• facebook
  • whatsapp
  • telegram

భారత్‌ దౌత్యానికి అగ్ని పరీక్ష!



భారత్‌ దౌత్య శక్తికి పెను సవాలు ఎదురైంది. మన దేశానికి చెందిన నౌకాదళ మాజీ అధికారులకు ఖతర్‌లో మరణ శిక్ష పడటం పిడుగుపాటుగా మారింది. ఒకపక్క ఇజ్రాయెల్‌ హమాస్‌ యుద్ధం కారణంగా పశ్చిమాసియా దేశాలతో దౌత్య సమతౌల్యం సమస్యగా మారిన సమయంలో విదేశాంగ శాఖకు ఇది ఊహించని పరిణామమే.


సహజవాయు సంపన్న దేశమైన ఖతర్‌లోని ఓ న్యాయస్థానం- గూఢచర్యం ఆరోపణలపై భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులకు మరణ దండన విధించింది. వీరంతా ఖతర్‌ సైనిక దళాలకు శిక్షణ, రవాణా సేవలు అందించే ‘అల్‌దహ్రా టెక్నాలజీస్‌’ అనే సంస్థకు సేవలు అందిస్తున్నారు. శిక్ష పడటానికి దారితీసిన ఆరోపణలు, కేసు వివరాలపై అటు ఖతర్‌, ఇటు భారత విదేశాంగ శాఖలు గుంభనంగా వ్యవహరిస్తున్నాయి. ఇక దోహా పాలకుల ఆధ్వర్యంలోని మీడియా మాత్రం... తమ దేశ నౌకాదళం కోసం ఇటలీ-జర్మనీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్న జలాంతర్గామి వివరాలను భారతీయులు ఇజ్రాయెల్‌కు అందజేస్తున్నారని ఆరోపించింది.


కొరవడిన పారదర్శకత

ఖతర్‌లో మన నౌకాదళ మాజీ సిబ్బందిపై విచారణలో పారదర్శకత కొరవడినట్లు విమర్శలున్నాయి. వీరిని 2022లో అక్కడి అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. దాదాపు రెండు నెలల తరవాత అతికష్టం మీద భారత దౌత్య సిబ్బందితో కలిసే వెసులుబాటు కల్పించారు. 2023 మార్చిదాకా వారిపై నేరాభియోగాలనూ వెల్లడించలేదు. అక్కడి ఓ ప్రాథమిక కోర్టు రెండు మూడుసార్లు జరిపిన విచారణలతోనే వారిపై అభియోగాలతో ఏకీభవిస్తూ శిక్షను ఖరారు చేసింది. ఈ కేసు వివరాలపై ఇటు మన విదేశాంగశాఖ, అటు ఖతర్‌ ప్రభుత్వం మౌనం వహిస్తున్నాయి. శిక్ష ఖరారయ్యాక తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. తమ ప్రాధాన్యాంశాల్లో ఈ కేసు పరిష్కారం కూడా ఉందంటూ విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ వెల్లడించారు. ఈ కేసులో అసలు ఇజ్రాయెల్‌కు గూఢచర్యం చేసే కోణమే లేదని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. కొన్నేళ్లుగా ఇదే తరహా నేరాభియోగాలపై కుల్‌భూషణ్‌ జాదవ్‌ పాకిస్థాన్‌ జైలులో మగ్గుతున్నారు. మన నౌకాదళ మాజీ అధికారులను రక్షించుకోవడానికి పరిమిత మార్గాలు కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకోవడంపై విదేశాంగ శాఖ, న్యాయ నిపుణులు కసరత్తు చేస్తున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో పోరాటం చేసే అవకాశాలూ ఉన్నాయి. పాక్‌లో చిక్కుకుపోయిన కుల్‌భూషణ్‌ కేసులో భారత్‌ ఈ మార్గంలోనే పోరాడింది. దౌత్యమార్గమే అన్నింటికంటే ఉత్తమమన్నది నిపుణులు అభిప్రాయం. లక్షల సంఖ్యలో భారతీయులు ఖతర్‌లోని వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నారు. వేల సంఖ్యలో భారతీయ కంపెనీలు అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఎల్‌ఎన్‌జీని దిగుమతి చేసుకొంటున్నాం. దోహాకు గణనీయంగా ఎగుమతులు చేసే దేశాల్లో భారత్‌ ఒకటి. ఉగ్రవాదానికి ఊతమిస్తోందనే ఆరోపణలపై- గతంలో సౌదీ, యూఏఈ, బహ్రెయిన్‌, ఈజిప్ట్‌ దేశాలు ఖతర్‌కు దారితీసే జల, వాయు, భూమార్గాలను దిగ్బంధించాయి. ఆ కష్ట సమయంలో కూడా మనదేశం నిర్మాణ సామగ్రి, ఆహార సరఫరాలో దోహాకు లోటు చేయలేదు. ఇరుదేశాల మధ్య రక్షణ సహకార రంగ ఒప్పందాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఖతర్‌ పాలకుల ద్వారా క్షమాభిక్షకు ప్రయత్నం చేయవచ్చనే అభిప్రాయాలున్నాయి. రంజాన్‌, ఖతర్‌ జాతీయ దినం వంటి ప్రత్యేక రోజుల్లో ఆ దేశ పాలకుడు వివిధ కేసుల్లో నిందితులకు శిక్ష తగ్గింపు, క్షమాభిక్ష వంటివి ప్రకటిస్తుంటారు. ఈ దశలో భారత్‌ దౌత్యం విజయవంతమైతే, గతంలో చేసుకొన్న ఖైదీల మార్పిడి ఒప్పందానికి అనుగుణంగా నౌకాదళ మాజీ సిబ్బందిని భారత్‌కు తీసుకొచ్చే అవకాశం ఉంది. గతంలో మరణ దండన పడినవారికి శిక్ష తగ్గించిన ఉదంతాలు సైతం ఉండటం కొంత ఉపశమనం కలిగించే అంశం.


భౌగోళిక రాజకీయ సంక్లిష్టతలు

ఒకపక్క ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య విషయంలో కెనడా నుంచి ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఇదే సమయంలో ఖతర్‌లో మన నౌకాదళ మాజీ ఉద్యోగులకు శిక్ష పడటం ఇబ్బందికరమైన అంశమే. ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడులను భారత్‌ ఖండించింది. మరోవైపు, హమాస్‌ తరఫున ఖతర్‌ మధ్యవర్తిత్వం నిర్వహిస్తోంది. భారత్‌కు వ్యతిరేక దేశాలైన తర్కియే, పాక్‌లతో అంటకాగుతూ... తాలిబన్‌, అల్‌ఖైదా, హమాస్‌ వంటి శక్తులకు ఆశ్రయం కల్పిస్తోందనే ఆరోపణలూ ఉన్నాయి. గల్ఫ్‌లో మన తరఫున మధ్యవర్తిత్వం నడిపించగల సౌదీ, యూఏఈలతో దోహాకు సత్సంబంధాలు లేకపోవడం ప్రతికూలాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ఆరోపణల తీవ్రత దృష్ట్యా భారత్‌కు మద్దతుగా అమెరికా ఎంతమేర జోక్యం చేసుకొంటుందో నిర్దిష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అమెరికాకు కీలకమైన స్థావరం ఖతర్‌లోనే ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య దౌత్య వ్యూహానికి పదును పెట్టడం ద్వారా ముందడుగు వేయడం సముచితం.


- పి.ఫణికిరణ్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పర్యావరణ పరిరక్షణకుహరిత ఇంధనం

‣ యుద్ధ జ్వాలల్లో భూగోళం

‣ మదుపరులకు మేలెంత?

‣ చైనా ఎత్తులకు పైయెత్తు!

Posted Date: 06-11-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం