• facebook
  • whatsapp
  • telegram

తుంబా రాకెట్‌ ప్రయోగానికి 60 ఏళ్లు



భారతదేశ తొలి రాకెట్‌ ప్రయోగానికి 60 ఏళ్లు పూర్తయ్యియి. సాధారణ రాకెట్ల ప్రయోగంతో మొదలైన భారత అంతరిక్ష ప్రస్థానం ఇప్పటిదాకా ఎన్నో ఘనతర లక్ష్యాల్ని సాధించింది. మున్ముందు మరిన్ని ఉన్నత లక్ష్యాల్ని సాధించే దిశగా దూసుకెళుతోంది.


కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని తుంబా గ్రామంలో ఏర్పాటైన తుంబా ఈక్వటోరియల్‌ రాకెట్‌ లాంచింగ్‌ స్టేషన్‌ (టీఈఆర్‌ఎల్‌ఎస్‌) నుంచి 1963 నవంబరు 21న ఫ్రెంచ్‌ పేలోడ్‌తో కూడిన అమెరికాకు చెందిన నైక్‌ అపాచీ రాకెట్‌ను ప్రయోగించారు. విజయవంతంగా సాగిన ఆ ప్రయోగం భారత అంతరిక్ష కార్యక్రమాలకు నాంది పలికింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి అప్పటికి రెండు దశాబ్దాలు కూడా పూర్తికాకముందే చోటుచేసుకున్న ఆ ఉదంతం అంతరిక్ష విజయాలకు బాటలు పరచింది. అప్పట్లో కేరళలో అంతరిక్ష కేంద్రం ఏర్పాటు కోసం అధికారులు ఎనిమిది స్థలాలను పరిశీలించారు. అన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించిన తరవాత తిరువనంతపురం సమీపంలోని తుంబా గ్రామం రాకెట్‌ ప్రయోగాలకు అనువుగా ఉందని గుర్తించి, ఎంపిక చేశారు. ఎగువ వాతావరణ అధ్యయనాల కోసం టీఈఆర్‌ఎల్‌ఎస్‌ను ఏర్పాటు చేశారు. తుంబా కేంద్రం నుంచి మొదటిసారిగా చేపట్టిన రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించేందుకు అప్పట్లో కేరళ అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేశారు. అప్పటి శాసనసభ్యులుగా ఉన్న జోసెఫ్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ ‘కేరళ రాష్ట్రం నుంచి తొలి రాకెట్‌ ప్రయోగం జరగనుంది. దీనిని వీక్షించాలని అనుకుంటున్నాం. అందుకు సమయం కేటాయించి అనుమతించాలి’ అని అభ్యర్థించారు. దీనిపై అసెంబ్లీ స్పీకర్‌ స్పందించి సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ కార్యాలయంలోని మినిట్స్‌ దస్త్రాల్లో ఈ అంశాన్ని నమోదు చేశారు.


అమెరికా, రష్యా (యూఎస్‌ఎస్‌ఆర్‌), ఫ్రాన్స్‌, జపాన్‌, జర్మనీ, యూకే, తదితర దేశాల శాస్త్రవేత్తలు రాకెట్లకు సంబంధించిన ప్రయోగాలు నిర్వహించడానికి తుంబా ఈక్వటోరియల్‌ రాకెట్‌ లాంచింగ్‌ స్టేషన్‌లోని వసతులను వినియోగించుకుంటున్నారు. తుంబా నుంచి ఇప్పటిదాకా పెద్దసంఖ్యలో సౌండింగ్‌ రాకెట్‌ ప్రయోగాలు చేపట్టారు. రోహిణి సౌండింగ్‌ రాకెట్స్‌ (ఆర్‌ఎస్‌ఆర్‌) పేరుతో మొదలైన వీటి ప్రయోగాలు ఇన్నేళ్లకాలంలో గణనీయమైన పురోగతి సాధించాయి. ప్రస్తుతం పనిచేస్తున్న రోహిణి సౌండింగ్‌ రాకెట్లు ఆర్‌హెచ్‌-200, ఆర్‌హెచ్‌-300, ఆర్‌హెచ్‌-560 మరెంతో భిన్నమైనవి. కాలక్రమంలో భారత అంతరిక్ష పరిశోధకులు ఎన్నో ప్రయోగవాహక నౌకల పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సౌండింగ్‌ రాకెట్లు, రోహిణి, మేనక లాంచర్లు, ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ-ఎం3, ఎల్‌వీఎం-3 ప్రయోగ వాహక నౌకలను అభివృద్ధి చేశారు. ఏరోనాటిక్స్‌, ఏవియానిక్స్‌ తదితర రంగాల్లో పరిశోధనలను వేగిరపరిచారు. పలురకాల ప్రయోగ వాహకనౌకలు, ఉపగ్రహాలు, పేలోడ్లకు సంబంధించిన సాంకేతికతలను అభివృద్ధి చేశారు.


ఇన్నేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) దేశం గర్వించదగిన సంస్థగా ఎదిగింది. ప్రపంచం ముందు భారత ప్రతిష్ఠను ఇనుమడింపజేసింది. వాతావరణ పరిశోధనలకు సంబంధించిన సౌండింగ్‌ రాకెట్లతో మొదలైన ప్రయోగాలు.. భారీ వాహకనౌక ఎల్‌వీఎం-3ను అంతరిక్షంలోకి విజయవంతంగా పంపించే స్థాయికి చేరాయి. దిగువ భూకక్ష్య నుంచి మార్స్‌ దాకా ప్రయోగాలు సాగాయి. చంద్రుడు, సూర్యుడితోపాటు పలు గ్రహాలను అధ్యయనం చేసేందుకు చేపట్టిన ప్రయోగాలూ విజయవంతమయ్యాయి. ఈ క్రమంలో లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌ సెంటర్‌, శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ అంతరిక్ష కేంద్రం, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌, టెక్నాలజీ వంటి సంస్థలెన్నో ఏర్పాటయ్యాయి. ఇస్రో ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. ప్రపంచ దేశాలతో పోటీపడుతూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ రోదసి పరుగులో దూసుకెళ్తోంది. అంతరిక్షాన్ని సామాజికాభివృద్ధికి ఉపయోగించుకోవాలనే ఇస్రో దార్శనికతకు ఏళ్ల క్రితం పడిన బీజాలు, ఇప్పటివరకు ఎన్నో ఫలాలను అందించాయి. రోదసిలోకి వెళ్ళేందుకు స్వదేశీ సామర్థ్యం పెరిగింది. అంతరిక్ష సంబంధిత సేవలు దేశంలో ఎన్నో మార్పులకు కారణమయ్యాయి. మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌, ఆస్ట్రోశాట్‌, చంద్రయాన్‌ వంటి మిషన్లు అందించిన ఫలితాల స్ఫూర్తితో భవిష్యత్తులో చేపట్టే ప్రయోగాల ద్వారా మరెన్నో అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని ఆశిద్దాం.


- దేవేంద్రరెడ్డి
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బైడెన్‌ - జిన్‌పింగ్‌.. మాటామంతీ

‣ దిగుబడులపై కరవు ప్రభావం

‣ విపత్తుల కట్టడికి పటిష్ఠ వ్యూహం

‣ అంకురాలే ఆలంబనగా ఆర్థికాభివృద్ధి..

‣ పంట వ్యర్థాలతో లాభాల సాగు

‣ ప్రపంచ ఆర్థికానికి యుద్ధ గాయాలు!

‣ స్వేచ్ఛకు సంకెళ్లు.. ప్రజాస్వామ్యానికే చేటు!

Posted Date: 24-11-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం