• facebook
  • whatsapp
  • telegram

లాభసాటి సేద్యం కోసం..అభివృద్ధి చెందిన దేశాలు చాలా పంటల్లో వందశాతం యాంత్రీకరణను సాధించాయి. సాగును సరళతరం చేస్తూ ‘స్మార్ట్‌ వ్యవసాయం’ దిశగా పరుగులు తీస్తున్నాయి. మన దేశంలోనూ అటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా జరగాల్సిన అవసరముంది.


ప్రపంచ ఆహార భద్రత నానాటికీ సంక్లిష్టంగా మారుతోంది. వాతావరణ మార్పులవల్ల వ్యవసాయ దిగుబడులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో ఉత్పత్తుల పెంపే లక్ష్యంగా అనేక దేశాలు, సంస్థలు కృషి చేస్తున్నాయి. డేటా అనలిటిక్స్‌, రోబోటిక్స్‌, కృత్రిమ మేధ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతల ద్వారా పనిచేసే వ్యవసాయ ఉపకరణాలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఖర్చులను తగ్గించుకుని, ఉత్పాదకను పెంచుకోవడంలో ఇవి కీలకంగా మారుతున్నాయి.


విత్తనోత్పత్తి కోసం పండించే పంటల్లో అధికభాగం పరాగ సంపర్కంపైనే ఆధారపడి ఉంటాయి. ఈ ప్రక్రియలో తేనెటీగలు, ఇతర కీటకాలదే కీలక పాత్ర. వాతావరణ మార్పుల కారణంగా తరచూ తుపానులు, వరదలు, కరవు పరిస్థితులు సంభవిస్తున్నాయి. వీటికి తోడు పురుగుమందుల పిచికారీ పెరగడం వల్ల ఆవాసాలు కోల్పోయి తేనెటీగలు, కీటకాలు కనుమరుగవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి ఇజ్రాయెల్‌కు చెందిన ఓ సంస్థ ‘రోబీ’, ‘క్రాస్‌ బీ’ అనే పరికరాలను తయారుచేసింది. ఇవి అవకాడో చెట్ల మధ్య అంటుకున్న పుప్పొడి రేణువులను సేకరించి వ్యాప్తి చేస్తాయి. ఈ యంత్రాలను ఇజ్రాయెల్‌, స్పెయిన్‌, అమెరికా వంటి దేశాల్లో విరివిగా వినియోగిస్తున్నారు. అంతేకాదు, వీటివల్ల ఆ పండ్ల ఉత్పత్తి 30శాతం వరకు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. అలాగే మొక్కల్లో పరాగ సంపర్కానికి జపాన్‌ అతిచిన్న డ్రోన్లను తయారుచేసింది. సెల్‌ఫోన్‌ అప్లికేషన్‌ సాయంతో వీటిని నియంత్రించవచ్చు. ఈ డ్రోన్లలో అమర్చే జీపీఎస్‌ సాధనాల ద్వారా పొలంలో ఎక్కడెక్కడ పరాగ సంపర్కం జరిగిందో తెలుసుకోవచ్చు. ఇజ్రాయెల్‌కే చెందిన మరో సంస్థ పుప్పొడిని సేకరించి, ఆ తరవాత దాన్ని వినియోగించుకునేలా యంత్రాలను అభివృద్ధి చేసింది. ఫలదీకరణ సమయంలో అత్యుత్తమ పుప్పొడిని అందించడంవల్ల దిగుబడులు పెరుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అధిక ఉత్పత్తులకు, వ్యవసాయ కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు పరిశోధనలు చేపడుతున్నాయి. అధునాతన ఉపకరణాలను అందుబాటులోకి తెస్తున్నాయి. వ్యవసాయంలో వస్తున్న సాంకేతికతలు సేద్య రంగం భవిష్యత్తును ఆశాజనకంగా మారుస్తున్నాయి.


ఆధునిక వ్యవసాయ ఉపకరణాల వల్ల సమయం ఆదా అవుతుంది. పంటల నాణ్యత, దిగుబడులు పెరుగుతాయి. కష్టతరమైన పనులను సులభంగా చేయవచ్చు. నీటిపారుదల, ఫలదీకరణ, తెగుళ్ల నివారణ వంటి పనులను మెరుగ్గా నిర్వహించవచ్చు. ఎరువులు, నీరు, పురుగుమందుల అవసరం తగ్గుతుంది కాబట్టి, పర్యావరణ పరిరక్షణకూ అవి సహాయపడతాయి. పంట కోత తరవాత వాటిల్లే నష్టాలను తగ్గించుకోవడానికి, తద్వారా ఆదాయం పెంచుకోవడానికి ఆధునిక ఉపకరణాలు ఉపయోగపడతాయి. డ్రోన్లు, ప్లాంటర్లు, మట్టి సెన్సర్లు, వేరియబుల్‌ రేట్‌ టెక్నాలజీ (వీఆర్‌టీ) పరికరాలు, రోబోటిక్‌ వీడర్లు, క్రాప్‌ మానిటరింగ్‌ యాప్‌లు, ఆటోమేటెడ్‌ నీటిపారుదల వ్యవస్థ, స్మార్ట్‌ హార్వెస్టర్లు, జీపీఎస్‌ ఆధారిత ట్రాక్టర్లు వంటి ఉపకరణాలెన్నో సేద్య రంగాన్ని మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో దాదాపు 9.9శాతం ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. 2050 నాటికి ఆహార డిమాండ్‌    70శాతం పెరుగుతుందని అంచనా. ఈ సవాలును అధిగమించాలంటే- సాగుకు సాంకేతికతను జోడించి ఉత్పత్తులను పెంచడమే ఉత్తమ మార్గం. వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి ‘సబ్‌ మిషన్‌ ఆన్‌ అగ్రికల్చరల్‌ మెకనైజేషన్‌’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. పలు రాష్ట్రాలు సైతం ఇటువంటి పథకాలను అమలుచేస్తున్నాయి. రాయితీపై వివిధ రకాల పరికరాలను రైతులకు అందజేస్తున్నాయి.


భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) అధ్యయనం ప్రకారం, దేశ వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ స్థాయి 45శాతం వరకు ఉంటోంది. ఈ విషయంలో ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, పంజాబ్‌లు ముందువరసలో ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలు వెనకబడ్డాయి. వాస్తవానికి, వ్యవసాయ రంగంలో యాంత్రీకరణకు అనేక ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. అధికశాతం చిన్న, సన్నకారు రైతులే కావడంవల్ల అత్యాధునిక పరికరాలను కొనుగోలుచేసి, నిర్వహించడం శక్తికి మించిన పని అవుతోంది. అవగాహన లేకపోవడంవల్ల వాటిని వినియోగించడం కష్టమవుతోంది. ప్రస్తుతం వరి, గోధుమ పంటల్లోనే యాంత్రీకరణ అధికంగా ఉంది. ఇతర ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటల్లోనూ యాంత్రీకరణ ఊపందుకోవాలి. ఇందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించాలి.


- డి.సతీష్‌బాబు
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భద్రతకు ఆత్మనిర్భరతే పునాది

‣ డ్రోన్‌ విపణికి కొత్త రెక్కలు

‣ అపస్వరాల ఐక్యతా రాగం!

‣ కెన్యాతో కలిసికట్టుగా..

‣ భవితపై ఆశ.. ప్రగతిపై ధ్యాస!

‣ పర్వతాలపై చెత్త మేట

‣ కార్పొరేట్‌ కళకళ.. సాగు విలవిల!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Follow us on Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 25-12-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని