• facebook
  • whatsapp
  • telegram

జీ20 సారథ్యంలో మేటి విజయాలు



భారతదేశం జీ20 కూటమికి సారథ్య బాధ్యతలు స్వీకరించి నేటికి ఏడాది. వసుధైవ కుటుంబకం.. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకటే భవిష్యత్తు.. స్ఫూర్తిని ప్రతిబింబించే, పునరంకితమయ్యే, పునరుత్తేజం పొందే మధుర క్షణమిది. ఇది- బహుళపక్షవాదంలో ఓ నవోదయం!


జీ20 నేతృత్వ బాధ్యతలను భారత్‌ స్వీకరించే నాటికి ప్రపంచం పలురకాల సవాళ్లతో సతమతమవుతోంది. కొవిడ్‌ మహమ్మారి చేసిన గాయాల నుంచి అప్పుడప్పుడే కోలుకుంటోంది. వాతావరణ మార్పుల ముప్పు కమ్ముకొంది. ఆర్థిక అస్థిరత నెలకొంది. అభివృద్ధి చెందుతున్న దేశాలను రుణ సంక్షోభం వేధిస్తోంది. వీటన్నింటికీ తోడు బహుళపక్షవాదం క్షీణిస్తోంది. సంక్షోభాలు, పోటీతత్వం, సహకార అభివృద్ధి భావనలు దెబ్బతిని పురోగతి మందగించింది. అలాంటి పరిస్థితుల్లో జీ20 నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన భారతదేశం- నాటి దుస్థితి నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించి, ప్రత్యామ్నాయం చూపాలని నిశ్చయించుకుంది. ఇందులో భాగంగా జీడీపీ కేంద్రీకృతంగా సాగే ప్రగతి నుంచి మానవ ప్రాధాన్య పురోగతి వైపు మళ్ళాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. మన మధ్య విభజన తెస్తున్న విషయాలను కాకుండా మనల్ని ఏకం చేసే అంశాల్ని ప్రపంచానికి గుర్తుచేయాలన్నదే భారత్‌ లక్ష్యం. మొత్తంగా, అంతర్జాతీయ చర్చలు కొందరి ప్రయోజనాలకే పరిమితం కాకుండా అందరి ఆకాంక్షలు, ప్రయోజనాలకు పెద్దపీట వేశాయి.


నిర్ణయాత్మక బాధ్యత

ఆకాంక్ష, సమ్మిళితత్వం, కార్యాచరణాత్మకత, నిర్ణయాత్మకత వంటి నాలుగు సూత్రాలు... జీ20 బాధ్యతల నిర్వహణలో మన దృక్పథాన్ని సుస్పష్టంగా నిర్వచించాయి. జీ20 సభ్యులంతా ఏకగ్రీవంగా ‘న్యూదిల్లీ దేశాధినేతల తీర్మానం(ఎన్‌డీఎల్‌డీ)’ ప్రతికి ఆమోదం తెలపడం నాలుగు సూత్రాల ఆచరణలో మన నిబద్ధతకు నిదర్శనం. సమ్మిళితత్వ భావనే మన జీ20 నేతృత్వానికి ఆత్మ. ఆఫ్రికన్‌ యూనియన్‌ (ఏయూ)కు జీ20లో శాశ్వత సభ్యత్వాన్ని కల్పించడంతో 55 ఆఫ్రికా దేశాలు కూటమిలో చేరాయి. దీంతో ప్రపంచ జనాభాలో 80 శాతం ఈ వేదిక కిందికి వచ్చినట్లయింది. తద్వారా అంతర్జాతీయ సవాళ్లు-అవకాశాలపై మరింత సమగ్ర చర్చలను ప్రోత్సహించినట్లయింది. ఇక ‘దక్షిణార్ధ గోళం దేశాల గళం’ పేరిట భారతదేశం తొలిసారి రెండు దఫాలుగా నిర్వహించిన శిఖరాగ్ర సదస్సు బహుళపక్షవాదంలో నవోదయానికి శుభారంభం పలికింది. అంతర్జాతీయ చర్చల్లో దక్షిణార్ధ గోళం సమస్యలకు భారత్‌ ప్రాధాన్యం కల్పించి వెలుగులోకి తెచ్చింది. ప్రపంచ ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి చెందుతున్న దేశాలు నిర్ణయాత్మక బాధ్యతను స్వీకరించే నవశకానికి అడుగు పడింది.


ప్రజా భాగస్వామ్యం కింద నిర్వహించిన అనేక కార్యక్రమాల ద్వారా జీ20 140 కోట్లమందికి చేరువైంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు భాగస్వాములుగా మమేకమయ్యాయి. వాస్తవిక అంశాల ఆధారంగా జీ20 ఆదేశాలకు అనుగుణంగా అంతర్జాతీయ దృష్టిని విస్తృతమైన అభివృద్ధి లక్ష్యాల వైపు మళ్ళించడంలో భారత్‌ కృతకృత్యమైంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సాధనను వేగవంతం చేయడానికి జీ20 కార్యాచరణ ప్రణాళికను భారత్‌ రూపొందించింది. ఇది ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వం, పర్యావరణ సమతౌల్యం, పరస్పర అనుసంధానత వంటి అంశాల్లో సమస్యల పరిష్కారానికి విస్తృత కార్యాచరణను సూచిస్తుంది. ఈ ప్రగతి ప్రణాళిక పురోగమనానికి డిజిటల్‌ ప్రజాహిత మౌలిక సదుపాయాల (డీపీఐ)లు అత్యంత కీలకం. ఆధార్‌, యూపీఐ, డిజిలాకర్‌ వంటి డిజిటల్‌ ఆవిష్కరణల విప్లవాత్మక ప్రభావాన్ని ప్రత్యక్షంగా గమనించిన భారత్‌ తనవంతుగా నిర్ణయాత్మక సిఫార్సులు చేసింది. జీ20 ద్వారా మనం డిజిటల్‌ ప్రజాహిత మౌలిక సదుపాయాల(డీపీఐ) భాండాగారం ఏర్పాటును విజయవంతంగా పూర్తి చేశాం. సమ్మిళిత వృద్ధి శక్తిని సద్వినియోగం చేసుకునే దిశగా దక్షిణార్ధ గోళ దేశాలు ఈ భాండాగారాన్ని సమర్థంగా ఉపయోగించుకోవాలి.


వాతావరణ న్యాయం-సమానత్వం విషయంలో మన నిబద్ధతను ‘ఎన్‌డీఎల్‌డీ’ తీర్మానం ప్రస్ఫుటం చేసింది. ఉత్తరార్ధ గోళ దేశాల నుంచి గణనీయ ఆర్థిక సహాయంతోపాటు సాంకేతిక చేయూతను కోరింది. భారీ స్థాయిలో నిధుల సమీకరణ అవసరమైన దృష్ట్యా మెరుగైన, విస్తృత, ప్రభావశీల బహుళపక్ష అభివృద్ధి బ్యాంకుల ప్రాముఖ్యాన్ని జీ20 ఎలుగెత్తి చాటింది. ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు చేపట్టాలన్న డిమాండ్‌ విషయంలోనూ భారత్‌ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. భద్రతా మండలి వంటి ప్రధాన విభాగాల పునర్నిర్మాణాన్ని కోరుతోంది. జీ20 తీర్మానం లింగ సమానత్వానికీ పెద్దపీట వేసింది. వచ్చే ఏడాదికల్లా మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యాచరణ బృందం ఏర్పాటు అవసరాన్ని నొక్కిచెప్పింది. మహిళా రిజర్వేషన్‌ బిల్లు-2023 ద్వారా మహిళల అభివృద్ధి విషయంలో భారత్‌ తన నిబద్ధతను చాటుకుంది. విధానపరమైన సమన్వయం, నమ్మకమైన  వాణిజ్యం, వాతావరణ కార్యాచరణపై దృష్టి సారిస్తూ ఈ కీలక ప్రాధాన్యాలన్నింటిలోనూ పరస్పర సహకార స్ఫూర్తిని ఎన్‌డీఎల్‌డీ చాటిచెప్పింది. మనం అధ్యక్షత వహించిన సమయంలో జీ20 ద్వారా 87 నిర్ణయాలు తీసుకోవడంతోపాటు 118 పత్రాలకు ఆమోదం సాధించడం గర్వకారణం. గతంతో పోలిస్తే ఇదెంతో గణనీయమైన పెరుగుదల.  


సమష్టి కృషి

భారత్‌ జీ20కి నాయకత్వం వహించిన సమయంలో భౌగోళిక, రాజకీయాంశాలు, ఆర్థికవృద్ధిపై వాటి ప్రభావం వంటి అంశాలపై చర్చలకు నేతృత్వం వహించింది. ఉగ్రవాదం, విచక్షణా రహితంగా పౌరుల ప్రాణాలు తోడేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని తుదముట్టించడమనే విధానంతోనే ఈ పెనుముప్పును నిర్మూలించడం సాధ్యం. మనం శత్రుత్వానికి బదులు  మానవత్వాన్ని స్వీకరించాలి. ఇది యుద్ధాలకు కాలం కాదు. మనదేశం జీ20 అధ్యక్ష బాధ్యతల్లో ఉన్నప్పుడు అసాధారణ విజయాలు సాధించడం నాకెంతో సంతోషకరం. ఇది బహుళపక్ష వాదానికి  పునరుజ్జీవనం కల్పించింది. దక్షిణార్ధ గోళ దేశాల గళాన్ని గట్టిగా వినిపించింది. పురోభివృద్ధికి ప్రాధాన్యం కల్పించింది. అన్ని రంగాల్లోనూ మహిళా సాధికారత కోసం పోరాడింది. ఈ నేపథ్యంలో భూగోళం పచ్చగా పరిఢవిల్లడంతోపాటు ప్రపంచ ప్రజానీకానికి శాంతి, శ్రేయస్సు దిశగా ఇప్పటిదాకా మనం సమష్టిగా చేసిన కృషి భవిష్యత్తులోనూ కొనసాగుతుందని విశ్వసిస్తున్నాం. ఆ మేరకు జీ20 అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్‌ దేశానికి అప్పగిస్తున్నాం.


మూడు రెట్లు పెంచాలని..

ప్రపంచ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 2030 నాటికి మూడు రెట్లు పెంచాలని జీ20 తీర్మానం పిలుపిచ్చింది. మరోవైపు ‘ప్రపంచ జీవఇంధన కూటమి’ ఏర్పాటు, హరిత ఉదజని కోసం సమష్టి కృషి, స్వచ్ఛ, హరిత ప్రపంచ నిర్మాణంపై జీ20 ఆకాంక్షలు ఎంతో ఉన్నతం. సుస్థిరాభివృద్ధికి అనుగుణమైన మన ప్రాచీన సంప్రదాయాల ద్వారా ప్రపంచం ప్రయోజనం పొందే అవకాశముంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బతుకుల్ని చిదిమేస్తున్న విపత్తులు

‣ కాలుష్య కట్టడికి స్వచ్ఛ ఇంధనాలు

‣ భారత్‌ ఎపెక్‌లో చేరుతుందా?

‣ భద్రమైన జీవనం.. యుద్ధాలతో ఛిద్రం

‣ డ్రాగన్‌ దూకుడుకు ముకుతాడు

‣ ఆదాయం.. సమతూకం!

Posted Date: 01-12-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం