• facebook
  • whatsapp
  • telegram

స్వేచ్ఛకు సంకెళ్లు.. ప్రజాస్వామ్యానికే చేటు!పత్రికలు, ప్రసార మాధ్యమాలు స్వేచ్ఛగా పనిచేయగల సమాజంలోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. దేశంలోని మీడియా సంస్థలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. జర్నలిస్టులు బెదిరింపులు, దాడులు, హత్యలకు గురికావడం సర్వసాధారణంగా మారిపోయింది. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా...


ప్రజాస్వామ్యానికి పత్రికలు నాలుగో స్తంభమని చెబుతారు. దేశంలోని పత్రికలు ఎలాంటి ఒత్తిళ్లకూ తావులేకుండా స్వేచ్ఛగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న సందేశంతో ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) ఏటా నవంబరు 16న జాతీయ పత్రికా దినోత్సవం నిర్వహిస్తోంది. బ్రిటిష్‌ హయాములో దేశ జనులలో స్వాతంత్య్రోద్యమ కాంక్షను రగిలించడంలో పత్రికలు పోషించిన పాత్ర ఎనలేనిది. ఎన్నటికీ మరువరానిది. విభిన్న ప్రాంతాలు, భాషలు, సంస్కృతీ సంప్రదాయాలు కలిగిన ఉపఖండంలో- ప్రజలందర్నీ స్వాతంత్య్రోద్యమం దిశగా ఏకోన్ముఖం చేసింది పత్రికలే. నేడు గాడి తప్పుతున్న ప్రజాస్వామ్యానికి కాపలాదారుగా వ్యవహరిస్తున్న మీడియా- అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వ్యవస్థల్లో, సమాజంలో వేళ్లూనుకొన్న అవినీతి, అక్రమాలు వెలుగులోకి రాకుండా మీడియా సంస్థల గొంతు నులిమే చర్యలు కొంతకాలంగా ఉద్ధృతమవుతున్నాయి.


పెరుగుతున్న దాడులు

దేశంలో పాత్రికేయులపై దాడులు, కేసులు, హత్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. 2022లో దేశవ్యాప్తంగా 194 మంది జర్నలిస్టులపై దాడులు జరిగాయి. వీటిలో అత్యధికంగా జమ్మూకశ్మీర్‌లో 48 ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ సంస్థల నుంచే కాకుండా రాజకీయ నాయకులు, నేరస్థులు, అవినీతిపరుల నుంచీ వారికి బెదిరింపులు వస్తున్నాయి. కొన్ని పాలక పక్షాలు జర్నలిస్టులను తమ దారికి తెచ్చుకొనేందుకు పోలీసు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వంటి వ్యవస్థలను వారిపైకి ఉసిగొల్పుతున్నట్లు ఆరోపణలున్నాయి. కొన్నిసార్లు వారిని నిర్బంధించి వేధిస్తున్నారు. ఒక్కోసారి వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు పాత్రికేయులు ప్రాణాలకు తెగించి మరీ సాహసించాల్సి వస్తోంది. అలా దేశంలో 1992 నుంచి ఇప్పటివరకు సుమారు 91 మంది పాత్రికేయులు, పత్రికా సిబ్బంది దారుణ హత్యలకు గురైనట్లు ‘కమిటీ టూ ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌’ వెల్లడించింది. ప్రభుత్వ నిర్ణయాలను, వ్యవస్థల్లో జరిగే అవినీతిని, అపారదర్శకతను, నేర ఘటనలను వెలుగులోకి తీసుకురావడమే ఇటువంటి దాడులకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. అక్కసుతో మీడియా సంస్థలు, జర్నలిస్టులపై చేసే దాడులు అంతిమంగా ప్రజాస్వామ్య వ్యవస్థకే చేటు చేస్తాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత్‌లో అధికారికంగా 1,46,045 పత్రికలు, 905 శాటిలైట్‌ టీవీ చానెళ్లు నమోదయ్యాయి. తుపానులు, వరదలు వంటి విపత్తులు ఘర్షణల్లో సమాచార సేకరణకు వెళ్ళి ఎంతోమంది పాత్రికేయులు ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో కొవిడ్‌ ఉద్ధృతి వేళ సుమారు 500 మంది పాత్రికేయులు మృతిచెందినట్లు నెట్‌వర్క్‌ ఆఫ్‌ విమెన్‌ ఇన్‌ మీడియా ఇండియా (ఎన్‌డబ్ల్యూఎంఐ) లెక్కగట్టింది. అంతటి సంక్షోభ సమయంలో కరోనా కేసులు, మరణాలు, ఆసుపత్రుల్లో అందుతున్న సేవలపై వాస్తవాలను వెలుగులోకి తీసుకురాకుండా మీడియా సంస్థలపై ఒత్తిళ్లు రావడం- దేశ ప్రతిష్ఠను మసకబార్చింది.


భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు అద్దంపట్టాల్సిన మీడియా సంస్థలు నేడు అనేక దేశాల్లో ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేయాల్సి వస్తోంది. భారత్‌లోనూ పత్రికా స్వేచ్ఛ ‘నేతిబీరలో నెయ్యి’ అన్న చందంగానే ఉందని ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీ (డబ్ల్యూపీఎఫ్‌ఐ) చాటుతోంది. 180 దేశాలతో కూడిన ఈ ర్యాంకింగ్‌ జాబితాలో భారత్‌ స్థానం 161. పొరుగునున్న పాకిస్థాన్‌ (150), తాలిబన్‌ పాలనలోని అఫ్గానిస్థాన్‌ (152)లు మనకంటే మెరుగైన స్థానాల్లో నిలిచాయి. 2022లో 150వ స్థానంలో నిలిచిన ఇండియా ఈసారి 11 స్థానాలు దిగజారిపోవడానికి పలు కారణాలను డబ్ల్యూపీఎఫ్‌ఐ విశ్లేషించింది. ముఖ్యంగా జర్నలిస్టులపై దేశద్రోహం కేసులు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు... పలు ఆన్‌లైన్‌ వార్తాసంస్థలపై కఠిన చర్యలకు దిగడం, కశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను వెలుగులోకి తీసుకురాకుండా పాత్రికేయులపై ఆంక్షలు, దాడులు, రాజకీయ పరమైన ఒత్తిళ్లు వంటివి చోటుచేసుకున్నాయని ఆ వేదిక పేర్కొంది.


కఠిన నిబంధనలు..

దిల్లీ పోలీసులు ఇటీవల కొంతమంది మీడియా సిబ్బందిపై దాడులు చేసి, వారి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. పాత్రికేయుల విధి నిర్వహణకు ఎంతో కీలకమైన డిజిటల్‌ సాధనాలను స్వాధీనం చేసుకుని, శోధించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆక్షేపించింది. ఈ విషయంలో మీడియా సిబ్బంది ప్రయోజనాలను కాపాడేందుకు అత్యంత పారదర్శకంగా మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇటువంటి మార్గదర్శకాల్లో- న్యాయ ఉత్తర్వులు(జ్యుడీషియల్‌ వారెంట్‌) లేకుండా మీడియా సిబ్బంది డిజిటల్‌ సాధనాలను స్వాధీనం చేసుకోరాదన్న నిబంధన విధించడం ఎంతో అవసరం. మీడియా సిబ్బందికి, వారి డిజిటల్‌ ఉపకరణాల్లోని డేటాకు భద్రత కల్పించాలి. మీడియా సంస్థలు, పాత్రికేయుల భావవ్యక్తీకరణ స్వేచ్ఛ సంకెళ్లు తెంచుకున్న నాడే- దేశంలో ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది.


- తమ్మిశెట్టి రఘుబాబు
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రోదసిలో భారత కీర్తిపతాక

‣ రష్యా దూకుడుతో అణ్వస్త్ర ఆందోళన

‣ ఉచిత న్యాయం... అవగాహనే కీలకం

‣ డోక్లామ్‌పై కన్నేసిన డ్రాగన్‌

Posted Date: 18-11-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని