• facebook
  • whatsapp
  • telegram

కాలుష్య కట్టడికి స్వచ్ఛ ఇంధనాలుఆధునిక ప్రపంచానికి చోదక శక్తి ఇంధనం. ఈ దశాబ్దం చివరి నాటికి వివిధ దేశాల్లో ఇంధన ఉత్పత్తి, వినియోగం, కర్బన ఉద్గారాల విడుదలలో భిన్న పరిస్థితులు నెలకొంటాయని ‘అంతర్జాతీయ ఇంధన సంస్థ’ తాజా నివేదికలో స్పష్టంచేసింది. ఈ నెల 30 నుంచి డిసెంబరు 12దాకా దుబాయ్‌లో కాప్‌-28 సదస్సు జరగనున్న నేపథ్యంలో ఈ అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా శిలాజ ఇంధనాలను మండించడం వల్ల భూతాపం అంతకంతకూ అధికమవుతోంది. ఫలితంగా సముద్ర నీటిమట్టాలు పెరిగి భూభాగాలు కుంచించుకుపోతున్నాయి. వాతావరణ సమతుల్యత లోపించి అతివృష్టి, అనావృష్టి, తుపానులు, కరవు కాటకాలు పెరుగుతున్నాయి. వాతావరణ కాలుష్యం జోరెత్తి మానవాళి ఆరోగ్యం దెబ్బతింటోంది. అనేక జీవజాతులు నశించి పోతున్నాయి. ఇలాంటి పరిస్థితిని కొన్నేళ్లుగా మనం చవిచూస్తున్నాం. ప్రపంచంలో 90శాతం పైగా కలుషిత గాలినే పిలుస్తున్నారని, ఏటా లక్షల మంది వాతావరణ కాలుష్యం కారణంగా ముందుగానే మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనడాన్ని బట్టి- పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.


పెరుగుతున్న వినియోగం

ప్రపంచ ఇంధన వినియోగంలో చైనాది అగ్రస్థానం. అమెరికా తరవాత భారతదేశం మూడో స్థానంలో ఉంది. ప్రపంచ ఇంధన ధోరణులను నిర్ణయించడంలో చైనాదే కీలక పాత్ర. గత దశాబ్ద కాలంలో చైనా కారణంగా చమురులో 60శాతం, సహజ వాయువులో 30శాతం డిమాండు పెరిగింది. స్వచ్ఛ ఇంధనాలైన సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పడం, విద్యుత్‌ వాహనాల విక్రయంలో ప్రపంచంలో సగభాగం చైనాదే. 2030 నాటికి భారత్‌లో పునరుత్పాదక ఇంధన కేంద్రాల సామర్థ్యం 500 గిగావాట్లకు, రెండు, మూడు చక్రాల విద్యుత్‌ వాహనాల విక్రయాలు పదిరెట్లు పెరిగే అవకాశం ఉంది. కాలుష్యం 25శాతం తగ్గనుంది. 2030 నాటికి అందరికీ విద్యుత్తు తదితర ఇంధనాలు అందుబాటులోకి రావడం వల్ల దాదాపు 67 కోట్లమంది ఆధునిక వంట ఇంధనాలను ఉపయోగిస్తారు. కట్టెల పొయ్యి స్థానంలో ఎల్‌పీజీ లేదా విద్యుత్తు వాడతారు. 20శాతం పైగా వాయు కాలుష్యానికి కారణమయ్యే రవాణా రంగంలో విద్యుత్‌ వాహనాల వినియోగం పెరగడం వల్ల ముప్పు తగ్గే అవకాశం ఉంది. గడిచిన దశాబ్దంలో బొగ్గు, చమురు, సహజ వాయువులకు డిమాండ్‌ 80శాతం చేరుకోగా 2030 నాటికి 73శాతానికి తగ్గుతుందని అంచనా. ఇంధన వినియోగం తీరుతెన్నుల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అనూహ్యంగా పెరుగుతున్న పట్టణీకరణ, వేడి వాతావరణం వల్ల ఏసీల వినియోగం అనేక రెట్లు అధికమై హానికర గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలను పెంచుతున్నాయి. ప్రపంచ భౌగోళిక రాజకీయాలు, ఉద్రిక్తతలు, ఆర్థిక అస్థిరతల వల్ల ఇంధన సంక్షోభాలు తలెత్తుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఫలితంగా సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాథమిక ఇంధన వనరులైన శిలాజ ఇంధనాల నిల్వలు- భౌగోళిక పరిస్థితుల కారణంగా కొన్ని దేశాలకే పరిమితం కావడం, అవసరాలు, వినియోగం వేరుగా ఉండటం తదితర అసమానతల వల్ల మిగతా దేశాలకు ఇంధన భద్రత/స్వయం సమృద్ధి సాధించడంలో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఏ దేశమైనా మొదట తన ఇంధన వినియోగ అవసరాలను అంచనా వేసుకొని, దేశీయంగా ఉత్పత్తికి గల అవకాశాలను గుర్తించి ఇంధన భద్రత/స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రాధాన్యమిస్తుంది. ఆ తరవాతే మిగతా విషయాలపై దృష్టి సారిస్తుంది. అందుకని హానికర కర్బన ఉద్గారాలను నిరోధించి, పునరుత్పాదక స్వచ్ఛ ఇంధనాల వినియోగాన్ని పెంచడం, అవసరమైన పెట్టుబడులు పెట్టడంపై ఆయా దేశాల ప్రభుత్వ విధానాలు దృష్టి సారిస్తాయి. ఏది ఏమైనా ఇప్పటికీ చమురు, గ్యాస్‌ ఉత్పత్తి రంగంలోనే పెట్టుబడులు భారీగా ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే దీర్ఘకాలిక భవిష్యత్తులో శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం కష్టం. ఇలాంటి ఇంధనాలపై క్రమంగా పెట్టుబడులు తగ్గించాలి. స్వచ్ఛ ఇంధనాల ఉత్పత్తి, వినియోగం పెరిగేలా ఆ రంగంలో పెట్టుబడులను పెంచాలి. కాలుష్యానికి ప్రధాన కారణాలైన కాలం చెల్లిన బొగ్గు ఆధారిత విద్యుత్తు కేంద్రాలను మూసివేయాలి. సాధ్యమైనంత మేరకు కొత్త కేంద్రాలు రాకుండా చూడాలి. అంతర్జాతీయంగా దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందించుకుంటేనే-2050 నాటికి కర్బన తటస్థత లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది.


పరస్పర సహకారంతో..

పునరుత్పాదక ఇంధన కేంద్రాల స్థాపిత సామర్థ్యం 2030నాటికి 50 శాతానికి చేరుకునే అవకాశం ఉంది. భవిష్యత్తులో సౌర విద్యుత్తు వాటా సగానికి పైగా ఉండనుంది. ఈ రంగంలో 2030 నాటికి ప్రపంచం సంవత్సరానికి 1200 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నా, తగిన విద్యుత్తు లైన్ల అందుబాటు, సుస్థిర నిల్వ సామర్థ్యం కొరవడటంవల్ల అధికంగా స్థాపించే అవకాశం లేదు. అన్ని దేశాల్లో సౌర ఫలకల ఉత్పత్తి పెరిగితే, సౌర విద్యుత్‌ కేంద్రాల సంఖ్య పెరుగుతుంది. సౌర విద్యుత్తు 47శాతందాకా, పవన విద్యుత్తు 23 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలూ పెరుగుతాయి. రియాక్టర్లను నవీకరించడం ద్వారా అణు విద్యుత్‌ ఉత్పత్తినీ కొంతమేర కొనసాగించవచ్చు. జీవ ఇంధనాలు, భూ అంతర్గత ఉష్ణశక్తి, సముద్ర తరంగాలు, హైడ్రోజన్‌ తదితర పునరుత్పాదక ఇంధనాల సాంకేతికతను అభివృద్ధి చేయడం ద్వారా వాటి నుంచీ ఇంధనశక్తి ఉత్పత్తి పెంచవచ్చు. ఉత్పత్తి, వినియోగాలు పెరిగేకొద్దీ ఈ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అధికమవుతాయి. భూతాపం వల్ల దుష్పరిణామాలు అందరినీ ఒకేస్థాయిలో బాధిస్తాయి. అందుకని, అన్ని దేశాల మధ్య పరస్పర సహకారం, చిత్తశుద్ధి ఉంటేనే సమస్యను సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అప్పుడే వాతావరణ కాలుష్యం మరింతగా పెరగకుండా కట్టడి చేయడం సాధ్యమవుతుంది.


విధానాలే కీలకం

అంతర్జాతీయ ఇంధన సంస్థ వెలువరించిన ‘ప్రపంచ ఇంధన దృక్కోణం-2023’ పరిశోధన నివేదికను బట్టి భవిష్యత్తులో కాలుష్యం కట్టడి ప్రధానంగా అయిదు అంశాలపై ఆధారపడి ఉంటుంది. 

1) పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడురెట్లు పెంచాలి. 

2) రవాణా వాహనాల అంతర్గత సామర్థ్యాన్ని రెండురెట్లు మెరుగుపరచాలి. 

3) శిలాజ ఇంధన వినియోగంలో మిథేన్‌ విడుదలను 75శాతందాకా నిరోధించాలి. 

4) స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిలో సుస్థిర అభివృద్ధితోపాటు కొత్త ఆవిష్కరణలను సాధించాలి. 

5) ఎప్పటికప్పుడు పురోగతి పర్యవేక్షణ, నిర్దేశిత కొలమానాల తనిఖీ విషయంలో ప్రతి దేశం తన అవసరాలు, భౌగోళిక స్థితిగతులను బట్టి సరైన విధానాలను రూపొందించుకోవాలి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భారత్‌ ఎపెక్‌లో చేరుతుందా?

‣ భద్రమైన జీవనం.. యుద్ధాలతో ఛిద్రం

‣ డ్రాగన్‌ దూకుడుకు ముకుతాడు

‣ ఆదాయం.. సమతూకం!

Posted Date: 01-12-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని