• facebook
  • whatsapp
  • telegram

బైడెన్‌ - జిన్‌పింగ్‌.. మాటామంతీఅమెరికా, చైనా అధ్యక్షుల మధ్య జరిగిన భేటీ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. రాజకీయ, ఆర్థిక రంగాల్లో ఉభయ దేశాల సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో బైడెన్‌, జిన్‌పింగ్‌ల సమావేశం ఆసక్తి రేకెత్తించింది. ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార వేదిక (అపెక్‌) శిఖరాగ్ర సభ సందర్భంగా శాన్‌ఫ్రాన్సిస్కోలో వీరిద్దరూ భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు.


అమెరికా దృష్టి ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధాలపై కేంద్రీకృతమైంది. ఈ యుద్ధాల్లో అమెరికా సైన్యం నేరుగా పాల్గొనకపోయినా ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌లకు పూర్తిస్థాయిలో అండదండలనిస్తోంది. ఇక చైనా ఆర్థిక సవాళ్లతో సతమతమవుతోంది. కొవిడ్‌ లాక్‌డౌన్ల కారణంగా దెబ్బతిన్న డ్రాగన్‌ ఆర్థికం ఇప్పటికీ గాడిన పడలేదు. ఆ దేశ ఆంతరంగిక సుస్థిరతపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఆర్థిక, రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలోనే అమెరికాతో సంబంధాలు క్షీణించాయి. ఆర్థిక రంగంలో డ్రాగన్‌ స్వప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తూ అనుచిత వాణిజ్య కార్యకలాపాలకు పాల్పడుతోందని అమెరికా ఆగ్రహిస్తోంది. బీజింగ్‌కు ఆధునిక సాంకేతికతల ఎగుమతిపై ఆంక్షలు విధించింది. చైనాకు అమెరికా, ఐరోపాల నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులూ (ఎఫ్‌డీఐ) తగ్గిపోయాయి.


ఉద్రిక్త వాతావరణం

రాజకీయంగా తైవాన్‌ విషయంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తైవాన్‌పై చైనా దండయాత్రకు పాల్పడవచ్చని అమెరికా ఆందోళన చెందుతుంటే, తైవాన్‌ స్వాతంత్య్రం ప్రకటిస్తుందని డ్రాగన్‌ అనుమానిస్తోంది. రష్యా, ఇరాన్‌లతో చైనా సైనిక సంబంధాలూ అగ్రరాజ్యానికి ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో అమెరికా ప్రాబల్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా చైనా ముందుకెళుతోందని వాషింగ్టన్‌ కలవరపడుతోంది. తైవాన్‌ సమీపంలో చైనా యుద్ధనౌకలు, విమానాలు, సైనిక దళాలను మోహరించడంపై చర్చల్లో బైడెన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తైవాన్‌ ఆత్మరక్షణకు పూర్తి సహాయసహకారాలు అందిస్తామని జిన్‌పింగ్‌కు స్పష్టం చేశారు. తైవాన్‌పై దండెత్తే ఉద్దేశం తమకు లేదని జిన్‌పింగ్‌ స్పష్టం చేస్తూనే చైనా-తైవాన్‌లు శాంతియుతంగా పునరేకం కావాలని ఉద్ఘాటించారు. ఏతావతా తైవాన్‌పై ఇప్పట్లో యుద్ధానికి దిగే అవకాశం లేదని అమెరికా, చైనాలు పరస్పరం భరోసా ఇచ్చుకున్నాయి. అయినా తైవాన్‌పై ఉద్రికతలు చాలాకాలమే కొనసాగేట్లున్నాయి. తైవాన్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న సమయంలో చైనా విధానాలు బాగా ప్రభావం చూపనున్నాయి.


అగ్రనేతల భేటీ వల్ల రెండు దేశాలమధ్య దౌత్యపరంగా ఉన్నత స్థాయి సంబంధాల పునరుద్ధరణ జరిగింది. అమెరికా కాంగ్రెస్‌ దిగువ సభ మాజీ స్పీకర్‌ నాన్సీ పెలోసీ 2022 ఆగస్టులో తైవాన్‌ను సందర్శించినప్పటి నుంచి అమెరికా, చైనా సేనల మధ్య మాటామంతీ కరవైంది. సైనిక దళాల మధ్య సంప్రదింపులను పునరుద్ధరించాలని భేటీలో బైడెన్‌, జిన్‌పింగ్‌లు నిర్ణయించారు. సంప్రదింపులు నిలిచిపోయిన రెండేళ్లలో ఆసియా-పసిఫిక్‌లో, ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంపై అమెరికన్‌ విమానాలను చైనా 180సార్లు అటకాయించిందని అమెరికా రక్షణ శాఖ తెలిపింది. సముద్రంలో ఫిలిప్పీన్స్‌, ఆస్ట్రేలియా యుద్ధ నౌకలకూ చైనా నౌకలు అడ్డుతగులుతున్నాయి. ఈ రెండూ అమెరికాకు వ్యూహపరమైన మిత్రులే. చైనా విమానాలు, నౌకల దుందుడుకు చేష్టలు అదుపు తప్పి ఏదో ఒకరోజు పూర్తిస్థాయి సంఘర్షణ ప్రజ్వరిల్లే ప్రమాదం ఉంది. దాన్ని నివారించడానికి రెండు దేశాల సైన్యాల మధ్య నేరుగా చర్చలు జరగడం అత్యంత ఆవశ్యకం.


జిన్‌పింగ్‌ పర్యటన సందర్భంగా అమెరికాతో ఆర్థిక సంబంధాల బలోపేతానికి గట్టి ప్రయత్నమే జరిగింది. హైటెక్‌ కంపెనీలు సహా 400 అమెరికన్‌ సంస్థల సీఈఓలతో జిన్‌పింగ్‌ విందు సమావేశం జరిపారు. అమెరికాకు చైనా మిత్రుడిగా, భాగస్వామిగా నిలవడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలు బలపడటానికి వీలుగా వచ్చే అయిదేళ్లలో 50,000 మంది అమెరికన్‌ విద్యార్థులకు తమ దేశంలో విద్యావకాశాలు కల్పిస్తామని జిన్‌పింగ్‌ ప్రతిపాదించారు. జిన్‌పింగ్‌ ప్రసంగానికి అమెరికన్‌ సీఈఓలు లేచినిలబడి చప్పట్లు కొట్టి హర్షించినా, చైనా నుంచి పెట్టుబడుల తరలింపును వారు నిలిపేస్తారా అనేది సందేహమే. పశ్చిమాసియా పరిస్థితి గురించీ అగ్రనేతలు చర్చించారు. ఇరాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడకుండా నివారించడానికి చైనా తన పలుకుబడిని ఉపయోగించాలని బైడెన్‌ కోరారు. నేటి ప్రపంచంలో చైనా, అమెరికా సమాన భాగస్వాములని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. ప్రధాన రాజ్యాలుగా తమ పాత్రను బాధ్యతగా పోషించాలని సూచించారు. చైనా-అమెరికాల మధ్య పోటీ ఉందని బైడెన్‌ పేర్కొనగా, ఇలాంటి అభిప్రాయం అవాంఛనీయ పరిణామాలకు దారితీస్తుందని జిన్‌పింగ్‌ హెచ్చరించారు. ప్రపంచంలో అమెరికా ప్రాధాన్యాన్ని దెబ్బతీసే ఉద్దేశం తమకు లేదని, చైనా ప్రగతిని అమెరికా కూడా ఆహ్వానించాలని కోరారు.


కవ్వింపు చర్యలు

ఏదిఏమైనా, పసిఫిక్‌ మహాసముద్రంలో చైనా నౌకల కవ్వింపు చర్యలు ఆగిపోతాయనే నమ్మకం అమెరికాకు కలగడం లేదు. దక్షిణ చైనా సముద్రమంతా తనదేనంటూ అక్కడి దీవుల్లో చైనా తిష్ఠ వేయడం తీర ప్రాంత దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. చైనా ముప్పును ఎదుర్కోవడానికి అమెరికా, ఫిలిప్పీన్స్‌, జపాన్‌, దక్షిణ కొరియా, బ్రిటన్‌లు పసిఫిక్‌లో గతవారం సైనిక, నౌకాదళ విన్యాసాలు జరిపాయి. ఈ ప్రాంతాన్ని విడిచివెళ్ళే ఉద్దేశం తమకు లేదని బైడెన్‌ స్పష్టం చేశారు. ఆసియా-పసిఫిక్‌ దేశాలలో పెట్టుబడులను పెంచుతామని ప్రకటించారు. ప్రపంచంలో వివిధ చోట్ల జరుగుతున్న సాయుధ సంఘర్షణలు ప్రధాన దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్‌- బైడెన్‌ భేటీ స్వాగతించదగిన పరిణామమే. కానీ, దానివల్ల కొత్తగా సహకార వృద్ధి ఏదీ జరగలేదు. ఇప్పటికే దిగజారిన సంబంధాలు మరింత క్షీణించకుండా నిలువరించడానికి ఈ భేటీలో ప్రయత్నం జరిగిందని చెప్పాలి. అది సంఘర్షణ నివారణ ప్రయత్నమే తప్ప అమెరికా, చైనాల మధ్య సహకార పునరుద్ధరణకు పెద్దగా తోడ్పడేది కాదు.


రసాయనాల ఎగుమతి

ఎంతోమంది మరణాలకు కారణమైన ఫెంటనిల్‌ వంటి ప్రమాదకర సింథటిక్‌ మాదక ద్రవ్యాల తయారీకి ఉపకరించే రసాయనాల ఎగుమతిని నివారిస్తామని చైనా హామీ ఇవ్వడం విశేష పరిణామం. మెక్సికోలో ఫెంటనిల్‌ను తయారుచేసే మాదకద్రవ్య ముఠాలకు చైనా నుంచి పెద్దయెత్తున రసాయన ముడిసరకులు సరఫరా అవుతున్నాయని అమెరికా అధికారులు వెల్లడించారు. మెక్సికో నుంచి ఫెంటనిల్‌ అమెరికాకు అక్రమ రవాణా అవుతోంది. దీన్ని నిరోధించాలని అమెరికా, చైనాలు అంగీకరించాయి. కృత్రిమ మేధ (ఏఐ) వల్ల పొంచివున్న ప్రమాదాలను రెండు దేశాలూ గుర్తించినా ఏఐ భద్రతపై ద్వైపాక్షిక ఒప్పందమేదీ కుదరలేదు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ దిగుబడులపై కరవు ప్రభావం

‣ విపత్తుల కట్టడికి పటిష్ఠ వ్యూహం

‣ అంకురాలే ఆలంబనగా ఆర్థికాభివృద్ధి..

‣ పంట వ్యర్థాలతో లాభాల సాగు

‣ ప్రపంచ ఆర్థికానికి యుద్ధ గాయాలు!

‣ స్వేచ్ఛకు సంకెళ్లు.. ప్రజాస్వామ్యానికే చేటు!

Posted Date: 24-11-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని