• facebook
  • whatsapp
  • telegram

డ్రోన్‌ విపణికి కొత్త రెక్కలువిమానంలా ఎగురుతూ, రోబోలా పనిచేస్తూ నిర్దేశిత లక్ష్యాలను చేరుకుంటాయి- డ్రోన్లు. నేడు వేడుకలను డ్రోన్లతో చిత్రీకరించడం సర్వసాధారణంగా మారింది. వైద్యం, వాణిజ్యం, రవాణా, నిఘా వంటి అనేక రంగాల్లో వీటి వాడకం పెరుగుతోంది.


రోబోటిక్స్‌, ఏరోనాటిక్స్‌ సాంకేతికతలు కలగలిసినవే- డ్రోన్లు. వీటిని మానవరహిత వైమానిక వాహనాలు (యూఏవీలు)గా పిలుస్తుంటారు. రిమోట్‌ సాయంతోనే కాదు, స్వతంత్రంగానూ ఇవి గాలిలో ఎగురుతూ నిర్దేశిత గమ్యస్థానాలను చేరుకుంటాయి. నిఘా వంటి సంక్లిష్టమైన కార్యకలాపాలను సైతం చేపడుతున్నాయి. కొవిడ్‌ వేళ రవాణాపరమైన ఆంక్షలవల్ల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు డ్రోన్లను ఎక్కువగా ఉపయోగించాయి. ఇప్పుడు దేశ రక్షణ, శాంతి భద్రతల పర్యవేక్షణ, వాణిజ్యం, సినీ నిర్మాణం, వ్యవసాయం, విపత్తుల వేళ సహాయ కార్యక్రమాల నిర్వహణ, వన్య సంపదపై నిఘా, ఔషధాల చేరవేత వంటి అనేక పనుల కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు.


స్వావలంబన దిశగా..

ప్రస్తుతం దాదాపు 1100 కోట్ల డాలర్లుగా ఉన్న అంతర్జాతీయ డ్రోన్‌ మార్కెట్‌ పరిమాణం 2030కల్లా 5,500 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. నేడు ప్రపంచ వాణిజ్య డ్రోన్ల విపణిలో 70శాతం చైనా కంపెనీ డీజేఐ సొంతం. ఉత్పత్తి వ్యయం చైనాలో తక్కువగా ఉన్నందువల్ల అవి చవక ధరలో అందుబాటులోకి వస్తున్నాయి. అందుకే ఇతర దేశాల్లో చైనా డ్రోన్లకు గిరాకీ ఎక్కువగా ఉంటోంది. డ్రాగన్‌ దేశం మీద అతిగా ఆధారపడటం మంచిదికాదని భావించిన ఇండియా- డ్రోన్ల ఉత్పత్తిలో స్వావలంబన సాధించడానికి నడుం కట్టింది. అమెరికా, ఇజ్రాయెల్‌ వంటి మిత్ర దేశాల నుంచి రక్షణావసరాల కోసం దిగుమతి చేసుకొనే పోరాట డ్రోన్లు మినహా వాణిజ్య డ్రోన్ల దిగుమతిని 2022 ఫిబ్రవరిలో నిషేధించింది. దేశ భద్రత రీత్యా చైనా నుంచి డ్రోన్లనే కాదు, వాటి విడిభాగాలనూ దిగుమతి చేసుకోకూడదని ఆంక్షలు విధించింది. స్వదేశీ డ్రోన్ల పరిశ్రమకు పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఫలితంగా 2020-21లో రూ.88కోట్లుగా ఉన్న భారతీయ డ్రోన్‌ పరిశ్రమ ఆదాయం 2021-22లో రూ.319కోట్లకు ఎగబాకింది. అయిదేళ్లలో డ్రోన్లు, వాటి విడిభాగాల తయారీ రంగంలోకి రూ.5,000కోట్ల పెట్టుబడులు వస్తాయంటున్నారు. అలా 2026కల్లా దేశీయ డ్రోన్ల పరిశ్రమ టర్నోవర్‌ రూ.15,000కోట్లు చేరుకుంటుందని అంచనా. 2023-28 మధ్య కాలానికి కేంద్రం ప్రకటించిన విదేశీ వాణిజ్య విధానం- భారతీయ డ్రోన్లను పౌర అవసరాల కోసం విదేశాలకు ఎగుమతి చేయాలని లక్షిస్తోంది. సంపన్న దేశాలలో జీతభత్యాలు, విడిభాగాల ధరలు ఎక్కువ. కాబట్టి, భారత్‌ నాణ్యమైన డ్రోన్లను తక్కువ ఖర్చుకే తయారుచేస్తే అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ వాటాను చేజిక్కించుకోగలుగుతుంది. ఈ దిశగా తొలి అడుగు పడటం విశేషం. రష్యా కోసం మానవ రహిత విమాన వ్యవస్థ (యూఏఎస్‌)ను భారత్‌లో కూర్పు చేయడానికి నవంబరులో దుబాయ్‌ విమాన ప్రదర్శనలో ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం, 2024 మార్చి నుంచి రష్యన్‌ రవాణా డ్రోన్‌ కూర్పును ప్రారంభిస్తామని భారతీయ కంపెనీ ససా ఎలెక్టాన్రిక్స్‌ ప్రకటించింది. వీటిని వ్యవసాయంతోపాటు పర్వత ప్రాంతాల్లో సరకుల బట్వాడాకు ఉపయోగిస్తారు.కేంద్రం డ్రోన్ల పరిశ్రమకు అనేక రకాలుగా ఊతమిస్తోంది. నిరుడు దేశంలో అతిపెద్ద డ్రోన్‌ మహోత్సవాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. గడచిన సెప్టెంబరులో చేపట్టిన భారత్‌ డ్రోన్‌ శక్తి కార్యక్రమంలో దాదాపు 75 అంకుర సంస్థలు పాల్గొన్నాయి. రక్షణకు ఉపయోగపడే డ్రోన్ల తయారీలో ప్రభుత్వం ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తోంది. శత్రు డ్రోన్లను తుత్తునియలు చేయడానికి కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థల వినియోగానికి ప్రాధాన్యమిస్తోంది.


మూడో అతిపెద్ద మార్కెట్‌..

హైదరాబాద్‌లోని రోబోటిక్స్‌ సంస్థ ఏఐతో పనిచేసే డ్రోన్‌ నిరోధక వ్యవస్థ ‘ఇంద్రజాల్‌’ను రూపొందించింది. శత్రుదేశాలు ఆయుధాలను, మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడానికి డ్రోన్లను వినియోగిస్తున్నాయి. సరిహద్దు గస్తీ కేంద్రాలు, చమురుశుద్ధి కర్మాగారాలు, అణు విద్యుత్కేంద్రాలు, రేవులు, ప్రభుత్వ కార్యాలయాలపై శత్రువులు డ్రోన్లతో దాడులుచేసే ప్రమాదముంది. రెండు నుంచి 4,000 కిలోమీటర్ల పరిధిలో శత్రు డ్రోన్ల రాకను పసిగట్టి, ధ్వంసంచేసే సత్తా ఇంద్రజాల్‌ సొంతం. భారత్‌ 2025కల్లా ప్రపంచంలో మూడో అతిపెద్ద డ్రోన్‌ మార్కెట్‌గా నిలవనున్నది. ప్రస్తుతం దేశంలో 200కు పైగా డ్రోన్‌ అంకుర సంస్థలు ఉన్నాయి. ఈ పరిశ్రమ విస్తరిస్తున్న కొద్దీ కొత్త ఉపాధి అవకాశాలూ అందివస్తాయి. రష్యా వంటి మిత్ర దేశాలతో సహకారం అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్‌కు కొత్త అవకాశాలు సృష్టించనున్నది.


- కైజర్‌ అడపా
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అపస్వరాల ఐక్యతా రాగం!

‣ కెన్యాతో కలిసికట్టుగా..

‣ భవితపై ఆశ.. ప్రగతిపై ధ్యాస!

‣ పర్వతాలపై చెత్త మేట

‣ కార్పొరేట్‌ కళకళ.. సాగు విలవిల!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Follow us on Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 16-12-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని