• facebook
  • whatsapp
  • telegram

పంట వ్యర్థాలతో లాభాల సాగుదేశ రాజధాని దిల్లీ సహా పలు నగరాలు, పట్టణాల్లో వాయు కాలుష్యం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏటా చలికాలంలో పంట వ్యర్థాల దహనం వల్ల దిల్లీలో వాయు నాణ్యత భారీగా పడిపోతోంది. ఫలితంగా ప్రజలను అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి.


వాయు కాలుష్యం దేశ ప్రజల ఆరోగ్యానికి యమపాశంలా మారింది. ఉత్తరాది రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను రైతులు పొలాల్లోనే కాల్చడం తీవ్ర వాయు కాలుష్యానికి దారితీస్తోంది. పంట వ్యర్థాలను పొలాల్లో కాల్చడం చాలా దేశాల్లో లేనేలేదు. బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాల నుంచీ వెలువడే విషవాయువులు గాలిని కాలుష్యమయం చేస్తున్నాయి. వీటికితోడు దేశంలో రోడ్లపై తిరుగుతున్న కోట్లాది వాహనాలు, పట్టణాల్లో పరిశ్రమల నుంచి వెలువడే పొగ, గృహాల్లో ఘన వ్యర్థాల దహనం తదితరాలన్నీ కలిసి ఇండియాలో వాయు నాణ్యతను కుంగదీస్తున్నాయి. ఈ కాలుష్యం పర్యావరణంపైనా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా, భూతాపం పెరిగి కుండపోత వానలు, ఆకస్మిక వరదలు, కరవు పరిస్థితులు చుట్టుముడుతున్నాయి.


భూసార క్షీణత

పంట వ్యర్థాలను పొలాల్లోనే కాల్చడం వల్ల తలెత్తే వాయు కాలుష్య దుష్ఫలితాల మూలంగా భారత్‌ ఏటా రెండు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం చవిచూడాల్సి వస్తున్నట్లు అమెరికాకు చెందిన ‘అంతర్జాతీయ ఆహార విధానాల పరిశోధనా సంస్థ’ వెల్లడించింది. ఇండియాలోని పలు సంస్థలతో కలిసి ఆ సంస్థ పరిశోధన చేపట్టింది. వాయుకాలుష్యం వల్ల ఉత్తరాది రాష్ట్రాల ప్రజల ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. పలు రకాల ఆరోగ్య సమస్యలూ వారిలో తలెత్తుతున్నాయి. చిన్నపిల్లలపైనా ప్రభావం పడుతోంది. దేశ రాజధాని దిల్లీలో గాలి విషపూరితం కావడానికి 24శాతం మేర పంట వ్యర్థాల దహనమే కారణమని సుప్రీంకోర్టుకు అమికస్‌ క్యూరీ అపరాజితాసింగ్‌ ఇటీవల నివేదించారు. ‘ప్రతి ఒక్కరికీ వాయు కాలుష్యానికి కారణాలేమిటో తెలిసినా ఏమీ చేయరు... ప్రతీదానికీ కోర్టు జోక్యం కోసం ఎదురుచూస్తుంటారు’ అని సుప్రీంకోర్టు ఇటీవల ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల దిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో దాదాపు 35వేల పొలాల్లో పంట వ్యర్థాలను కాల్చిన ఘటనలు నమోదయ్యాయి. వాటిలో అత్యధికంగా పంజాబ్‌లోనే 23వేల వరకు ఉన్నాయి. దేశ రాజధానికి చుట్టుపక్కల ఉన్న హరియాణా, ఉత్తర్‌ ప్రదేశ్‌, పంజాబ్‌ వంటి రాష్ట్రాల్లో పంటకోతల అనంతరం వ్యర్థాల దహనం పెద్ద సమస్యగా మారింది. దీన్నుంచి బయటపడటానికి రైతులను చైతన్యపరచి, ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించడానికి 2018-22 మధ్యకాలంలో కేంద్రం మూడు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను ఆయా రాష్ట్రాలకు ఇచ్చింది. అయినా, సమస్య పరిష్కారం కాలేదు. పంట వ్యర్థాల దహనం వల్ల భూసారం సైతం దెబ్బతింటుందని కేంద్ర వ్యవసాయశాఖ హెచ్చరిస్తోంది. పంట వ్యర్థాల దహనంతో పాటు దిల్లీ రోడ్లపై వేల సంఖ్యలో తిరిగే వాహనాలు, పరిశ్రమలు, రోడ్లను ఊడ్చటం, ఇతర వ్యర్థాల దహనం, నిర్మాణ రంగం నుంచి వెలువడే కాలుష్యం తదితరాలూ దేశ రాజధానిలో వాయు నాణ్యతను కుంగదీస్తున్నాయి. శీతాకాలంలో వాయుకాలుష్యం పెరుగుతున్నందు వల్ల జాతీయ వాతావరణ మార్పులు-ప్రజారోగ్య కార్యక్రమాన్ని కేంద్రం ఇటీవల ప్రారంభించింది. జిల్లా, నగర స్థాయి ప్రణాళికలు రూపొందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది.


వాణిజ్య ఉత్పత్తులకు అవకాశం

పంట కోసిన తరవాత మిగిలిన వ్యర్థాలను భూమిలో కలియదున్నే అనేక రకాల యంత్రాలు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. వాటిని విస్తృతంగా రైతులకు చేరువ చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు కోరుతున్నారు. చైనాలో తినేందుకు ఉపయోగించే పుల్లలు, చెంచాలను వరిగడ్డితో తయారుచేసే పరిశ్రమలున్నాయి. ఇలా వరిగడ్డిని వాణిజ్య ఉత్పత్తులకు మార్చే పరిశ్రమలు పెద్దయెత్తున ఏర్పాటయ్యేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. దీనివల్ల పంట వ్యర్థాల దహనం సమస్య తగ్గుతుంది. రైతులకూ ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుంది. కూలీల కొరత వల్ల రైతులు యంత్రాల సాయంతో పంట కోతలు సాగిస్తున్నారు. దీనివల్ల పశుగ్రాసం కొరత ఏర్పడుతోంది. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికీ అనుసంధానిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. నానాటికీ అధికమవుతున్న వాహనాలూ భారీయెత్తున కర్బన ఉద్గారాలను వెలువరిస్తున్నాయి. దీన్ని నివారించాలంటే విద్యుత్‌ వాహనాల వినియోగం పెరిగేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి. దీనికోసం తగిన ప్రోత్సాహకాలు అందించాలి. శిలాజ ఇంధనాల వినియోగాన్ని క్రమంగా తగ్గించి, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు సమధిక దృష్టి సారించడమూ అత్యావశ్యకం. ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు తోడు, వాయు కాలుష్యం కారణంగా తలెత్తే దుష్పరిణామాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించినప్పుడే క్షేత్రస్థాయిలో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి.


- మంగమూరి శ్రీనివాస్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రపంచ ఆర్థికానికి యుద్ధ గాయాలు!

‣ స్వేచ్ఛకు సంకెళ్లు.. ప్రజాస్వామ్యానికే చేటు!

‣ రోదసిలో భారత కీర్తిపతాక

‣ రష్యా దూకుడుతో అణ్వస్త్ర ఆందోళన

‣ ఉచిత న్యాయం... అవగాహనే కీలకం

‣ డోక్లామ్‌పై కన్నేసిన డ్రాగన్‌

Posted Date: 22-11-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని