• facebook
  • whatsapp
  • telegram

అసమానతలపై పోరుకు హేతుబద్ధ పన్నులు



పన్ను చెల్లింపుదారులు సమర్పించిన వార్షిక రిటర్నులను ఆదాయ పన్ను శాఖ విశ్లేషించి ఆ వివరాలను ఏటా ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది. ఇటీవలి వివరాలను పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా, దేశీయంగా ఆదాయాల్లో తీవ్ర వ్యత్యాసాలు నెలకొన్నట్లు స్పష్టమవుతుంది.


ఆదాయపన్ను శాఖ ఇటీవలి వివరాల ప్రకారం దేశీయంగా ఇన్‌కమ్‌ట్యాక్స్‌ రిటర్నుల సంఖ్య, వాటిద్వారా పన్ను చెల్లింపుదారులు వెల్లడించిన ఆదాయాలు గత దశాబ్ద కాలంలో గణనీయంగా పెరిగాయి. రిటర్నుల సంఖ్య 3.6 కోట్ల నుంచి 6.75 కోట్లకు చేరింది. రిటర్నులు సమర్పించిన వారి ఆదాయాలు రూ.24.31 లక్షల కోట్ల నుంచి రూ.69.59 లక్షల కోట్లకు పెరిగాయి. రిటర్నుల్లో చూపిన ఆదాయ గణంకాలను విశ్లేషిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ)- మొత్తం ఆదాయంలో కింద స్లాబుల్లో ఉన్న 25శాతం వ్యక్తుల వాటా 2013-14, 2021-22 మధ్య కాలంలో 8.3శాతం నుంచి 8.4శాతానికి పెరిగినట్లు చెప్పింది. మధ్య స్లాబుల్లో ఉన్న 74శాతం వ్యక్తుల వాటా 75.8శాతం నుంచి 77శాతానికి అధికమైనట్లు వెల్లడించింది. పై స్లాబుల్లోని ఒక శాతం వ్యక్తుల వాటా అదే కాలానికి దాదాపు 16శాతం నుంచి 14.6శాతానికి తగ్గినట్లు తెలిపింది. ఇవి దేశీయంగా ఆదాయ వ్యత్యాసాలను సూచిస్తున్నాయి. గణాంకాలను మరింత లోతుగా పరిశీలిస్తే పైనున్న ఒక శాతం సంపన్నుల ఆదాయాల్లో 2013-14 నుంచి 2021-22 వరకు ఏటా 13శాతం వృద్ధి నెలకొందని అర్థమవుతుంది. ద్రవ్యోల్బణాన్ని పరిగణిస్తే కింది అంచెలో ఉన్న 25శాతం ప్రజల నిజ ఆదాయాలు తగ్గుతున్నాయని స్పష్టమవుతుంది. ఏది ఏమైనా భారతదేశ ప్రజల ఆదాయాల్లో భారీ వ్యత్యాసాలు నెలకొన్నాయి. పలు అధ్యయనాలు, పరిశీలనలు సైతం ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి.


కుటుంబాల ఆదాయమే కొలమానం

వాస్తవానికి, ఆదాయ పన్ను రిటర్నులు ప్రజల ఆర్థిక స్థితిని పాక్షికంగానే చూపిస్తాయి. ఎందుకంటే, ప్రజల్లో ఆదాయపన్ను కట్టేవారి శాతం చాలా తక్కువ. 2019-20, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో పన్ను చెల్లింపుదారులు సమర్పించిన వార్షిక రిటర్నులు 6.47 కోట్ల నుంచి 7.40 కోట్లకు పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రి గత జులైలో పార్లమెంటులో ప్రకటించారు. వాటిలో 2.90 కోట్ల నుంచి 5.16 కోట్ల రిటర్నులు సున్నా పన్ను చూపించినట్లు వెల్లడించారు. అంటే, దాదాపు 70శాతం రిటర్నుల నుంచి పన్ను ఏమీ లభించలేదు. పైగా, భారత జనాభాలో కేవలం నాలుగు శాతం నుంచి అయిదు శాతమే ఆదాయపన్ను రిటర్నులు సమర్పిస్తున్నారు. వారిలో సున్నా పన్ను కట్టిన వారి సంఖ్య తీసివేస్తే పన్ను కట్టేవారు 1.6శాతం నుంచి 2.15శాతమే ఉంటారు. ఈ అతి తక్కువ మంది తమ రిటర్నుల్లో చూపించిన రాబడి, ఆదాయ పన్ను గణంకాలతో ప్రజల ఆర్థిక స్థితిగతులను కొలవలేము. వాటిని గణించాలంటే కుటుంబ సంపాదనలను పరిగణనలోకి తీసుకోవాలి. భారత కుటుంబాల్లో చాలా వాటిలో ఆదాయం ఆర్జించేవారు ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఉంటారు. ఒక కంపెనీ సీఈఓ వేతనం సంవత్సరానికి అయిదు కోట్ల రూపాయలు అనుకుంటే, ఆ కుటుంబంలో ఇంకెవరూ ఆర్జనపరులు కాకపోయినా వారందరి ఆర్థిక స్థితి బాగుంటుంది. ఇంకో కుటుంబంలో ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువమంది ఆర్జిస్తూ అయిదు లక్షల రూపాయల నుంచి రూ.10 లక్షల వార్షిక ఆదాయం పొందితే, ఎక్కువ మంది సంపాదిస్తున్నారు కాబట్టి, ఆ కుటుంబ ఆర్థిక స్థితి బాగుందని చెప్పలేము. కుటుంబాల మొత్తం సంపాదనలు, వారి సంపదలు ఆర్థిక అసమానతలను నిజంగా ప్రతిఫలిస్తాయి.


సామాన్యులపై పెను భారం

కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష, పరోక్ష పన్నులు రెండింటి ద్వారా ఆదాయం లభిస్తుంది. ఆదాయ పన్ను, కార్పొరేట్‌ ట్యాక్స్‌ ప్రత్యక్ష పన్నుల్లో ఉంటాయి. జీఎస్టీ, కస్టమ్స్‌, ఎక్సైజ్‌ సుంకాలు పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నుల ద్వారా ఏటా దాదాపు రూ.16 లక్షల కోట్ల నుంచి రూ.17 లక్షల కోట్ల సుంకం వసూలవుతోంది. దీనిలో వ్యక్తిగత ఆదాయ పన్ను వాటా 50శాతం. ఇండియాలో 2016 నుంచి సంపద పన్ను రద్దయింది. దానికి బదులుగా కోటి రూపాయలకు పైన రాబడి ఉన్నవారు పన్ను చెల్లించాల్సిన ఆదాయంపై రెండు శాతం సర్‌ఛార్జి అదనంగా విధిస్తున్నారు. పన్నులు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గించే సాధనాలుగానూ ఉపయోగపడతాయి. ఈ క్రమంలో ప్రత్యక్ష పన్నులను పురోగామి పన్నులని, పరోక్ష సుంకాలను తిరోగామి పన్నులని పిలుస్తారు. ప్రజల ఆర్థిక అసమానతలను తగ్గించడానికి ప్రత్యక్ష పన్నులు తోడ్పడతాయి. ఇటీవలి కాలంలో జీఎస్‌టీ లాంటి పరోక్ష పన్నుల భారాన్ని ప్రజలపై అధికంగా మోపుతున్నారు. దీనివల్ల సామాన్యుల బతుకులు మరింత దుర్భరంగా మారుతున్నాయి. దీన్ని నివారించాలంటే పన్నులు హేతుబద్ధంగా, అసమానతలను తగ్గించేలా ఉండాలి.


నల్లధనం సమస్య

ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికి రిటర్నులు దాఖలు చేయనివారిని పర్యవేక్షించడం, ఎక్కువ విలువ కలిగిన లావాదేవీలను పరీక్షించడం తదితర చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. వీటివల్ల పన్ను ఆదాయం పెరిగినా, దేశంలో నల్లధనం సమస్య అధికమవుతుందన్నది కాదనలేని వాస్తవం. ఇటీవలి కాలంలో ఇండియాలో యూపీఐ లావాదేవీలు భారీగా జోరందుకొన్నాయి. మరోవైపు, భారత్‌లో 2023 నాటికి రూ.33.78 లక్షల కోట్ల నగదు చలామణీలో ఉంది. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థతో పాటు, కరెన్సీ ఎకానమీ సైతం జోరెత్తుతోంది. ఇది పన్ను ఎగవేతకు, నల్లధనానికి మూల కారణంగా నిలుస్తోంది. నల్లధనం దేశ జీడీపీలో ఎంత ఉందనే లెక్కలు తమ వద్ద లేవని కేంద్రం చెబుతోంది. 2011లో సీబీడీటీ నియమించిన కమిటీ దేశ జీడీపీలో నల్లధనం తొమ్మిది శాతం ఉంటుందని అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు 20శాతం అని, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) 50శాతం అని చెప్పాయి. కరెన్సీ, స్థిరాస్తి రూపంలో నల్లధనం ఉంటుంది. విదేశీ బ్యాంకులు, పన్ను స్వర్గధామ దేశాల్లోనూ కొంత దాస్తారు. విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తేవడానికి కేంద్రం 2015లో ఒక చట్టం చేసింది. ఆదాయపన్ను శాఖ ఏటా పన్ను ఎగవేతదారులను గుర్తించి సుంకం వసూలు చేస్తోంది. నల్లధనాన్ని నివారించగలిగితే దేశ ఆర్థిక స్వరూపం మారిపోతుంది. ప్రజలపై పన్ను భారం తగ్గించే వెసులుబాటు ప్రభుత్వానికి కలుగుతుంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భారత్‌ దౌత్యానికి అగ్ని పరీక్ష!

‣ పర్యావరణ పరిరక్షణకుహరిత ఇంధనం

‣ యుద్ధ జ్వాలల్లో భూగోళం

‣ మదుపరులకు మేలెంత?

‣ చైనా ఎత్తులకు పైయెత్తు!

Posted Date: 07-11-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం