• facebook
  • whatsapp
  • telegram

రష్యా దూకుడుతో అణ్వస్త్ర ఆందోళన



సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందం (సీటీబీటీ) నుంచి రష్యా ఇటీవల బయటకు వచ్చింది. దీనివల్ల అగ్రరాజ్యాల మధ్య అణ్వస్త్ర తయారీ పోటీ మళ్ళీ మొదలయ్యే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇది ప్రపంచ శాంతిని ప్రశ్నార్థకంగా మారుస్తుంది.


ఉక్రెయిన్‌పై యుద్ధం వల్ల పాశ్చాత్య దేశాలతో రష్యాకు దూరం మరింత పెరుగుతోంది. అప్పట్లో సోవియట్‌ యూనియన్‌, అమెరికాల నడుమ ఏళ్ల తరబడి నెలకొన్న ప్రచ్ఛన్నయుద్ధ ఛాయలు మళ్ళీ కనిపిస్తున్నాయి. సోవియట్‌ పతనం అనంతరం ఏకైక అగ్రరాజ్యంగా అమెరికా అవతరించింది. గత దశాబ్ద కాలంగా రష్యా, చైనాలు అమెరికాకు సవాలు విసురుతున్నాయి. పూర్వ వైభవం సాధించాలన్న వ్యూహంలో భాగంగా పుతిన్‌ కొన్ని నెలల క్రితమే సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందం (సీటీబీటీ) నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు. అమెరికా రూపొందిస్తున్న డబ్ల్యూ93 అణు వార్‌హెడ్‌ వాషింగ్టన్‌ నౌకాదళానికి తురుఫుముక్కగా మారనుంది. భారీ విధ్వంసాన్ని సృష్టించగల ఈ అణ్వాయుధాన్ని త్వరలోనే పరీక్షించే అవకాశముందని రష్యా అనుమానిస్తోంది. అమెరికాతో పోల్చుకుంటే రష్యా వద్ద అణ్వాయుధాలు అధికంగానే ఉన్నాయి. అయితే, ఆధునికత విషయంలో మాస్కో వెనకంజలో ఉంది. ఇవన్నీ పుతిన్‌ను సీటీబీటీ ఒప్పందం నుంచి వెనక్కు వచ్చేలా చేశాయన్నది విశ్లేషకుల భావన.


సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందం (సీటీబీటీ) 1996లోనే ఆమోదం పొందింది. దానిపై దాదాపు 187 దేశాలు సంతకాలు చేశాయి. అయితే, 178 దేశాలే అమలు చేయాలని నిర్ణయించాయి. భారత్‌, పాక్‌తో పాటు మొత్తం తొమ్మిది దేశాలు సీటీబీటీపై సంతకాలు చేయలేదు. అణ్వస్త్ర పరీక్షతో పాటు అణ్వాయుధాలు లేని ప్రపంచాన్ని ఆవిష్కరించాలని భారత్‌ సుదీర్ఘకాలంగా డిమాండ్‌ చేస్తోంది. 1954లో అమెరికా ‘కేజిల్‌ బ్రావో’ పేరుతో మార్షల్‌ దీవుల వద్ద అణుపరీక్షలు నిర్వహించింది. ఆ పేలుడు తీవ్రత హిరోషిమా కన్నా అనేక వందల రెట్లు ఎక్కువగా ఉండటంతో అంతర్జాతీయ సమాజం భయంతో వణికిపోయింది. ఆ పరీక్షల వల్ల వెలువడిన అణుధార్మికత అనేక ఏళ్ల పాటు ఆ దీవులతో పాటు సముద్ర జలాలపై ప్రభావం చూపింది. ఆ ప్రయోగం అనంతరం అప్పటి భారత ప్రధాని నెహ్రూ అణు పరీక్షలను తీవ్రంగా వ్యతిరేకించారు. అణ్వస్త్రాలను కలిగిన దేశాలు అవి లేనివాటిపై ఆధిపత్యం చలాయించే ప్రమాదం ఉందని భారత్‌ వాదించింది. ఈ క్రమంలో 1964లో చైనా అణు పరీక్ష జరిపింది. దాంతో పొరుగుదేశంతో ప్రమాదముందని గ్రహించిన ఇండియా- సీటీబీటీపై సంతకం చేసేందుకు నిరాకరించింది. 1974లో పోఖ్రాన్‌లో మొదటిసారి అణుపరీక్షలు నిర్వహించిన అనంతరం రెండు దశాబ్దాలకుపైగా అణ్వాయుధాలను తయారు చేయాలన్న అంశంపై ఇండియా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 1998లో చైనా సాయంతో పాక్‌ అణ్వాయుధాలు సమకూర్చుకోనుందన్న నిఘావర్గాల సమాచారంతో అప్పటి ప్రధాని వాజ్‌పేయీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. పోఖ్రాన్‌లో మరోసారి పరీక్షలు నిర్వహించి అణ్వాయుధ పాటవ దేశంగా భారత్‌ అవతరించింది. అయితే, మొదటగా అణ్వాయుధాలు ఉపయోగించబోమన్న విధానాన్ని ఇండియా అనుసరిస్తోంది.


సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందం ప్రపంచశాంతికి దోహదపడిందని చెప్పవచ్చు. 1996కు ముందు వేలాది అణుపరీక్షలు జరిగాయి. ఒప్పందం తరవాత అణ్వస్త్ర పరీక్షల సంఖ్య చాలా వరకు తగ్గింది. సీటీబీటీ నుంచి రష్యా వైదొలగడంతో అణ్వాయుధాల రేసు మళ్ళీ ప్రారంభమయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌, ఉత్తరకొరియా లాంటి రష్యా మిత్రదేశాలు మాత్రం క్రెమ్లిన్‌ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆయా దేశాల అణ్వాయుధాల అభివృద్ధికి రష్యా సహకరించే అవకాశముంది. కొంతకాలంగా రష్యా తన అణు సామర్థ్యాన్ని పెంపొందించుకుంటోంది. ఖండాంతర క్షిపణి సర్మత్‌ను తయారు చేసింది. క్రూజ్‌ క్షిపణి బురెవెస్నిక్‌ను పరీక్షించింది. ఇవి రెండూ అణు వార్‌హెడ్‌లను తీసుకెళ్ళగలవు. రాబోయే కాలంలో వాటి ఉత్పత్తిని పెంచేందుకు రష్యా సిద్ధమవుతోంది. అణ్వాయుధాలను మరింతగా అభివృద్ధి చేయాలన్న రష్యా ఆశయాలకు సీటీబీటీ అడ్డంకిగా మారిందని కొద్దిరోజులుగా ఆ దేశ రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు ఆ ఒప్పందం నుంచి బయటకు రావడంతో రష్యా తన సొంత భూభాగంపై మళ్ళీ అణుపరీక్షలు నిర్వహించే అవకాశముంది. మరిన్ని అణ్వాయుధాలను తయారుచేసుకోవడం పాశ్చాత్య కూటమి నుంచి తమకు రక్షణ కవచంగా నిలుస్తుందని రష్యా అధినేత పుతిన్‌ విశ్వసిస్తున్నారు. క్రెమ్లిన్‌ నిర్ణయంతో అమెరికా సైతం తిరిగి అణ్వస్త్ర రేసులోకి వచ్చే ప్రమాదం ఉంది. ఈ పరిణామాలు ప్రపంచశాంతికి ఎంతమాత్రం మంచివి కాదు.


- కె.శ్రీధర్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉచిత న్యాయం... అవగాహనే కీలకం

‣ డోక్లామ్‌పై కన్నేసిన డ్రాగన్‌

‣ ప్రాజెక్టు కుశ.. గగనతల రక్షణ కవచం!

‣ వాతావరణ మార్పులతో దిగుబడి తెగ్గోత

‣ అసమానతలపై పోరుకు హేతుబద్ధ పన్నులు

‣ భారత్‌ దౌత్యానికి అగ్ని పరీక్ష!

Posted Date: 11-11-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం