• facebook
  • whatsapp
  • telegram

కెన్యాతో కలిసికట్టుగా..హిందూ మహాసముద్ర ప్రాంతంలో వ్యూహాత్మకంగా కీలకమైన దేశాల్లో కెన్యా ఒకటి. దానితో ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకోవాలని ఇండియా భావిస్తోంది. ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాడటంతో పాటు రక్షణ రంగంలో మరింతగా సహకరించుకోవాలని ఉభయ దేశాలు తాజాగా సంకల్పించాయి.


భారత్‌ కొంతకాలంగా తన విదేశాంగ విధానంలో ఆఫ్రికాకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. 55 సభ్య దేశాలు ఉన్న ఆఫ్రికా సమాఖ్య ఇటీవల జీ-20 కూటమిలో శాశ్వత భాగస్వామిగా చేరడంలో దిల్లీ కీలక పాత్ర పోషించింది. ఈ పరిణామంతో ఆఫ్రికా దేశాల్లో ఇండియాపై సానుకూల భావన పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ఇండియాలో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకొంది. ఆఫ్రికాలోని ఇతర దేశాలతో పోలిస్తే కెన్యాలో రాజకీయ, ఆర్థిక స్థిరత్వం కొంత మెరుగు. దానితో మైత్రీబంధాన్ని బలోపేతం చేసుకోవడంపై దిల్లీ బాగా దృష్టి సారిస్తోంది.ఈపర్యటనలో కుదిరిన ఒప్పందాలు ఉభయ దేశాలను చేరువచేసే అవకాశాలున్నాయి.


ద్వైపాక్షిక బంధాన్ని పటిష్ఠపరచుకోవడంపై ప్రధాని మోదీతో రూటో సమాలోచనలు జరిపారు. పెట్టుబడులు సహా పలు రంగాలకు సంబంధించిన కీలక సదస్సుల్లో పాల్గొన్నారు. సేద్య రంగ ఆధునికీకరణ కోసం నైరోబీకి లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ కింద సుమారు రూ.2085 కోట్లు అందించాలని దిల్లీ నిర్ణయించింది. క్రీడలు, విద్య, డిజిటల్‌ పరిష్కారాలు తదితర రంగాల్లో ఇండియా-కెన్యా అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. హిందూ మహాసముద్ర రూపంలో నైరోబీతో మనం జల సరిహద్దు పంచుకుంటున్నాం. ఇండో-పసిఫిక్‌ ప్రాంత వ్యూహాల్లోనూ అది కీలకం. స్వాతంత్య్రానికి పూర్వమే ఇండియా-కెన్యాల నడుమ సంబంధాలు ఉన్నప్పటికీ, దశాబ్దాలపాటు స్తబ్దత ఏర్పడింది. 2016లో మోదీ కెన్యాలో చేపట్టిన పర్యటన ద్వైపాక్షిక బంధంలో మళ్ళీ జవసత్వాలు నింపింది. రక్షణ రంగంలో పరస్పర సహకారం కోసం ఆ ఏడాదే ఇరు దేశాలు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఇది ద్వైపాక్షిక వ్యూహాత్మక బంధంలో అత్యంత కీలకంగా మారింది. ఏటా కెన్యా రక్షణ బలగాల సిబ్బందికి ఇండియా శిక్షణ ఇస్తోంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సహకారంపై ఉభయ దేశాలు తాజాగా సంయుక్త దార్శనిక పత్రాన్ని ఆవిష్కరించాయి. సాగర జలాల్లో దోపిడి, చేపల అక్రమ వేట, మాదకద్రవ్యాల రవాణా వంటివాటిని నిలువరించేందుకు అది దోహదపడనుంది. ఉగ్రవాద రక్కసిపై ఉమ్మడి పోరుకూ అవి సంకల్పించాయి. డాలర్లలో కాకుండా జాతీయ కరెన్సీలోనే ద్వైపాక్షిక వాణిజ్య లావాదేవీలు జరపడంపై చర్చించాయి. అంతరిక్ష సాంకేతికత, డిజిటల్‌ ప్రజా వసతుల రంగాలకు సంబంధించిన కీలక పరిజ్ఞానాలు, నైపుణ్యాలను జన క్షేమం కోసం వినియోగించేలా నైరోబీతో పంచుకునేందుకు దిల్లీ సుముఖత వ్యక్తం చేయడంకీలక పరిణామం.


భారత్‌ - కెన్యాకు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. చైనా, యూఏఈ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. దిల్లీ-నైరోబీ వార్షిక ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువ 339 కోట్ల డాలర్లు. అందులో భారతీయ ఎగుమతులదే సింహభాగం. కెన్యాలో భారతీయుల పెట్టుబడులూ ఎక్కువే. ఆ దేశంలో తయారీ, ఔషధ, టెలికాం, ఐటీ, బ్యాంకింగ్‌, వ్యవసాయం వంటి రంగాల్లో 200కుపైగా భారతీయ కంపెనీలు ఉన్నాయి. సుమారు లక్ష మంది భారతీయులు కెన్యాలో నివసిస్తున్నారు. నైరోబీలో ఎగ్జిమ్‌ బ్యాంకును ప్రారంభించిన దిల్లీ- దానిద్వారా ప్రాంతీయంగా 15 దేశాలకు సేవలు అందిస్తోంది. వైద్యం కోసం కెన్యా ప్రజలు ఎక్కువగా వస్తున్నది ఇండియాకే. ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఇరు దేశాల ఎదుట పలురంగాల్లో అనేక అవకాశాలున్నాయి. గస్తీ నౌకలు, నిఘా సాధనాల ఉత్పత్తితోపాటు నౌకా నిర్మాణ రంగంలో రెండు దేశాలు సంయుక్త ప్రాజెక్టులు చేపట్టవచ్చు. విపత్తుల నిర్వహణలో కెన్యా సామర్థ్యాల పెంపునకు ఇండియా చేయూతను అందించాలి. నిఘా సమాచార మార్పిడి ద్వారా రక్షణ రంగంలో మరింతగా సహకరించుకోవాలి. హిందూ మహాసముద్రంలో కెన్యా వ్యూహాత్మక ప్రాధాన్యత దృష్ట్యా- దాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చైనా ప్రయత్నిస్తోంది. నైరోబీని మొంబాసా ఓడరేవుతో అనుసంధానించే రైల్వేలైన్‌ను నిర్మించడంతోపాటు లామూలో కొత్త ఓడరేవు నిర్మాణాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇండియా అప్రమత్తంగా వ్యవహరించాలి. బీజింగ్‌ నియంత్రణలోకి నైరోబీ వెళ్ళకుండా దౌత్య వ్యూహాలతో ముందుకెళ్ళాలి. ఆ దేశంలో భారతీయ పెట్టుబడులు మరింత పెరిగేలా ప్రణాళికలు రచించాలి. 


- నవీన్‌కుమార్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భవితపై ఆశ.. ప్రగతిపై ధ్యాస!

‣ పర్వతాలపై చెత్త మేట

‣ కార్పొరేట్‌ కళకళ.. సాగు విలవిల!

‣ ధరల వాతలు.. తీరేనా వెతలు?

‣ సైనిక పాలకులపై ఉమ్మడి పోరు

‣ సరైన సాయంతోనే రైతుకు ఉపశమనం

‣ పర్యావరణంపై వేటు.. భవితకు కాటు!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Follow us on Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 16-12-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని