• facebook
  • whatsapp
  • telegram

ధరల వాతలు.. తీరేనా వెతలు?దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఇటీవల సమావేశమైంది. ఆ కమిటీ నిర్ణయాన్ని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నేడు వెల్లడించే అవకాశం ఉంది. దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గవర్నర్‌ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ)కి అధ్యక్షత వహిస్తారు. దేశ ద్రవ్య విధానంలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం తేవడానికి కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. దేశీయంగా రెపో రేటును (వాణిజ్య బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే రుణాలపై విధించే వడ్డీ రేటు) నిర్ణయించి ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్షిత పరిమితిలో ఉండేలా చూడటం ఈ కమిటీ బాధ్యత. ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయం నేడు వెలువడుతుందని చెబుతున్నారు. భారత్‌లో ద్రవ్యోల్బణం ఆరు శాతానికి మించకుండా చూడాలని ఆర్‌బీఐ లక్షిస్తోంది. ద్రవ్య విధాన బృందం గురించి తొలిసారిగా ఉర్జిత్‌ పటేల్‌ కమిటీ ప్రతిపాదించింది. ఇందులో అయిదుగురు సభ్యులు ఉండాలని అది సూచించింది. సభ్యులను కేంద్రం ఏడుకు పెంచింది. 2016 జూన్‌ నుంచి ఎంపీసీ పనిచేయడం మొదలుపెట్టింది. అంతర్గత బృందం, సాంకేతిక సలహా కమిటీ మద్దతు, సూచనలతో ద్రవ్య విధాన నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ నియంత్రిస్తారు. ద్రవ్య విధాన రూపకల్పనలో ఆర్‌బీఐలోని ద్రవ్య విధాన శాఖ (ఎంపీడీ) ఎంపీసీకి సహకరిస్తుంది. 


ఆచితూచి అడుగులు

ద్రవ్య విధాన కమిటీ ఏడాదిలో కనీసం నాలుగుసార్లు సమావేశమవుతుంది. ప్రతి సమావేశం తరవాత ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తారు. ఆర్థికవేత్తలు, సంస్థల నిర్వాహకులు రాబోయే ద్రవ్య విధాన ప్రకటనపై ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆర్‌బీఐ రెపోరేటు 6.5శాతంగా ఉంది. దేశీయంగా స్థూల ఆర్థిక పరిస్థితులను క్షుణ్నంగా గమనించి, గత నాలుగు సమావేశాల్లో రెపో రేటును ఆర్‌బీఐ అలాగే ఉంచింది. భారత్‌లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం (చిల్లర ధరల ద్రవ్యోల్బణం) ఈ ఏడాది అక్టోబర్‌లో 4.87శాతంగా ఉంది. నవంబర్‌లో అది 6.1శాతానికి పెరిగినట్లు ప్రపంచ ఆర్థిక సంస్థ బాక్లీస్‌ నివేదిక ఇటీవల అంచనా వేసింది. ఇది ఆర్‌బీఐ నిర్దేశిత ద్రవ్యోల్బణ పరిమితికన్నా కాస్త ఎక్కువ. కూరగాయలు... ముఖ్యంగా టొమాటో, ఉల్లిపాయలు, పప్పుధాన్యాల ధరలు పెరగడం ద్రవ్యోల్బణానికి దారితీసింది. ఈ క్రమంలో ద్రవ్యోల్బణాన్ని ఆరు శాతం కన్నా దిగువకు తేవడానికి ఆర్‌బీఐ రెపో రేటును పెంచుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, రెపో రేటు పెరిగితే, రుణాలపై వడ్డీలు అధికమవుతాయి. దానివల్ల కంపెనీలు మూలధనాన్ని సమకూర్చుకోవడం కష్టమవుతుంది. ఫలితంగా పెట్టుబడులు, ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తాయి. అంతిమంగా అది ఆర్థిక వృద్ధిని దెబ్బతీసి, నిరుద్యోగితను పెంచుతుంది. మరోవైపు దేశీయంగా చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉత్పత్తి వ్యయం తగ్గుతున్నా, వస్తు విక్రయాల ధరలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ వేచి చూసే ధోరణిని అవలంబించి, వరసగా అయిదోసారీ రెపో రేటును మార్చకపోవచ్చన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. బాక్లీస్‌ నివేదిక ప్రకారం దేశీయంగా ద్రవ్యోల్బణం ప్రస్తుతం ఆర్‌బీఐ లక్షిత పరిమితికి కొద్దిగానే అధికంగా ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకొని రెపో రేటును పెంచడం ద్వారా ఆర్థిక వృద్ధిని దెబ్బతీసే చర్యలకు ద్రవ్య విధాన కమిటీ దిగకపోవచ్చు.


ద్రవ్యోల్బణాన్ని నిరోధించడానికి దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రణాళికలు అవసరం. భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణకు కేంద్ర బ్యాంకు అయిన ఆర్‌బీఐ అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం తప్పనిసరి. ముఖ్యంగా దేశీయంగా పలు రకాల వ్యవస్థాగత సవాళ్లు పొంచి ఉన్నాయి. అందువల్ల ఆర్‌బీఐ ఆచి తూచి అడుగులు వేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం కొద్దిగా పెరిగినా, విపరీత పరిణామాలకు దారితీయవచ్చు. ముఖ్యంగా ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం, శ్రామిక మార్కెట్లో వేతనాలపై ప్రభావం పడుతుంది. భారత్‌లో శ్రామిక మార్కెట్‌ అత్యధికంగా అసంఘటిత రంగంలో ఉందన్న విషయాన్ని గుర్తించాలి. అందువల్ల ద్రవ్యోల్బణం పెరగకుండా, ఆర్థిక వృద్ధి మందగించకుండా ఆర్‌బీఐ, కేంద్రం జాగ్రత్తగా అడుగులు వేయాలి.


సమన్వయం అవసరం

ద్రవ్యోల్బణం కట్టడిలో ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం నడుమ సరైన సమన్వయం ఉండటం మరో ప్రధాన అంశం. ప్రజల ద్వారా ఎన్నికైన ఏ ప్రభుత్వానికైనా ద్రవ్యోల్బణం పెరుగుదల ఇబ్బందికరమే. అదే సమయంలో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచితే ఆర్థిక ప్రగతి కుంటువడుతుంది. ఉత్పత్తి వ్యయం పెరిగి, వస్తువుల ధరలు పైకి ఎగబాకుతాయి. ఫలితంగా ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పవు. అందువల్ల ద్రవ్యోల్బణం విషయంలో ప్రభుత్వం, కేంద్రబ్యాంకు సమన్వయంతో ముందుకు సాగాలి. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలంటే వడ్డీరేట్లను పెంచడమే ఏకైక పరిష్కారం కాదు. వస్తు సరఫరాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం ద్వారానూ ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేసేందుకు కేంద్రం వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవాలి. ఈ క్రమంలో ఆర్‌బీఐ, కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ద్రవ్యోల్బణానికి మూలకారణాలను గుర్తించి, వెంటనే తగిన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది.  


స్థానిక పరిస్థితులకు ప్రాధాన్యం

భారత్‌లో సామాజిక, ఆర్థిక అసమానతలు తీవ్రంగా రాజ్యమేలుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిత్యావసరాల ధరలు పెరిగితే అట్టడుగున ఉన్నవారు వాటిని కొనుగోలు చేయలేరు. ఫలితంగా వారి జీవితాలు దుర్భరంగా మారతాయి. ఈ క్రమంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి మధ్యస్థ, దీర్ఘకాలిక వ్యూహాలను భారత్‌ అభివృద్ధి చేసుకోవాలి. దీనికోసం ఆర్‌బీఐ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన దేశ ద్రవ్యోల్బణంపై దృష్టి సారించినప్పుడు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ద్రవ్య విధాన నిర్ణయాలకు తక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే, మన ఆర్థికంపై ఫెడ్‌ నిర్ణయాల ప్రభావం ఉండదని దీని ఉద్దేశం కాదు. ద్రవ్యోల్బణాన్ని, స్థూల ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావాన్ని అంచనా వేసే సమయంలో దేశీయంగా ఉన్న పరిస్థితులకు అధిక ప్రాధాన్యం దక్కాలి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సైనిక పాలకులపై ఉమ్మడి పోరు

‣ సరైన సాయంతోనే రైతుకు ఉపశమనం

‣ పర్యావరణంపై వేటు.. భవితకు కాటు!

‣ యునెస్కోలో పాక్‌ పైచెయ్యి!

‣ ప్రథమ పౌరుల అధికారం పరిమితమే

‣ ఇండియాతోనే ఈయూ!

‣ ఆహార భద్రతకు భూసార పరిరక్షణ

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Follow us on Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 15-12-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని