• facebook
  • whatsapp
  • telegram

డ్రాగన్‌ దూకుడుకు ముకుతాడు


ప్రపంచ శాంతి, సుస్థిరతలకు చైనా విస్తరణవాదం సమీప భవిష్యత్తులో పెనుముప్పుగా పరిణమించే ప్రమాదం కనిపిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ ఇప్పటికే చెలరేగిపోతోంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో దాని దూకుడు పలు దేశాలకు ఆందోళన కలిగిస్తోంది.


ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దుందుడుకు విధానాలను ఇండియా మొదటి నుంచీ నిశితంగా గమనిస్తోంది. పలు ప్రాంతీయ, అంతర్జాతీయ వేదికలపై అవసరమైన సందర్భాల్లో దాని తీరును ఎండగడుతోంది. ఇండొనేసియా రాజధాని జకార్తా వేదికగా ఇటీవల జరిగిన ఆసియాన్‌ రక్షణ మంత్రుల సమావేశం(ఏడీఎంఎం-ప్లస్‌)లోనూ ఆ వైఖరిని కొనసాగించింది. అంతర్జాతీయ జలాల్లో రవాణా, వాణిజ్య కార్యకలాపాలు స్వేచ్ఛగా జరగాల్సిన ఆవశ్యకతను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జకార్తాలో నొక్కిచెప్పారు. ప్రపంచ ప్రమాణాలకు అన్ని దేశాలూ కట్టుబడి ఉండాలంటూ హితవు పలికారు. దక్షిణ చైనా సముద్రంలో తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్నది సుస్పష్టం. ప్రాంతీయంగా బీజింగ్‌కు ముకుతాడు వేసేందుకు ఏడీఎంఎం-ప్లస్‌ కృషి చేయాలని రాజ్‌నాథ్‌ పరోక్షంగా పిలుపిచ్చారు. ఈ కూటమిలో 10 ఆసియాన్‌ దేశాలతోపాటు ఇండియా, చైనా, ఆస్ట్రేలియా, జపాన్‌, న్యూజిలాండ్‌, దక్షిణ కొరియా, రష్యా, అమెరికా భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి.


చైనా వితండవాదం

బీజింగ్‌ వ్యవహార శైలితో దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు నానాటికీ పెరుగుతున్నాయి. పొరుగున ఉన్న చిన్న దేశాలను డ్రాగన్‌ తన సైనిక బలంతో వేధింపులకు గురిచేస్తోంది. వాటి సార్వభౌమత్వానికి సవాళ్లు రువ్వుతోంది. శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం 2016లో ఇచ్చిన తీర్పును పెడచెవిన పెడుతూ- దాదాపుగా దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదేనంటూ బీజింగ్‌ వితండవాదం చేస్తోంది. ఆ సాగరంలో ఫిలిప్పీన్స్‌ నౌకలు వాటి సొంత మిలిటరీ ఔట్‌పోస్ట్‌లకు వెళ్ళకుండా చైనా తీర రక్షక దళాలు ఇటీవల అడ్డుకోవడంతో తీవ్ర ఘర్షణాత్మక వాతావరణం తలెత్తింది. బీజింగ్‌, మనీలా మధ్య ఇలాంటి ఉద్రిక్తతలు తరచూ కనిపిస్తున్నాయి. అమెరికా, జపాన్‌ల నుంచి మద్దతు అందుతుండటంతో ఫిలిప్పీన్స్‌ కూడా ఈ వ్యవహారంలో వెనకడుగు వేయడం లేదు. దక్షిణ చైనా సముద్రంతోపాటు తూర్పు చైనా సాగరమూ ఇండో-పసిఫిక్‌లో భాగమే. శాంతియుతంగా నడుచుకోకుండా, పూర్తిస్థాయిలో సాయుధ ఘర్షణకు దిగకుండా ఈ ప్రాంతంలో గ్రే జోన్‌ ఎత్తుగడలతో బీజింగ్‌ ముందుకెళ్తోంది. తద్వారా ఆయా దేశాలపై ఒత్తిడి పెంచి తన రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. హిందూ మహాసముద్ర ప్రాంతం (ఐఓఆర్‌)లో తన నౌకాదళ బలగాల మోహరింపును పెంచుతోంది. ఈ పరిణామాలన్నీ విశ్వశాంతికి విఘాతం కలిగించే ముప్పున్నవే. వాటిపై పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేసిన ఇండియా- ఇటీవలి కాలంలో కొంత దూకుడు పెంచింది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో బీజింగ్‌ దుందుడుకుతనాన్ని రాజ్‌నాథ్‌ ఇటీవల బహిరంగంగా తూర్పారపట్టారు. ఆ దేశం పేరును ఆయన నేరుగా ప్రస్తావించి విమర్శలు గుప్పించడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ హరికుమార్‌ కూడా బీజింగ్‌పై కొన్నాళ్ల కిందట తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ చైనా సముద్రంలో దాని దుందుడుకుతనం కారణంగా ప్రాంతీయంగా శాంతిభద్రతలకు భంగం కలిగే ముప్పుందని హెచ్చరించారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఇండో-పసిఫిక్‌లో కీలక పాత్ర పోషించాలని దిల్లీ భావిస్తోంది. గ్లోబల్‌ సౌత్‌ నాయకత్వ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని కోరుకుంటోంది. ఆ ప్రణాళికల్లో భాగంగానే ప్రస్తుతం చైనాతో వ్యవహారాల్లో కఠినంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి.


రక్షణ బంధాల బలోపేతం

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో మరింత కీలకంగా ఎదిగే వ్యూహంలో భాగంగా ఆసియాన్‌ దేశాలతో సైనిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇండియా ఇటీవలి సంవత్సరాల్లో దృష్టి సారించింది. మన దేశం నుంచి బ్రహ్మోస్‌ క్షిపణుల కొనుగోలుకు ఫిలిప్పీన్స్‌ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. వియత్నాం, ఇండొనేసియాలు సైతం రక్షణ రంగంలో దిల్లీతో కీలక ఒప్పందాల ఖరారుకు చేరువలో ఉన్నాయి. తేజస్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు మలేసియా ఆసక్తి కనబరిచింది. ఇండియా, ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్‌) నిరుడు తమ బంధాన్ని సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి ఉన్నతీకరించుకున్నాయి. జకార్తాలో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌తో సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలతోపాటు ఇండో-పసిఫిక్‌ భద్రత, ప్రాంతీయంగా వ్యూహాత్మక సహకారం పెంపుపై రాజ్‌నాథ్‌ చర్చించారు. తాజాగా హస్తిన వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 2+2 చర్చల్లోనూ హిందూ-పసిఫిక్‌ ప్రాంతంలో రక్షణ భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవడంపై ఇండియా విస్తృత స్థాయిలో సమాలోచనలు జరిపింది. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన ఇండో-పసిఫిక్‌లో చైనాకు ముకుతాడు వేసేందుకు, స్వీయ సామర్థ్యాలను ఘనంగా చాటుకునేందుకు దిల్లీ చేస్తున్న ప్రయత్నాలకు ఈ పరిణామాలు నిదర్శనాలు.


- శ్రీయాన్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆదాయం.. సమతూకం!

‣ తుంబా రాకెట్‌ ప్రయోగానికి 60 ఏళ్లు

‣ బైడెన్‌ - జిన్‌పింగ్‌.. మాటామంతీ

‣ దిగుబడులపై కరవు ప్రభావం

‣ విపత్తుల కట్టడికి పటిష్ఠ వ్యూహం

Posted Date: 01-12-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం