• facebook
  • whatsapp
  • telegram

ఆదాయం.. సమతూకం!


దేశంలో పన్ను వసూళ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాజ్యాంగం ప్రకారం కేంద్రం, రాష్ట్రాలు పంచుకోవాలి. ఆర్థిక సంఘం సిఫార్సులతో ఈ పంపిణీ జరుగుతుంది. ఇటీవలి కాలంలో సెస్సుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అధిక ఆదాయం లభిస్తోంది. సెస్సులు, సర్‌ఛార్జీలను విభాజ్య నిధిలో కలపకపోవడంతో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. నేడు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా..


రాజ్యాంగంలోని 280వ అధికరణ కింద రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు. ఈ సంఘం విభాజ్య నిధిలో జమ అయ్యే నికర పన్ను వసూళ్లను కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడానికి అవసరమైన సిఫార్సులు చేస్తుంది. పన్నుల ఆదాయాన్ని రాజ్యాంగంలోని ఒకటో, ఏడో అధ్యాయాల్లో సూచించిన ప్రకారం పంపిణీ చేస్తారు. కేంద్రం, రాష్ట్రాలు; వివిధ రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీకి ఆర్థిక సంఘం సిఫార్సులు చేస్తుంది. 270, 275 రాజ్యాంగ అధికరణలు సాధారణ, ప్రత్యేక గ్రాంట్ల పంపిణీని నిర్దేశిస్తాయి. తలసరి ప్రాతిపదికన రాష్ట్రాలకు ఉమ్మడి నిధులు, ప్రజాసేవలు సమానంగా లభించేలా చూడటం ఆర్థిక సంఘం విధి. ఈ సంఘం కార్యాచరణ నిబంధనావళిని (టీఓ ఆర్‌ను) రాష్ట్రపతి ఉత్తర్వులో పొందుపరుస్తారు. 15వ ఆర్థిక సంఘం టీఓఆర్‌లోని కొన్ని అంశాలు విమర్శలకు లోనయ్యాయి. తన సిఫార్సులకు 1971 నాటిది కాకుండా 2011 జనగణనను ప్రాతిపదికగా తీసుకోవాలన్న సూచనపై పెద్ద వివాదమే రేగుతోంది. దీనివల్ల కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేసి జనాభా వృద్ధిని తగ్గించుకున్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందనేది ప్రధాన విమర్శ. అలాగే రెవిన్యూ లోటు భర్తీకి గ్రాంట్లు, రక్షణ, అంతర్గత భద్రతకు మురిగిపోని నిధిని ఏర్పాటు చేయడం వంటి ప్రతిపాదనలూ చర్చోపచర్చలకు తావిచ్చాయి. ఈ నెల చివరి వారంలో రాష్ట్రపతి నియమించే 16వ ఆర్థిక సంఘం 2026-27 నుంచి అయిదేళ్లపాటు అమలులో ఉంటుంది.


తగ్గిన వాటా

భారత్‌లో మొదటి నుంచీ కేంద్రం, రాష్ట్రాల మధ్య నిధుల పంపకంలో సమతూకం కొరవడింది. పన్నుల ఆదాయమంతటినీ విభాజ్య నిధిలోకి తీసుకురావడం ద్వారా ఈ అసమతౌల్యాన్ని సరిచేయడానికి 11వ ఆర్థిక సంఘం ప్రయత్నించింది. ఇటీవలి కాలంలో సెస్సుల రూపంలో కేంద్రం ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఇది మొత్తం పన్నుల ఆదాయంలో 10శాతానికి సమానంగా ఉందని 15వ ఆర్థిక సంఘం వెల్లడించింది. సెస్సులు, సర్‌ఛార్జీలను విభాజ్య నిధిలో కలపకపోవడంతో రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతోంది. 11వ ఆర్థిక సంఘం విభాజ్య నిధిలో 29.3శాతం నిధులను రాష్ట్రాల వాటాగా నిర్ణయించింది. 12వ ఆర్థిక సంఘం దాన్ని 30.5శాతానికి పెంచింది. 13, 14వ ఆర్థిక సంఘాలు రాష్ట్రాల వాటాను వరసగా 32, 42 శాతాలకు పెంచాయి. ప్రణాళికా సంఘం రద్దు, సీఎస్‌, సీఎస్‌ఎస్‌ పథకాల పునర్‌ వ్యవస్థీకరణ వల్ల రాష్ట్రాలకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి 14వ ఆర్థిక సంఘం ప్రాధాన్యం ఇచ్చింది. జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడంతో రాష్ట్రాల సంఖ్య 28కి తగ్గిన దరిమిలా 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాల వాటాను 41శాతానికి తగ్గించింది. సెస్సులను దృష్టిలో పెట్టుకుని 16వ ఆర్థిక సంఘం రాష్ట్రాల వాటాను పెంచే అవకాశం ఉంది.


కొవిడ్‌ వల్ల ఏర్పడిన ఆర్థిక అస్థిరతను అధిగమించడానికి రాష్ట్రాల రుణ సేకరణ పరిమితిని సడలించాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. 2021-22లో స్థూల రాష్ట్ర జీడీపీ(జీఎస్‌డీపీ)లో నాలుగు శాతాన్ని రుణ సేకరణ పరిమితిగా నిర్ణయించారు. 2022-23లో దాన్ని 3.5శాతం, 2023-24 నుంచి 2025-26 వరకు మూడు శాతానికి మార్చారు. 2021-22 నుంచి 2024-25 వరకు విద్యుత్‌ రంగ సంస్కరణల కోసం అదనంగా 0.5శాతం రుణాల సేకరణకు ఆర్థిక సంఘం అనుమతించింది. 2021-22 నుంచి 2024-25 మధ్య ఏ సంవత్సరంలోనూ తన రుణ సేకరణ పరిమితిని పూర్తిగా వినియోగించుకోలేకపోయిన రాష్ట్రం, పై కాలావధిలో తదుపరి సంవత్సరంలో ఆ లోటును భర్తీ చేసుకోవచ్చని 15వ ఆర్థిక సంఘం తెలిపింది. 16వ ఆర్థిక సంఘం కూడా ఇలాంటి వెసులుబాటును అందిస్తుందని ఆశిస్తున్నారు.



ఆర్థిక క్రమశిక్షణ

పన్నెండో ఆర్థిక సంఘం సిఫార్సు చేసినట్లు ఒక రుణ మండలిని ఏర్పాటు చేయాలని ఆర్థికవేత్తలు డాక్టర్‌ సి.రంగరాజన్‌, డీకే శ్రీవాస్తవ ప్రతిపాదించారు. ఈ స్వతంత్ర సంస్థ కేంద్రం, రాష్ట్రాల రుణ వ్యవహారాలను పరిశీలించాలి. వడ్డీ, పింఛన్‌, రాయితీ చెల్లింపులే ప్రభుత్వ వ్యయంలో సింహభాగాన్ని ఆక్రమిస్తాయి. ఉచిత సబ్సిడీలపై 16వ ఆర్థిక సంఘం దృష్టి కేంద్రీకరించి విత్త లోటు గాడి తప్పకుండా చూడాలి. ప్రభుత్వోద్యోగుల విషయంలో పాత, కొత్త పింఛన్‌ వివాదాన్నీ పరిశీలించాలి. ఒక విత్త మండలిని ఏర్పరచి కేంద్రం, రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించేలా చూసే బాధ్యతను దానికి అప్పగించాలనే సూచనా ఉంది. అమెరికాలోని కాంగ్రెస్‌ బడ్జెట్‌ కార్యాలయం, బ్రిటన్‌లోని బడ్జెట్‌ బాధ్యతల కార్యాలయం, ఆస్ట్రేలియా, కెనడాల్లోని పార్లమెంటరీ బడ్జెట్‌ కార్యాలయాల తరహాలో భారత విత్త మండలిని నియమించాలనే ప్రతిపాదనను 16వ ఆర్థిక సంఘం తీవ్రంగా పరిశీలించాలి. రాష్ట్రాలు బడ్జెట్‌ను విస్మరించి బయటి నుంచి రుణాలు తీసుకునే ధోరణినీ అరికట్టాలి.


ప్రత్యేక ప్రయోజన గ్రాంట్లు

విభాజ్య నిధి నుంచి రాష్ట్రాలకు పంచే నిధుల విషయంలో కొన్ని విధివిధానాలు పాటిస్తారు. జనాభా, విస్తీర్ణం, ఆదాయాలను బట్టి ఆయా రాష్ట్రాలకు నిధులు పంపిణీ చేస్తారు. అలాగే అటవీ విస్తీర్ణం, జనాభాలో మార్పులనూ పరిగణనలోకి తీసుకుంటారు. పేద రాష్ట్రాల వాటా పెంచడానికి 13వ ఆర్థిక సంఘం ప్రయత్నించింది. ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యమిచ్చింది. రాష్ట్రాల మధ్య విద్య, వైద్యం పరంగా సమాన వసతుల కల్పనకు ప్రతి ఆర్థిక సంఘం ప్రత్యేక ప్రయోజన గ్రాంట్లను మంజూరు చేస్తోంది. 14వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు, ప్రకృతి ఉత్పాతాల విషయంలో మాత్రమే ఈ తరహా గ్రాంట్లను ఇచ్చింది. 15వ ఆర్థిక సంఘం పాత పద్ధతిని పునరుద్ధరించింది. 16వ ఆర్థిక సంఘం సైతం పూర్వ పద్ధతిలోనే ప్రత్యేక ప్రయోజన గ్రాంట్లను ఇస్తుందని భావిస్తున్నారు.


నిధుల బదిలీలో మార్పులు

గతంలో కొన్ని అంశాలు ఆర్థిక సంఘం, ప్రణాళికా సంఘం రెండింటి పరిధిలో ఉండటం సమస్యాత్మకంగా పరిణమించింది. ఆర్థిక సంఘం కేవలం విభాజ్య నిధి నుంచి కేంద్రం, రాష్ట్రాలకు నిధుల పంపకంపైనే దృష్టి సారించాలని, ప్రణాళికా సంఘం ప్రణాళిక, ప్రణాళికేతర నిధుల కేటాయింపును నిర్ధారించాలని పాలనా సంస్కరణల సంఘం 1969లో సిఫార్సు చేసింది. సమన్వయ సాధనకు ఆర్థిక సంఘంలో ప్రణాళికా సంఘం ప్రతినిధి ఒకరిని సభ్యుడిగా నియమించాలని సిఫార్సు చేసింది. ఆ ప్రతిపాదన ఆరో ఆర్థిక సంఘం నుంచి అమలులోకి వచ్చింది. ఇటీవలి సంవత్సరాల్లో భారత్‌లో నిధుల బదిలీ పద్ధతిలో పెద్ద మార్పులే వచ్చాయి. సాధారణంగా రెండు మార్గాల్లో రాష్ట్రాలకు నిధుల పంపిణీ జరుగుతుంది. గతంలో రాష్ట్రాల ప్రణాళికలకు కేంద్ర ప్రణాళికా సంఘం ద్వారా నిధులు బదిలీ అయ్యేవి. 2015-16లో ప్రణాళికా సంఘం రద్దయినప్పటి నుంచి నిధులను ఆర్థిక సంఘం ద్వారానే పంపిణీ చేస్తున్నారు. గతంలో కేంద్ర రంగం (సీఎస్‌), కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్‌ఎస్‌)ల ద్వారానూ రాష్ట్రాలకు నిధులు అందేవి. తరవాత ఆ పద్ధతికీ స్వస్తి చెప్పారు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ తుంబా రాకెట్‌ ప్రయోగానికి 60 ఏళ్లు

‣ బైడెన్‌ - జిన్‌పింగ్‌.. మాటామంతీ

‣ దిగుబడులపై కరవు ప్రభావం

‣ విపత్తుల కట్టడికి పటిష్ఠ వ్యూహం

Posted Date: 01-12-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం