• facebook
  • whatsapp
  • telegram

దిగుబడులపై కరవు ప్రభావం



వాతావరణ మార్పులతో ప్రకృతి విపత్తుల విజృంభణ పెరిగింది. భూసారం దెబ్బతింటోంది. అస్థిర వర్షపాతం, దళారుల మోసాలు, సరైన విపణి వ్యవస్థ, నిల్వ సదుపాయాలు లేకపోవడం, కూలీ ధరలు పెరగడం.. ఇవన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్‌లో రైతులను కుంగదీస్తున్నాయి. 


వాతావరణ పరిస్థితులు గాడితప్పి రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం 2015-22 మధ్య కాలంలో కుండపోత వానలు, వరదలు తదితర జలావరణ సంబంధిత విపత్తుల వల్ల 3.3 కోట్ల హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయి. అదే సమయంలో 3.5 కోట్ల హెక్టార్లలో పంటలను కరవు దెబ్బతీసింది. ఈ సంవత్సరం ఎన్‌నినో వల్ల దేశీయంగా చాలాచోట్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీనివల్ల చాలా ఏళ్ల తరవాత ఇండియాలో ఖరీఫ్‌ దిగుబడులు తరుగుపడనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ ముందస్తు అంచనాలు వెల్లడిస్తున్నాయి.


జలవనరుల నిర్వహణ

కరవు పరిస్థితుల వల్ల భారత్‌లో నిరుడు జూన్‌-అక్టోబర్‌ మధ్య కాలంనాటి ఖరీఫ్‌ సీజన్‌తో పోలిస్తే ఈసారి వరి దిగుబడి 3.8శాతం, పప్పుగింజలు 6.6శాతం, తృణధాన్యాలు 6.5శాతం మేర తగ్గనున్నాయి. మొత్తంగా ఈ ఖరీఫ్‌లో ఆహార ధాన్యాల దిగుబడి అయిదు శాతం మేర తగ్గి, 14.8 కోట్ల టన్నులుగా ఉండవచ్చని కేంద్రం అంచనా వేసింది. ఇందులో వరి దిగుబడి 10.6కోట్ల టన్నులుగా ఉండవచ్చు. నిరుడు ఖరీఫ్‌తో పోలిస్తే ఇది నలభై లక్షల టన్నులు తక్కువ. నూనె గింజలు 50లక్షల టన్నులు, పత్తి ఇరవై లక్షల బేళ్లు, చెరకు దిగుబడి అరవై లక్షల టన్నుల మేర తగ్గవచ్చు. కర్ణాటక, పశ్చిమ్‌ బెంగాల్‌, ఝార్ఖండ్‌, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కేరళల్లో కొన్నిచోట్ల ఈసారి దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే 20 నుంచి 59 శాతం మేర తక్కువ వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లో 37శాతం తక్కువ వర్షపాతం సంభవించింది. సాగు పరంగా కీలకంగా నిలిచే ఆంధ్రప్రదేశ్‌లో వరి, పప్పు ధాన్యాల దిగుబడులు గణనీయంగా ప్రభావితమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 60శాతానికి పైగా జనాభా ఆదాయం, ఉపాధికి వ్యవసాయమే ప్రాథమిక ఆధారం. వరితో పాటు చెరకు, పత్తి, మామిడి, వేరుశెనగ, పొద్దుతిరుగుడు తదితరాలు అత్యధికంగా సాగయ్యే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. ప్రస్తుతం అటవీ నిర్మూలన అడ్డూ ఆపూ లేకుండా సాగుతోంది. జలవనరులు దురాక్రమణకు గురవుతున్నాయి. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు తదితర తక్కువ నీటిని వినియోగించుకునే పంటల సాగును పాలకులు ప్రోత్సహించడం లేదు. వరి, చెరకు లాంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలు అధికంగా సాగవుతున్నాయి. మరోవైపు జలవనరుల నిర్వహణా గాడితప్పుతోంది. వీటన్నింటి వల్లా ఆంధ్రప్రదేశ్‌లో కరవు తీవ్రత అధికమవుతోంది.


సత్వర కార్యాచరణ

వాటర్‌షెడ్‌ అభివృద్ధి పథకాల్లో రైతుల క్రియాశీల భాగస్వామ్యం, ఆయా పథకాల అమలుపై పర్యవేక్షణ, వ్యవసాయ సంస్థలతో వాటిని అనుసంధానించడం, జలవనరుల సుస్థిర వినియోగం వంటి కీలక అంశాలను ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. వాటర్‌షెడ్‌ పథకాల్లో భూసారం, జల సంరక్షణ కార్యకలాపాలు సక్రమంగా అమలు కావడం లేదు. ప్రభుత్వాలు వెంటనే వీటిపై దృష్టి సారించాలి. కరవు ప్రభావాన్ని సమగ్రంగా అంచనా వేసి, దాన్ని తగ్గించేందుకు సరైన ప్రణాళికలు రూపొందించి సమర్థంగా అమలు చేయాలి. పంటల బీమా, కరవును తట్టుకొనే వంగడాల ఉత్పత్తి, జల సంరక్షణ, కరవు పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించడం, నదుల అనుసంధానం తదితరాలనూ చేపట్టాలి. కరవు ప్రభావ తగ్గింపు ప్రణాళికల రూపకల్పన, వాటి అమలులో ప్రజల భాగస్వామ్యానికీ తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కరవును తట్టుకొనే వంగడాల ఉత్పత్తి, ప్రకృతి సిద్ధ వ్యవసాయంపై పరిశోధనలకు ప్రభుత్వాలు తగిన ఆర్థిక సాయం అందించాలి. నీటి సంరక్షణకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఆ జలాన్ని సమర్థంగా వినియోగించుకోవడానికి సమర్థ నీటి పారుదల వ్యవస్థలను రూపొందించాలి. వాతావరణ మార్పులవల్ల తలెత్తే కరవును ఎదుర్కోవడంలో స్వచ్ఛంద సంస్థలను, ప్రైవేటు రంగాన్ని భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. రైతులు సైతం వైవిధ్యమైన, కరవును తట్టుకొనే పంటలు సాగు చేయాలి. వాన నీటిని సంరక్షించుకోవాలి. నీటి పారుదల, భూసార పరిరక్షణలోనూ జాగ్రత్త వహించాలి. పంటలకు తప్పకుండా బీమా చేయించాలి. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ప్రభుత్వాల చొరవ, ప్రజల భాగస్వామ్యం సమకూరితేనే కరవు పరిస్థితులను అధిగమించగలం. అప్పుడే సుస్థిర వ్యవసాయానికి, ఆహార భద్రతకు భరోసా దక్కుతుంది. అటువైపు సత్వర కార్యాచరణ ప్రస్తుతం అత్యావశ్యకం.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ విపత్తుల కట్టడికి పటిష్ఠ వ్యూహం

‣ అంకురాలే ఆలంబనగా ఆర్థికాభివృద్ధి..

‣ పంట వ్యర్థాలతో లాభాల సాగు

‣ ప్రపంచ ఆర్థికానికి యుద్ధ గాయాలు!

‣ స్వేచ్ఛకు సంకెళ్లు.. ప్రజాస్వామ్యానికే చేటు!

Posted Date: 24-11-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం