్తుంటాయి. ఎఫ్‌అండ్‌ఓ షేర్ల కాంట్రాక్టులు నెల రోజుల కాలపరిమితితో ట్రేడ్‌ అవుతుంటాయి. నిఫ్టీ, బ్యాంక్‌ నిఫ్టీ లాంటి సూచీలకైతే వారం రోజుల్లో గడువు తీరిపోయే కాంట్రాక్టులూ ఉంటాయి. వీటన్నింటికీ ఒకేసారి కాకుండా విడతలవారీగా ట్రేడింగ్‌ సమయాన్ని పొడిగించాలని నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) భావిస్తోంది. తొలుత సూచీల (నిఫ్టీ, బ్యాంక్‌ నిఫ్టీ లాంటివి) ఎఫ్‌అండ్‌ఓలకు అదనంగా సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు లావాదేవీలు నిర్వహించాలనుకుంటోంది. దీనిపై మదుపరుల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా సమయాన్ని రాత్రి 11.30 గంటల వరకు పొడిగించాలని భావిస్తోంది. ఆ తరవాత కంపెనీల షేర్ల ఫ్యూచర్లు, ఆప్షన్లకు దీన్ని వర్తింపజేసే ఉద్దేశంలో ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీకి ఎన్‌ఎస్‌ఈ పంపినట్లు తెలుస్తోంది. వీటికి సెబీ ఆమోదం తెలిపితే అందుకు తగ్గట్లుగా నిర్వహణ వ్యవస్థల్లో ఎన్‌ఎస్‌ఈ మార్పులు చేసే అవకాశముంది.


సెబీ అధ్యయనం ప్రకారం- ఎఫ్‌అండ్‌ఓ షేర్ల విభాగంలో లావాదేవీలు జరిపే ప్రతి పది మందిలో తొమ్మిది మంది నష్టాలనే చవిచూస్తున్నారు. వీటికి తోడు బ్రోకరేజీ, సెక్యూరిటీ లావాదేవీ రుసుము రూపంలో మరికొంత పోగొట్టుకొంటున్నారు. ఇలాంటి వారిలో చిన్న మదుపరులే ఎక్కువగా ఉంటున్నారు. స్టాక్‌ మార్కెట్లోకి అడుగుపెట్టిన చిన్న మదుపరుల సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ట్రేడింగ్‌ కాలం పొడిగిస్తే, ఆ సమయంలోనూ నష్టాలు, రుసుముల కింద వీరు మరికొంత డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. లావాదేవీలు జరిపేటప్పుడు స్టాక్‌ మార్కెట్‌ను అనుక్షణం గమనిస్తూ ఉండాలి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సమయాన్ని దానికే కేటాయిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కుటుంబంతో గడిపే సమయమూ తగ్గుతుంది. ఇది వారి వైవాహిక జీవితం, కుటుంబ సభ్యులతో సంబంధాలపై ప్రభావం చూపించవచ్చు. ఎక్కువ సమయం వెచ్చించడం వల్ల స్టాక్‌ మార్కెట్‌ ఓ వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. ఇలాంటివారు చేతిలో డబ్బులు అయిపోయాక... అప్పులుచేసి మరీ లావాదేవీలు జరిపే పరిస్థితి తలెత్తవచ్చు. ఇప్పటికే స్టాక్‌ మార్కెట్లో నష్టాల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి.


నిర్వహణ వ్యయంపై ఆందోళన

అంతర్జాతీయ ధరల ఆధారంగా కదలాడే పసిడి, ముడి చమురు, సహజవాయువు లాంటి కమొడిటీల్లో ఇప్పటికే ట్రేడింగ్‌ సమయాన్ని పొడిగించారు. దానివల్ల తరవాతి రోజు ఈ కమొడిటీలు భారీ నష్టాలు లేదా లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకే ఇదే తరహా విధానాన్ని కంపెనీల షేర్లకు అమలు చేయాలని సెబీ, ఎక్స్ఛేంజీలు అనుకుంటున్నాయి. అయితే, ట్రేడింగ్‌ సమయం పొడిగింపుతో తమకు నిర్వహణ ఖర్చులు పెరిగిపోతాయని బ్రోకరేజీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న సాంకేతిక వ్యవస్థలను మెరుగుపరచుకోవడంతో పాటు ఎక్కువ సిబ్బందిని నియమించుకోవాల్సి రావడమే దీనికి కారణం. ట్రేడింగ్‌ సమయాన్ని పెంచడంవల్ల అటు మదుపరులకూ ఆ రోజు జరిగిన లావాదేవీలపై విశ్లేషణ చేసుకునేందుకు, తరవాతి రోజుకు సంబంధించిన వ్యూహాలు సిద్ధపరచుకునేందుకు తగిన సమయం ఉండదు. అందువల్ల లాభనష్టాలన్నింటినీ బేరీజు వేసి ట్రేడింగ్‌ సమయం పొడిగింపుపై సెబీ నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఆమోదం తెలిపినా చిన్న మదుపరులను దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి!


- నాసు నరేశ్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ చైనా ఎత్తులకు పైయెత్తు!

‣ ఆహార భద్రతకు పెను సవాళ్లు

‣ యానిమేషన్‌ రంగం.. ఉపాధికి ఊతం!

‣ డ్రాగన్‌తో తెగదెంపులు సాధ్యమేనా?

‣ నోబెల్‌.. భారతీయులకు అందుతుందా?

Posted Date: 06-11-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని