• facebook
  • whatsapp
  • telegram

పటిష్ఠ చర్యలతోనే భూతాప నియంత్రణవాతావరణ మార్పుల వల్ల అనేక విపత్తులు సంభవిస్తున్నాయి. శిలాజ ఇంధనాల పరిమిత వినియోగం, కర్బన ఉద్గారాల స్వీయనియంత్రణ, అడవుల పరిరక్షణ వంటివి భూతాపం కట్టడికి అమితంగా దోహదపడతాయి. ఈ అంశాలపై ఏటా ‘కాప్‌’ విశ్వసదస్సుల్లో చర్చలు జరుగుతున్నాయి. నిర్దిష్టమైన కార్యాచరణను అనుసరించడంలో చిత్తశుద్ధి కొరవడుతోంది.


పర్యావరణ మార్పుల నియంత్రణకు ఐక్యరాజ్యసమితి 1995 నుంచి ప్రపంచ దేశాల ప్రతినిధులతో చర్చలు(కాప్‌) నిర్వహిస్తోంది. ఇప్పటిదాకా 27 ‘కాప్‌’ వార్షిక సదస్సులు జరిగాయి. నేటి నుంచి దుబాయ్‌ వేదికగా కాప్‌-28 ప్రారంభమవుతోంది. వాతావరణ సంక్షోభాలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో రెండు వారాల పాటు జరిగే ఈ సదస్సులో చర్చలు, తీసుకునే నిర్ణయాలు ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి. గత ఒప్పందాల అమలుపై సమీక్ష, దీటైన కార్యాచరణలకు ఈ సదస్సు దారిచూపుతుందని పేద, వర్ధమాన దేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.


మాటలు తప్ప చేతలేవీ?

కొన్నేళ్లుగా ఎండలు మండిపోతున్నాయి. రుతువులు క్రమం తప్పుతున్నాయి. తుపానులు, అకాల వర్షాలు, వరదలు, వర్షాభావ పరిస్థితులు జనజీవనాన్ని దుర్భరంగా మార్చేస్తున్నాయి. నదులు, సముద్ర జలాల్లో ఉష్ణోగ్రతలు అధికం కావడంతో సున్నితమైన జీవజాతులు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. పారిశ్రామిక విప్లవానికి ముందునాటి పరిస్థితులతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా సగటున 1.15 డిగ్రీల సెల్సియస్‌ మేర ఉష్ణోగ్రతలు పెరిగాయని అంచనా. భూతాపం పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్‌ కంటే దిగువకు నిలువరించకపోతే సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరిగిపోతాయి. దాంతో భారత్‌, బంగ్లాదేశ్‌, చైనాలతో పాటు అనేక యూరోపియన్‌, అమెరికా దేశాలకు ప్రమాదం పొంచి ఉంటుంది. భూతాపం తీవ్రమైతే కరవులు, కార్చిచ్చులు, వరదల వంటివి పెచ్చరిల్లి ప్రజల ఆహార భద్రత పెనుప్రమాదంలో పడుతుంది. ఐరాస విపత్తుల విభాగం హెచ్చరికల ప్రకారం, 2030 నాటికి ఏటా 560 పెను విపత్తులు తలెత్తవచ్చు. బొగ్గు, చమురు, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాలను మితిమీరి వినియోగించడంవల్ల విడుదలయ్యే కర్బన ఉద్గారాలు వాతావరణ మార్పులకు ప్రధాన కారకాలవుతున్నాయి. మరోవైపు- ప్రపంచవ్యాప్తంగా ఏటా 2.5కోట్ల ఎకరాల మేర అడవులు మాయమవుతున్నాయని అంచనా. గడచిన మూడు దశాబ్దాల్లో ఇండియాలోనూ వన విధ్వంసం పెరిగిందని వివిధ నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2015-2020 మధ్యకాలంలో మన దేశంలో దాదాపు 16లక్షల ఎకరాల్లో అడవులు నాశనమయ్యాయి. వీటికి తోడు ఎనభై శాతం వ్యర్థ జలాలను ఇప్పటికీ సముద్రాలు, నదుల్లోనే విడిచిపెట్టేస్తున్నారు. గడిచిన వందేళ్లలో యాభై శాతం చిత్తడినేలలు, పగడపు దిబ్బలు అంతరించిపోయాయి. వాయుకాలుష్యం అత్యంత ప్రమాదకర దశకు చేరింది. ప్లాస్టిక్‌ వినియోగం మితిమీరడంతో మానవాళి ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడుతోంది. సముద్ర జలాల్లో కలుస్తున్న ప్లాస్టిక్‌ కారణంగా అక్కడి జీవావరణ వ్యవస్థ ప్రతికూలంగా ప్రభావితమవుతోంది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ ఉత్పత్తుల తయారీ, వినియోగంపై అనేక దేశాలు నిషేధం విధించినా- అది ఆశించిన స్థాయిలో అమలు కావడంలేదు.


విచ్చలవిడి కర్బన ఉద్గారాలతో పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది అభివృద్ధి చెందిన దేశాలేనని అనేక అధ్యయనాలు చాటుతున్నాయి. వాతావరణ మార్పులను ఎగదోస్తున్న సంపన్న దేశాలు- పర్యావరణ పరిరక్షణలో బాధ్యతాయుతమైన పాత్రను పోషించడం లేదని పేద, వర్ధమాన దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2015లో పారిస్‌ వేదికగా జరిగిన ‘కాప్‌-21’లో ప్రపంచ దేశాల మధ్య చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. సామాజిక, ఆర్థిక, భౌగోళిక తారతమ్యాలు లేకుండా భూతాపాన్ని కట్టడి చేసేందుకు పటిష్ఠ కార్యాచరణ అమలు చేయాలని 196 దేశాలు ఆనాడు అంగీకరించాయి. ఆ ఒప్పందం ప్రకారం- భూతాపంలో వృద్ధిని రెండు డిగ్రీలకు తగ్గించడం, వీలైతే దాన్ని 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కంటే దిగువకు తీసుకురావడానికి కృషి చేయాలి. కర్బన ఉద్గారాల నియంత్రణకుగాను పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంపన్న రాజ్యాలు ఏటా సుమారు రూ.8.30 లక్షల కోట్ల నిధులను సమకూర్చాలి. 2030 నాటికి అటవీ నిర్మూలనను  పూర్తిగా నిషేధించే చర్యలను బలోపేతం చేయాలి. 2050 నాటికి కర్బన ఉద్గారాల తటస్థతను సాధించాలి. పారిస్‌ ఒప్పందంపై సంతకం చేసి ఎనిమిదేళ్లు గడిచినా అమెరికాతో పాటు అనేక అగ్ర దేశాలు ఆడిన మాట తప్పుతున్నాయి. జర్మనీ, నార్వే, స్వీడన్‌ వంటివే కొద్దోగొప్పో నిధులు కేటాయిస్తున్నాయి. బొగ్గు వినియోగాన్ని పూర్తిగా కట్టడి చేసేందుకు సంపన్న దేశాలు మరింత కాలపరిమితిని కోరుకుంటున్నాయి. థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు, చమురుపై విపరీతంగా ఆధారపడిన అనేక దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులవైపు వేగంగా మరలడం లేదు.


ప్రజా భాగస్వామ్యంతో..

ప్రపంచ దేశాల నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే- భూతాప నియంత్రణ ఇంకా క్లిష్టతరమవుతుంది. పర్యావరణ పరిరక్షణకు అంతర్జాతీయ సమాజం ఏకతాటిపైకి రావాల్సిన అత్యవసర సమయమిది. సౌర, పవన విద్యుత్తు వంటి సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలి. వనాల పెంపకంపై దృష్టి సారించాలి. ప్రణాళికల రూపకల్పనలోనే కాదు- వాటికి అవసరమైన నిధుల కేటాయింపు, వినియోగంలోనూ చిత్తశుద్ధిని కనబరచాలి. తీర ప్రాంతాలు, పర్వత ప్రదేశాల వంటి విభిన్న భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా విపత్తు నివారణ వ్యూహాలను అనుసరించాలి. చిత్తడినేలలు, మడ అడవులను కాపాడుకోవాలి. పర్యావరణ పరిరక్షణలో ప్రజలను భాగస్వాములను చేయాలి. ప్రపంచ వేదికలపై ప్రస్ఫుటమయ్యే పర్యావరణ స్పృహ- క్షేత్రస్థాయి చర్యల్లోనూ ప్రతిబింబించాలి. ఆ మేరకు అన్ని దేశాలకు ‘కాప్‌-28’స్పష్టంగా దిశానిర్దేశం చేయాలి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ జీ20 సారథ్యంలో మేటి విజయాలు

‣ బతుకుల్ని చిదిమేస్తున్న విపత్తులు

‣ కాలుష్య కట్టడికి స్వచ్ఛ ఇంధనాలు

‣ భారత్‌ ఎపెక్‌లో చేరుతుందా?

‣ భద్రమైన జీవనం.. యుద్ధాలతో ఛిద్రం

‣ డ్రాగన్‌ దూకుడుకు ముకుతాడు

‣ ఆదాయం.. సమతూకం!

Posted Date: 01-12-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని