• facebook
  • whatsapp
  • telegram

ఇండియాతోనే ఈయూ!భారత్‌-ఐరోపా సమాఖ్య (ఈయూ) వ్యూహాత్మక బంధం వేగంగా బలపడుతోంది. రక్షణ, భద్రతాపరమైన అంశాల్లో సహకారం పెంపొందించుకోవడానికి ఉభయ పక్షాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. పశ్చిమ దేశాలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్నాయి. ఈ తరుణంలో భారత్‌ వాటికి విశ్వసనీయ భాగస్వామిగా కనిపిస్తోంది.


ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడు పెరిగింది. తైవాన్‌ను ఆక్రమించుకోవాలన్న పట్టుదలతో ఉన్నట్లు డ్రాగన్‌ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి వంటి సెమీకండక్టర్ల రంగానికి తైవాన్‌ కేంద్రం. ఇది చేజారితే అమెరికా, ఐరోపా సమాఖ్య(ఈయూ)లకు చిక్కులు తప్పవు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈయూ ప్రత్యామ్నాయాల అన్వేషణలో పడింది. భావసారూప్యత గల దేశాలతో కలిసి చిప్‌ల తయారీ ప్రయత్నాలను జోరెత్తించింది. భారత్‌లో సెమీకండక్టర్ల తయారీకి ఊతమిచ్చేందుకు ప్రకటించిన సుమారు రూ.83వేల కోట్ల ప్రోత్సాహకాలు దిగ్గజ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి.


పెను సవాళ్లు

ఇండియా, ఐరోపా సమాఖ్య వాణిజ్య-సాంకేతిక మండలి (టీటీసీ) కొద్దిరోజుల కిందట భేటీ అయ్యింది. ఈ సందర్భంలో భారత్‌-ఈయూల మధ్య సెమీకండక్టర్ల రంగానికి సంబంధించి అవగాహన ఒప్పందం కుదిరింది. చిప్‌ల రూపకల్పన మొదలు పంపిణీ వరకు అన్ని దశల్లోనూ తమకున్న అనుభవాన్ని, అత్యుత్తమ విధానాలను ఉభయ పక్షాలు పరస్పరం పంచుకోవాలని టీటీసీ సమావేశంలో నిర్ణయించారు. ఈ రంగంలో పరిశోధన-అభివృద్ధితో పాటు నిపుణులు, ప్రతిభావంతులైన కార్మికులను సిద్ధం చేసేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని ఒప్పందంలో నిర్దేశించారు. పెట్టుబడుల్లో పారదర్శకత, సమాన అవకాశాల కల్పన వంటి అంశాలకు ప్రాధాన్యమివ్వాలని భావించారు. ఐరోపా సమాఖ్య ఇప్పటికే జపాన్‌, దక్షిణ కొరియా, సింగపూర్‌, కెనడాలతో ఈ తరహా ఒప్పందాలు చేసుకొంది. వ్యూహాత్మకమైన ఉత్పత్తుల కోసం చైనాపై ఆధారపడటాన్ని ఈయూ తగ్గించుకొంటోందనడానికి ఈ పరిణామాలే నిదర్శనం.


ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్‌ దౌర్జన్యాలు భద్రతాపరంగా ఐరోపా సమాఖ్యకు పెనుసవాళ్లు విసరుతున్నాయి. 2008లో సముద్ర దొంగల కట్టడి పేరిట హిందూ మహాసముద్రంలోకి చొరబడిన చైనా క్రమంగా బలపడుతోంది. అక్కడి కోకో ద్వీపాలు, శ్రీలంక, పాకిస్థాన్‌, మయన్మార్‌, మాల్దీవులు, జిబూటీలో పాగా వేసింది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన జలమార్గాల్లోని 50కి పైగా దేశాల్లో సుమారు వంద చోట్ల పోర్టులు, టెర్మినళ్లను చైనా నిర్వహిస్తోందని వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం పేర్కొంది. డ్రాగన్‌ వీటిలో కొన్నింటినైనా నిఘా కార్యకలాపాలకు వినియోగిస్తే- భారత్‌తో పాటు ఐరోపా సమాఖ్యకూ ముప్పే!


భారత్‌-ఈయూ బంధం కేవలం పెట్టుబడులు, వాణిజ్యానికే పరిమితం కాలేదు. రక్షణ, భద్రతా రంగాల్లో సమష్టి లక్ష్యాలు, పరస్పర ప్రయోజనాల కోసం పనిచేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈయూ తొలిసారిగా గత నెలలోనే డిఫెన్స్‌ అటాచీని దిల్లీలో నియమించింది. భారత్‌తో రక్షణ పరికరాల క్రయవిక్రయాలకు ఈ నియామకం చాలా కీలకం. మరోవైపు, ఉభయపక్షాలు తొలిసారి కలిసికట్టుగా గల్ఫ్‌ ఆఫ్‌ గినీలో నౌకాదళ విన్యాసాలు చేపట్టాయి. ఇరుపక్షాల మధ్య బలపడుతున్న రక్షణ బంధానికి ఇది బలమైన సంకేతం. భారత్‌-పశ్చిమాసియా-ఐరోపా ఆర్థిక నడవా (ఐమెక్‌) ప్రతిపాదనలు పట్టాలకు ఎక్కుతున్న వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం విశేషం. ఈయూతో అత్యధిక వాణిజ్య సంబంధాలున్న తొలి పది దేశాల్లో నాలుగు ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోనే ఉన్నాయి. పైగా, ఐరోపాలో ముఖ్య దేశమైన ఫ్రాన్స్‌కు ఇక్కడి రీయూనియన్‌ ద్వీపంపై తన హక్కులను కాపాడుకోవడం ఎంతో కీలకం.


సమష్టిగా పనిచేస్తేనే..

ఐరోపా సమాఖ్యకు చెందిన పలు శక్తిమంతమైన దేశాలు ఇప్పటికే ఇండో-పసిఫిక్‌ ప్రాంతంపై తమ వ్యూహాలకు పదును పెట్టాయి. ఫ్రాన్స్‌ 2019లోనే వ్యూహపత్రాన్ని సిద్ధం చేసింది. జర్మనీ, నెదర్లాండ్స్‌ 2020లో ఈ ప్రాంతంపై అనుసరించాల్సిన మార్గదర్శకాలను రూపొందించుకొన్నాయి. వీటన్నింటిలో భారత్‌కున్న ప్రాధాన్యాన్ని అవి విస్పష్టంగా పేర్కొన్నాయి. భారత్‌, ఈయూలు ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని చిన్న దేశాలతో కలిసి పనిచేయాలన్న లక్ష్యంతో ‘హిందూ మహాసముద్ర సహకార, శిక్షణ (ఐఓసీఏటీ)’ కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలున్నాయి. సంయుక్త నౌకాదళ విన్యాసాలు, కోస్ట్‌గార్డుల సామర్థ్యాలను పెంచే శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, పటిష్ఠమైన సముద్ర నిఘా కోసం అత్యాధునిక రాడార్‌ పరికరాల అందజేత తదితరాల గురించీ ఆలోచిస్తున్నారు. ఇటువంటి చర్యలు చిన్న దేశాల నౌకాదళాల మధ్య సమన్వయం నెలకొల్పి, వాటి సామర్థ్యాలను పెంపొందిస్తాయి. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో డ్రాగన్‌ దూకుడుకు సమర్థంగా అడ్డుకట్ట వేయాలంటే- వివిధ రంగాల్లో కలిసికట్టుగా పనిచేయడమే భారత్‌, ఈయూలకు ఉన్న ఏకైక మార్గం!


- పెద్దింటి ఫణికిరణ్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సేంద్రియ వ్యవసాయంతో లాభాలెన్నో!

‣ అసమాన పోరాట శక్తిగా నౌకాదళం

‣ ఇరాన్‌ అమ్ములపొదిలో సరికొత్త క్షిపణి

‣ వర్సిటీ ర్యాంకింగుల్లో మెరుగయ్యేదెన్నడు?

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Follow us on Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 06-12-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని