• facebook
  • whatsapp
  • telegram

భవితపై ఆశ.. ప్రగతిపై ధ్యాస!370, 35(ఎ) అధికరణాల రద్దు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం చిరస్మరణీయ తీర్పును వెలువరించింది. దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను చాటిచెప్పింది. ఇది ప్రతి భారతీయుడికీ గర్వకారణం. పార్లమెంటు 2019 ఆగస్టు 5న తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ సమగ్రతను పెంపొందించే ఉద్దేశంతోనే జరిగిందని, విచ్ఛిన్నం కోసం కాదని సుప్రీంకోర్టు సరిగ్గానే నిర్ధారించింది. ఆర్టికల్‌ 370 శాశ్వత స్వభావంతో కూడినది కాదనే వాస్తవాన్నీ గుర్తించింది.


రమణీయమైన ప్రకృతి సౌందర్యం, నిర్మలమైన లోయలు, గంభీరమైన పర్వతాలతో అలరారే జమ్మూ, కశ్మీర్‌, లద్దాఖ్‌లు తరతరాలుగా ఎందరో కవులు, కళాకారులు, సాహసికుల మదిని దోచాయి. ఇక్కడ నింగిని తాకే హిమాలయాలు, స్వచ్ఛమైన జలాలతో కళకళలాడే సరస్సులు, నదులు స్వర్గాన్ని తలపిస్తాయి. కానీ, ఏడు దశాబ్దాలపాటు దారుణమైన హింస, అస్థిరతలు ఈ ప్రాంతాలను, ప్రజలను పట్టిపీడించడం దురదృష్టకరం. శతాబ్దాల వలస పాలనవల్ల... ఆర్థిక, మానసిక అణచివేతలవల్ల మన సమాజంలో ఒక రకమైన గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నాడు అనేక ప్రాథమిక అంశాలలో స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్ళలేక, ద్వంద్వ విధానాలను అనుసరిస్తూ వచ్చారు. అది మరింత గందరగోళానికి దారితీసింది. అటువంటి పరిస్థితులకు జమ్మూకశ్మీర్‌ మరింతగా లోనుకావడం బాధాకరం. స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు జాతీయ సమైక్యత కోసం కొత్త పంథాను అనుసరించే అవకాశం మనకు వచ్చింది. కానీ, దీర్ఘకాలిక జాతీయ ప్రయోజనాలను విస్మరించి, గందరగోళంతో కూడిన సామాజిక విధానాన్ని అనుసరించడానికే మొగ్గు చూపారు.ముళ్ల బాటలో ముందుకెళ్ళాలని..

నా జీవిత తొలినాళ్ల నుంచే ‘జమ్మూకశ్మీర్‌ ఆందోళన్‌’తో అనుసంధానమయ్యే అవకాశం నాకు లభించింది. జమ్మూకశ్మీర్‌ సమస్య కేవలం రాజకీయ సమస్య మాత్రమే కాదనే సైద్ధాంతికతకు చెందినవాడిని. నెహ్రూ మంత్రివర్గంలో డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ ముఖర్జీకి చాలా ప్రాముఖ్యత, ప్రభుత్వంలో సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉండేవి. అయినప్పటికీ, కశ్మీర్‌ విషయమై ఆయన ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేశారు. తన జీవితాన్ని పణంగా పెట్టయినా సరే, ఈ విషయంలో ముళ్ళబాటలో ముందుకెళ్ళాలనే నిర్ణయించుకున్నారు. ఆయన త్యాగం, కృషి- కోట్ల మంది భారతీయుల మనసులు కశ్మీర్‌ అంశంతో ముడివడేలా చేశాయి. ఆ తరవాత కొన్నేళ్లకు అటల్‌జీ శ్రీనగర్‌ బహిరంగ సభలో ‘ఇన్సానియత్‌, జమ్‌హూరియత్‌, కశ్మీరియత్‌’ అనే శక్తిమంతమైన నినాదమిచ్చారు. ఎల్లవేళలా గొప్ప స్ఫూర్తిని నింపే నినాదమది. జమ్మూకశ్మీర్‌లో జరిగినది- మన దేశానికి, అక్కడ నివసించే ప్రజలకు జరిగిన ఘోర ద్రోహమని నేను దృఢంగా నమ్ముతున్నాను. జమ్మూకశ్మీర్‌ వాసులకు జరిగిన ఈ అన్యాయాన్ని పారదోలడానికి శక్తివంచన లేకుండా చేయగలిగినంత చేయాలనేది నా బలమైన కోరిక. అది ఎప్పటినుంచో నా మదిలో ఉన్నది.


తోటి భారతీయుల మాదిరిగా జమ్మూకశ్మీర్‌ వాసులు హక్కులు, అభివృద్ధికి ఎన్నడూ నోచుకోరని 370, 35(ఎ) అధికరణలు చెప్పకనే చెబుతున్నాయి. అవి ఎంతకూ బద్దలుకాని అడ్డుగోడగా ఉంటూ, పేదలు, అణగారిన వర్గాలకు గుదిబండలా పరిణమించాయి. ఒకే దేశానికి చెందిన ప్రజల మధ్య దూరం సృష్టించాయి. ఈ అంతరం వల్లే- జమ్మూకశ్మీర్‌ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేద్దామనుకున్న ఎంతోమంది భారతీయులు, ఆ పని చేయలేకపోయారు. జమ్మూకశ్మీర్‌ సమస్యపై స్పష్టత, దానితో ముడివడిన సంక్లిష్టతలపై నాకు లోతైన అవగాహన ఉంది. కాబట్టే- జమ్మూకశ్మీర్‌ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని; భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకుంటున్నారని విస్పష్టంగా చెప్పాను. వారు తమ పిల్లలకు హింసకు, అనిశ్చితికి తావులేని మెరుగైన జీవితాన్ని అందివ్వాలనుకుంటున్నారు. ఆ దిశగా జమ్మూకశ్మీర్‌ ప్రజల కోసం సాగిస్తున్న ప్రయత్నంలో- మూడు కీలక అంశాలకు ప్రాధాన్యమిస్తున్నాం. అవి: 1) ప్రజల ఆందోళనలను అర్థం చేసుకోవడం, 2) తోడ్పాటు చర్యల ద్వారా వారిలో విశ్వాసాన్ని పెంపొందించడం, 3) అభివృద్ధి, అభివృద్ధి... మరింత అభివృద్ధికి ప్రాధాన్యమివ్వడం.


జమ్మూ, కశ్మీర్‌ అభివృద్ధి ప్రయాణాన్ని మరింత జోరెత్తించేందుకు మన ప్రభుత్వంలోని మంత్రులు తరచూ ఆ ప్రాంత ప్రజలతో నేరుగా మమేకమవ్వాలని నిర్ణయించాం. 2014- 2019 మధ్య మంత్రులు 150 సార్లకుమించి అక్కడ పర్యటించారు. జమ్మూ, కశ్మీర్‌ అభివద్ధి కోసం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ఒక విశిష్టమైన ముందడుగు. మౌలిక వసతుల కల్పన, ఉపాధి సృష్టి, పర్యాటకానికి, హస్తకళలకు ప్రోత్సాహం తదితరాలకు ఇందులో చర్యలు తీసుకున్నాం. జమ్మూకశ్మీర్‌లో క్రీడలు, మైదానాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశాం. శిక్షణ కార్యక్రమాలూ చేపట్టాం. శిక్షకులను అందుబాటులోకి తెచ్చాం. స్థానిక ఫుట్‌బాల్‌ క్లబ్‌ల ఏర్పాటును ప్రోత్సహించడం ప్రధాన అంశం. వీటివల్ల అసాధారణ ఫలితాలు సాకారమయ్యాయి. ప్రతిభావంతమైన ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి అఫ్షాన్‌ ఆషిక్‌ గురించి 2014లో నాకు తెలిసింది. శ్రీనగర్‌లో రాళ్లు రువ్వే అల్లరి మూకల్లో ఆమె ఒకరు. సరైన ప్రోత్సాహంవల్ల ఆమె ఫుట్‌బాల్‌ క్రీడాకారిణిగా మారారు. ఆమెను శిక్షణకు పంపగా విశేషంగా రాణించారు. జమ్మూ కశ్మీర్‌లో కిక్‌బాక్సింగ్‌, కరాటేలోనూ ఇతర యువత రాణించడం మొదలైంది. జమ్మూకశ్మీర్‌ సర్వతోముఖాభివృద్ధిలో పంచాయతీ ఎన్నికలు సైతం కీలకంగా నిలిచాయి.ఎంతో మార్పు

2019 ఆగస్టు అయిదో తేదీ భారతీయులందరి మనసుల్లో నిలిచి ఉంటుంది. 370 అధికరణను రద్దు చేస్తూ భారత పార్లమెంటు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి జమ్మూ, కశ్మీర్‌, లద్దాఖ్‌లలో ఎంతో మార్పు వచ్చింది. 370 అధికరణ రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. అయితే, జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌లలో అభివృద్ధి వీచికలను చూసి పార్లమెంటు నిర్ణయానికి ప్రజాకోర్టు నాలుగేళ్ల క్రితమే సమ్మతి తెలిపింది. రాజకీయ స్థాయిలో క్షేత్రస్థాయి ప్రజాస్వామ్యం పరంగా గత నాలుగేళ్లు ప్రజల్లో కొత్త విశ్వాసం నింపాయి. అంతకు ముందు మహిళలు, గిరిజనులు, ఎస్సీలు, ఎస్టీలు, పేదలకు సమాజ అభివృద్ధి ఫలాలు అందేవి కావు. లద్దాఖ్‌ ఆకాంక్షలు సైతం పూర్తిగా విస్మరణకు గురయ్యాయి. 2019 ఆగస్టు అయిదున అంతా మారిపోయింది. కేంద్రం చట్టాలన్నీ ఎలాంటి భయ పక్షపాతాలకు తావు లేకుండా అమలవుతున్నాయి. మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థ అమలులోకి వచ్చింది. బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిళ్ల ఎన్నికలు జరిగాయి. విస్మరణకు గురైన శరణార్థి వర్గాలు సైతం అభివృద్ధి ఫలాలను ఆస్వాదిస్తున్నాయి. సౌభాగ్య, ఉజ్జ్వల వంటి పథకాలు అందరికీ అందుతున్నాయి. గృహ నిర్మాణంలో పురోగతి సాధ్యమైంది. నల్లా నీటి కనెక్షన్లు దక్కుతున్నాయి. వైద్య సేవల రంగంలో మౌలిక సదుపాయాల నవీకరణను ప్రజలు చూస్తున్నారు. అన్ని గ్రామాలు బహిరంగ మలవిసర్జన రహిత హోదాను సాధించాయి. ప్రభుత్వ ఖాళీలను పారదర్శక విధానంలో భర్తీ చేశాం. శిశు మరణాల రేటు వంటి సూచికలు మెరుగయ్యాయి. మౌలిక వసతులు, పర్యాటకానికి ప్రోత్సాహం లభించింది. ఈ ఘనత అంతా జమ్మూ, కశ్మీర్‌ ప్రజలకే దక్కుతుంది. ఎందుకంటే, వారు అభివృద్ధిని కోరుకొంటున్నారు. మార్పును ఆశిస్తున్నారు. ‘ఏక్‌ భారత్‌-శ్రేష్ఠ భారత్‌’ స్ఫూర్తికి నిన్నటి సుప్రీం తీర్పు మరింత బలాన్నిచ్చింది. ఐక్యత, సుపరిపాలన పట్ల నిబద్ధత ప్రాధాన్యాన్ని అది గుర్తు చేసింది. ప్రస్తుతం జమ్మూ, కశ్మీర్‌, లద్దాఖ్‌లో ప్రతి బిడ్డ- భవిష్యత్తు ఆకాంక్షలను నెరవేర్చుకోగలనన్న నమ్మకంతో జన్మిస్తుంది. ప్రజల్లో నెలకొన్న నిరాశ, నిస్పృహలను అభివృద్ధి, ప్రజాస్వామ్యం పూర్తిగా తరిమివేశాయి.


నిబద్ధతకు నిదర్శనం..

మేము 2014లో కేంద్రంలో అధికారం చేపట్టిన కొద్దికాలానికే జమ్మూకశ్మీర్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. కశ్మీర్‌ లోయలో విధ్వంసం చోటుచేసుకుంది. పరిస్థితిని అంచనా వేయడానికి శ్రీనగర్‌ వెళ్ళి, పునరావాసం కోసం రూ.1000 కోట్ల ప్రత్యేక సాయం ప్రకటించాను. జమ్మూకశ్మీర్‌ ప్రజలను ఆదుకొనే విషయంలో మా ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమది. ఆ ఏడాది, జమ్మూకశ్మీర్‌లో మనం కోల్పోయిన ఆప్తుల జ్ఞాపకార్థం దీపావళి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఆ రోజు అక్కడే ఉన్నాను. జీవితంలో వివిధ వర్గాల ప్రజలను కలుసుకొనే అవకాశం నాకు లభించింది. ప్రజలు అభివృద్ధిని మాత్రమే కాదు, తరతరాలుగా పాతుకుపోయిన అవినీతి నుంచి స్వేచ్ఛను కూడా కోరుకుంటున్నారని తెలియవచ్చింది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పర్వతాలపై చెత్త మేట

‣ కార్పొరేట్‌ కళకళ.. సాగు విలవిల!

‣ ధరల వాతలు.. తీరేనా వెతలు?

‣ సైనిక పాలకులపై ఉమ్మడి పోరు

‣ సరైన సాయంతోనే రైతుకు ఉపశమనం

‣ పర్యావరణంపై వేటు.. భవితకు కాటు!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Follow us on Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 16-12-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని