• facebook
  • whatsapp
  • telegram

ప్రపంచ ఆర్థికానికి యుద్ధ గాయాలు!



విదేశీ వాణిజ్యం.. ప్రపంచ దేశాల్లో పేదరికం, అసమానతల నిర్మూలనకు ఎంతగానో తోడ్పడుతుంది. ఇటీవలి కాలంలో దానికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. తాజా యుద్ధాలతో అంతర్జాతీయ వాణిజ్యానికి సమస్యలు తలెత్తే ముప్పు పొంచి ఉంది. ఇలాంటి అడ్డంకుల్ని అధిగమించి ముందడుగు వేయాలి.


గతంలో ప్రపంచ యుద్ధాలు, ఉగ్రవాదం, స్వీయ వాణిజ్య రక్షణ ధోరణులు అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీశాయి. అయినప్పటికీ అది 1960 నుంచి 20 రెట్లు పెరిగి ప్రపంచ ప్రజల ఆదాయ వృద్ధికి దోహదం చేసింది. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా మళ్ళీ వెనకంజ వేసింది. సంక్షోభం నుంచి తేరుకోవడానికి వివిధ దేశాలు దిగుమతులపై ఆంక్షలు విధించాయి. తమ ఎగుమతులు పెంచుకోవడానికి సబ్సిడీలను ఇబ్బడిముబ్బడిగా పెంచేశాయి. ఆపైన కొవిడ్‌ మహమ్మారి విరుచుకుపడి అంతర్జాతీయ సరఫరా గొలుసులను విచ్ఛిన్నం చేసింది. తరవాత ఉక్రెయిన్‌ యుద్ధం ఇంధన, ఆహార సరఫరాలను దెబ్బతీసింది. ప్రస్తుత ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం ముదిరితే చమురు సరఫరాలు మరింత విచ్ఛిన్నమై ప్రపంచార్థికాన్ని దెబ్బతీస్తాయనే ఆందోళన పెరుగుతోంది.


ప్రత్యామ్నాయాల అన్వేషణ

మారిన పరిస్థితుల్లో కొన్ని దేశాలు కూటమి కట్టి ఉమ్మడి భావనకు దూరంగా జరగడం సమస్యను తీవ్రతరం చేస్తోంది. ఆర్థిక సామర్థ్యం దెబ్బతినడం, అంతర్జాతీయ వాణిజ్యం విచ్ఛిన్నం కావడం వంటి లోపాలు పెచ్చరిల్లాయి. అక్కడికీ కొవిడ్‌ సమయంలో భారత్‌ వంటి దేశాలు టీకాలు, మందులను పేద దేశాలకు అందుబాటులోకి తెచ్చి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నించాయి. ఉక్రెయిన్‌ యుద్ధంతో ఆహార ధాన్యాల ఎగుమతులు దెబ్బతినగా ప్రత్యామ్నాయాల అన్వేషణ ఊపందుకుంది. ఉదాహరణకు ఇథియోపియాకు ఉక్రెయిన్‌ నుంచి గోధుమ ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయినా, అర్జెంటీనా నుంచి తన అవసరాలలో 20 శాతాన్ని దిగుమతి చేసుకుని కొంత తేరుకోగలిగింది. అర్జెంటీనా నుంచి ఇథియోపియా అంతకుముందెన్నడూ గోధుమలను కొనుగోలు చేయలేదని ఇక్కడ గమనించాలి. సరఫరా గొలుసులు విచ్ఛిన్నమైనా ప్రత్యామ్నాయాల్ని కనుగొనడం ఇక్కడ విశేషం. మొత్తంమీద స్వేచ్ఛా వాణిజ్యానికి విఘాతం కలగడం ప్రపంచార్థికానికి మంచిది కాదు. దేశాలన్నీ రెండు కూటములుగా విడిపోతే ప్రపంచ జీడీపీ అయిదు శాతం మేర కోసుకుపోతుందని ప్రపంచ వాణిజ్య సంస్థ హెచ్చరించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అంచనా ప్రకారమైతే అది రెండు నుంచి ఏడు శాతందాకా ఉంటుంది. అంతర్జాతీయ వాణిజ్యం క్షీణిస్తే వర్ధమాన దేశాలకు వస్తుసేవలు, సాంకేతికతల సరఫరా దెబ్బతింటుంది. ఆ దేశాల్లో పేదరికం, ఆర్థిక అసమానతలు పెరిగిపోతాయి. దీన్ని నివారించడానికి అంతర్జాతీయ వాణిజ్యం సజావుగా జరిగేలా చూడటం ప్రపంచ దేశాల కర్తవ్యం. ఇందుకోసం పకడ్బందీ వాణిజ్య అజెండాను చేపట్టాలి. ముఖ్యంగా డిజిటల్‌, హరిత, సమ్మిళిత అంతర్జాతీయ వాణిజ్య విధానాన్ని ప్రోత్సహించాలి. ఈ విభాగాల్లో వాణిజ్య వృద్ధి ప్రపంచార్థికాన్ని కొత్త మలుపు తిప్పుతుంది. అదే సమయంలో దేశాలు పటిష్ఠమైన సామాజిక భద్రతా పథకాలను చేపట్టాలి. నైపుణ్య శిక్షణకు భారీ పెట్టుబడులు పెట్టాలి. రుణ వితరణ, గృహ నిర్మాణం, మౌలిక వసతుల విస్తరణకు సమర్థ  విధానాలు చేపట్టి ఆచరించాలి. సిబ్బంది వేర్వేరు పరిశ్రమలు, కంపెనీలు, వృత్తులకు మారే అవకాశాన్ని కల్పించాలి. ఇంతవరకు అంతర్జాతీయ సరఫరా గొలుసులకు దూరంగా ఉన్న దేశాలకు వాటిలో భాగస్వామ్యం కల్పించాలి. ఆ దేశాలలో పరిశ్రమలు, వ్యాపార సంస్థలు నెలకొల్పి ఉత్పత్తిలోనూ భాగస్వాములను చేయాలి. అది పునఃప్రపంచీకరణకు దారి తీసి అభివృద్ధిలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. సరఫరా గొలుసులు పునరుత్తేజితమై అభివృద్ధి పుంజుకొంటుంది. ప్రపంచాన్ని పీడిస్తున్న తీవ్ర ఆర్థిక సమస్యలకు అంతర్జాతీయ వాణిజ్యం చక్కని పరిష్కారమవుతుంది. దేశాల మధ్య వాణిజ్యం, సాంకేతిక, ఆర్థిక సహకారం లేనిదే వాతావరణ మార్పులను నిరోధించలేం. కర్బన ఉద్గారాల తటస్థతను సాధించలేం. కర్బన ఉద్గారాలను తగ్గించే సాంకేతికతలు వర్ధమాన దేశాలకూ అందుబాటులోకి రావాలి. కర్బన ఉద్గార రహిత నూతన హరిత ఆర్థిక వ్యవస్థ ఏర్పడితే మార్కెట్‌ విస్తీర్ణం, అంతర్జాతీయ వాణిజ్యం కొత్త శిఖరాలకు చేరతాయి. సౌర శక్తి ఉత్పాదన వ్యయం 2010కన్నా ఇప్పుడు 90 శాతం తగ్గిపోయింది. చైనా తదితర దేశాల నుంచి సౌర ఫలకాలు, సంబంధిత సాంకేతికతలు విరివిగా, చవకగా ఎగుమతి కావడం వల్ల వర్ధమాన దేశాలూ సౌర శక్తి ఉత్పాదనలో పాలుపంచుకోగలుగుతున్నాయి. కొవిడ్‌, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల సరకుల ఎగుమతులు, దిగుమతులు తగ్గినా సేవల వాణిజ్యం మాత్రం విస్తరిస్తోంది. వీడియో కాల్స్‌ ద్వారా అందించే కన్సల్టెన్సీ వంటి డిజిటల్‌ సేవల ఎగుమతుల విలువ 2022లో 3.8 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. అది ఆ ఏడాది మొత్తం సేవల ఎగుమతిలో 54 శాతానికి సమానం.


సుస్థిర భవిత కోసం..

రాజకీయ, సైనిక ఉద్రిక్తతల మధ్య కూడా వాణిజ్య సహకారం సుసాధ్యమే. పర్యావరణానికి హానికరమైన రీతిలో చేపల వేట నిషేధం, ఆహార భద్రత, మేధా హక్కుల బదిలీ వంటి అంశాలపై 2022లో డబ్ల్యూటీఓ సభ్య దేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వీటిని వివిధ దేశాల ప్రభుత్వాలు సమర్థంగా ఆచరణలోకి తీసుకురావాలి. 2024 ఫిబ్రవరిలో జరిగే డబ్ల్యూటీఓ మంత్రిత్వ సమావేశంలో భావి కార్యాచరణకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలి. అంతర్జాతీయ వాణిజ్య వృద్ధికి తోడ్పడే విధానాలు చేపట్టాలి. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను కొత్త శిఖరాలకు తీసుకెళ్ళాలి. వాతావరణ మార్పుల నిరోధానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లు కూడా సుస్థిర భవిత కోసం కలిసికట్టుగా కదలాలి. మారుతున్న ప్రపంచానికి అనువైన నిర్ణయాలు తీసుకుని, వాటి అమలుకు చురుగ్గా పురోగమించడం ప్రపంచ దేశాల కర్తవ్యం.


డిజిటల్‌ మార్గం

ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా, అమెరికా, ఐరోపా సమాఖ్యతోపాటు 90 దేశాలు డిజిటల్‌ వాణిజ్యానికి మౌలిక నిబంధనల రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. అంతర్జాతీయంగా ఆమోదం పొందిన నియమ నిబంధనలు వాణిజ్య వ్యయాన్ని తగ్గించి లాభసాటిగా మారుస్తాయి. ముఖ్యంగా చిన్న పరిశ్రమలకు ఇది ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. చిన్న వ్యాపారాలు, మహిళా వ్యవస్థాపకులను డిజిటల్‌ మార్గంలో అంతర్జాతీయ ఉత్పత్తి, సరఫరా గొలుసుల్లో భాగస్వాములను చేయడం- ఆదాయ అసమానతలను తొలగించి ఆర్థిక స్వాతంత్య్రానికి బాటలు వేస్తుంది. అంతర్జాతీయ వాణిజ్య ఫలాలు అన్ని వర్గాలకూ అందుతాయి. ఈ విషయంలో వియత్నాం అగ్రగామిగా ఉంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స్వేచ్ఛకు సంకెళ్లు.. ప్రజాస్వామ్యానికే చేటు!

‣ రోదసిలో భారత కీర్తిపతాక

‣ రష్యా దూకుడుతో అణ్వస్త్ర ఆందోళన

‣ ఉచిత న్యాయం... అవగాహనే కీలకం

‣ డోక్లామ్‌పై కన్నేసిన డ్రాగన్‌

Posted Date: 18-11-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం