• facebook
  • whatsapp
  • telegram

రోదసిలో భారత కీర్తిపతాకరోదసి రంగంలో భారత కీర్తి పతాకాన్ని చంద్రయాన్‌-3, ఆదిత్య ప్రయోగాలు ఉన్నత శిఖరాలకు చేర్చాయి. 2035కల్లా భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, 2040లోగా చంద్రుడిపై భారతీయుడు కాలు మోపడమే లక్ష్యాలుగా ముందుకు సాగాలని ప్రధాని మోదీ నిర్దేశించారు. వీటి సాధనలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ఇస్రోతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరముంది.


ఉపగ్రహ ప్రయోగాల ద్వారా మానవాళికి ఎన్నో ప్రయోజనాలు అందివచ్చాయి. అనేక రంగాల పురోగతికి ఈ ప్రయోగ ఫలితాలే ఆలంబనగా నిలిచాయి. అయితే, అంతరిక్ష ప్రయోగశాలలు, గ్రహాంతర అన్వేషణలవల్ల మనిషి జీవితానికి తక్షణ ప్రయోజనమేమిటనే ప్రశ్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తరచూ వినిపిస్తోంది. మానవాళి పురోగతికి, జీవితాలను మెరుగుపరచడానికి అంతరిక్ష పరిశోధనలు ఎంతగానో దోహదపడతాయి. ఉపగ్రహాలు భూ ఉపరితలం నుంచి 500-700 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యల్లో తిరుగుతుంటాయి. అయితే, 250 కిలోమీటర్ల దూరంలో ఉండే అంతరిక్ష పరిశోధనశాల నుంచి భూ పరిశోధనలను మరింత స్పష్టంగా పరిశీలించగలుగుతాం. ముఖ్యంగా వాతావరణ మార్పులు, వరదలు, అగ్ని పర్వతాల పేలుళ్లు వంటి విపత్తులను ఈ కేంద్రం నుంచి నిశితంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. కృత్రిమ మేధ(ఏఐ) వంటి సాంకేతికతలు ఇందుకు తోడ్పడుతున్నాయి. అక్కడ ఉండే ‘మైక్రో గ్రావిటీ’లో సూక్ష్మజీవులపై పరిశోధనలను మరింత లోతుగా చేపట్టడం ద్వారా వ్యాధి మూలాలను కనుగొనడం సాధ్యమవుతుంది. ఇది కొత్త ఔషధాల తయారీకి బాటలు పరుస్తుంది. ఇలా వైజ్ఞానిక పరంగానే కాదు, అంతరిక్ష పర్యాటకం వంటి కార్యక్రమాల ద్వారా వాణిజ్య పరంగానూ అభివృద్ధి సాధించడానికి రోదసి పరిశోధనలు దోహదపడతాయి.


చంద్రగ్రహ ప్రయోగాలు..

జాబిల్లిపైకి భారతీయుడిని పంపడం ద్వారా దేశ సాంకేతిక ప్రతిభ ప్రపంచ యవనికపై మరోమారు ప్రస్ఫుటమవుతుంది. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం పరికరాలతో పాటు వ్యోమగాములకు అవసరమయ్యే ఆహారం, ఔషధాలను అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. ఇంధన, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, నియంత్రణ, గమన నిర్దేశన (కంట్రోల్‌, నావిగేషన్‌ గైడెన్స్‌) వ్యవస్థల్లోనూ పురోగతి సాధించాల్సి ఉంది. ఈ అంశాల్లో సాధించే అభివృద్ధి కేవలం అంతరిక్ష పరిశోధనలకే ప్రయోజనకరమని అనుకుంటే పొరపాటే. మన దైనందిన జీవితాలకూ ఈ సాంకేతిక విజయాలు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. భవిష్యత్తులో ఇతర గ్రహాలపై పరిశోధనలకు చంద్రగ్రహ ప్రయోగాలు ఎంతగానో తోడ్పడతాయి. జాబిల్లిపైకి మానవ వలస, ఖనిజాన్వేషణ వంటి దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి ఈ ప్రయోగాలు ఎంతోగానో తోడ్పడతాయి. రోదసి ప్రయోగాల్లో రష్యా ఎంతగానో కృషి చేసింది. 1998 నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) పనిచేస్తోంది. రెండేళ్ల నుంచి చైనాకు చెందిన ట్యాంగాంగ్‌ స్పేస్‌ స్టేషన్‌ సైతం అందుబాటులో ఉంటోంది. అమెరికా పలు పర్యాయాలు చంద్రుడిపైకి విజయవంతగా మనుషులను పంపింది. ప్రస్తుతం ఆర్టిమిస్‌ మిషన్‌ ద్వారా అమెరికా చంద్రుడి ఉపరితలంపైకి మనుషులను పంపేందుకు ప్రయత్నిస్తోంది. చైనా 2030 నాటికి ఇద్దరు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపేందుకు ప్రయత్నాలు ఆరంభించింది. భారత్‌ సైతం ఈ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. 2007లో ‘శాటిలైట్‌ రికవరీ ఎక్స్‌పెరిమెంట్‌’ ద్వారా తొలి అడుగు వేసింది. ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన ‘గగన్‌యాన్‌ టీవీ-డి1’ రోదసి యాత్ర దిశగా మరింత విశ్వాసాన్ని పాదుగొల్పింది.


మనుషులతో కూడిన గగన్‌యాన్‌ పూర్తి విజయం సాధించిన తరవాత అంతరిక్ష కేంద్రం నిర్మాణం కోసం మరిన్ని సాంకేతిక రంగాల్లో నైపుణ్యం సాధించవలసిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా రోదసిలో పరికరాలను అమర్చడం, దీర్ఘకాలంపాటు మానవ నివాసానికి అనుకూలంగా ‘వాతావరణ నియంత్రణ, జీవనాధార వ్యవస్థ (ఈసీఎల్‌ఎస్‌ఎస్‌)’ను బలోపేతం చేసుకోవడం, మానవ వ్యర్థాల నిర్వహణవంటి అనేక విషయాల్లో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి. అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు కొన్ని నెలలపాటు ఉంటారు. కాబట్టి, అందుకు అవసరమైన సదుపాయాలు, ఆహార నిల్వ, రోదసి వైద్యం వంటి అంశాల్లో ఇండియా మరింత పురోగతి సాధించడం ఎంతో అవసరం. చంద్రుడిపై భారతీయుడు కాలు మోపడం కోసం భారత్‌ మరిన్ని అంశాలు/రంగాల్లో జోరందుకోవాలి. శక్తిమంతమైన వాహక నౌకలను తయారు చేసుకోవడంతో పాటు అదనపు బరువు నియంత్రణకు కావలసిన ల్యాండింగ్‌ సాంకేతికతలను, తిరిగి భూమిపైకి రావడానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి పరచుకోవాలి. చంద్రుడి నుంచి తిరిగి వచ్చే యాత్రలో ఉష్ణ నియంత్రణ ఎంతో కీలకమైన అంశం. ఎందుకంటే ఆ మార్గంలో కొన్ని వేల డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలను ఎదుర్కొని క్షేమంగా రావలసి ఉంటుంది. డేటారిలే ఉపగ్రహాల సాయంతో నిరంతర సమాచార వ్యవస్థను నెలకొల్పుకొనే విషయంలోనూ ముందంజ వేయాలి. ఇటువంటి సంక్లిష్ట ప్రయోగాలకు అవసరమైన అత్యాధునిక హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన సైతం ఎంతో ముఖ్యం. అంతరిక్ష ప్రయోగాలు కాబట్టి ఇతర దేశాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి.


సమష్టి కృషితోనే..

భారత్‌ ఇప్పటివరకు రోదసి రంగంలో గణనీయమైన పురోగతి సాధించింది. అయితే, అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, చంద్రుడిపైకి భారతీయుడిని పంపే లక్ష్యాలను అందుకోవడానికి సమగ్ర కృషి అవసరం. ఈ రెండు లక్ష్యాలు అత్యంత క్లిష్టమైనవే అయినప్పటికీ, అసాధ్యమైనవేమీ కావన్న సంగతిని గుర్తించాలి. వీటి సాధనకు ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు దేశవ్యాప్తంగా పనిచేస్తున్న వివిధ ఇంజినీరింగ్‌, రక్షణ సంస్థలు, వైద్య పరిశోధనాలయాలు, పరికరాల తయారీ పరిశ్రమలు తోడ్పాటు అందించాలి. ఇవి సాకారమైన నాడు- భారతదేశ కీర్తి పతాక విశ్వ వేదికపై మరింతగా రెపరెపలాడుతుంది.


నాంది పలికిన ఇస్రో..

అంతరిక్ష కేంద్రం లక్ష కిలోలకు పైగా బరువు ఉంటుంది. కాబట్టి, భారత్‌ దీని నిర్మాణం కోసం పరికరాలను అత్యంత శక్తిమంతమైన రాకెట్ల ద్వారా దశలవారీగా నింగిలోకి పంపవలసి ఉంటుంది. అలా పంపిన పరికరాలు క్రమపద్ధతిలో ‘ఆటోమేటిక్‌’గా జతకట్టేలా చూసుకోవాలి. ఇందుకోసం ఒక నిర్దిష్ట ప్రదేశానికి పరికరాలను చేర్చి, వాటిని అత్యంత కచ్చితత్వంతో ఒకదానికి ఒకటి అమర్చే     సామర్థ్యాలను మెరుగుపరచుకోవడం ఆవశ్యకం. ఇస్రో ఆ దిశగా ‘స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (స్పేడెక్స్‌)తో నాంది పలికింది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రష్యా దూకుడుతో అణ్వస్త్ర ఆందోళన

‣ ఉచిత న్యాయం... అవగాహనే కీలకం

‣ డోక్లామ్‌పై కన్నేసిన డ్రాగన్‌

‣ ప్రాజెక్టు కుశ.. గగనతల రక్షణ కవచం!

‣ వాతావరణ మార్పులతో దిగుబడి తెగ్గోత

‣ అసమానతలపై పోరుకు హేతుబద్ధ పన్నులు

‣ భారత్‌ దౌత్యానికి అగ్ని పరీక్ష!

Posted Date: 18-11-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని